పెట్టుబడుల వెల్లువ

తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక వేత్తలకు భూతల స్వర్గంగా మారింది. పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో కేవలం ఒక వారం రోజుల్లోనే ఏకంగా రూ.2,950 కోట్ల పెట్టుబడులను సాధించగలిగింది. లైఫ్ సైన్సెస్‌తోపాటు ఆభరణాలు, వంట నూనెల తయారీ తదితర రంగాలలో ఈ పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడుల వల్ల దాదాపు ఆరువేల పై చిలుకు మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఎల్లో రివల్యూషన్ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదనటానికి నిదర్శనమే, ఈ మధ్య ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుండటమే. ఎల్లో రివల్యూషన్‌లో భాగంగా జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ కంపెనీ, వంట నూనెల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకు వచ్చింది. ఈ కంపెనీ రూ.400 కోట్ల పెట్టుబడితో రోజుకు 1,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న కంపెనీ ద్వారా దాదాపు 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

పశువుల వ్యాక్సిన్ తయారీ కోసం ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ సంస్థ రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం 300 మిలియన్ డోసుల సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 750 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో ఈ యూనిట్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఆభరణాల తయారీ యూనిట్ స్థాపన కోసం మలబార్ గ్రూపు రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టింది. యేటా 10 టన్నుల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాలను తయారు చేయగలిగే ఈ యూనిట్ ద్వారా 2,750 మందికి ఉపాధి కల్పించి, దేశంలోనే అతిపెద్ద ఆభరణాల తయారీ యూనిట్‌గా ప్రసిద్ధిగాంచనున్నది.
రూ.1,100 కోట్ల పెట్టుబడులతో, ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్, జీవీఆర్‌పీ ప్రీ క్లినికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఆర్‌వో) తో పాటు మరో మూడు కంపెనీలకు చెందిన ఐదు ప్రాజెక్టుల ద్వారా దాదాపు 1,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
వెటర్నరీ వ్యాక్సిన్ల పెట్టుబడి రూ.700 కోట్లు
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL) ముందుకు వచ్చింది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సుమారు 700 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. జాతీయ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డ్ (NDDB) అనుబంధ సంస్థ అయిన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL) ప్రపంచంలోని అతిపెద్ద FMD వ్యాక్సిన్ తయారీదారులలో ఒకటి. ఐఐఎల్ బృందం మంత్రి కేటీఆర్‌తో సమావేశమై సంస్థ ప్రణాళికలను వివరించింది. నూతన కేంద్రం ఏర్పాటు ద్వారా మొత్తం 750 మందికి ఉపాధిని కల్పించనున్నది.
పశువులకు వచ్చే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (FMD)తో పాటు ఇతర పశువ్యాధులకు సంబంధించిన టీకాలను ఈ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నారు. దీంతోపాటు భారత ప్రభుత్వ నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (NADCP)కి FMD వ్యాక్సిన్ను అందించే ప్రముఖ సరఫరాదారు. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (FMD) వ్యాక్సిన్, ఇతర జంతు వ్యాక్సిన్ల తయారీ కోసం వెటర్నరీ వ్యాక్సిన్ ఫెసిలిటీ ఏర్పాటుకు జీనోమ్ వ్యాలీలో IIL పెట్టుబడి పెడుతోంది. అత్యాధునిక సౌకర్యాలతో బయో సేఫ్టీ లెవల్ 3 ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తోంది. గచ్చిబౌలిలో ప్రస్తుతం ఉన్న తయారీ కేంద్రం సంవత్సరానికి 300 మిలియన్ డోసుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొత్తగా ఏర్పాటుచేయబోతున్న ఈ వ్యాక్సిన్ తయారీ కేంద్రంతో ఇప్పటికే సంస్థకు ఉన్న సామర్థ్యానికి అదనంగా సంవత్సరానికి మరో 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుంది.
IIL, MD, డాక్టర్ కె.ఆనంద్ కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ముకుల్ గౌర్, NSN భార్గవలతో పాటు సంస్థకు చెందిన ఇతర అధికారులు, మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తమ సంస్థ విస్తరణ ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్‌లో IIL ఏర్పాటుచేయబోతున్న మూడవ టీకా తయారీ కేంద్రం వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారతదేశ స్వయం సమృద్ధికి నిదర్శనం అని ఆసంస్థ మేనేజింగ్ డైరెక్టర్ K.ఆనంద్ కుమార్ చెప్పారు. తమ వ్యాక్సిన్ తో పశువులకు వచ్చే తీవ్రమైన వ్యాధులు తగ్గడంతో పాటు రైతులకు, దేశానికి వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ సంస్థ జీనోమ్ వ్యాలీలో మరో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ కొత్త టీకా ఉత్పత్తి కేంద్రంతో ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ జోరు కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు & వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ డైరెక్టర్ (ఫార్మా & లైఫ్ సైన్సెస్) శక్తి ఎం నాగప్పన్ కూడా పాల్గొన్నారు.
ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ గురించి…
ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంది. ఇది ఆరోగ్య రంగానికి చెందిన సంస్థ. ఆసియాలోని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల్లో ఒకటి. 1982లో నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB)చే స్థాపించబడింది. ఈ సంస్థ ఉత్పత్తులు 50 దేశాలకు ఎగుమతి అవుతాయి. కంపెనీకి సంబంధించిన మరిన్ని వివరాలను www.indimmune.comలో చూడవచ్చు.

400 కోట్ల పెట్టుబడితో – జెమినీ ఎడిబుల్స్
నూనె గింజల సాగు చేసే రైతాంగానికి లబ్ది చేకూర్చే విధంగా, జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ (జీఈఎఫ్) రిఫైనరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌కు సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ రిఫైనరీ కోసం రూ.400 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ యూనిట్ రాబోయే రెండేండ్లలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ రిఫైనరీ యూనిట్ ద్వారా దాదాపు 1000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు సంస్థ తెలియజేసింది.
జీఈఎఫ్ ఎండీ ప్రదీప్ చౌదరీ ప్రగతిభవన్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ యూనిట్ ఏర్పాటునకు సంబంధించి తమ పెట్టుబడి వివరాలను వెల్లడించారు. జీఈఎఫ్ వారి పెట్టుబడి నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఇప్పటికే నాలుగు విప్లవాల (రెండవ హరిత, నీలి, గులాబీ, శ్వేత విప్లవం)కు శ్రీకారం చుట్టిందని, దీంతోపాటు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయడం ద్వారా పసుపు విప్లవానికి శ్రీకారం చుట్టాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని కేటీఆర్ చెప్పారు.

ఈ సందర్భంగా జెమినీ ఎండీ ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ..తాము నెలకొల్పబోయే యూనిట్‌తో సుమారుగా 1000 మందికి ఉద్యోగాలు లభించడంతోపాటు ఆయిల్ సీడ్ రైతులకు ఎంతో మద్దతుగా ఉంటుందన్నారు. రెండేండ్లలో అందుబాటులోకి రానున్న ఈ యూనిట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం తమ వద్ద మూడు ప్రాంతాలు (చౌటుప్పల్, జహీరాబాద్, కొత్తూరు) సూచించిందని, దీనికి సంబంధించి త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు.తమ పెట్టుబడి తెలంగాణలో పసుపు విప్లవానికి నాంది పలుకుతుందని, రాబోయే కాలంలో రాష్ట్రంలో మరిన్ని యూనిట్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్లు నిర్వహిస్తుండగా, వీటి పూర్తి సామర్థ్యం 2,600 మెట్రిక్ టన్నులు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
మలబార్ గోల్డ్ & డైమండ్స్ రూ.750 కోట్ల పెట్టుబడి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రూ.750 కోట్ల పెట్టుబడితో బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గ్రూప్ ఏర్పాటు చేయనున్న యూనిట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మలబార్ గోల్డ్ & డైమండ్స్ వారి అతిపెద్ద ఆభరణాల తయారీ యూనిట్‌గా నిలువనుంది. ఈ కర్మాగారంలో 2,750 మందికి ఉపాధి లభించే అవకాశాలు వున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో మలబార్ గోల్డ్ & డైమండ్స్‌కు 17 రిటైల్ షోరూమ్‌లు వున్నాయి. వీటన్నింటిలో కలిపి వెయ్యి మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, మలబార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ అహమ్మద్ ఎం.పీ., వైస్ ఛైర్మన్ అబ్దుల్ సలామ్ కే.పి. పాల్గొన్నారు.
జీనోమ్‌వ్యాలీలో ఐదు ప్రాజెక్టుల పెట్టుబడి రూ.1100 కోట్లు
టీ-హబ్ తరహాలో ఏర్పాటుచేయనున్న ప్రతిష్ఠాత్మక బయోఫార్మా హబ్ (బీ-హబ్)కు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. జీవీ-1 అనే మరొక కొత్త ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు.జీనోమ్‌వ్యాలీలో రూ.1,100 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులను ప్రారంభించారు. జీవశాస్త్రాలు, బయోఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని మంత్రి కే.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్థలాలకు రోజరోజుకూ డిమాండ్ పెరుగుతున్నదని చెప్పారు. అభివృద్ధి వేగం పెరగటం, కంపెనీల త్వరితగతి విస్తరణ వల్ల రానున్న రోజుల్లో 20 లక్షల చదరపు అడుగుల స్థలం అదనంగా తోడవుతుందని వెల్లడించారు.
ఇన్నోపోలిస్, టచ్‌స్టోన్, ఏఆర్‌ఎక్స్‌లకు సంస్థలకు సంబంధించిన రెండో దశ యూనిట్ల కోసం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ఆర్ అండ్ డీ క్లస్టర్ జీనోమ్ వ్యాలీ, ఇది దేశంలోనే మొట్టమొదట్దిదని పేర్కొన్నారు. ఇక్కడ ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ వారు విస్తరణ చేయడం హర్షణీయం. ఇది ఈ ‘జీనోమ్ వ్యాలీలో మరో మైలురాయి లాంటిదని అన్నారు. ఈనాడు 800లకుపైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలకు తెలంగాణ చిరునామా అయిందని, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇక్కడి లైఫ్ సైన్సెస్ సంస్థల మూలంగా మన రాష్ట్రం ప్రధాన పాత్ర పోషిస్తున్నదని తెలిపారు.

జీనోమ్ వ్యాలీలో ప్రస్తుతం దాదాపు 200లకుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు సుమారు 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో దేశంలోనే ప్రధాన కేంద్రంగా జీనోమ్ వ్యాలీ ఎదిగిందని వివరించారు. అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా ఈ ప్రాంతం అవతరించిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనంతగా ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం జీనోమ్ వ్యాలీలో ఉన్నది. దీనిని ఇంకా విస్తరిస్తున్నాం. ఇక్కడ సీఆర్‌ఓలు, సీడీఎంఓలు ఉన్నాయి. సింజీన్, లారస్, క్యూరియా తదితర అనేక సీఆర్‌ఓలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు రానున్నాయి’ అని తెలిపారు. తాజా ప్రాజెక్టులతో జీనోమ్ వ్యాలీలో మరో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రయోగశాలలు అందుబాటులోకి వస్తాయని, అదనంగా 3 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు
కొవిడ్-19 సమయంలో అత్యంత వేగంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయటంలో తెలంగాణ రాష్ట్రం కీలకపాత్ర పోషించిందని చెప్పారు. వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు బయోలాజికల్-ఈ లిమిటెడ్, ఇండియన్ ఇమ్యునో లాజికల్స్‌తో సహా పలు కంపెనీలు రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టాయని వెల్లడించారు. స్టెరైల్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులకు చెందిన ఫార్మా కంపెనీ హెటిరో 750 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిందని, ప్రముఖ అంతర్జాతీయ ఔషధ సంస్థ రోచె తన గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. జీనోమ్ వ్యాలీలో డిమాండ్, కంపెనీల రాకను బట్టి తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం 2030 లక్ష్యానికి ముందుగానే 100 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకొంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఆర్‌అండ్‌డీ, బయో ప్రాసెస్ ఫెసిలిటీస్, కొలాబరేషన్ మాడ్యూల్స్, గ్రేడ్-ఏ ట్రైనింగ్ రూమ్ సౌకర్యాలు పుష్కలంగా ఉన్న బీ-హబ్, బయోఫార్మా కంపెనీలకు మంచి వేదికగా మారుతుందన్నారు. పిరమిల్-యాపన్ బయోలైఫ్ సైన్సెస్‌లో 8 మిలియన్ల డాలర్లతో కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించటం సంతోషంగా ఉన్నదన్నారు. ఈ పెట్టుబడులు బయోఫార్మా రంగంలో తెలంగాణ నాయకత్వ స్థానాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు.
బీ-హబ్‌తో కొత్త పుంతలు
హైదరాబాద్ ఇప్పటికే అతిపెద్ద ల్యాబ్‌స్పేస్‌కు కేంద్రంగా ఉన్నదని, 30 లక్షల చదరపు అడుగుల అంతర్జాతీయ ప్రమాణాల వర్క్‌స్పేస్ అందుబాటులో వున్నదని కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ మౌలిక వసతుల కల్పనలో తెలంగాణకు దేశంలో ఏ రాష్ట్రమూ సాటిరాదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. అమెరికా సంస్థ జీవీ రిసెర్చ్, విమ్టా ల్యాబ్స్ అత్యాధునిక సౌకర్యాలతో కంపెనీలు ప్రారంభిస్తున్నాయని చెప్పారు. బయోఫార్మా హబ్ ఈ రంగంలో గొప్ప మలుపు అని పేర్కొన్నారు. 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ కేంద్రం బయోటెక్నాలజీ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా మారనున్నదని చెప్పారు. ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ ఇప్పటికే 900 కోట్లతో 25 లక్షల చదరపు అడుగుల ప్రయోగశాలను ప్రారంభించిందని, వచ్చే ఐదేండ్లలో మరో రెండు వేలకోట్ల పెట్టుబడులు హైదరాబాద్‌లో పెట్టనున్నదని కేటీఆర్ వివరించారు.
జీనోమ్ వ్యాలీలో 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 ప్రాజెక్టులను అందుబాటులో ఉంచాలని ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ నిర్ణయించింది. ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ జీనోమ్ వ్యాలీలో మరో 9 లక్షల చదరపు అడుగుల ల్యాబ్ స్పేస్‌లను ప్రకటించింది. వీటిలో ఇన్నోపోలిస్, జీనోపోలిస్, టచ్‌స్టోన్, ఏఆర్‌ఎక్స్, నెక్సోపోలిస్, జీవీ-1, బీ-హబ్ ఉన్నాయి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భారతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థలు కీలకపాత్ర పోషించాయని ఈ సందర్భంగా ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ ఎండీ విశాల్ గోయల్ అన్నారు.
డ్రగ్ డిస్కవరీసహా లైఫ్ సైన్సెస్ పరిశ్రమ వృద్ధికి తోడ్పడాలనే ల్యాబ్ స్పేస్‌లను ఆర్‌ఎక్స్ ప్రొపెల్లంట్ గణనీయంగా పెంచుతున్నది. హైదరాబాద్ కేంద్రంగా దేశంలో సమగ్ర పరిశోధనా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నది. ‘రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే లైఫ్ సైన్సెస్ కంపెనీలకు అవసరమైన టర్న్‌కీ ఆర్ అండ్ డీ ల్యాబొరేటరీలు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలు, ఇంక్యుబేషన్ కేంద్రాలు, వేర్‌హౌసింగ్ పార్కులను ప్లగ్ అండ్ ప్లే విధానంలో అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తున్నది’ అని తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్-ఫార్మా డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ తెలిపారు.