తెలంగాణ సంస్కృతీ చిహ్నం బతుకమ్మ

By – డా.భిన్నూరి మనోహరి 

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నా నోము పండింది ఉయ్యాలో
నీ నోము పండిందా ఉయ్యాలో….

అంటూ తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంతో, ఆనందంగా సామూహికంగా జరుపుకునే అతి పెద్ద పండుగ బతుకమ్మ. పెండ్లి అయిన ఆడపిల్లలు, పెండ్లి కాని పిల్లలు, నడి వయసు వారు, ముసలివారు అందరూ వయసుతో నిమిత్తం లేకుండా చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. బతుకును ఇచ్చే తల్లి బతుకమ్మగా, ఊరిని రక్షించే దేవతగా జానపదుల పండుగగా ప్రసిద్ధి కెక్కిన బతుకమ్మ సంబరాలు ఆశ్వీజమాసంలో శరన్నవరాత్రులకు ముందు వచ్చే భాద్రపద బహుళ అమావాస్యనాడు జరుపుకునే ‘ఎంగిలిపువ్వు బతుకమ్మ’తో మొదలయ్యి ఆశ్వీజ శుద్ధ అష్టమి(9వరోజు)నాడు చేసుకునే ‘సద్దుల బతుకమ్మ’తో ముగుస్తాయి.

తెలంగాణలో ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా ప్రకృతితో మమేకమైన పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగ వచ్చే కాలం వర్షాకాలం. ఈ కాలంలో ప్రకృతి అంతా పచ్చగా, అనేక జాతుల పూలతో వాతావరణమంతా చాలా రంగులమయంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో శిష్టులు అమ్మవారి శరన్నవరాత్రులు చేస్తే, జానపదులు చేసే అమ్మవారి పూజ బతుకమ్మ. ఒకవిధంగా రెండూ శక్తి ఆరాధనే. ఆషాఢమాసం నుండి శక్తి ఆరాధన మొదలవుతుంది. శ్రావణం కూడ అమ్మవారికి ప్రీతికరమైన వ్రతాలు, నోములు చేసుకునే మాసం. అదేవిధంగా ఆశ్వీజ మాసంలో కూడా శక్తి ఆరాధన విశేషంగా చేస్తాం.  

మంత్రశాస్త్ర రీత్యా బగళాముఖీ ఆరాధన ఉత్తరాదిలో బాగా ఉంటుంది. పీతాంబరీదేవిగా పిలువబడే బగళా ముఖి అమ్మవారిని పూజిస్తే దుష్టశక్తులనుండి కాపాడు తుందని, అందరినీ బంధిస్తుందనే నమ్మకం ఉంది. పీతాంబరం అంటే పసుపుపచ్చని వర్ణం. బతుకమ్మను పేర్చిన తరువాత  పసుపుతో గౌరమ్మను చేసి పై వరుసలో పెట్టి ఆ గౌరమ్మే తమను కాపాడుతుందని భావించి పూజిస్తాం. ఈ పరంగా చూసినట్లయితే బగళాముఖికి ప్రతీకగా మన బతుకమ్మను చెప్పవచ్చు. ఏ రూపంలో చేసినా శక్తి ఆరాధనే మూలం కదా.

బతుకమ్మ పండుగకు ముందు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బొడ్డెమ్మ పండుగను చేస్తారు. బొడ్డెమ్మ పండుగ భాద్రపద బహుళ పంచమి నుండి అమావాస్య వరకు అంటే ఎంగిలిపూవు బతుకమ్మ ప్రారంభమయ్యే వరకు చేస్తారు. ఇది ముఖ్యంగా కన్నెపిల్లలు చేసుకునే పండుగ. బొడ్డు, బొడ్డెమ్మ అంటే మధ్యలో ఉండేది. పూల మధ్యలో ఉంచే పసుపు గౌరమ్మ బొడ్డెమ్మ. మొదటిరోజు ఒక పీఠం మీద పుట్టమట్టితో చతురస్రాకారంలో గద్దెను ఏర్పాటు చేసి వెంపల్లె చెట్టును నిలిపి, పసుపు కుంకుమతో అలంకరించి పసుపు గౌరమ్మను నిలుపుతారు. 

‘‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో / బిడ్డాలెందరే ఉయ్యాలో
నీ బిడ్డ నీలగౌరి ఉయ్యాలో / నిత్యమల్లె చెట్టెక్కె ఉయ్యాలో’’

బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతారు. రోజుకొక నైవేద్యం సమర్పిస్తారు. వెంపల్లె చెట్టును కార్పాస లక్ష్మిగా పత్తితో దండలు చేసి పసుపు కుంకుమతో అలంకరించి (వత్తి, పత్తి) దండలు వేసి పూజిస్తారు. బొడ్డెమ్మను కూడా ప్రాంతాల వారిగా తయారు చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. పీఠ బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ అంటూ వాటి ఆకారాలను బట్టి ఆ పేర్లు పెట్టుకుంటారు.

బొడ్డెమ్మ పండుగ పూర్తి అయ్యేనాటికి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. అది భాద్రపద బహుళ అమావాస్య దీన్నే పెత్రామాస (పితరుల అమావాస్య) అంటారు. ఇదే ఎంగిలిపువ్వు బతుకమ్మ అంటారు. బొడ్డెమ్మ పదిహేను రోజులు ఆడలేనివారు ఎంగిలిపువ్వు బతుకమ్మరోజు గౌరమ్మను నిలుపుకొని బతుకమ్మను పేర్చి ఆరోజు నుంచి 9 రోజులు బతుకమ్మను ఆడుతారు. ప్రతిరోజు ఒక నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు.9 రోజులు జరపుకునే బతుకమ్మకు ఆయా రోజుల్లో పెట్టే నైవేద్యాన్ని బట్టి బతుకమ్మకు ఆ పేరును పెట్టుకున్నారు.

1. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ : ఈ రోజు బొడ్డెమ్మ పండుగ చివరి రోజు. పితృదేవతలకు తర్పణాలు, వారి పేరు మీద సాహిత్యం ఇవ్వడం, వారికి రకరకాల వంటకాలు చేసి నైవేద్యం సమర్పించడం చేస్తారు. నిజానికి భాద్రపద బహుళ పాడ్యమి నుండి పితృపక్షాలు ప్రారంభం ఆ 15 రోజుల్లో ఎటువంటి కార్యం చేయకపోయినా పెత్రామాసనాడు పితృదేవతలను తలచుకుని వారికి ప్రీతిగా సమర్పించడం ఆచారంగా ఉంది. ఎంగిలిపువ్వు బతుకమ్మ కూడా ఈరోజు రావడంతో వారికి సమర్పించిన నైవేద్యాలే గౌరమ్మకు కూడా సమర్పించడం జరుగుతుంది. ఇంకా నువ్వులు, బియ్యంనూక కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.

2. రెండవరోజు అటుకుల బతుకమ్మ : ఈరోజు అమ్మవారికి బెల్లం, అటుకులు, అటుకుల పాయసం  నైవేద్యంగా సమర్పిస్తారు.

3. మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో పదార్థం వండి నైవేద్యంగా సమర్పిస్తారు.

4. నానేబియ్యం బతుకమ్మ : నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో పాయసం చేసి నైవేద్యంగా గౌరమ్మకు నివేదిస్తారు.

5. అట్ల బతుకమ్మ : బతుకమ్మకు ఈరోజు అట్లు (దోశలు) నైవేద్యం పెడతారు.

6. అలిగిన బతుకమ్మ : ఆశ్వీజ శుద్ధ పంచమి బతుకమ్మ ఆరవరోజు. ఈరోజు బతుకమ్మకు నైవేద్యం ఏమీ సమర్పించరు.

7. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని దోరగా వేయించి నీళ్లు కలిపి వాటికి వేపకాయల ఆకారంలో చేసి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు.

8. వెన్నబుద్దుల బతుకమ్మ : నువ్వులు, వెన్న, బెల్లంతో కలిపి ఉండలుగా చేసి బతుకమ్మకు నైవేద్యం పెడతారు.

9. సద్దుల బతుకమ్మ : ఇది బతుకమ్మ పండుగకు సంబంధించి చాలా విశేషమైన రోజు. తొమ్మిదిరోజులు చిన్నమొత్తంలో పేర్చిన బతుకమ్మను ఈరోజు చాలా పెద్దగా పేరుస్తారు. ఈరోజు గౌరమ్మను పెట్టుకొని పూజ చేసి బతుకమ్మను పేర్చిన తర్వాత అగ్రంలో గౌరమ్మను నిలిపి దీపంతో తీసుకువెళ్ళి ఆడతారు. ఈరోజు అమ్మవారికి 9 రకాల సద్దులు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. పెసర సద్ది, నువ్వు సద్ది, కొబ్బరి సద్ది, బెల్లం అన్నం, పెరుగు అన్నం (దద్ద్యోదనం), పులిహోర, చిత్రాన్నం, చక్కెర పొంగలి, కట్టెపొంగలి. 

ఎంగిలిపువ్వు బతుకమ్మకు అందరూ గుమికూడినా గుమి కూడకున్నా సద్దుల బతుకమ్మ నాటికి ఆడపిల్లలందరూ పుట్టింటికి చేరుతారు. చిన్ననాడు పోటీ పడి బతుకమ్మలను పేర్చినట్లుగానే ఇప్పుడు కూడా ఎవరి బతుకమ్మ పెద్దగా ఉంటుందో అన్న ఉత్సాహంతో పొద్దునే ఇంట్ల అన్నలను, తమ్ములను తంగేడు, గునుగు, గుమ్మడి, బంతి, చేమంతి, గన్నేరు, నందివర్దనం, నూకపూవు ఇట్లా అన్ని రకాల పూలను సేకరించడానికి పంపుతారు. భోజనాలు అయిన తర్వాత పెద్ద ఇత్తడి లేదా రాగి పళ్ళెంలో కింద తంగేడు ఆకులను పేర్చి కట్టలుగా పేర్చిన తంగేడు పూలను ముందు వరుసగా పెడతారు. ఆ తరువాత ఒక్కొక్క పూల వరుసను పేరుస్తూ త్రికోణాకారంలో కింద పెట్టిన పళ్ళెం సైజును బట్టి, ఉన్న పూలను బట్టి వరుసలు పెంచుకుంటూ పెద్దగా పేరుస్తారు. 5,7,9,11 వరుసల వరకు పేరుస్తారు. ఇంట్లో ఆడపిల్లలు చిన్నవారుంటే వారి ఎత్తు బతుకమ్మను కూడా పేరుస్తారు. ఇట్లా ఒక్క బతుకమ్మను అస్సలే పేర్చరు. తోడుగా చిన్న బతుకమ్మను కూడా పేరుస్తారు. రెండింటిలో పైన గౌరమ్మను ఉంచి ఇండ్ల ముందర లేదా సామూహికంగా ఒక దేవాలయం ముందర లేదా చెరువు గట్టు దగ్గర ఆడుతారు. 

ఊరిలో పెద్దముత్తయిదువ ఆడేచోట  అలికి ముగ్గు వేసి ఒక పీట పెట్టి దానిమీద ఎర్రమట్టిని కుప్పగా ఉంచి అందులో వెంపెల్లె చెట్టును నిలుపుతుంది. ఊరిలో ఉండే పూజారి వచ్చి ఆ చెట్టుకు (లక్ష్మీదేవి)కి గౌరమ్మకు షోడశోపచార పూజ చేయించిన తరువాత ‘‘ఒక్కొక్క పువ్వేసి చందమామ / ఒక్క జాము ఆయె చందమామ’’ అంటూ అందరూ పూల రెక్కలు చల్లుతూ బతుకమ్మ సంబరాన్ని ప్రారంభిస్తారు. గొంతు పెద్దగా ఉండి పాటలు చెప్పేవాళ్ళు చెప్పుతుంటే మిగతా అందరూ బతుకమ్మలచుట్టూ తిరుగుతూ చప్పట్లు, కోలాటం వేస్తూ ఏక గొంతుకతో పాట పాడుతారు. ఇట్లా సాయంత్రం 5-6 గంటలకు మొదలయ్యే బతుకమ్మ పాటలు, ఆటలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి.

ఇక్కడ ఒక అంశాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  పాటలనేవి కొన్ని పురాణ, ఇతిహాస కథలు, సీతారాములు, శివపార్వతుల కథలు ఉంటాయి. వారి ఆదర్శ జీవనం, పార్వతి శివుడి గురించి చేసిన తపస్సు వంటివి, రాముడు శివధనస్సు విరువడం వంటి కథనాలతో ఉంటాయి. ఇవి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు అత్తగారింట్లో ఆవిధంగా నడుచుకోవాలని అని సూచించే విధంగా ఉంటాయి. కొన్ని పాటలు కొత్త పెళ్ళికూతురుని పుట్టింటికి పంపమని అన్నదమ్ములు వెళ్ళి అడిగే విధానం ఉంటాయి. ఇవన్నీ ఒక వరుసకు చెందినవైతే కొన్ని పాటలు స్వాతంత్య్ర సమరం జరిగే సమయంలో, రజాకార్ల ఆగడాలను ఎదుర్కొనే క్రమంలో వీరుల గాథలను పాటలుగా, రజాకార్ల దురాగతాలకు బలైన ఆడవాళ్ళ దీనగాథలు ఇట్లా సామాజిక అంశాలకు సంబంధించిన ఎన్నో పాటలు పాడతారు. 

పాటలో చివరగా ఊతంగా ఉయ్యాల, కోల్‌, గౌరమ్మ, వలలో, చందమామ అన్న పదాలు ఉపయోగిస్తారు.

‘‘శ్రీదేవి, భూదేవి ఉయ్యాలో, ధరణిలో సమ్మక్క ఉయ్యాలో…’’
‘‘శ్రీకరంబైనట్టి ఉయ్యాలో, భారతదేశాన ఉయ్యాలో…’’
‘‘ఇద్దరక్కచెల్లెండ్లు ఉయ్యాల్లో, ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో…’’
‘‘శ్రీగౌరి నీ పూజలో గౌరమ్మ, చిత్రమై తోచునమ్మ గౌరమ్మ’’
‘‘వెంపల్లె చెట్టు కింద వలలో, ఎల రేగు కింద వలలో’’
‘‘గుండంలో నిమ్మచెట్టు కోల్‌, నిండి ఉండగా కోల్‌’’

ఇట్లా సార్వత్రికంగా ప్రాంతాల పరంగా వందల సంఖ్యలో పాటలు ఉన్నాయి.

చివరకు సద్దుల బతుకమ్మనాడు పెళ్ళి అయిన ఆడపిల్లను అత్తవారింటి పంపినట్లు గౌరమ్మను (బతుకమ్మ) తమ ఇంటి ఆడబడుచుగా భావించి నీళ్ళలో ఓలలాడించి

‘‘హిమవంతునింట్లో పుట్టి, హిమంతునింట్లో పెరిగి
విదియాట్ల తదియ నాడు కాంతాలందరు గూడి
@@@
మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ
మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మ’’

అంటూ సాగనంపుతారు. బతుకమ్మలను దగ్గరలో  ఉన్న చెరువులో విడిచిపెడతారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమానికి సంబంధించిన పాటలు కూడా అనేకం వచ్చినాయి. ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులకు సంబంధించినవి, పోరాట సమయంలో చేసిన కార్యాచరణకు సంబంధించిన పాటలు కూడా బతుకమ్మ పాటలుగా ప్రాచుర్యం పొందినాయి. ఆధునిక కాలంలో పాటలు చెప్పేవారు తక్కువైనారు. సంప్రదాయబద్ధంగా ఆడేవారు తక్కువైనారు. డి.జెలు, మైకుల హడావిడిలో ప్రకృతి సంబంధమైన పండుగ అసహజంగా జరుపుకుంటున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఎక్కువైంది. కానీ కొంత సహజత్వం లోపిస్తుంది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించి అధికారికంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తుంది. ప్రతీ గల్లీలో, నగరంలో, పట్టణంలో, గ్రామంలో, పెద్ద పెద్ద నగరాల్లో ప్రధాన వీధుల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు నిర్వహిస్తుంది. ఇది తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగగా మనం జరుపుకుంటున్నాం. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.