|

వృత్తి నైపుణ్య శిక్షణ లోనూ టి-సాట్‌ భళా..భళా

గత ఆరు సంవత్సరాల కాలంలో ఆన్‌ లైన్‌ విద్యా బోధనలో భళా అనిపించుకున్న టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్లు వృత్తి నైపుణ్య శిక్షణ లోనూ భళా అనిపించుకుంటున్నాయి. ఐటి టెక్నాలజీ కోర్స్‌ వి.ఎల్‌.ఎస్‌.ఐ., ఇక్ఫాయ్‌ యూనివర్సిటీ సిబ్బంది అందించే అవగాహనా పాఠ్యాంశాలకు విస్తృత ఆదరణ లభిస్తోంది. వృత్తి నైపుణ్య శిక్షణ నిరుద్యోగ యువతకు ఆన్‌ లైన్‌ శిక్షణలో టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్లు నిపుణ, విద్య ప్రత్యేక వేదికలయ్యాయి. ఇంజనీరింగ్‌, సాంకేతిక విద్యలో పట్టాలు పొందిన నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యంలో మెళకువలు నేర్పేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తున్నాయి. నిరుద్యోగ యువతతో పాటు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికీ ఈ ప్రసారాలు ఉపయోగపడుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంచాలని నిర్ణయించి, ఐటి కమ్యూనికేషన్ల శాఖ ఆధ్వర్యంలోని టాస్క్‌, పొటానిక్స్‌ వాలీ సంస్థలు సాఫ్ట్‌ నెట్‌ (టి-సాట్‌) తో కలిసి తొలివిడత శిక్షణ 15 రోజులు విజయవంతంగా పూర్తి చేసింది. 15 రోజుల్లో 4.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. యూట్యూట్‌, యాప్‌ సుమారు 1.58 కోట్ల మంది విద్యార్థులు వీడియో పాఠ్యాంశాలను వీక్షించారు. ఏప్రిల్‌ నాల్గవ తేదీ నుండి మరో విడత ప్రారంభం కానున్నాయి. ఐటి ఉద్యోగాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వి.ఎల్‌.ఎస్‌.ఐ (వెరీ లార్జ్‌ స్కేల్‌ ఇండస్ట్రీ) టెక్నాలజీపై ఇంజనీరింగ్‌ విద్య పూర్తి చేసిన యువతలో నైపుణ్యం పెంచేందుకు సంస్థ పొటానిక్స్‌ వ్యాలీ ఆధ్వర్యంలో ఆన్‌ లైన్‌ శిక్షణ నిర్వహించగా, ఇక్ఫాయ్‌ యూనివర్సిటీ అధ్యాపకులు పలు ప్రత్యేక అంశాలపై చేసిన బోధనలు విద్యార్థులు, నిరుద్యోగ యువత, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువతకు భాషా ప్రావీణ్యం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరిగేందుకు దోహదపడ్డాయి.

వి.ఎల్‌.ఎస్‌.ఐ ప్రసారాలకు విస్తృత ఆదరణ
హైదరాబాద్‌ లోని ప్రముఖ 10 ఐటి కంపెనీల ప్రతినిధులను ఎంపిక చేసిన వి.ఎల్‌.ఎస్‌.ఐ టెక్నాలజీపై పొటానిక్స్‌ వాలీ ఆధ్వర్యంలో ప్రత్యేక వృత్తి నైపుణ్య పాఠాలు బోధించారు. సిలికాన్‌ వాలీ, ఇన్‌ టెల్‌, డెలాయిట్‌ వంటి ఐటి దిగ్గజ కంపెనీ ప్రతినిధులు ఉద్యోగులు, నిరుద్యోగుల సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేందుకు ఆన్‌ లైన్‌ బోధనకు ముందుకు వచ్చారు. బోధన ప్రసారాల్లో మొదటి విడత 2021వ సంవత్సరం జూలై 26వ తేదీన ప్రారంభమై ఆగస్టు ఏడవ తేదీన ముగిసాయి. ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకు రెండు గంటల పాటు జరిగిన ప్రత్యక్ష ప్రసార శిక్షణ కార్యక్రమంలో వేలాది మంది ఐటి ఉద్యోగులు, ఐటి ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువకులు తమ సందేహాలకు పరిష్కారాలు తెలుసుకున్నారు. ప్రారంభ కార్యక్రమంలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొని వి.ఎల్‌.ఎస్‌.ఐ ప్రాధాన్యతను వివరించడంతో పాటు యువతలో నైపుణ్యాన్ని పెంచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జయేష్‌ రంజన్‌తోపాటు పొటానిక్స్‌ వాలీ సీఈవో మాధవ్‌, టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా, టి-సాట్‌ సీఈవో ఆర్‌.శైలేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెండవ విడతలో డిసెంబర్‌ నాల్గవ తేదీన ప్రారంభమైన శిక్షణ 2022 జనవరి ఎనిమిదవ తేదీ వరకు 12 రోజుల పాటు కొనసాగింది. టెక్నాలజీపై శిక్షణ మాత్రమే కాకుండా ఐటి రంగంలో యువత స్వతంత్రంగా సంస్థలు నెలకొల్పాలనే లక్ష్యంతో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు ఐటి శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మొదటి విడత ప్రసారాల్లో 4.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. టి-సాట్‌ డిజిటల్‌ ప్రసార మాధ్యమాలు యూట్యూబ్‌ ద్వార 58,525, యాప్‌ 46,627, యునిక్వీ యూజర్స్‌ 22,950, రిటర్న్‌ యూజర్స్‌ 19,045, కొత్తగా 3,904 సుమారు కోటిన్నర మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం కలుగగా 10 ప్రతిష్టాత్మక ఐటి కంపెనీలు శిక్షణలో పాల్గొన్నాయి.

ఆకట్టుకుంటున్న ఇక్ఫాయ్‌ ప్రసారాలు
రాష్ట్ర ఐటి శాఖా మాత్యులు కె.టి.రామారావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోని ఐక్ఫాయ్‌ యూనివర్సిటీ కుదుర్చుకున్న ఎం.ఒ.యు మేరకు డిసెంబర్‌ 16, 2021 నుండి 2022 ఫిబ్రవరి రెండవ తేదీ వరకు 37 పాఠ్యాంశ భాగాల నైపుణ్య శిక్షణ ప్రసారాలు కొనసాగాయి. టి-సాట్‌ నిపుణ, విద్య ఛానళ్లలో ఉదయం, రాత్రి 9.30 గంటల నుండి 10 గంటల వరకు అరగంట పాటు డిజిటల్‌, లీగల్‌ మార్కెటింగ్‌, బెసిక్స్‌ ఆఫ్‌ కాపీ రైట్స్‌, జెండర్‌ జస్టిస్‌ వంటి అంశాలపై అనుభవం కలిగిన బోధన సిబ్బందిచే శిక్షణ కొనసాగింది. గత ఆరు సంవత్సరాలుగా పాఠశాల, ఇంటర్మీడియట్‌, డిగ్రీ విద్యార్థులకు బోధనలు అందించిన టి-సాట్‌ నెట్వర్క్‌…నిరుద్యోగ యువతకు అందించే వృత్తి నైపుణ్య శిక్షణలోనూ విజయవంతమౌతోంది.

ఏప్రిల్‌ నాల్గవ తేదీ నుండి మూడవ విడత
మేకిన్‌ ఇండియాలో భాగంగా శరవేగంగా అభివృద్ధి చెందుతూ 2025 నాటికి 400 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ను సొంతం చేసుకునే దిశగా భారత ఎలక్ట్రానిక్స్‌ రంగం పరుగులు పెడుతున్న సమయంలో ఇ.ఎస్‌.డి.ఎం (ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌ డిజైనింగ్‌ మరియు మ్యాన్యుఫాక్చరింగ్‌) లో అధిక ప్రాధాన్యత కలిగిన వి.ఎల్‌.ఎస్‌.ఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీలో తెలంగాణ ఐటి శాఖ ఆధ్వర్యంలో సాంకేతిక శిక్షణ అందిస్తోంది. ఇప్పటికే వి.ఎల్‌.ఎస్‌.ఐలో రెండు విడతలు శిక్షణ పూర్తవగా ఏప్రిల్‌ నెల నాల్గవ తేదీ సోమవారం నుండి మూడవ విడతలో భాగంగా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీస్‌ ఎక్స్‌ పోజర్‌ ట్రైనింగ్‌ ప్రొగ్రాం ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ నాల్గవ తేదీ నుండి 16వ తేదీ వరకు రెండు వారాల పాటు వారంలో ఐదు రోజుల చొప్పున సాంకేతిక శిక్షణా కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 11 నుండి ఒంటి గంట వరకు రెండు గంటల పాటు జరిగే శిక్షణలో టి-సాట్‌ నిపుణ ఛానల్‌ ద్వార ప్రముఖ ఐటి కంపెనీ ప్రతినిధులు ముంబయి, బెంగళూర్‌, ఢల్లీి వంటి ముఖ్య పట్టణాల నుండి అవగాహన కల్పిస్తారు. బి.ఈ., బి.టెక్‌., ఎం.టెక్‌., ఎం.బి.ఎ విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీకి కూడా ఈ శిక్షణ ఉపయోగపడనుంది.