నవ వసంతంలో అడుగిడిన నవ్య తెలంగాణ..

By: డాక్టర్‌.వి.వి.రామారావు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కలగానే మిగిలిపోతుందేమోననే దిగులు చీకట్లను తొలగించి కలను సాకారం చేసి  రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు కొత్త వెలుగులను అందించిన మాన్యులు కేసీఆర్‌, చరిత్రలో ఒక పేజిలో స్థానం పొందటం కాదు.. చరిత్రనే సృష్టించారు.. తెలంగాణ ఏర్పాటై అప్పుడే ఎనిమిదేళ్ళయ్యాయంటే నమ్మశక్యంకావడంలేదు. ఇపుడు తెలంగాణ నవవర్షాన్విత బాల. బాల అంటే ఏమి తెలియని బేలయని కాదు.. బాల అంటే అమ్మవారనే అర్థంలో ధ్వని..అంటే శక్తి వంతమైనదని.. రాష్ట్రం ఏర్పాటైన ఎనిమిదేళ్ళ వ్యవధిలో వందేళ్ళ ప్రగతిని సాధించి దేశంలో అగ్రస్థానానికీ ఎగబ్రాకడం అందుకు నిదర్శనం. ఈ తెలంగాణ మట్టికే అలాంటి శక్తి వున్నది. ఈ మట్టిని నమ్మి జీవించే ఇక్కడి భోళా ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటంచేసిన విప్లవతపస్వి కేసీఆర్‌ గాంధీజిలా సత్యాగ్రహం చేశాడు. కాళోజిలా ప్రశ్నించాడు. దాశరథిలా గద్దించాడు. వారి తపస్సు ఫలించింది. యాభై ఎనిమిదేళ్ళ క్రితం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌తో అతికిన అతుకును వూడించాడు. ఎనిమిదేళ్ళలో బంగారు తెలంగాణగా మార్చాడు.

కేసీఆర్‌ మాయల మరాఠి కాడు… మంత్రదండంతో హాంఫట్‌ అని మ్యాజిక్‌ చేయలేదు. ఆయన తొలుత తెలంగాణ మౌలిక అవసరాలను గుర్తించాడు. తెలంగాణ వెనకబాటుతనానికి కారణాలను విశ్లేషించాడు. రోగమేదో తెలుసుకొంటే చికిత్స సులభమనే అంశాన్ని ఎరిగిన మేథావి. అందుకే నీళ్ళు నిధులు నియామకాలనే నినాదత్రయంలో నీటి పారుదల ప్రాజెక్టులపై దృష్టిసారించి కాళేశ్వరం భారీప్రాజెక్టును మూడేళ్ళలోనే పూర్తిచేసి కోటి ఎకరాల మాగాణాన్ని నీటితో తడిపాడు. గోదావరి నీటిని ఎగువకు ప్రవహింపజేసి నీరు పల్లమెరుగుననే సామెతనే తిరగరాశారు కేసీఆర్‌ను అపర భగీరథుడంటారు. పట్టుదలలో కార్యసాధనలో కేసీఆర్‌ ఇంకో మెట్టు పైనే వున్నాడు. భగీరథుడు కేవలం తన పితృదేవతల కోసమే గంగను తీసుకొచ్చాడు. కేసీఆర్‌ తెలంగాణ రైతులందరికోసం గోదావరిని మళ్ళించాడు.

ఇపుడు దేశంలో ఎక్కడ చూసినా, పవర్‌ కట్టే.. కానీ మన తెలంగాణాలో విద్యుత్‌ కోతనేదే లేదు. 24గంటలూ కరెంటు సరఫరా చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కేసీఆర్‌. ఇల్లు అలుకగానే సంబరపడడం కాదు. రైతులకు నీళ్ళిచ్చి, కరెంటు ఇవ్వగానే సరిపోదని ఎరిగిన కేసీఆర్‌ ప్రతి రైతుకు ప్రతిసంవత్సరం ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఉచితంగా బ్యాంకు ఖాతాలో జమచేయిస్తున్నాడు. స్వాతంత్య్రం సిద్ధించిన 75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రమూ ఇంతవరకు ఇలాంటి పథకం ప్రవేశపెట్టలేదు. రైతుల సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రి ఇంతగా పాటుపడలేదు. ఇది చారిత్రక సత్యం తెలంగాణ ఏర్పడిన తదుపరి నీటిపారుదల, వ్యవసాయరంగం, విద్యుత్‌ రంగాలేకాదు ప్రతి రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. అవన్నీ గణాంక వివరాలతో వివరిస్తే మహాభారతమే అవుతుంది. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన వందలాది సంక్షేమ పథకాల వలన దళిత, బిసి, మైనారిటీ, ఓబిసి, వర్గాలు లబ్దిపొందుతున్నాయి.

కేసీఆర్‌ది ధార్మిక చింతన. ఆధ్యాత్మికంగా యాదాద్రి క్షేత్రం రూపురేఖలు మార్చి తెలంగాణనే దివ్య స్థలిగా మార్చారు. జ్ఞానపథానికి పెద్దపీటవేసినట్లే జానపదానికి అగ్రతాంబూలం ఇచ్చారు. గుస్సాడి నృత్యకళకు కోటిరూపాయల నిధులు మంజూరు చేయడం అందుకు నిదర్శనం. సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించారు. సహజంగానే సాహితీవేత్తయైన కేసీఆర్‌ ప్రపంచ తెలుగు మహాసభలను కనీవిని ఎరుగనివిధంగా నిర్వహించారు. వేయిమాటలేల కేసీఆర్‌ తెలంగాణాను సాధించిమాత్రమే మిన్నకుండలేదు. తెలంగాణా గతిని గమనాన్నే మార్చారు. పరిశ్రమలు, ఐటి, ఔషధాలు, ఆసుపత్రులు, విద్య, వైద్యం, చేనేత మొదలైన పలు రంగాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చారు. తెలంగాణా ప్రగతిని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి పార్టియే పార్లమెంటులో ప్రశంసించింది. అయితే సాధించినదానితో సంతృప్తిని పొంది పొంగి పోకూడదనేదే కేసీఆర్‌ అభిమతం. అందుకే ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తమ లక్ష్యాలను నిర్దేశించుకొని, నిజాయిగా చిత్తశుద్ధితో తెలంగాణను హరిత తెలంగాణాగ, బంగారు తెలంగాణగానే కాకుండా ఆదర్శ తెలంగాణగా నిర్మించడానికి కృతనిశ్చయంతో ముందుకు వెళుతున్నారు. వారి లక్ష్యాలు నెరవేరితే అనతి కాలంలోనే మన తెలంగాణ మహాత్ముడు కలలుగన్న స్వరాజ్యంగా మారుతుందనుటలో సందేహం లేదు.