ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రోత్సాహం

అత్యధికంగా వంటనూనె దిగుబడినిచ్చే బహువార్షిక పంటలలో ఆయిల్‌ పామ్‌  ప్రధానమైనది. 
పామ్‌ ఆయిల్‌ ను అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రధానంగా వంట కోసం ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా, వంటనూనెల వినియోగంలో 36.71 శాతం (2020-21లో), భారతదేశం వంట నూనెల వినియోగంలో 60శాతంగా ఉంది. 
పామ్‌ ఆయిల్‌ కేవలం వంట నూనె గానే కాకుండా, ఆహార ఉత్పత్తులు, డిటర్జెంట్లు, సౌందర్య సాధనాల తయారీకి, కొంతవరకు జీవ ఇంధనంగా కూడా ఉపయోగించబడుతుంది.

భారత దేశం ప్రతి సంవత్సరం మలేషియా, ఇండోనేషియా నుండి సుమారు 9-10 మిలియన్‌ మె. టన్నుల ముడి పామ్‌ ఆయిల్‌ను, విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి దిగుమతి చేస్తోంది. ముడి చమురు తరువాత ఇది రెండవ అత్యధిక దిగుమతి.

ఆయిల్‌ పామ్‌ పంట సగటు ఉత్పాదకత మిగతా నూనె పంటల కంటే ఎక్కువగా ఉండటం వలన, మార్కెట్లో పామ్‌ ఆయిల్‌ తక్కువ ధరకు లభ్యమవడమే కాకుండా పోషక విలువలలో కూడా మిగతా నూనెల కంటే ఏ మాత్రము తీసిపోకుండా ఉంది. ఐసిఎంఆర్‌ జాతీయ పోషక సంస్థ (ఎన్‌ఐఎన్‌) వారి అధ్యయనం ప్రకారం ఇతర నూనెల మాదిరి గానే పామ్‌ ఆయిల్‌ కూడా హృదయంపై ఎటువంటి దుష్ప్రభావాలు చూపలేదు.  ఈ నూనె ఎక్కువ కాలం నిలువ ఉండడమే కాకుండా, దీని భాష్పీభవన ఉష్ణోగ్రత (300 డిగ్రీలు) ఎక్కువగా ఉండడం వలన అధిక ఉష్ణోగ్రతలో కూడా రసాయనిక మార్పులు జరగకుండా నాణ్యత స్థిరంగా ఉంటుంది, అందువలన కూడా ఈ నూనెకు ఆహార ఉత్పత్తుల పరిశ్రమలో ప్రాధాన్యత దక్కింది. దేశంలో మొత్తం పామ్‌ ఆయిల్‌ వినియోగంలో 72 శాతం వరకు ఆహార సంబంధిత పరిశ్రమలలో వినియోగిస్తుండగా, మిగిలిన 28 శాతం వరకు సౌందర్య ఉత్పత్తులు, ఔషధాలు, జీవ ఇంధనం మున్నగు వాటి తయారీలో వాడుతున్నారు.

 సగటున మన దేశ జనాభాకి 22 మిలియన్‌ టన్నుల వంట నూనెలు అవసరం కాగా, కేవలం 7 మిలియన్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. మిగిలిన 15 మిలియన్‌ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ మొత్తం దిగుమతులలో పామాయిల్‌ 60శాతంగా ఉన్నది. అనగా, సుమారు 9-10 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ నూనెను, విలువైన విదేశీ మారక ద్రవ్యం వెచ్చించి దిగుమతి చేసుకుంటున్నాం. పామ్‌ ఆయిల్‌ దిగుమతులను పూర్తిగా తగ్గించుకుని ఇప్పుడు వెచ్చిస్తున్న విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలంటే, ఆయిల్‌ పామ్‌ సాగును పెద్ద యెత్తున  ప్రోత్సహించాల్సిన అవసరం వుంది.

జాతీయ ఆయిల్‌ పామ్‌ పరిశోధన సంస్థ వారి ‘‘విజన్‌ 2050’’ నివేదికని బట్టి చూసినట్లైతే 2050 సంవత్సరానికి మన దేశ జనాభాకి సగటున 19.16 కిలోల చొప్పున 31.03  మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వంట నూనెలు అవసరం కాగా, అందులో 45శాతం అనగా 13.96 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల పామ్‌ ఆయిల్‌ వాటాగా ఉంటుందని అంచనా. 

భారత ప్రభుత్వం 1992 నుండి వివిధ కార్యక్రమాల ద్వారా దేశంలో ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం దాదాపు 8.75 లక్షల ఎకరాలు.  దేశంలో పామ్‌ ఆయిల్‌ స్వయం సమృద్ధి సాధించాలంటే అదనంగా 70 లక్షల ఎకరాల విస్తీర్ణం అవసరం.

తెలంగాణలో ఆయిల్‌ పామ్‌ ప్రస్తుతం 68,179 ఎకరాలలో సాగు చేయబడుతోంది, రాష్ట్రంలో ముడి పామాయిల్‌ ఉత్పత్తి సాలినా 45,000 మెట్రిక్‌ టన్నులు మాత్రమే, కాగా మన రాష్ట్ర జనాభాకు 3.66 లక్షల టన్నుల పామ్‌ ఆయిల్‌ అవసరం. 2020 వరకు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాలో మాత్రమే నీటి వసతి క్రింద ఆయిల్‌ పామ్‌ సాగు చేయబడుతోంది. మన రాష్ట్రం లోన అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఈ జిల్లాలలో రైతులు విజయవంతంగా ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తూ సాలినా ఎకరానికి 10-12 టన్నుల గెలల దిగుబడి సాధిస్తున్నారు. దేశంలోనే అధిక విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్‌ కంటే మన రాష్ట్రంలో నూనె రికవరీ శాతం ఎక్కువ. 

ఆయిల్‌ పామ్‌ ను అధికంగా సాగు చేసే ఇండోనేషియా, మలేషియా దేశాలలో అడవులను తీసివేసి వర్షాధారంగా ఆయిల్‌ పామ్‌ తోటలను వేయడం జరిగింది. దీని వల్ల ఆ ప్రాంతం లోని  జీవ వైవిధ్యం దెబ్బ తింటుందని పర్యావరణ వేత్తల అభిప్రాయం. వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువును (జaతీపశీఅ-సఱ-శీఞఱసవ) శోషించి/ గ్రహించి, నేలలో కర్భన శాతాన్ని స్థిరీకరించడానికి ఆయిల్‌ పామ్‌ పంట దోహద పడుతుంది. భారతీయ ఆయిల్‌ పామ్‌ పరిశోధన సంస్థ వారి అధ్యయనం ప్రకారం ఒక హెక్టారు ఆయిల్‌ పామ్‌ తోట సంవత్సరానికి సగటున 29.3 టన్నుల బొగ్గుపులుసు వాయువును శోషించి పర్యావరణానికి మేలు చేస్తుంది. దీనివలన నేలలో సేంద్రీయ కర్భన శాతం పెరిగే అవకాశం ఉంది. భారతీయ ఆయిల్‌ పామ్‌ పరిశోధన సంస్థ వారి అధ్యయనం ప్రకారం ఒక హెక్టారు ఆయిల్‌ పామ్‌ తోట నుండి సంవత్సరానికి 36.50 టన్నుల జీవ పదార్థం (ఖాళీ గెలలు, నూనె తీయగా వచ్చిన పీచు పదార్థం, విత్తన పెంకు, ఆకు మట్టలు, కాండం, నూనె మిల్‌ వ్యర్థాలు మున్నగునవి) ఉత్పత్తి అవుతుంది, ఇట్టి జీవ పదార్థాన్ని తిరిగి వివిధ రకాల పరిశ్రమలలో జీవ ఇంధనం, జీవన ఎరువుల మున్నగు వాటి తయారీకి ఉపయోగిస్తారు. 

తెలంగాణ ప్రాంత విషయానికి వస్తే ఈ పంటను నీటి వసతి ఉన్న రైతుల భూములలో ప్రోత్సహించడం జరుగుతోంది. దీని వలన పర్యావరణానికి నష్టం కలిగే అవకాశం లేకపోగా, కొత్త పంట వైపుకు రైతులను మళ్లించడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. సమృద్ధిగా నీటి వసతి కలిగి, ఈ పంట సాగు చేయడానికి ఆసక్తి చూపిన రైతులకు పంట పై పూర్తి అవగాహన కల్పించిన పిదప మాత్రమే ప్రోత్సహించడం జరుగుతుంది.

పర్యావరణానికి మేలు కలిగించేది, వరికి ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్‌ పామ్‌ సాగుకు అధిక అవకాశాలున్నాయి. ఒక ఎకరా వరి సాగుకు అవసరమైన నీటితో 4 ఎకరాల ఆయిల్‌ పామ్‌ పంటను సాగు చేయవచ్చు. అంతే కాకుండా మరే ఇతర పంటలకు లేని విధంగా ప్రభుత్వం చే నిర్ణయించబడిన ధర ప్రకారం కంపెనీలచే గెలలు కొనబడి, పక్షం రోజులకొకసారి డబ్బు రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఆయిల్‌ పామ్‌ పంటకు మాత్రమే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొని పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం,చెరువుల పునరుద్ధరణ వలన సాగునీటి లభ్యత పెరగడమే కాకుండా, భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందాయి.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 4 జిల్లాలే కాకుండా, ఆయిల్‌ పామ్‌ సాగును ఇతర జిల్లాలకు విస్తరించుటకు కేంద్రం తెలంగాణలో 10.90 లక్షల ఎకరాలు ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలమయి నవిగా నోటిఫై చేసింది. ఇప్పటివరకు, రాష్ట్ర ప్రభుత్వం 11 కంపనీలకు 26 జిల్లాలో 9.49 లక్షల ఎకరాలను ఫ్యాక్టరీ జోన్లు కింద కేటాయించడం జరిగింది.  సదరు కంపెనీలు సుమారు రూ.120 నుండి రూ 130 కోట్లు వెచ్చించి రాష్ట్రంలో 30 చోట్ల నర్సరీలను ఏర్పాటు చేసి , మొలకలను దిగుమతి చేసుకుని మొక్కలను పెంచడం జరుగుతున్నది.

ఆయిల్‌ పామ్‌ ప్రయోజనాలు, అవసరాలు, సాగు అనుకూలతల దృష్ట్యా, పంట వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 20.00 లక్షల ఎకరాల వరకు ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీనివలన  వంటనూనె ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించడంతో పాటు దేశ అవసరాలను కూడా కొంతవరకు తీర్చడానికి సాధ్యపడుతుంది. తద్వారా రాష్ట్రంలోని రైతులు లబ్ధిపొందడమే కాకుండా విలువైన విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా అవుతుంది.

ఆయిల్‌ పామ్‌ మొక్కలను పెంచుటకు అవసరమైన 2 సంవత్సరాల ముందస్తు సమయం దృష్టిలో ఉంచుకొని 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల కోసం, రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా ఆయిల్‌ పామ్‌ కంపనీలను  పర్యవేక్షణ చేస్తూ వారి ద్వారా ఇప్పటికే 3.25 కోట్ల విత్తన మొలకల సరఫరా కోసం విదేశీ సంస్థలకు  ఇండెంట్లు పెట్టడం జరిగినది. 

సాగు విస్తరణ కోసం కార్యాచరణ ప్రణాళిక

ఆర్ధిక సం. 2022-23కి గాను, రూ.1000.00 కోట్ల లక్ష్యం తో 2.50 లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగు ప్రోత్సహించుటకు నిర్ణయించడం జరిగింది.

  • ఆయిల్‌ పామ్‌ మొక్కల కొరకు ఎకరానికి రూ.11,600 ఎరువులు, అంతర పంటల కోసం సంవత్సరానికి ఎకరానికి రూ.4200 (4 సంవత్సరాల వరకు ) రాయితీ అందించబడుతుంది.
  • బిందు సేద్యానికి ఎకరానికి రూ.20317 రాయితీ అందించబడుతుంది.
  • 2.50 లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగు కోసం కనీసం 1.62 కోట్ల మొక్కలు అవసరముంటుంది. 
  • కంపెనీలు ఇప్పటికే 93.38 లక్షల విత్తన మొలకలను పొంది వారి వారి నర్సరీలలో నాటడం జరిగింది.  
  • ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది రైతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తీసుకెళ్లి ప్రత్యక్ష్యంగా ఆయిల్‌ పామ్‌ తోటలను చూపించి సాగు పై అవగాహన కల్పించడం జరిగినది. – ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా లక్ష ఎకరాలలో  ఆయిల్‌ సాగు చేపట్టుటకు 20,000 మందిరైతులు ఆసక్తి చూపించారు.