గుండె చెరువయ్యే చెరువు కథ

uuri-cheruvఊరికి చెరువే గుండెకాయ కదా, గుండె చెరువయ్యే చెరువు కథ ఎంతచెప్పినా వొడువని నేలతండ్లాట కథేకదా. అందుకే చెరువు కథ చెప్పడానికి ఉపక్రమిస్తే అది కావ్యంకాక మరేమవుతుంది? చెరువు ఒక దీర్ఘానుభవ సమాహారం. చెరువు మన జ్ఞాపకాల పుటలను తడిపిన జీవనమూలాల ముచ్చట. అందుకే వనపట్ల సుబ్బయ్య ఊర చెరువుని దీర్ఘ కవితా కావ్యంగా హృద్యంగా ఆవిష్కరించాడు. దీర్ఘ కవితకుండాల్సిన ప్రధాన క్షణం అంతస్సూత్రత, ఆ క్షణాన్ని తనది చేసుకున్న చెరువును ప్రధాన కవితా వస్తువుగా స్వీకరించడంలోనే కవి భావనకున్న లోతు చెరువుతో కవి పెనవేసుకున్న అనుబంధం మనకు అర్థమౌతుంది. తెలంగాణాలో చెరువులంటేనే ఓ గొలుసు కట్టు అనుబంధాల ధార కదా..

ఒక్కో బొట్టునూ ఒడిసిపట్టి, దాపెట్టి నేల దాహార్తికి అందించే చెరువును గురించి చెపుతూ సకల జీవరాసుల/ ఆకలి దూపల తీర్చే / పాల సముద్రాలు అంటాడు కవి. చెరువును పాలసముద్రం అనడంలోనే చెరువుకున్న పరిపూర్ణమయిన మాతృత్వకాంతిని మనముందు ప్రసరింపజేస్తాడు. ఈ ఊర చెరువు దీర్ఘ కావ్యం నిండా మత్తడి దుంకిన మన పాలమూరు పదాలు.

వాటి సొగసు చదివినంతసేపూ మన మనసును అలలు అలలుగా కమ్ముకుంటాయి. మన తెలంగాణ ప్రభుత్వం మన స్వరాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమం ఒక మహా ఉద్యమంగా రూపుదాల్చుతున్న ఈ తరుణంలో, ఈ అపూర్వ యజ్ఞానికి అండగా, ఆలోచనలు రేకెత్తించే అక్షరాయుధంగా మలిచి ఊర చెరువు దీర్ఘకవితగా అందించారు కవి వనపట్ల సుబ్బయ్య.
– వఝుల శివకుమార్‌