దేశానికి అన్నపూర్ణ తెలంగాణ

By: శ్రీధర్‌ రావు దేశ్‌పాండే 

నీళ్లు-నిధులు-నియామకాలు అన్న నినాదంతో సాగిన 15 ఏండ్ల సుధీర్ఘ ఉద్యమానంతరం 2014 లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 29 వ రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చింది. 112.08 లక్షల హెక్టార్ల (276.95 ఎకరాలు) విస్తీర్ణం కలిగిన తెలంగాణ రాష్ట్రం దేశంలో 17 రాష్ట్రాల కన్నా పెద్దది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రమైన వివక్షకు లోనైన సాగునీటి కల్పనపై ప్రత్యేక శ్రద్ధను పెట్టి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. బంగారు తెలంగాణ నిర్మాణంలో సాగునీటి కల్పనే ప్రధాన చోదక శక్తి అని ప్రభుత్వం గుర్తించింది. 8 సంవత్సరాల ఈ ప్రయాణంలో సాగునీటి కల్పనలో ప్రభుత్వం అద్భుత విజయాలను సాధించింది. ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రతీఘాతుక శక్తులు ఎన్ని అడ్డంకులు కల్పించినా వాటిని అధిగమించి ప్రాజెక్టులను నిర్మించాము. వాటి ఫలితాలు వ్యవసాయం, తాగునీరు, పశువుల పెంపకం, మత్స్య పరిశ్రమ, ఉద్యానవనాలు, పర్యాటకం, అటవీ పర్యావరణ పునరుద్ధరణ తదితర అనుబంధ రంగాలలో ప్రతిఫలిస్తున్నది. మొత్తంగా రాష్ట్ర ఆర్థిక, సామాజిక వికాసానికి దోహదం చేస్తున్నది. 

తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగునీటి కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ప్రణాళికలు తయారు చేసుకున్నది. వృధాగా సముద్రం పాలవుతున్న గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించడానికి చర్యలు తీసుకున్నది. రాష్ట్రం మొత్తంలో సుమారు 125 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని, రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామీణ అసెంబ్లీ నియోజక వర్గాల్లో సకల  మార్గాల ద్వారా కనీసం ఒక లక్ష ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగించాలని సంకల్పించింది. 

ఉమ్మడి రాష్ట్రం అమలు చేసిన డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి, ఇందిరమ్మ వరద కాలువ, రాజీవ్‌ దుమ్ముగూడెం, ఇందిరా రుద్రంకోట ఎత్తిపోతల పథకాలు, దేవాదుల, కాంతనపల్లి ప్రాజెక్టులను, శ్రీరాం సాగర్‌ వరద కాలువ, ఉమ్మడి రాష్ట్రంలో పరి పాలనా అనుమతులు పొందినా కూడా ఉమ్మడి రాష్ట్ర పాలకులు అటకెక్కించిన పాలమూరు-రంగారెడ్డి, డిరడీ ఎత్తిపోతల పథకాలను సమీ క్షించి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీఇంజనీరింగ్‌ చేసుకోవడం జరిగింది. ఈ పథకాల రీఇంజనీరింగ్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. అవసరమైన ఆర్థిక వనరులు సమకూరుస్తున్నది. ఈ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన సాగు తున్నాయి. మూడున్నర ఏండ్లలోనే కాళేశ్వరం మల్టీ స్టేజ్‌ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసిన ఫలితంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి అనూహ్యంగా పెరిగిన సంగతి తెలిసిందే 

మిషన్‌ కాకతీయ:

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన మొదటి ఫ్లాగ్‌షిప్‌ కార్యక్రమం మిషన్‌ కాకతీయ. శతాబ్దాలుగా తెలంగాణ గ్రామీణ సామాజిక, ఆర్థిక వ్యవస్థకు అధరువులుగా ఉన్న గొలుసుకట్టు  చెరువుల వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా ధ్వంసం అయిపోయిన తర్వాత ఇంకా మిగిలి ఉన్న సుమారు 46,531 చెరువులను పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్‌ కాకతీయ’ పేరిట బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. మిషన్‌ కాకతీయ పథకం కింద నాలుగు దశల్లో రూ. 9155.97 కోట్లతో 27,625 చెరువులను పునరుద్దరించడం జరిగింది. వీటి కింద 20.78 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇప్పటి వరకు మిషన్‌ కాకతీయ పథకం కోసం నాలుగు దశలలో ప్రభుత్వం రూ. 5,349.37 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 15.05 లక్షల ఎకరాలు చెరువుల కింద స్థిరీకరణ చెందినాయి. చెరువుల నిల్వసామర్థ్యం పెరిగింది. చెరువుల కింద వ్యవసాయంతో పాటూ చేపల పెంపకం అనూహ్యంగా పెరిగింది. చెరువులలో నీటి నిల్వ పెరిగినందు వలన రాష్ట్రంలో భూగర్భ జలాలు పైకి లేచినాయి. ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నందున  35 లక్షల బోరు బావుల కింద 40 – 45 లక్షల ఎకరాల్లో సాగు సుస్థిరం అయ్యింది. మిషన్‌ కాకతీయ కింద పునరుద్ధరణ జరిగిన చెరువులు, ఆనకట్టలు, చెక్‌ డ్యాంలకు  నికరంగా నీటి సరఫరా జరగాలన్న ఉద్దేశ్యంతో ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.  ప్రాజెక్టుల పరిధిలోకి వచ్చే అన్ని చెరువులను నింపడం ప్రథమ ప్రాధాన్యతగా ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఇందు కోసం 3 వేల కొత్త తూములని 124.28 కోట్లతో నిర్మించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో సుమారు 2756 తూముల నిర్మాణం పూర్తి అయ్యింది. మిగతావి పురోగతిలో ఉన్నాయి.  ఈ పథకం కూడా జయప్రదం కావడంతో చెరువుల కింద రబీ పంటకు నికరంగా నీరు అందే పరిస్థితి  ఏర్పడిరది. 

చెక్‌ డ్యాంల నిర్మాణం: 

వర్షా కాలంలో వాన నీటిని, వానలు తగ్గిన తర్వాత ప్రాజెక్టుల ఆయకట్టు నుండి వచ్చే పడవాటి నీటిని (Regenerated Water) ఎక్కడికక్కడ ఒడిసి పట్టడానికి ప్రభుత్వం భారీ మధ్యతరహా ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఉన్న నదులు, వాగులు, వంకలపై చెక్‌ డ్యాం లు నిర్మించి వాగులను పునరుజ్జీవింప  చేయాలని  ప్రభుత్వం తలపెట్టింది. మిషన్‌ కాకతీయ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన మరో బృహత్తర పథకం.  

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 2014-18 మధ్య కాలంలో ప్రభుత్వం 202 చెక్‌ డ్యాంలను 764 కోట్ల ఖర్చుతో నిర్మించడానికి అనుమతించింది. వీటిలో 181 చెక్‌ డ్యాంలు పూర్తి అయినాయి.  2019-2021 మధ్య కాలం ప్రభుత్వం వాగులపై రెండు దశలలో 1200 చెక్‌ డ్యాంల నిర్మాణానికి 3825  కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతిని ఇచ్చింది. అన్ని  జిల్లాలలో మొదటి దశలో 644 చెక్‌ డ్యాంల నిర్మాణం చేపట్టినారు. ఇవి జూన్‌ కల్లా పూర్తి అవుతాయి. వీటిలో 465 చెక్‌ డ్యాంల నిర్మాణానికి నాబార్డ్‌ 2006 కోట్ల ఆర్థిక సహాయం చేస్తున్నది.  మిగతా 556 చెక్‌ డ్యాంల నిర్మాణం 2022-23 ఆర్థిక సంవత్సరంలో చేపట్టడం జరుగుతుంది. ఈ చెక్‌ డ్యాంల కింద ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. భూగర్భ జల సంపద పెరుగుతుంది. పశు పక్షులకు, వన్య ప్రాణులకు తాగునీటి సౌకర్యం ఏర్పడుతుంది. అటవీ పర్యావరణ వృద్ధికి ఈ చెక్‌ డ్యాంలు దోహదం చేయనున్నాయి.   

కాలువల ఆధునికీకరణ: 

ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి అయిన ప్రాజెక్టుల కాలువల వ్యవస్థ నిర్వహణను గాలికి వదిలేసిన కారణంగా కాలువలన్నీ పూడికతో నిండి పోయినాయి, చెట్లు మొలిచి పగుళ్లు ఏర్పడినాయి. కాలువలపై కట్టడాలు కూలిపోయినాయి. ప్రతిపాదిత ఆయకట్టుకు నీరు సరఫరా చేయలేని స్థితి నెలకొన్నది. ప్రతిపాదిత ఆయకట్టుకు, వాస్తవ ఆయకట్టుకు తేడా 40శాతం తగ్గుదల ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ గ్యాప్‌ పూరించడానికి ప్రభుత్వం ప్రాజెక్టుల కాలువల వ్యవస్థను ఆధునీకరించడానికి నిధులు మంజూరు చేసింది. శ్రీరాంసాగర్‌, నాగార్జునసాగర్‌, నిజాంసాగర్‌, రాజోలిబండ, వనదుర్గా ప్రాజెక్ట్‌(ఘన్‌ పూర్‌ ఆనకట్ట), సదర్‌ మాట్‌ , మూసి, సాత్నాలా, చెలిమెలవాగు, స్వర్ణ, పాలేరు పాత కాలువ, నల్లవాగు, శనిగరం ప్రాజెక్టుల కాలువల ఆధునికీకరణ పనులను పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆధునికీకరణ అవసరమైన అన్ని ప్రాజెక్టులని దశల వారీగా పూర్తి చేయడం జరుగుతుంది. 

సాగునీటి రంగానికి నిధుల కేటాయింపులు: 

సాగునీటి రంగానికి ప్రతీ ఏటా పెద్ద మొత్తంలో బడ్జెట్‌ కేటాయింపులు చేస్తున్నది ప్రభుత్వం. భూసేకరణ మరియు పునరావాస కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. 2015-16, 2016-17, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలలో సాగునీటి రంగానికి ఏటా 25 వేల కోట్ల నిధులను బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆ తర్వాత కూడా అదే ప్రాధాన్యతను కొనసాగించారు. 2019-20 లో 18,511 కోట్లు, 2020-21లో 15,738 కోట్లు, 2021-22 లో 20,551 కోట్లు కేటాయించినారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ  సాగునీటి రంగానికి 22,637.82 కోట్లు కేటాయించడం జరిగింది. వీటికి అదనంగా కాళేశ్వరం కార్పొరేషన్‌, ుూఔRIణజ ద్వారా రుణాలు సేకరించి  ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం జరుగుతున్నది.  

ప్రాజెక్టుల పురోగతి

తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగునీటి కల్పనకై ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, చెరువుల అభివృద్ది కోసం ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 1,45,000 కోట్లు ఖర్చు చేసింది. సాగునీటి రంగంపై ఇంత పెద్ద ఎత్తున నిధులను వెచ్చించడం దేశంలోనే  ఇది ఒక చరిత్ర. ఉమ్మడి రాష్ట్రంలో 2004 -14 మధ్యన పదేండ్లలో తెలంగాణ ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చు కేవలం రూ. 55 వేల కోట్లు మాత్రమే. 

1. తెలంగాణ ఏర్పాటు తర్వాత పూర్తి అయిన ప్రాజెక్టుల వివరాలు

తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం (11 నెలల్లో పూర్తి అయ్యింది), భక్త రామదాసు ఎత్తిపోతల పథకం (10 నెలల్లో పూర్తి అయ్యింది), మిడ్‌ మానేరు జలాశయం, శ్రీరాంసాగర్‌ రెండో దశ , గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి బ్యారేజి (మేడిగడ్డ), సరస్వతి బ్యారేజి (అన్నారం), పార్వతి బ్యారేజి (సుందిళ్ల), లక్ష్మి, సరస్వతి, పార్వతి పంప్‌ హౌజ్‌ లు, 13.5 కిమీ గ్రావిటి కాలువ, నంది, గాయత్రి భూగర్భ పంప్‌ హౌజ్‌ లు, కాళేశ్వరం లింక్‌-2 లో 10 మీ వ్యాసం కలిగిన జంట సొరంగాలు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొమురవెల్లి మల్లన్న సాగర్‌, కొండపోచమ్మసాగర్‌ జలాశయాలు, వాటి అనుబంధ పంప్‌ హౌజ్‌లు, శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవన పథకం, బాగారెడ్డి సింగూరు కాలువలు, సిలారు రాజనరసింహ ఎత్తిపోతల పథకం, కిన్నెరసాని కాలువలు, గొల్లవాగు, మత్తడి వాగు, పాలెంవాగు, ర్యాలివాగు, గడ్డెన్నసుద్దవాగు, చౌటుపల్లి హనుమంత్‌ రెడ్డి ఎత్తిపోతల పథకం, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ, గట్టు పొడిచిన వాగు, సమ్మక్కసాగర్‌ బ్యారేజి (తుపాకులగూడెం).

2. పాక్షికంగా పూర్తి అయి ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న ప్రాజెక్టులు: 

గోదావరి బేసిన్లో కాళేశ్వరం, దేవాదుల, యెల్లంపల్లి, శ్రీరాంసాగర్‌ వరద కాలువ, కొమురం భీమ్‌, కృష్ణా బేసిన్లో ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్‌ఎల్‌బిసి, మహాత్మాగాంధి కల్వకుర్తి, జవహర్‌ నెట్టెంపాడు, రాజీవ్‌ భీమా ఎత్తిపోతల పథకం, కోయిల్‌ సాగర్‌  ఎత్తిపోతల పథకాలు.

3. కాళేశ్వరం ప్రాజెక్టు 

కాళేశ్వరం ప్రాజెక్టులో పనులు మొత్తం 7 లింకుల్లో, 28 ప్యాకేజీల్లో వివిధ జిల్లాల్లో పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు తెలంగాణ రాష్ట్రంలో 13 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. 20 జిల్లాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజిలు, 16  జలాశయాలు, మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్‌ దాకా 10 స్టేజిల ఎత్తిపోతలు, అన్ని లింకుల్లో కలిపి 21 పంప్‌ హౌజ్‌ లు, 108 భారీ  పంపులు, సర్జ్‌ ఫూల్స్‌, 98 కిమీ డెలివరీ పైపులు, డెలివరీ సిస్టెర్న్స్‌, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల  కాలువలు, భారీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, వందల కిలోమీటర్ల విద్యుత్‌ లైన్లు .. ఇట్లా అనేక కాంపొనెంట్స్‌ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. వీటి ద్వారా 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, శ్రీరాంసాగర్‌, వరద కాలువ, నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టులు, చెరువుల కింద ఉన్న26.75 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో మొత్తం 45 లక్షల ఎకరాల ఆయకట్టును సాధించడం కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం. 

2016 లో ప్రారంభం అయిన కాళేశ్వరం పనుల్లో 2020 నాటికి..  అంటే 4 ఏండ్లలోనే మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ జలాశయానికి గోదావరి నీరు చేరడం ఒక అపూర్వమైన విషయం. 2021 లో 50 టిఎంసి నిల్వ సామర్థ్యం ఉన్న మల్లన్న సాగర్‌ జలాశయంలోకి కూడా 16 టిఎంసిల నీరు చేరిన సంగతి తెలిసిందే. అతి తక్కువ కాలంలో ఇంత పెద్ద మల్టీ స్టేజ్‌ లిఫ్ట్‌ పథకాన్ని పూర్తి చేయడం అపూర్వం. దేశంలో ఇటువంటి ఉదాహరణ మనకు కనబడదు. 

కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక్క ఎకరం కూడా సాగులోకి రాలేదు అని విమర్శలు చేస్తున్నారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ జలాశయాల కింద సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, సిరిసిల్లా, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో 817  చెరువులు, 66 చెక్‌ డ్యాంలను  నింపడం జరిగింది. ఈ చెక్‌ డ్యాం ల కింద సుమారు 20, 576 ఎకరాలు సాగు లోకి వచ్చాయి. సిద్ధిపేట, సిరిసిల్లా జిల్లాల్లో 2.30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించడం జరుగుతున్నది. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులో దిగువ మానేరు జలాశయం కింద  మొదటి దశ, రెండవ దశలో ఉన్న 6.10 లక్షల ఎకరాల ఆయకట్టు, నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద ఉన్న 2 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పొందింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సుమారు 10 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరింది. 

గోదావరి నదిపై ఐదు బ్యారేజిలు (ఎల్లంపల్లి. సుందిళ్ళ. అన్నారం, మేడిగడ్డ, సమ్మక్కసాగర్‌) పూర్తి అయిన కారణంగా సుమారు 200 కిమీ పొడవున గోదావరి పునరుజ్జీవనం పొందింది. ఈ  సజీవ గోదావరి ఇక ఎండి పోయే ప్రసక్తే లేదు.  గోదావరి నదీ గర్భంలో 62.81 టిఎంసిలు నిల్వ సాధ్యం అయ్యింది. వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, మత్స్య పరిశ్రమ ,టూరిజం, పట్ణాణాభివృద్ధి, పర్యావరణం, దేశీయ జల రవాణా తదితర రంగాలను ప్రభావితం చేసి తెలంగాణా సమగ్ర వికాసానికి దోహదం చేసే ఒక ప్రగతి రథంగా (గ్రోత్‌ ఇంజన్‌) కాళేశ్వరం ప్రాజెక్టు మారింది. 

4. పెండింగ్‌ ప్రాజెక్టులు  

కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌ సాగర్‌, ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, దేవాదుల తదితర పెండిరగ్‌ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చింది. వీటి ద్వారా దాదాపు 16 లక్షల ఏకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కావడంతో పాలమూరుతో పాటు ఎన్నోప్రాంతాలు పచ్చబడ్డాయి. వలసలు ఆగిపోయాయి. వలస వెళ్ళిన ప్రజలు తిరిగి తమ గ్రామాలకు తిరిగి వస్తున్నారు. తెలంగాణకే అనేక పొరుగు రాష్ట్రాల నుంచి, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌ ఘర్‌, పశ్చిమ బెంగాల్‌ లాంటి దూర ప్రాంతాల నుంచి కూడా   ప్రజలు ఉపాధి కోసం వస్తున్నారు. 

ప్రాజెక్టుల ఫలితాలు 

పైన వివరించిన విధంగా ప్రభుత్వం గడచిన 6 ఏండ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసినందు వలన తెలంగాణ రాష్ట్రం సాధించిన ఫలితాలు, విజయాలు ఈ విధంగా ఉన్నాయి.

2. ప్రాజెక్టుల కింద, చెరువుల కింద అభివృద్ధి అయిన ఆయకట్టు వివరాలు 

చెరువులను, ప్రాజెక్టులను పూర్తి చేసినందు వలన సాగునీటి సౌకర్యాలు పెరగడం, భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి కావడంతో ప్రాజెక్టుల కింద, ఆయకట్టు ఆవల 35 లక్షల బోరు బావుల కింద రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. 2014-15 లో తెలంగాణలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు ఉండగా అది 2020-21 నాటికి 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది.  

తదనుగుణంగా ధాన్యం ఉత్పత్తి కూడా అనూహ్యంగా పెరిగింది. 2014-15 లో ధాన్యం ఉత్పత్తి 68.17 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా 2020-21 నాటికి అది 259 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. నేడు తెలంగాణ దేశానికి అన్నం పెట్టె అన్నపూర్ణగా అవతరించింది. 

ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ రాష్ట్రాన్ని వెనక్కి తోసి తెలంగాణ మొదటి స్థానంలో నిలచింది. భారత ఆహార సంస్థ ద్వారా జరిగే ధాన్యం సేకరణలో వంజాబ్‌ తర్వాత రెండో స్థానంలో నిలచింది. 

3. రాష్ట్రంలో భూగర్భ జలాల వృద్ధి: 

తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోభూగర్భ జలాల వృద్ధిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని భూగర్భ జల శాఖ వారి అధ్యయనంలో తేలింది.  2020 మే నేలతో పోలిస్తే రాష్ట్రంలో సగటున 2.07 మీ ల పెరుగుదల నమోదు అయ్యింది. అత్యధికంగా మెదక్‌ జిల్లాలో 6.86 మీ. లు పెరుగుదల నమోదు అయ్యింది. 

4. రాష్ట్రంలో తాగునీటి కల్పన:

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటికి స్వచ్చమైన తాగునీటిని నల్లా ద్వారా అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన పథకం మిషన్‌ భగీరథ. మిషన్‌ భగీరథ కోసం రాష్ట్రంలో ఉన్న అన్ని జలాశయాల్లో 10 శాతం నీటిని కేటాయించింది ప్రభుత్వం. గోదావరి బేసిన్లో 32.58 టిఎంసిలు, కృష్ణా బేసిన్‌ లో 23.44 టిఎంసిలు మిషన్‌ భగీరథ పథకానికి ప్రభుత్వం కేటాయించింది. ఇవి రాష్ట్రానికి ట్రిబ్యునల్స్‌ ద్వారా కేటాయించిన నీటిలో నుంచే తాగునీటికి వినియోగించడం జరుగుతున్నది. జలాశయాల్లో నిర్ణీత కనీస మట్టాలను తప్పనిసరిగా కాపాడాలని ప్రభుత్వం ఆదేశించింది. మిషన్‌ భగీరథ పూర్తి అయి దేశ వ్యాప్తంగా గొప్ప పథకంగా ప్రశంసలు అందుకున్నది. ఎన్నో పురస్కారాలను అందుకున్నది. దేశంలో వంద శాతం గ్రామాలకు సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పించిన రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

5. రైతుల ఆత్మహత్యల్లో తగ్గుదల: 

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వారు విడుదల చేసిన నివేదికలను పరిశీలిస్తే తెలంగాణా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 64 శాతం తగ్గినట్టు తెలుస్తున్నది. ఒక వైపు మహారాష్ట్రా, కర్నాటక ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు పెరుగుతుంటే తెలంగాణాలో సగానికంటే ఎక్కువ తగ్గడం గమనార్హం.  

క్ర.సంరాష్ట్రం20152019
1 మహారాష్ట్ర42913927
2కర్నాటక1569 1992
3ఆంధ్రప్రదేశ్‌ 916 1029
4తెలంగాణ 1400499

తెలంగాణ లో 2015 లో 1400 మంది రైతులు చనిపోతే 2019 లో 499 కి పడిపోయింది. 

సాగునీటి సౌకర్యాల కల్పనతో పాటూ రైతు బంధు పథకం, రైతు బీమా పథకం, రుణ మాఫీ, వ్యవసాయానికి  24 గంటల  ఉచిత కరెంటు, రైతుల పంటలకు మెరుగైన మార్కెటింగ్‌  సౌకర్యాలు, గిట్టుబాటు ధరలు కల్పించడం లాంటి చర్యలు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గడానికి దోహదం చేసినాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవన్ని రైతుకు బతకడానికి భరోసాను ఇచ్చాయి. 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా గడచిన ఐదేండ్లలో సాగునీటి రంగంలో గొప్ప  విజయాలు చేకూరినాయి. తెలంగాణా ప్రజల సాగునీటి ఆకాంక్షలు నెరవేరే దారిలో ప్రాజెక్టుల పురోగతి సాగుతున్నది. తెలంగాణా కోటి ఎకరాల మాగాణంగా మారడానికి ఏంతో కాలం పట్టదు. ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంలో సాగునీటి శాఖ  ముందుకు సాగుతున్నది.  మానవాభివృద్ధి సూచికలలో అగ్రగామిగా నిలచింది. ఈ సందర్భంలో 2011 లో జాతీయ అభివృద్ధి మండలి (నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌) తమ పదకొండవ ప్రణాళికా నివేదికలో కొత్త రాష్ట్రాలు ఉత్తరాఖండ్‌, రaార్ఖండ్‌, ఛత్తీస్‌ఘర్‌ లు తమ మాతృ రాష్ట్రాలతో పోల్చినప్పుడు గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌ పెరుగుదలపై ఈ విధంగా వ్యాఖ్యానించింది.

‘‘అభివృద్ది చెందడానికి కావలసిన వనరులు, శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అవి అణిగిపోయి ఉండటం వలన ఈ ప్రాంతాలు వెనుకబడి పోయినాయి. ఈ ప్రాంతాలు రాష్ట్రాలుగా ఏర్పడగానే వీటిల్లోని సహజంగా నిబిడీకృతమై ఉన్న సమస్త సృజనాత్మక శక్తులు వికాసం చెంది ప్రజలను కార్యోన్ముఖులను కావించాయి. ప్రాంత అభివృద్ధికి ప్రణాళికాబద్దమైన పరిపాలన కూడా బయటి పెట్టుబడులను రాష్ట్రంలోకి ఆకర్షించి ఆర్థిక ప్రగతికి దోహదం చేసి ఉంటుంది. వనరుల వినియోగం కూడా అందుకు ఊతం ఇచ్చింది.’’

ఈ వ్యాఖ్యానం తెలంగాణకూ అక్షరాలా వర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తన శక్తి సామర్థ్యాలను, ప్రకృతి, మానవ నిర్మిత వనరులను, మానవ వనరులను అత్యంత సృజనాత్మకంగా వినియోగం చేస్తున్నది. సాగునీటి రంగం  అపూర్వంగా వికాసం చెంది రాష్ట్ర సమగ్రాభివృద్దికి దోహదం చేస్తున్నది. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికత, సంకల్ప బలం తోడయ్యింది. 

ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల సాగునీటి ఆకాంక్షలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది. గత 6 ఎండ్లలో ప్రభుత్వం చేసిన పనులు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి. రాబోయే 2, 3 ఏండ్లలో ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నది. త్వరలోనే ‘‘మా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం’’ అన్న ఉద్యమ నినాదం నిజం కాబోతున్నది. ఈ సాగునీటి పథకాలన్నీ రాష్ట్ర సమగ్ర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయి.