ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం

తెలంగాణను ఆధునిక వ్యవసాయ రాష్ట్రంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేస్తున్నది.లాభదాయక సేద్య పద్ధతుల పట్ల పూర్తి అవగాహన ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో మెరుగైన సాగునీటి యాజమాన్య పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ప్రతి నీటిబొట్టును గరిష్టస్థాయిలో సద్వినియోగపరచి పంటల ఉత్పత్తిని, ఉత్పాదకత పెంపుదలతో సన్న, చిన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. దీనితో రైతులకు అన్ని రకాల వ్యవసాయ ఖర్చులు తగ్గి, అధిక ఉత్పత్తితో అదనపు ఆదాయం లభిస్తున్నది. సూక్ష్మ సేద్య పరికరాలతో ఎస్సీ, ఎస్టీ, సన్నకారు, మధ్యతరగతి రైతులు ఎక్కువగా లబ్ధిపొందుతున్నారు.

ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలకు రైతుల నుంచి మంచి స్పందన కనిపిస్తున్నది.2014-15 నుంచి 2021-22 వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,42,253 ఎకరాల్లో డ్రిప్‌తో పాటు 2,36,589 ఎకరాల్లో స్ప్రింక్లర్స్‌ తో కలిపి మొత్తం 7,78,832 ఎకరాల్లో సూక్ష్మ సేద్య పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది.

  • మైక్రో ఇరిగేషన్‌ ప్రోగ్రాం లో భాగంగా సూక్ష్మ సేద్య పరికరాలు యూనిట్స్‌ కు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నది.
  • డ్రిప్‌, స్ప్రింక్లర్‌ యూనిట్స్‌ తో 2,91,486 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
  • రాష్ట్రంలో మొత్తం 19.78 లక్షల ఎకరాలను ఇప్పటివరకు తేవడం జరిగింది.
  • 2014 తర్వాత 7.79 లక్షల ఎకరాలలో మైక్రో ఇరిగేషన్‌ పరికరాలను ప్రభుత్వం అమర్చింది
  • నాబార్డు సహకారంతో 2016-17, 2017-18 లో లబ్ధి పొందిన 1,38,579 మంది లబ్ధిదారులలో 82శాతం అంటే 1,14,541 మంది చిన్న, మధ్యతరహా కేటగిరికి చెందిన 2.74 లక్షల ఎకరాల్లో డ్రిప్‌, స్ప్రింక్లర్‌ పరికరాలు బిగించారు. వారిలో 27,535 మంది ఎస్సీ, ఎస్టీ రైతులు లబ్ధిపొందారు.

మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అమలుతో  ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వానికి, రైతులకు స్తూలంగా రూ.9,455 కోట్ల లబ్ధి కలిగింది. మైక్రో ఇరిగేషన్‌ పరికరాల ఏర్పాటుతో గతంతో పోల్చితే 43శాతం అంటే 25.54టిఎంసిల నీరు ఆదా అయింది. విద్యుత్‌ వినియోగం 1703 లక్షల యూనిట్స్‌ (33శాతం) తగ్గింది. విద్యుత్‌ పొదుపుతో రూ 76.67 కోట్లు మిగిలాయి. వివిధ రకాల పంటలు ఉత్పాదకతతో పాటు 52.30శాతం ఉత్పత్తి పెరిగింది. ఈ పెరిగిన దిగుబడి 65 లక్షల మెట్రిక్‌ టన్నులకి  సగటున టన్నుకు రూ.3,171 చొప్పున లెక్కిస్తే రైతులకు రూ 2,049 కోట్లు అదనపు ఆదాయం లభించింది. అలాగే రైతుల పరంగా చూస్తే వారికి కూలి ఖర్చులు రూ.94 కోట్లు మిగిలాయి.

రాష్ట్రంలో  2 కోట్ల 14 లక్షల ఎకరాలు సాగవుతున్నది. దానిలో 5.39శాతం భూమి అంటే 11.57 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగవుతున్నవి. ఉద్యానవన పంటల దిగుబడి 59 లక్షల మెట్రిక్‌ టన్నులుగా వుంది. కూరగాయలు 2.23 లక్షల ఎకరాలు (దిగుబడి 22.03 ఎల్‌ఎంటి), పండ్లు 4.24 లక్షలు ఎకరాలు(దిగుబడి 24.07 ఎల్‌ఎంటి), సుగంధ ద్రవ్యాలు 3.56 లక్షల ఎకరాలు (దిగుబడి 8.51 ఎల్‌ఎంటి), ప్లాంటేషన్స్‌ 55 వేల ఎకరాలు (దిగుబడి 3.89 ఎల్‌ఎంటి), పూలు 9 వేల ఎకరాలు (దిగుబడి 47 వేల మెట్రిక్‌ టన్నులు) లో సాగవుతున్నది.

వీటితో పాటు కొద్ది ఎకరాల్లో మెడిసినల్‌, అలంకరణమొక్కల నర్సరీలు ఉన్నాయి. 86 వేల ఎకరాల్లో ఆగ్రో ఫారెస్ట్రీ,3 వేల ఎకరాల్లో సెరికల్చర్‌ నర్సరీలను పెంచుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం పసుపు పంట సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. మిరప సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్నది.అలాగే ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తీర్ణంలో 6 వ స్థానంలోను, ఉత్పత్తిలో 2 వ స్థానంలో ఉన్నది. మన రాష్ట్రంలో ఉన్న వాతావరణం, భూసార పరిస్థితులు, మెరుగైన యాజమాన్య పద్ధతుల వలన  గెలల నుంచి వస్తున్న ఆయిల్‌ ఫామ్‌ నిష్పత్తి దేశంలోనే అత్యధికంగా 19.22శాతం ఉన్నది.

రాష్ట్ర సాగువిస్తీర్ణంలో హార్టికల్చర్‌ విస్తీర్ణం 5.39 శాతం మాత్రమే ఉన్నప్పటికీ మొత్తం వ్యవసాయరంగానికి 27 శాతం (జివిఎ)  జమజేస్తున్నది.

తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా ఉద్యానవన పంటల వైపు రైతులు మళ్ళుతున్నారు. ఉద్యనవనాల సాగు పట్ల రైతులను ప్రోత్సాహించడానికి 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్నది.

సబ్సిడీ ద్వారా రూ.295 కోట్లతో 1,324 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్రీన్‌, పాలి హౌస్‌ లతో 1,190 మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో అదనంగా 27,376 ఎకరాలను ఫామ్‌ ఆయిల్‌ సాగువైపు తేవడం జరిగింది. ప్రస్తుతం ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తీర్ణం 68,440 ఎకరాలకు చేరింది. ఆయిల్‌ ఫామ్‌ గెలల ఉత్పత్తి 2.6 లక్షల మెట్రిక్‌ టన్నులు అవుతున్నది. సాగునీటి వసతి పెరగడంతో రాష్ట్రంలో 9.49 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ ఫామ్‌ సాగును విస్తరించవచ్చని కేంద్రం నోటిఫై చేసింది. అయితే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంలో భాగంగా రాబోయే 5 ఏండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ ఫామ్‌ సాగును విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక అమలుచేస్తున్నది. స్టేట్‌ ప్లాన్‌ క్రింద 2022-23 లో ఆయిల్‌ ఫామ్‌ కు ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది.

పండ్లు, కూరగాయలు, పూలు, ఆగ్రో ఫారెస్ట్రీ సాగులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం,పద్ధతుల పట్ల రైతులకు శిక్షణ ఇచ్చే ప్రదర్శన క్షేత్రాలుగా ఉపయోగపడే రెండు ఎక్సలెంట్‌ సెంటర్లను మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల, సిద్ధిపేట జిల్లా ములుగు లలో ప్రభుత్వం నెలకొల్పింది. రూ.45.43 కోట్ల వ్యయంతో 4,552 ఎకరాల్లో వేసిన కూరగాయల పందిళ్లతో 3,936 మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. 2021-22 లో రూ.166 కోట్ల వ్యయంతో 83,240 ఎకరాలను మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోకి వచ్చింది.తద్వారా  31,084 మంది రైతులు లబ్ధిపొందు తున్నారు.

ప్రస్తుతం 2022-23లో ఉద్యనవనాల విభాగం ద్వారా రూ 1,218 కోట్లతో రూపొందించిన ప్రణాళికను అమలు చేయబోతున్నారు.