నిజాం ప్రభువును ఢీ కొన్న స్వామీజీ!

venkataraoజి. వెంకటరామారావు 

హౖదరాబాద్‌ రాష్ట్రం నాయకులలో చాలా మంది, వారెక్కడ పుట్టినా హైదరాబాద్‌ నగరాన్నే కార్యరంగంగా ఎంచుకున్నారు. రాజధాని నగరం నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తూ తమ స్ఫూర్తినీ, ప్రేరణనూ జిల్లాలకు వ్యాపింపచేశారు. హైదరాబాద్‌ రాష్ట్రంలో ఆనాటి నాయకత్వ స్థూల స్వరూపమిది. స్వామీ రామానంద తీర్థ కన్నడిగునిగా జన్మించినందువల్ల కర్నాటక ప్రాంత ప్రజలు ఆయనను తమ నాయకునిగా భావించే వారు. ఆయన విద్యాభ్యాసం, రాజకీయ కార్యకలాపాలు ఎక్కువగా మరాఠ్వాడాలో కొనసాగాయి గనుక మహారాష్ట్ర ప్రజలు స్వామీజీని తమ నాయకుడనేవారు. అయితే ఈ రెండింటికి మించి స్వామీజీ రాజకీయ నాయకత్వం సంపూర్ణంగా వికసించి ఉన్నత శిఖరాలను అందుకున్నది తెలంగాణలోనే.

పూర్వాశ్రమంలో స్వామీజీ పేరు వెంకటేష్‌ భావన్‌ రావ్‌ ఖడ్గీకర్‌. ఆయన 1903 అక్టోబర్‌ 3న గుల్బర్గా జిల్లాలోని చిన్‌మల్లి జాగీర్‌ గ్రామంలో జన్మించారు. పూణెలోని తిలక్ విద్యాపీఠం నుంచి ఎం.ఏ. పట్టా పొందారు. కొంతకాలం ప్రసిద్ద కార్మికనాయకుడు ఎన్‌.ఎం. జోషి నాయకత్వంలో కార్మిక రంగంలో పనిచేశారు. ఆనారోగ్య కారణాల వల్ల వృత్తికి స్వస్తి చెప్పి. విద్యారంగంలో ప్రవేశించి 1929లో ఉస్మానాబాద్‌ జిల్లా ఇప్పర్తి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. అక్కడే ఆయన ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించి 29వ ఏట సన్యసించి స్వామీరామానంద తీర్థ కొత్త రూపమేత్తారు.

ఆరు సంవత్సరాలు ఇప్పర్గాలో పని చేసిన అనంతరం బీడ్‌ జిల్లా మోయినాబాద్‌లో యోగీశ్వరీ ఉన్నత పాఠశాలను స్థాపించారు. 1938లో స్వామీజీ రాజకీయాలలోకి ప్రవేశించి హైదరాబాద్‌ నగరాన్ని కేంద్ర రంగంగా చేసుకున్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారాని స్వామీజీ తన రాజకీయ జీవితంలోని అత్యధిక కాలం వెచ్చించారు. స్వయంగా సన్యాసి కావడం వల్ల త్యాగ నిరతితో, స్వార్ధ చింతన లేని లక్ష్య శుద్ధిని సాధించగలిగారు. లక్షలాది తెలంగాణ ప్రజల ప్రేమాదరణలను సంపాదించగలిగారు. తెలంగాణలో ఒకవైపు క్రూరమైన ఫ్యూడల్‌ వ్యవస్థ, మరొక వైపు అత్యంత పేదరికమూ, వెనుకబడిన తనమూ నిరంతరం నిర్నిరోధంగా కొనసాగాయి. అరాచకం, హింసాయుత పోరాటాలకి దారితీసాయి. మిగతా ప్రాంతాల మాదిరిగా తెలంగాణ సమస్య కేవలం మత దురహంకార సమస్యో, రాజకీయ సమస్యోకాదు. తెలంగాణ సమస్య ప్రధానంగా సాంఘిక, ఆర్థిక పరమైనది ఆదృష్టితో స్వామీజీ దీన్ని పరిష్కరించ ప్రయత్నించాడు.

1938 అక్టోబరు 24న హైదరాబాద్‌ రాష్ట్రంలో స్టేటు కాంగ్రెస్‌ ఆవిర్భవించింది. సహజంగానే స్టేటు కాంగ్రెస్‌ అధ్యక్షపదవి స్వామీజీ భుజస్కంధాల మీద పడింది. ఆ వెంటనే ఆయనను అరెస్టు చేశారు. ఆయన కాళ్ళకు బేడీలు బిగించారు. ఒక నిక్కరు, గొంగలి, చెంబు, కంచం ఇచ్చారు. ఆయనతో రోజూ ఎనిమిది గంటలు పని చేయించారు. మొదటిసారే ఆయన 15 నెలలు జైల్లో ఉన్నారు. ఆ తరువాత వెంట వెంట వచ్చిన ఆందోళన ఫలితంగా అరెస్టు చేస్తూ వచ్చారు. హైదరాబాద్‌ సంస్థానం స్వాతంత్య్ర పోరాట చరిత్రలో నాలుగున్నర సంవత్సరాలు సుదీర్ఘ జైలు జీవితం గడిపింది స్వామీజీ ఒక్కరే. దేశానికి స్వాతంత్ర్యం లభించిన రోజున ఢిల్లీలో నెహ్రు ఇచ్చిన జాతీయ పతాకం తీసుకొని హైదరాబాద్‌ విచ్చేసిన స్వామిజీని పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైల్లో ఉంచారు. పోలీసు చర్య తరువాత ఆయన విడుదలయ్యారు.

నిజాం ప్రభుత్వంతో స్వామిజీ పోరాటం ‘నువ్వా-నేనా?’ అనే విధంగా సాగింది. స్టేటు కాంగ్రెస్‌ అధ్యూక్షులుగా ఉన్న తరుణంలోనే స్వామిజీ తెలంగాణ గ్రామాల పర్యటనకు పూనుకున్నారు. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు ప్రాబల్యమున్న ప్రాంతాల పరిస్థితులు హృదయ విదారకరంగా, వర్ణనాతీతంగా ఉండేవి. మిలిటరీ, పోలీసుల దాడులు ఒకవైపు, కమ్యూనిస్టు దళాల దాడులు మరొక వైపు, ఉభయ దాడుల మధ్య ప్రజల జీవితం నలిగిపోయింది. పోలీసులను పగటిదొరలని, కమ్యూనిస్టులను చీకటి దొరలని ఆ రోజుల్లో అంటూ ఉండటం పరిపాటి. దీన్నే ‘రాత్‌ కీ సర్కార్‌, దిన్‌ సర్కార్‌’ అనేవారు. స్వామీజీ తన సహజసాహసంతో ఇలాంటి వాతావరణంలో అడుగు పెట్టారు. ఆయనకు పోలీసు రక్షణ లేదు. అధికారం లేదు. స్వామిజీ మాత్రం వెనుకడుగు వేయలేదు. గ్రామగ్రామానికి వెళ్ళారాయన. భయపడి గ్రామాలను వదిలిపోతున్న రైతులను పిలిచి ధైర్యం చెప్పారు. పల్లె ప్రాంతాలలో జీవచ్ఛవాల్లా ఉన్న ప్రజలలో మళ్ళీ ప్రాణం పోసి లేపే సందేశాన్ని ఆయన అందజేశారు.

స్వామిజీ స్టేటు కాంగ్రెస్‌ అధ్యూక్షులుగా ఉన్నప్పుడే అత్యంత ప్రగతి శీలమైన తీవ్ర భూ సంస్కరణలు హైదరాబాద్‌ రాష్ట్రంలో జరిగాయి. హైదరాబాద్‌ కౌల్దారీ చట్టాన్ని అందరూ కొనియాడటమేగాక, దేశానికంతటికీ మార్గదర్శకంగా స్వీకరించారు. 

హైదరాబాద్‌ స్టేటు కాంగ్రెస్‌ నాయకత్వాన్ని వదిలేసిన తరువాత స్వామిజీ పూర్తిగా నిర్మాణాత్మకమైన కార్యక్రమాలలో నిమగ్నమినారు. 1962 పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేయడానికి నిరాకరించారు. ఈ విధంగా తన ఆధ్యాత్మిక రాజకీయ యాత్రలో మరో అడుగు ఆయన ముందుకు వేశారు. హైదరాబాద్‌ ఖాదీ సమితి అధ్యూక్షులుగా పని చేశారు. తెలంగాణ ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు పి.వి. నరసింహారావు, జములాపురం కేశేవరావు, కోదాటి నారాయణరావు, కాళోజీ మొదలైన వారు ఆయన శిష్య వర్గంలోని వారే. సామ్యవాదం – ప్రజా స్వామ్యం నినాదాలతో వెనకటి హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజలను మేల్కొలిపిన మహనీయుడు స్వామిజీ. 1972 జనవరి 22న స్వామిజీ హైదరాబాద్‌లో స్వర్గస్థులయ్యారు.