రాష్ట్రానికే రోల్ మోడల్‌గా సిద్ధిపేట స్వచ్ఛబడి
By: యం. రామాచారి
చెత్త రహిత సమాజ మార్పు దిశగా సిద్ధిపేట మున్సిపాలిటీ వినూత్న ఆలోచనతో ముందుకు సాగింది. మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవతో దక్షిణ భారతదేశంలో బెంగళూరు తర్వాత సిద్ధిపేటలోనే ‘స్వచ్ఛబడి’ని ఏర్పాటు చేసింది. నిత్యం చెత్త గురించిన పాఠాలు స్వచ్ఛత, చెత్త నిర్వహణ, చెత్త పునర్వినియోగం పై పాఠాలను ఇక్కడ మొదలుపెట్టింది. ప్రజల్లో స్వచ్ఛత పై స్పష్టమైన అవగాహన, చైతన్యం తేవాలని చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరికీ స్వచ్ఛ పాఠాలు బోధిస్తున్నది.

బడి అనగానే విద్యార్థులు ఉంటారు అనుకుంటాం.. అక్కడ పాఠ్యాంశాలు బోధిస్తారనుకుంటాం.. కానీ, సిద్ధిపేట స్వచ్ఛబడిలో మాత్రం చెత్త పునర్వి నియోగం, చెత్త నుంచి సంపదను ఎలా సృష్టించ వచ్చో చెప్తున్నారు. స్కూల్ అంటే.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్సు, సోషల్ సబ్జెక్టుల గురించి టీచర్లు పాఠాలు చెబుతారు. కానీ స్వచ్ఛబడి.. పేరుకు తగ్గట్టే ఇక్కడన్నీ స్వచ్ఛత పాఠాలే చెబుతారు. ఈ బడి ఆవరణ పర్యావరణ పరిరక్షణకు మోడల్ గా ఉంటుంది. ఇక్కడ కనిపించే కుర్చీలు, ప్రహారీ గోడ, మొక్కలు కుండీలు.. ప్రతీది చెత్త, పనికిరాని వస్తువుల్ని రీసైక్లింగ్ చేసి తయారు చేసినవే.

ఇక రోజూ చెత్త సేకరణ, ప్రజా రోగ్యం, తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ నివారణ, చెత్తతో ఇళ్లలోనే ఎరువు తయారీ చేసే విధానాలను తెలుసుకోవాలంటే తప్పనిసరిగా సిద్ధిపేటలోని ఈ స్వచ్ఛబడికి వెళ్లాల్సిందే.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మాతాశిశు పాత దవాఖాన ఆవరణలో కోటి రూపాయలతో 2 వేల చదరపు గజాల విస్తీర్ణంలో దేశంలోనే తొలిసారిగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏర్పాటుచేసిన ‘స్వచ్ఛ గ్రహ’ స్ఫూర్తితో స్వచ్ఛబడి ప్రారంభమైంది. గత ఏప్రిల్ 10న మంత్రి హరీశ్‌రావు దీన్ని ప్రారంభించారు. ఈ స్వచ్ఛబడి ఇవాళ రాష్ట్రానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్నది. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు బోధన ఉంటున్నది. పర్యావరణ పరిరక్షణ, జలవనరుల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం వంటి అంశాలను నేర్పిస్తున్నారు. అలాగే తడి, పొడి చెత్త సేకరణ, ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పిస్తు న్నారు. డిజిటల్ గది ద్వారా వారికి చెత్త పునర్విని యోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఔత్సాహికులు షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందిస్తున్నారు. సిద్ధిపేట మున్సి పాలిటీలోని 43 వార్డుల ప్రజలు దీనిని సందర్శన చేయగా, ఇప్పటివరకు 5 వేల మందికి పైగా చూసినట్టు మున్సిపల్ వర్గాలు తెలిపాయి.

చెత్త పునర్వినియోగంపై అవగాహన

సిద్ధిపేట మున్సిపాలిటీలోని 43 వార్డులు, 45 వేలకు పైగా జనావాసాల నుంచి నిత్యం 54.45 టన్నుల చెత్త వస్తున్నది. ఇందులో తడి చెత్త 26.80 టన్నులు, పొడిచెత్త 16.50 టన్నులు. సిల్ట్ 6.85 టన్నులు, బయో మెడికల్ వేస్ట్ 1.40 టన్నులు, హానికర చెత్త 1.20 టన్నులు, ఇతర వ్యర్థాలు 1.20 టన్నులు ఉంటున్నది.

నిత్యం ఇలా సేకరిస్తున్న చెత్తను పునర్వినియోగం చేసుకోవడం, అందులోంచి సంపదను ఎలా సృష్టించవచ్చో స్వచ్ఛబడిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛ బడిలో వర్మీ కంపోస్టు యార్డు, పార్కు, డిజిటల్ తరగతి, వార్డు కంపోస్టు, హోం కమ్యూనిటీ కంపోస్టింగ్ విభాగాలను ఏర్పాటు చేశారు. సేంద్రియ ఎరువుల ద్వారా పండించే కూరగాయల తోట సాగుచేస్తున్నారు. పనికిరాని వస్తువులతో చక్కని పరికరాలను తయారు చేశారు. ఖాళీ సీసాలతో స్వాగత తోరణాలు, వెదురు బొంగులతో ప్రహరీ.. ఇలా ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి. ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాలను తెలిపే బొమ్మలు వేశారు. అక్కడే ఒక గోశాలను ఏర్పాటు చేశారు. ఆవుల నుంచి వచ్చిన పేడతోపాటు చెత్త ద్వారా సేంద్రియ ఎరువులను తయారుచేసి పెరటి తోటలకు, మిద్దె తోటలకు ఇవ్వనున్నారు. రైతులకు వ్యవసాయానికి కూడా ఈ ఎరువులను అందిస్తున్నారు. సేంద్రియ ఎరువు, కెమికల్ ఎరువుల ద్వారా పండిన కూరగాయలు ఎలా ఉన్నాయో ఇక్కడికి వస్తున్న ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛబడి కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. ఈ స్వచ్ఛబడి ఇప్పుడు గూగుల్, ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్ తదితర వాటిల్లో వస్తున్నాయి.

నూనె క్యాన్లే కుండీలు
ఈ బడిలోని ప్రతి అంగుళం జీరోవేస్ట్కి ప్రతిరూపంగా ఉంటుంది. థర్మకోల్ షీట్స్, పాత నూనె క్యాన్లను మొక్కలు పెంచే కుండీలుగా మార్చేశారు. రంగురంగుల ప్లాస్టిక్ బాటిళ్లు, గాజు సీసాలు, సైకిల్ చక్రాలతో నిర్మించిన ప్రహారీ గోడ అందరినీ ఆకట్టుకుంటున్నది. జీరో వేస్టేజ్, హోం గార్డెన్, హోం అండ్ కమ్యూనిటీ కంపోస్ట్, చెత్త రీ సైక్లింగ్ ఇలా ఎన్నో అంశాలను ఈ బడిలో కలియ తిరుగుతూ తెలుసుకోవచ్చు.
బడిలో ప్రజలకు స్వచ్ఛ పాఠాలు
– సిద్ధిపేటలోని స్వచ్ఛబడిలో స్వచ్ఛ బోధన మొదలైంది. చెత్త విలువ తెలియజేయడం. ఇంట్లో ఉండే తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడం. తడి చెత్త ద్వారా సేంద్రీయ ఎరువు తయారీ పద్ధతి, సేంద్రీయ ఎరువుల ద్వారా కూరగాయల సాగు తదితర అంశాలపై బోధిస్తున్నారు.
– ఎనిమిది మంది శిక్షణ పొందిన వారి ద్వారా పాఠశాల విద్యార్థులు మొదలుకుని సీనియర్ సిటిజన్స్ వరకూ బోధిస్తారు.
– డిజిటల్ తరగతి గదిలో 50 మందికి బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇస్తున్నారు.
– చెత్త ప్రాముఖ్యత, పునర్వియోగం పై మూడు వీడియోల ద్వారా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.
సరికొత్త ఆలోచనకు ప్రతి రూపం: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
ప్రస్తుత సమాజాన్ని చెత్త అంశం పట్టి పీడిస్తున్నది. వినూత్న ఆలోచనతో సిద్ధిపేటలో స్వచ్ఛబడి పేరిట చెత్తను పునర్వినియోగం చేయడం., చెత్త ద్వారా ఎరువు తయారీతో పాటు రీ సైక్లింగ్ ప్రక్రియ ఎవరికి వారే చేసుకునేలా అవగాహన కోసం ఈ స్వచ్ఛబడిని నిర్మించాం. భవిష్యత్తులో స్వచ్ఛబడి మంచి ఫలితాలతో పాటు రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆశిస్తున్నాం. ప్రతి పౌరుడు పోయే బడి ఈ స్వచ్ఛబడి. ఇక్కడ మన ఇంట్లో ఉన్న చెత్తను ఎలా పునర్వినియోగం చేసుకోవచ్చనేది వివరిస్తున్నాం. చెత్త వల్ల కలిగే లాభాల గురించి బోధిస్తున్నాం. ప్రజా భాగ స్వామ్యంతో చెత్త రహిత పట్టణాలుగా మార్చుకుందాం. భవిష్యత్తుకు ఇది పునాది కావాలి. ముందుగా సిద్ధిపేట మున్సిపాలిటీని ఎంపిక చేసి, 43 వార్డుల్లోని ప్రజలకు దశల వారీగా స్వచ్ఛబడికి తీసుకువెళ్ళి బోధన చేయడం మొదలుపెట్టాం. దీంతో సత్ఫలితాలు రావడం మొదలైంది. త్వరలోనే జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ మున్సి పాలిటీలలోని ప్రజలను, ప్రజాప్రతినిధులు, అధికారులను స్వచ్ఛబడికి బోధన నిమిత్తం తీసుకువచ్చే విధంగా రాష్ట్ర మున్సిపల్ అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందించాం.
పద్ధతులపై అవగాహన కల్పిస్తాం: సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ డాక్టర్. కే.వీ.రమణాచారి

బడిలో పిల్లలకు టీచర్లు పాఠాలు చెప్పినట్లే. ఈ స్వచ్ఛ బడిలోని 12 మంది వలంటీర్లు ప్రజలకు, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లకు పర్యావరణ పరి రక్షణ మీద అవగాహన కల్పిస్తారు. తడి, పొడి చెత్తను ఎలా వేరు చేయాలి.? ఆ చెత్తతో కంపోస్టు తయారు చేయడం ఎలా.? అలాంటివి చెప్పడమే కాకుండా ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, చెత్త డ్రై వేస్టేజ్ రీ సైక్లింగ్ చేయడం వంటి పద్ధతుల్ని వివరిస్తాం.
మన చెత్త మన బాధ్యత: డాక్టర్ శాంతి తుమ్మల

జీరో ల్యాండ్‌ఫిల్ పట్టణాలను సృష్టించే బాధ్యతను అన్ని మున్సిపాలిటీలు తీసుకోవాలి. దానిపై అవగాహనకు అమలుకు రెండు ముఖ్యమైన అంశాలు పాటించాలి. ‘‘నా వ్యర్థం నా బాధ్యత’’ అని ప్రతి పౌరుడు అర్థం చేసుకోవాలి. దాని కోసం ప్రతి పౌరుడు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి ప్రజా ప్రతినిధి, ప్రతి అధికారి, ప్రతి పంచాయితీ స్వచ్ఛమైన ఈ స్వచ్ఛబడిని సందర్శించి సుస్థిరమైన ఘన వ్యర్థాల నిర్వహణలో విభిన్న వాటాదారులుగా మీరు చేయాల్సిన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు మీ పాత్రను ఎంచుకుని అర్థం చేసుకోవాలి. మనమంతా ‘మన చెత్త మన బాధ్యత’ అనుకోకపోతే మన ముందు తరాలు మనల్ని క్షమించరు. మనం మారాలి. స్వచ్ఛ తెలంగాణ సాధించేందుకు నడుం బిగించి ఈ సిద్ధిపేట స్వచ్ఛబడికి వెళ్లి నేర్చుకుందాం.