తెలంగాణ దళిత బంధు

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ అనే పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఖరారు చేశారు. మొదటగా, పైలట్‌ ప్రాజెక్టు కింద ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి, ‘తెలంగాణ దళిత బంధు’ పథకం అమలును ప్రారంభించాలని, అందులో భాగంగా పైలట్‌ నియోజకవర్గంగా కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు.

ముఖ్యమంత్రి గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన ‘సింహ గర్జన’ సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన ‘రైతు బీమా’ పథకం దాకా కరీంనగర్‌ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. అదే విధంగా ప్రతి ష్టాత్మకమైన ‘రైతుబంధు’ పథకాన్ని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ కేంద్రంగానే ప్రారంభిస్తున్నారు. అదే ఆనవాయితీని సీఎం సెంటిమెంటును కొనసాగిస్తూ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్‌ నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. ప్రారంభోత్సవ తేదీని త్వరలో సీఎం ప్రకటిస్తారు. ‘‘దళిత సాధికారత అమలు – పైలట్‌ ప్రాజెక్టు ఎంపిక – అధికార యంత్రాంగ్రం విధులు’’ అనే అంశం మీద సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని దళిత కుటుంబాల వివరాల స్థితి గతులను తెలుసుకుంటారు. ఆ తర్వాత నిబంధనలను అనుసరించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందులో హుజూరాబాద్‌ నియోజక వర్గంలో హుజూరాబాద్‌ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్‌ మండలంలోని 4,346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3,678 కుటుం బాలకు, జమ్మికుంట మండలంలోని 4,996 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలంలో 2,586 కుటుంబాలకు మొత్తంగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలనుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో (శాచురేషన్‌ మోడ్‌ లో) వర్తింపచేస్తారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే ‘తెలంగాణ దళిత బంధు’ పథకం 1200 కోట్లతో అమలవుతుంది. అయితే పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్‌ నియోజకవర్గం మొత్తంగా దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలవుతుంది. అందుకోసం అదనంగా మరో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలను పైలట్‌ నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో ఖర్చు చేయనున్నట్టు సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని పూర్తి స్థాయి వివరాలను త్వరలో విడుదల చేస్తామన్నారు. పైలట్‌ నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి అనుభవాలను సమీక్షిం చుకుని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ‘దళిత బంధు పథకం’ అమలు చేయడం అధికారులకు మరింత సులువవుతుందని సీఎం తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టు అమలు కోసం కలెక్టర్లతో పాటు ఎంపిక చేయబడిన అధికారులు పాల్గొంటారు.

తెలంగాణ దళిత బంధులో మూడు ముఖ్యమైన అంశాలుంటాయని సీఎం పేర్కొన్నారు. అందులో మొదటిది పథకం అమలు చేసి పర్యవేక్షించడం, రెండోది పథకం ఫలితాలను అంచనా కట్టడం, మూడోది లబ్ధిదారులు మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం అనే అంశాలను అవలంభించాలని సీఎం అధి కారులకు సూచించారు. ‘తెలంగాణ దళిత బంధు’ పథకం ద్వారా అందించే పది లక్షల నగదుతో పాటు, లబ్ధిదారుడు, ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందుతుంది.

‘‘దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్థితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలుస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం’’ అని సీఎం అన్నారు. తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలుచేయడానికి, దళితుల అభివృద్ధి కోసం మనసుపెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమని సీఎం స్పష్టం చేశారు. వారు అధికారులుగా కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా భావించి పని చేయాల్సి ఉంటుందన్నారు. అట్లాంటి చిత్తశుద్ధి, దళితుల పట్ల ప్రేమాభిమానాలున్న అధికారులను గుర్తించాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. ‘‘కులం, జెండర్‌, ఆర్థికం, తదితర పేర్లతో వివక్షకు గురిచేసి ప్రతిభావంతులను ఉత్పత్తి రంగానికి దూరంగా ఉంచడం, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామజికంగానే కాకుండా అది జాతికే నష్టం కలిగిస్తుందని సీఎం స్పష్టం చేశారు. దళిత సాధికారత కోసం కృషి చేయడం అంటే సమాజంలో వివక్షకు గురౌతున్న ఒక ప్రతిభావంతమైన వర్గాన్ని ఉత్పత్తిలో భాగస్వామ్యులను చేసేందుకు కృషి చేయడమేనని సీఎం తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘‘తెలంగాణ దళిత బంధు’’ పథకాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సి వుంది. మూస పద్ధతిలో కాకుండా ప్రభుత్వ ఆలోచనలను అందుకుని పనిచేసే అధికార, ప్రభుత్వ యంత్రాంగం ఎంపిక జరగాలి. ఎంపిక చేసిన అధికారులు దళిత బంధు పథకాన్ని ఆషామాషీగా కాకుండా మనసుపెట్టి అమలు చేయాలి. పూర్తిస్థాయి గణాంకాలు, సరైన సమాచారం లేకుండా ఏ ప్రభుత్వ పథకమైనా పరిపూర్ణంగా అమలుకాదు. ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఆధారం చేసుకుని, దళిత బంధు పథకం అమలులో ముందుకు సాగాలి’’ అని సీఎం అధికారులకు సూచించారు. ‘‘మనం తిండి తింటున్నప్పుడు ఎంతైతే లీనమై రసించి భోజనం ఆరగిస్తామో, మనకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎంతైతే దీక్ష కనబరుస్తామో దళిత బంధు పథకం అమలులో అధికారులు అంతే తాదాత్మ్యం చెంది పనిచేయాల’’ని సీఎం స్పష్టం చేశారు.

‘‘తమ అభివృద్ధి గురించి, గత పాలకులు అవలంభించిన విధానాల ద్వారా దళితుల్లో ఎటువంటి పురోగతి కానరాలేదనే అపనమ్మకం ఏర్పడిరది. వారిలో గూడుకట్టుకున్న అవిశ్వాసం తొలగిపోవాలి. ప్రభుత్వాలు తమ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాయి అనే విశ్వాసాన్ని, బలమైన నమ్మకాన్ని దళితుల్లో కలిగించాల్సిన అవసరం మనమీదున్నది. సరైన గైడెన్స్‌ ఇస్తూ దళిత బంధు పథకం అమలును పర్యవేక్షించాల్సి వుంటుంది.’’ అని సీఎం అధికారులకు తెలిపారు. దళిత బంధు పథకం అమల్లో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సహించబోదని సీఎం స్పష్టం చేశారు.

దేశంలోని ఇతర కులాల్లో, వర్గాల్లో కూడా ఆర్థిక వివక్ష వున్నదని, అయితే దళితులను సామాజిక వివక్ష అనే అదనపు వివక్ష, ఈ దేశంలో తరతరాలుగా పట్టి పీడిస్తున్నదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి దూరం చేసి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపించేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో వుందన్నారు. ఈ దళిత అభివృద్ధి ప్రస్థానంలో చిత్తశుద్ధి కలిగిన అధికార వ్యవస్థ తక్షణావసరం అని సీఎం వివరించారు. రైతుబంధు పథకం ద్వారా, రాష్ట్రంలో వ్యవసాయాన్ని రైతును అభివృద్ధి సంక్షేమ పథంలో నడిపించిన విధంగా, దళిత బంధు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దళిత సాధికారత కోసం విశేష కృషి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కుటుంబం యూనిట్‌గా అర్హులైన, ఎంపిక చేయబడిన దళిత కుటుంబాలకు నేరుగా ఆర్థికసాయం అందజేసి, వారికి ఇష్టమైన పనిని ఎంచుకుని అభివృద్ధి చెందే వెసులుబాటును కల్పించాలని ఇటీవలి దళిత ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్ణయించిందని గుర్తు చేశారు. ఆ నిర్ణయం మేరకు, దళారుల బాధ లేకుండ, రైతు బంధు తరహాలో నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని దళిత బంధు పథకం ద్వారా అందజేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. దళిత కుటుంబాల ప్రొఫైల్‌ను రూపొందించాలని, వారి జీవన స్థితి గతులను పొందు పరచాలన్నారు. దళిత సమస్యలు అన్ని చోట్లా ఒకే రీతిలో ఉండవని సీఎం అన్నారు. సమస్యలను గ్రామీణ, సెమీ అర్బన్‌, పూర్తి అర్బన్‌ అనే విభాగాలుగా విభజించాలని అందుకు అనుగుణంగా, దళిత బంధు పథకం ద్వారా అభివృద్ధి కార్యాచరణను అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ‘‘భారత సమాజంలో వ్యక్తుల వ్యక్తిత్వ పఠిమ గొప్పది. అయితే అనేక వివక్షతల మూలంగా సామూహిక ఐక్యత ఆశించినంతగా లేకపోవడం వల్ల సామాజిక అభివృద్ధి ఆశించినంతగా జరుగట్లేదు. ఇది విచారకరం. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తెచ్చింది. అవసరమైన మేరకు నిధులను అందుబాటులో ఉంచుతుంది.’’ అని సీఎం పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ  నర్సింగ్‌ రావు, సెక్రటరీలు స్మితా సభర్వాల్‌, భూపాల్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఎస్సీ సంక్షేమ శాఖ డైరక్టర్‌ కరుణాకర్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.