రైతు సంక్షేమంలో దేశానికే ఆదర్శం

By:- వై. వెంకటేశ్వర్లు

  • ఉద్యమ స్ఫూర్తితో అన్ని వేళలా అండగా నిలిచి రైతే రాజు అని తెలియజేస్తున్న ముఖ్యమంత్రి కె.సి. ఆర్‌
  • 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం
  • 3 కోట్ల 50 లక్షల టన్నులకు పెరిగిన పంటల ఉత్పత్తి
  • రైతుబంధు ద్వారా 9 విడతలలో రూ.57,881 కోట్లను రైతుల ఖాతాలలో జమచేసిన ప్రభుత్వం

దేశానికి అన్నం పెట్టే రైతుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్నప్పటికీ ఉమ్మడి పాలనాకాలంలో నాటి ప్రభుత్వాలు చూపిన వివక్ష, నిర్లక్ష్యం వలన సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో నూతన జవసత్వాలు లభిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా రూపొందించి అమలు చేస్తున్న రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా, రైతు బీమా, చెరువుల పునరుద్ధరణ, భారీ సాగునీటి ప్రాజెక్టులు, నాణ్యమైన విత్తనాల సరఫరా, పంటల కొనుగోలు, రైతు వేదికలు, ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి నియామకం, తదితర కార్యక్రమాలు, పథకాలతో రైతులలో సేద్యం పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఒకనాడు ఎందుకూ పనికిరావని ఖాళీగా ఉంచిన బంజరు భూములలో నేడు బంగారు పంటలు పండుతున్నాయి. రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతే ప్రత్యేక నిదర్శనంగా నిలుస్తున్నది. 2014 నాటికి సాగు విస్తీర్ణం 1 కోటీ 34 లక్షల ఎకరాలు కాగా, నేడు అది 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది కాకుండా 11.50 లక్షల ఎకరాలకు ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెరిగింది. 2014-15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2021-22 నాటికి 2.49 కోట్ల టన్నులకు చేరింది. అన్ని పంటల ఉత్పత్తి కలిపి 3.50 కోట్ల టన్నులకు చేరుకుంది. 2014-15 లో పత్తి సాగు విస్తీర్ణం 41.83 లక్షల ఎకరాలు ఉండగా, 2020-21 నాటికి 44.70 శాతం వృద్ధితో 18.70 లక్షల ఎకరాలు పెరిగి 60.53 లక్షల ఎకరాలకు చేరుకున్నది.2014-15 లో పత్తి దిగుబడి 35.83 లక్షల బేళ్లు ఉండగా, 60.44 లక్షల బేళ్లకు చేరుకున్నది.

రైతు పండించిన ధాన్యాన్ని ఎటువంటి పరిమితులు లేకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు రూ.1,07,748 కోట్ల విలువైన 6 కోట్ల 06 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి, రైతుల ఖాతాలలో డబ్బు జమచేసింది. అలాగే వ్యవసాయరంగానికి నాణ్యమైన నిరంతరాయ విద్యుత్‌ సరఫరాకు రూ.36,703 కోట్లను ఖర్చు చేసి విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ప్రభుత్వం పటిష్టపరిచింది. సాలీనా దాదాపు రూ.10,500 కోట్లు భరించి వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది.

రైతుబంధు పథకం ప్రపంచంలోనే వినూత్న ఆలోచనలతో రూపొందించిన పథకం. రైతుబంధు ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున గత 9 విడతలలో రూ.57,881 కోట్లను పంట పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమచేసింది. గతంలో విత్తనాలు మొదలు పురుగుమందులు, ఎరువుల కొరకు ఫర్టిలైజర్‌ షాపులు, వడ్డీ వ్యాపారస్తుల చుట్టూ తిరిగే రైతులు రైతుబంధు సొమ్ముతో తమకు నచ్చిన పంటలను సాగుచేస్తున్నారు. విధివశాత్తు అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి పెద్ద దిక్కుగా వుండే రైతు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. రైతు బీమాలో ఇప్పటివరకు 88,963 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారం చెల్లించడం జరిగింది.

ప్రజల తలసరి ఆదాయం
2014-15లో రూ.1,12,162 లు ఉండగా,
2021-22 నాటికి రూ.2,78,833లకు పెరిగింది.

వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి కూడా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలకు దోహదం చేసింది.రైతులకు ఆధునిక సేద్య, సస్యరక్షణ పద్ధతుల గురించి చైతన్య పరచేందుకు ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని ప్రభుత్వం నియమించింది. పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పి 6.66 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడం జరిగినది.

రైతు సంక్షేమంలో భాగంగా తెలంగాణ ఏర్పడిన తరువాత ట్రాక్టర్లపై రూ.273.5 కోట్ల రవాణా పన్ను మాఫీతో పాటు రాష్ట్రం ఏర్పడక ముందటి రూ.41.6 కోట్ల రవాణా పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచుటకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది గోడౌన్ల సామర్థ్యం 2014-15 లో 39 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉన్నది . ప్రస్తుతం గోడౌన్ల సామర్థ్యం 68.28 లక్షలకు పెంచడం జరిగింది. అలాగే ధాన్యం కాకుండా రూ.9,406.67 కోట్లతో ఇతర పంటలను ప్రభుత్వం సేకరించింది.

నాణ్యమైన విత్తనాల సరఫరాకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది. విత్తన నకిలీకి, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేయిస్తున్నది.

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా, ఇప్పటివరకు మొత్తం రూ. 963.26 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో వ్యవసాయరంగం ఆధునికీకరణ చెందుతున్నది. 2014-15లో వ్యవసాయ ట్రాక్టర్ల సంఖ్య 94,537 ఉండగా, ప్రస్తుతం 3 లక్షలు 52 వేలకు పెరిగాయి. 2014-15 లో 6,318 హార్వెస్టర్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 19,309 లకు చేరాయి.

ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తెలంగాణ వ్యవసాయరంగం దేశానికే ఆదర్శంగా పురోగమిస్తున్నది.