అహో! టీ హబ్‌ 2.0

By ముడుంబై మాధవ్‌

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుతో కలిసి ఆవిష్కరణ రంగంలో దేశంలోనే అగ్రగామి వేదికగా పేరుగడించిన టీ-హబ్‌ రెండవ దశ (టీ-హబ్‌ 2.0) భవనాన్ని వివిధ ఐటీ పరిశ్రమల సమాఖ్యల ముఖ్య నాయకులు, పరిశ్రమల అధిపతులు, భారతదేశపు యునికార్న్‌, సూనికార్న్‌ అంకుర పరిశ్రమల వ్యవస్థాపకులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తల సమక్షంలో గచ్చిబౌలిలో ప్రారంభించారు. 5,82,689 చదరపు అడుగుల మొత్తం విస్తీర్ణంతో టి`ఆకారంలో నిర్మించిన టీ హబ్‌ భవనం ఫ్రాన్స్‌ దేశపు ‘స్టేషన్‌ ఎఫ్‌’ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణంగా నిలిచింది.

టీ హబ్‌ మొదటి దశ భవంతికంటే టీ హబ్‌ 2.0 భవంతి ఐదు రెట్లు పెద్దది. ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నీ తానై టీ హబ్‌ 2.0 ఆరంభోత్సవాన్ని పర్యవేక్షించారు. అంకుర పరిశ్రమల వ్యవస్థాపకులతో ముఖాముఖి సమావేశాలు, పరిశ్రమకు చెందిన పెద్దలతో ఇష్టాగోష్ఠి, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, అధికారులను సమన్వయం చేస్తూ రోజంతా ఐటీ శాఖా మంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు. ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ముందుగా టీ హబ్‌ లోహ ఫలకాన్ని, అటుపిమ్మట టీ హబ్‌ నమూనాను ఆవిష్కరించారు. ఆ తర్వాత మంత్రి కేటీ రామారావు వెంట రాగా ముఖ్యమంత్రి టీ హబ్‌ ప్రాంగణమంతా కలియతిరిగారు. టీ హబ్‌ 2.0 భవనం, ప్రతీ అంతస్తులో ఉన్న సౌకర్యాలు, కార్యాలయాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

టీ హబ్‌ 2.0 ఆరంభోత్సవ ప్రధాన వేదిక వద్ద కార్యక్రమం వినూత్నంగా జరిగింది. యూనికార్న్‌ (ఒక బిలియన్‌ డాలర్ల పైగా సంపద కలిగిన సంస్థలు)గా ఎదిగిన భారతదేశపు అంకుర పరిశ్రమల వ్యవస్థాపకులు, నిర్వాహకులు అందరూ ఈ ప్రతిష్టాత్మక ఆరంభోత్సవంలో పాల్గొన్నారు.

అంకుర పరిశ్రమలకు చెందిన వ్యవస్థాపకులందరూ ఒక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం చాలా అరుదైన విషయం. ఇది గత ఎనిమిదేళ్లుగా ఐటీ శాఖ, ప్రభుత్వంలోని ఇతర శాఖల సహకారంతో రాష్ట్రాన్ని ఆవిష్కరణలకు గమ్యస్థానంగా మలచాలనే లక్ష్యంతో చేస్తున్న ప్రయత్నాలకు వచ్చిన ఫలితం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయతకు, సాంకేతికరంగంలో నిరంతర పురోగమనానికి తార్కాణం.

ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ప్రధాన వేదిక వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని పది ప్రదేశాలలో ప్రదర్శించిన వ్యవస్థాపకతా జ్యోతి (Flame of Entrepreneurship) ఈ యూనికార్న్‌ వ్యవస్థాపకులందరి చేతులు మారుతూ చివరకు ముఖ్యమంత్రిని చేరింది. దీంతో టీ హబ్‌ లాంఛనంగా ప్రారంభమైంది.

టీ హబ్‌ భాగస్వాములతో కలిసి కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ఔత్సాహికులకు వ్యవస్థాపకతకు సంబంధించిన అవగాహనను కల్పిస్తూ ఈ జ్యోతి రాష్ట్రమంతా తిరిగింది. వ్యవస్థాపకత స్ఫూర్తిని ప్రస్తుత, భవిష్యత్‌ తరాలలో రగిలించాలనే, కొనసాగించాలనే ప్రతీకాత్మక సందేశం ఈ కార్యక్రమంలో ఉంది.

అనంతరం సభికులనుద్దేశించి సీఎం ప్రసంగించారు. ‘‘నేటి యువతకు ఆకాంక్షలున్నాయి. స్వప్నాలున్నాయి. కొత్త సవాళ్లను స్వీకరించే, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తరం ఇది. యువతలో ఈ ఔత్సాహికతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వ్యవస్థాపకత, సాంకేతికతల విషయంలో భారతదేశాన్ని విశ్వ యవనికపై సమున్నతంగా నిలబెట్టాలని సంకల్పించింది. ఈ దిశగా గత ఏడేళ్లుగా మేము నిర్దిష్ట కార్యాచరణను చేపట్టాము. టీ హబ్‌ 2.0 ప్రారంభంతో ఆవిష్కరణల రంగంలో ప్రపంచస్థాయి సంస్థను నిర్మించామని చెప్పటానికి ఆనందంగా, గర్వంగా ఉంది.’’

‘‘టీ హబ్‌ మొదటి దశ ప్రారంభించిన తర్వాత వ్యవస్థాపకతపై తెలంగాణలో ఉన్న ఆసక్తి ప్రభుత్వానికి తెలిసింది. ఆ ఆసక్తిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో మూడేళ్ళ క్రితం టీ హబ్‌ 2.0కు రూపకల్పన చేయడం జరిగింది. భారత ఆర్థికవ్యవస్థకు మూలస్తంభాలుగా నిలిచేలా రేపటితరం అంకుర పరిశ్రమలను సాకటం మా లక్ష్యం. తెలంగాణ అంకుర సహాయక వ్యవస్థ (Ecosystem) నేడు నిధులను సమీకరించడంలో 15వ స్థానంలో ఉంది. చౌకగా సాంకేతిక నిపుణులు లభ్యమయ్యే  విషయంలో ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉంది. సుమారు 4 లక్షల కోట్ల రూపాయల విలువైనది ఈ Ecosystem. భవిష్యత్తులో భారతదేశపు ‘అంకుర రాష్ట్రం’గా నిలవాలని తెలంగాణ స్వప్నిస్తున్నది. సమీప భవిష్యత్తులోనే ఆవిష్కరణల రంగంలో ప్రపంచస్థాయి, విప్లవాత్మక ఉత్పత్తి /సేవ హైదరాబాద్‌ నగరంనుండే వస్తుందని నేను నమ్ముతున్నాను.’’

యూనికార్న్‌, సూనికార్న్‌ (యూనికార్న్‌ అయ్యే సామర్థ్యం ఉన్న అంకురాలు) వ్యవస్థాపకులను సీఎం ఈ వేదికపై సన్మానించారు. చేవెళ్ళ ఎంపీ రంజిత్‌ రెడ్డి, టీ హబ్‌ బోర్డు ఛైర్మన్‌ బీవీ మోహన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, టీ హబ్‌ ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) ఎం. శ్రీనివాస రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.                

అంతకుముందు వ్యవస్థాపకత స్ఫూర్తిని చాటే ఉద్దేశ్యంతో ఒక రోజు ‘టీ హబ్‌ ఇన్నొవేషన్‌ సమిట్‌’ను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా అనేక చర్చాగోష్టిలు, ఇన్నొవేషన్‌ రంగానికి చెందిన పలువురు లబ్దప్రతిష్టులతో ప్రసంగాలు, నైపుణ్య శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు టీ హబ్‌ కొత్త ప్రాంగణంలో జరిగాయి. దేశ, విదేశాలకు చెందిన అనేక అంకుర సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ఈ సందర్భంగా ప్రదర్శించాయి.

టీ హబ్‌ 2.0 భవనం :

టీ హబ్‌ భవనం నమూనా హైదరాబాద్‌లోని చార్మినార్‌ను పోలి ఉంటుంది. చార్మినార్‌కు నాలుగు మీనార్లు ఉన్నట్టే టీ హబ్‌ భవంతి కూడా నాలుగు పిల్లర్లపైన నిలబడి ఉంది. ఈ తరహా (Cantilever) నిర్మాణాలలో టీ హబ్‌ దేశంలోనే పొడవైనది. టీ హబ్‌ 2.0 భవనంలో మొత్తం పది అంతస్తులున్నాయి. మొత్తం 5,82,689 చ. అడుగుల విస్తీర్ణమున్న భవంతిలో 3,50,000 చ. అడుగుల విస్తీర్ణంలో పని ప్రదేశం ఉంటుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుండి అయిదో అంతస్తు వరకు అంకురాలకు కేటాయిస్తారు. ఆరవ అంతస్తులో భారత పరిశ్రమల సమాఖ్య (CII), AIC T-Hub Foundation కు కేటాయించారు. ఏడవ అంతస్తులో భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన నైపుణ్య కేంద్రం (Centre of Excellence) ఏర్పాటు చేస్తారు. ఎనిమిది, తొమ్మిదవ అంతస్తులు జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ (JICA), సామాజిక ప్రయోజనకారియైన అంకురాలకు, Y-Hubకు కేటాయించారు. అలాగే, ఆవిష్కరణల రంగానికి చెందిన ఐటీ శాఖ ఇతర విభాగాలు TSIC, RICH కూడా టీ హబ్‌ 2.0 భవనం నుండే కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఇంకా సమావేశమందిరాలు, శిక్షణాగదులు, అడిటోరియం, కేఫేటారియా వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

‘‘ఆలోచనతో రండి ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో 5 నవంబర్‌, 2015న ఐఐఐటీ హైదరాబాద్‌ ప్రాంగణంలో (Catalyst) ఒక ఇంక్యుబేటర్‌ గా మొదలైన టీ హబ్‌, ఆవిష్కరణల సంధానకర్తగా (Start up Ecosystem) గడచిన సుమారు ఏడేళ్ళ కాలంలో రూపాంతరం చెందింది. టీ హబ్‌, ఇతర అనుబంధ సంస్థల ప్రభావంతో 2016లో రాష్ట్రంలో 400 అంకురాలు ఉంటే వాటి సంఖ్య 2022 నాటికి 2000కు చేరింది. సుమారు లక్ష కోట్ల రూపాయల నిధులను టీ హబ్‌ అంకురాలు సమీకరించగలిగాయి.

నాలుగవ విడత ‘ఇంటింటా Innovator ప్రదర్శనకు దరఖాస్తుల ఆహ్వానం  

ఐటీ శాఖ విభాగం తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ (TSIC) గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న ‘ఇంటింటా Innovator నాలుగవ విడత ప్రదర్శనకై ఔత్సాహిక ఆవిష్కర్తలనుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఐటీ శాఖ మంత్రి కే.టీ. రామారావు ‘ఇంటింటా Innovator ప్రదర్శన – 2022’ పోస్టర్‌ను పది మంది గ్రామీణ ఆవిష్కర్తలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ డా. శాంత తౌటంతో కలిసి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అన్ని రంగాలు, వర్గాలకు చెందిన గ్రామీణ ఆవిష్కర్తలు, పాఠశాల, కళాశాల విద్యార్థులు, అంకురాలు, పారిశ్రామిక ఆవిష్కర్తలు ఈ ప్రదర్శనకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆవిష్కరణల వివరాలను వాట్సాప్‌ ద్వారా 9100678543 నంబర్‌కు పంపవలసి ఉంటుంది. ఆవిష్కర్తల నుండి దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేది ఆగస్టు 5, 2022. ఎంపిక చేసిన ఆవిష్కరణలు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ప్రదర్శించబడతాయి.

తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి ఆవిష్కర్తలు, ఆవిష్కరణలను గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం అందించడానికి ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల సందర్భంగా 33 జిల్లాల్లో ఇంటింటా Innovator ప్రదర్శనను టీఎస్‌ఐసీ నిర్వహిస్తూ వస్తున్నది. పౌరుల సమస్యలకు ఆవిష్కర్తలు రూపొందించిన వినూత్న సామాజిక పరిష్కారాలను జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారుల ఎదుట ప్రదర్శించడం ఈ కార్యక్రమం లక్ష్యం. గత మూడేళ్లలో ఈ ప్రదర్శన ద్వారా టీఎస్‌ఐసీ 33 జిల్లాలనుండి 100కు పైగా ఆవిష్కర్తలను గుర్తించి, వారిలో ఎంపికచేసిన 40 మందికి మార్గదర్శనం చేసింది. వారి ఆవిష్కరణలకు ప్రోటోటైప్‌/ప్రొడక్ట్‌ అభివృద్ధిలో సహాయపడి, ఆర్థిక సహాయం కూడా అందించింది.