అసామాన్యుడికి అక్షరార్చన

By: డా. అట్టెం దత్తయ్య

తెలంగాణ మట్టికి గొప్ప మహాత్మ్యముంది. ఎందరో మహానుభావులను తయారు చేసింది. కొందరు వారి జీవితాలు తెలంగాణ కోసం అంకితం చేశారు. అందులో ఒకరు సురవరం ప్రతాపరెడ్డి. భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్రల అస్తిత్వాల రక్షణకు పాటుపడిన అసామాన్యుడు. వారు నడిపించిన ‘గోలకొండ పత్రిక’, వారు సంకలనం చేసిన ‘గోలకొండ కవుల సంచిక’లు సామాన్యులకు, సాహితీకారులకు వెలుగు దివిటీలు. వారి ‘రామాయణ విశేషములు’, ‘హైందవ ధర్మవీరులు’, ‘హిందువుల పండగలు’ మన సంస్కృతి వెనకున్న సత్యాన్ని తెలిపి, గుట్టువిప్పు తాయి. తెలుగు అస్తిత్వానికి అద్ధం పట్టిన గ్రంథం ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’. ఇలా సురవరం రచనలు సమాజానికి అనేక కోణాలలో ఉపయోగపడుతూనే ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ సాధన తర్వాత సురవరం రచనలన్నిటికి పూర్వ వైభవం వచ్చింది. తెలంగాణ సాహిత్య అకాడమి వంటివి వారి రచనలను ఇంచు మించుగా అన్ని పునర్ముద్రించడం ఆనందదాయకం. వారి మీద మూడు పరిశోధన గ్రంథాలు వచ్చాయి. అవి వారి ‘జీవితం సాహిత్యం’ పరిచయం చేశాయి. కొన్ని సదస్సులు కూడా జరిగాయి. కాని వాటన్నిటికి భిన్నంగ రూపొందించిన గ్రంథమే ‘సురవరం తెలంగాణం’. ప్రధాన సంపాదకులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఎన్నో పనుల ఒత్తిడిలలో ఉన్న మంత్రివర్యులు వారి ప్రాంతీయ వైతాళికుని గురించి ప్రత్యేక శ్రద్ధతీసుకుని పుస్తకరూపంలో మననం చేసుకోవడం ఎందరికో ఆదర్శం.

ఇందులో సురవరం వివిధ పత్రికలలో రాసిన చక్కని పది కవితలను పొందుపర్చారు. అవి ఆనాటి సమాజ అధ్యయనానికి, భాషకు ప్రతిరూపాలు. రెండవ విభాగం కింద ఎంపిక చేసిన సురవరం సంపాదకీయాలు ఎనిమిదున్నాయి. అవి వేటికవే ప్రత్యేకం. నిజాం కాలంనాటి ప్రాచీన గ్రంథాలయం, గ్రామ్యము భాష, ఖాన్గీ పాఠశాలలు మొదలగు వాటిని గురించి సుజాత పత్రికకు రాసిన సంపాద కీయాలు వారి సూటితనానికి, నిర్భయత్వానికి నిదర్శనాలు. ఇదే వరుసలో ప్రసిద్ధమైన పది వ్యాసాలను అందించారు. అందులో ‘నిజాము రాజ్యములోని తెనుగువారి స్థితి’ ‘హైదరాబాదు రాష్ట్ర విద్యా సమస్యలు’ అనే వ్యాసాలు సురవరం పరిశోధన పటిమను పట్టి చూపిస్తాయి. ఎవరు ఎక్కువ స్పృశించని ‘తందాన కథలు’ వ్యాసంలో ఈ తందాన కథలు పుట్టుపూర్వోత్తరాలను, స్వభావ స్వరూపాన్ని ఎరుక పరిచాడు. ఈ ప్రక్రియ మీద ఇప్పటికి లోతుగా పరిశోధన జరగవలసి అవసరం ఉంది. సురవరం పీఠికల నుండి ఇందులో పన్నెండింటిని ఎంపికచేసి ప్రచురించారు. వాటిలో గోలకొండ కవులసంచికకు, మొగలాయి కథలకు, హింధువుల పండగలకు రాసిన అపూర్వమైన అభిప్రాయాలు వాటిలో చూడవచ్చు.

వైవిధ్యపూరితమైన ఈ గ్రంథంలో రెండవ విభాగంలో సురవరం వంటి వారిని గురించిన లేఖలు, కవితలు, వ్యాసాలు, పాటలు పొందుపర్చారు. అందులో ‘ప్రముఖుల లేఖలు’ ఒకటి. ఈ విభాగం కింద విశ్వనాథ సత్యనారాయణ నుండి తిరుమల రామచంద్ర వరకు ప్రతాపరెడ్డిగారికి రాసిన ఇరవైరెండు లేఖలు వేటికవే ప్రత్యేకం. ఈ లేఖలద్వారా వారి వ్యక్తిత్వాన్ని, పెద్దవారికి వారిపట్ల ఉన్న సాన్నిహిత్యాన్ని, గౌరవాన్ని అంచనావేయవచ్చు. సురవరం కీర్తిశేషులు అయిన తర్వాత వారిని గురించి ప్రసిద్ధులు రాసిన కొన్ని కవితలను ‘సమకాలీనుల స్మృతికవిత్వం’ అనే శీర్షికతో వేశారు. అందులో ‘‘అతడు కలంపట్టి పేర్చి/ నట్టి అక్షరాల సరాలు/ అమూల్యాలు అనర్ఘాలు/ అవి అనంత కాలానికి చాలు…’’ అని దాశరథి, ‘గోల కొండను అక్షరాలకు కట్టినవాడు/ నడమంతరపు దొరల హడల గొట్టినవాడు…’’ అంటూ కాళోజీ, ‘‘అతడు సాహిత్య గగన నీహారరోచి/ ఆంధ్రజనతా హృదబ్ది విహారి వీచి…’’ అంటూ కోవెల సంపత్కుమారాచార్య వంటివారలు పదిమంది కొనియాడిన కవితలు నిత్య పఠనీయాలు. ‘ఉత్తమ దేశికుడు’ శీర్షికతో బి. రామరాజు, ‘తెలంగాణ వైతాళికుడు సురవరం’ అనే శీర్షికతో కాల్వ మల్లయ్య వంటి అనేక మంది రాసిన సురవరం గురించిన లోతైన వ్యాసాలు ఇందులో చూడవచ్చు. ఇక ఈ గ్రంథం చివరివిభాగం కింద ‘సురవరం బాటలో’ అనే పేరుతో ఇరవై ఏడు వ్యాసాలను పొదిగారు. అందులో సురవరం బాటలో సురవరాన్ని ఆదర్శంగా తీసుకుని, సురవరంలా సమాజ, సాహిత్య సేవ చేసిన వారిని గురించి ఇక్కడ గుర్తుచేసుకోవడం ఆ తరాన్నే గౌరవించినట్లుంది. అందులో తెలుగులో తొలి కథానిక అందించిన ‘భండారు అచ్చమాంబ’, హైదరాబాద్‌ అంబేద్కర్‌గా పిలువబడే ‘బి.ఎస్‌. వెంకట్రావు’, దళిత అభ్యుదయ ఉద్యమకారుడు ‘భాగ్యరెడ్డి వర్మ’, శాసనాల శాస్త్రిగా పేరొందిన ‘బి.ఎన్‌.శాస్త్రి’ వంటి వారిని గురించి వచ్చిన విమర్శనాత్మక వ్యాసాలు ఈపుస్తకానికి మరింత వన్నే తెచ్చాయి. ఇందులోనే రెండు పాటలున్నాయి. తెలంగాణలో పాటలేకుండా ఏ పనిచేయలేము. పాట ప్రతి ఉద్యమానికి విజయ భావుట. అవి దేశపతి శ్రీనివాస్‌, గోరటి వెంకన్నలు రాసినవి. ఇలా ఈ గ్రంథం వైవిధ్యాన్ని సంతరించుకుంది. ఇందులో పొందుపరచిన రమణీయమైన చిత్రాలు అపూర్వమైనవి. ఇది మొదటి సంపుటి మాత్రమే. రెండవ సంపుటి ‘సురవరం అనంతరం తెలంగాణ సమాజం’ వచ్చేమాసం సమీక్షించుకుందాం.