|

కమనీయం రాములోరి కల్యాణం

భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగ రంగ వైభవంగా జరిగింది. గత రెండేళ్ళుగా కరోనా కారణంగా ఆలయ ప్రాంగణానికే పరిమితమైన ఈ వేడుకలు, తిరిగి ఈ ఏడాది బహిరంగంగా మిథిలా స్టేడియంలో నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భద్రాచలం పట్టణమంతా శ్రీరామ నామ స్మరణతో మార్మోగింది. భక్తజన సందోహంతో పట్టణం కిటకిటలా డిరది. తెలంగాణ రాష్ట్రంతో పాటు, పొరుగున గల ఆంధ్రప్రదేశ్‌, తదితర రాష్ట్రాల నుంచి కూడా కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు పులకించి పోయారు.

ఆనవాయితీగా వస్తున్న విధంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ దంపతులు శ్రీ సీతారామ కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వై.వి. సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్త రామదాసు వంశస్థులతోసహా, పలువురు భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు, కానుకలు సమర్పించారు. భక్త రామదాసు చేయించిన ఆభరణాలతో పెండ్లి కొడుకు రామయ్యను, పెండ్లి కుమార్తె సీతమ్మను సుందరంగా అలంకరించారు. పుష్పాలంకృత కల్యాణ వేదికపై కన్నుల పండుగగా కల్యాణం జరిగింది.కల్యాణం జరిగిన మరుసటి రోజున శ్రీ సీతారామ పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఆధ్వర్యంలో భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు.  భద్రాచలం పట్టణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కల్యాణం జరిగిన మిథిలా స్టేడియంలో చలువ పందిళ్ళతోపాటు,  ప్రతి సెక్టారులో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు రెవెన్యూ, పోలీస్‌ అధికారులను నియమించారు.  వాహనాల పార్కింగ్‌ కు వివిధ ప్రదేశాలను కేటాయించి భక్తులకు ఆ సమాచారం అందించారు. సమాచార శాఖ ద్వారా 25 సమాచార కేంద్రాలను ఏర్పాటుచేసి భక్తులకు అవసరమైన సమాచారాన్ని కరపత్రాల ద్వారా అందించారు. పట్టణమంతా మైకుల సదుపాయం కల్పించారు. ప్రతి ఒక్కరికీ తలంబ్రాలు అందేవిధంగా 175 క్వింటాళ్ళ తలంబ్రాలు సిద్ధంచేసి అందించారు. గతంలో 15 కేంద్రాల ద్వారా మాత్రమే అందించిన తలంబ్రాలను ఈ ఏడాది 80 కేంద్రాల ద్వారా భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఎస్పీ సునీల్‌ దత్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.