విజయగాధ – రియల్ శ్రీమంతుడు

By: మామిండ్ల దశరథం, కామారెడ్డి

‘‘ఊరు చాలా ఇచ్చింది. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావయిపోతారు’’ అనే పాపులర్‌ డైలాగ్‌ కొరటాల శివ దర్శకత్వంలో సినీ హీరో మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన శ్రీమంతుడు చిత్రంలోనిది. ఉన్నంతలో స్వంత ఊరికి ఏదైనా చేయాలన్న సందేశంతో ఆ చిత్రాన్ని రూపొందించారు. ఆ శ్రీమంతుడు సినిమాను ప్రేరణగా తీసుకొని తనకు అక్షరజ్ఞానం నేర్పిన పాఠశాలను రాష్ట్రానికి రోల్‌ మోడల్‌గా అధునాతనంగా తీర్చిదిద్ది … రియల్‌ హీరోగా, అసలైన శ్రీమంతుడిగా నిలిచారు ఓ వ్యక్తి. ఆయనే తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి. 

వివరాలలోకి వెళితే …

తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి స్వస్థలం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని జనగామ గ్రామం. కీ.శే. సుశీల, నారాయణరెడ్డి  దంపతుల కుమారుడు సుభాష్‌రెడ్డి బిల్డర్‌గా స్థిరపడ్డారు. సుభాష్‌రెడ్డి విద్యాభ్యాసం బీబీపేట్‌ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జరిగింది. 1986`87 సంవత్సరంలో పదోతరగతి పూర్తి చేశాడు. తను చదివిన పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో వారి తల్లిదండ్రుల పేరు మీద నూతన భవనం నిర్మించాలనుకున్నాడు. గత సంవత్సరం అక్టోబర్‌ 30న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేతులమీదుగా పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ప్రస్తుతం 653 మంది విద్యార్ధులు చదివే బీబీపేట మండల కేంద్రంలోని ఈ జిల్లా పరిషత్‌ ఉన్న పాఠశాలను ఆధునిక హంగులతో కార్పొరేట్‌ పాఠశాలను తలదన్నేలా నిర్మించారు. పూర్వ విద్యార్ధి తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి… తన తల్లిడంద్రుల జ్ఞాపకార్ధం రూ.6 కోట్లతో ఆధునిక హంగులతో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టారు. అంతర్జాతీయ స్కూల్స్‌ తరహాలో 42 వేల చదరపు అడుగుల్లో 33 సువిశాల గదుల్లో డిజిటల్‌ తరగతులు, సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. గ్రంథాలయం, మూత్రశాలలు, నీటి శుద్ధి కేంద్రం, భోజనశాల, ఆట వస్తువులు, ఉపాధ్యాయులకు విశ్రాంతి గదులు, ఒకేసారి 300 మంది సమావేశమయ్యేలా కాన్ఫరెన్స్‌ హాల్‌, హెడ్‌ మాస్టర్‌కు, ఉపాధ్యాయులకు ప్రత్యేక గదులు నిర్మించారు. ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్థానాలకు విద్యార్ధులు చేరుకుంటే తన లక్ష్యం నెరవేరినట్లు అవుతుందని చెబుతున్నారు దాత సుభాష్‌రెడ్డి. 

నవంబర్‌ 09,  2021న రాష్ట్ర మంత్రులు, కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డిల చేతుల మీదుగా ఈ పాఠశాల భవాన్ని గ్రామానికి అంకితం చేశారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీరామారావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జనగామలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణం జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో దశాబ్దాలుగా పెండిరగ్‌లో ఉన్న అనేక మౌలిక అంశాలను పరిష్కరించుకున్నామని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం  తెలంగాణేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మెచ్చే విధంగా రాష్ట్రంలో ఇంటింటికి మిషన్‌ భగీరథ నీరు ఇస్తున్నామని అన్నారు. విద్యా, వైద్యంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపడం సీఎం లక్ష్యమని మంత్రి కేటీఆర్‌ వెల్లడిరచారు. సుభాష్‌రెడ్డి స్వంత డబ్బులతో నిర్మించిన పాఠశాల ఇంత గొప్పగా ఉంటుందని తాను అనుకోలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ పాఠశాల అందంగా ఉంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ నియోజకవర్గాల్లో చేపడుతా మన్నారు. ‘‘మీ సేవలకు అభినందనలు’’ అంటూ సుభాష్‌ రెడ్డిని అభినందించారు. సుభాష్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని, అందరూ ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో … సుభాష్‌రెడ్డి లాంటి వాళ్ళు తోడైతే… రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని కేటీఆర్‌ తెలిపారు. 

కార్యక్రమంలో, ప్రభుత్వ విప్‌ గోవర్ధన్‌, జహీరాబాద్‌ ఎంపీ బీటీ పాటిల్‌, జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌, ఎల్లారెడ్డి ఎమ్మేల్యే జాజుల సురేందర్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ శోభ హాజరయ్యారు. 

గతంలో పుట్టిన ఊరికి సేవ చేయాలని తపనతో బీబీ పేట మండలంలోని తన స్వగ్రామం జనగామలో 52, జంగంపల్లి గ్రామంలో 50 డబుల్‌ బెడ్రూం ఇళ్ళను విల్లాల తరహాల్లో నిర్మించి ఔరా! అనిపించారు.

సుభాష్‌రెడ్డి గారూ… 

మీరే నిజమైన హీరో ! 

రియల్‌ శ్రీమంతుడికి… సినిమా హీరో 

మహేష్‌బాబు ట్విట్టర్‌ వేదికగా ప్రశంస

సుభాష్‌రెడ్డిగారు… శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో బిబిపేటలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించడం చాలా గౌరవంగా భావిస్తున్నా, మీరే నిజమైన హీరో … మీలాంటి మరింత మంది సమాజానికి కావాలి? అంటూ సినీ నటుడు మహేష్‌బాబు  ప్రశంసించారు. త్వరలో శ్రీమంతుడు సినిమా బృందంతో కలిసి పాఠశాలను సందర్శిస్తానని హామీ ఇచ్చారు.