|

రైతన్న సంబరాలు

వ్యవసాయం దండగకాదు.. పండగ అని గత ఏడేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం నిరూపించింది. పంటలు నిండుగా పండటంతో రాష్ట్రం ధాన్యాగారంగా అవతరించింది. రైతన్నల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు నాయకత్వంలో కొత్త రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పడిన ప్రభుత్వం రైతులకు అందించిన వరం ‘రైతుబంధు’ పథకం. ఈ పథకం కింద రైతులకు అందించిన సాయం అరలక్ష కోట్లను అధిగమించడంతో రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పథకం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయరంగ అభివృద్ధి ఆవశ్యకతను, రైతన్నల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఎనిమిదో విడతలో రూ.50 వేల కోట్ల మైలురాయిని అందుకున్నది. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ సాహసించని విధంగా, ఏ కేంద్ర ప్రభుత్వం చేపట్టని విధంగా రైతుబంధు పథకానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. 2018 మే 10న కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గం శాలపల్లిలో ధర్మరాజులపల్లి రైతన్నలకు అందించి కేసీఆర్‌ పథకాన్ని ప్రారంభించారు. పంటకు పెట్టుబడి కోసం రైతన్నలు ఎవరి ముందూ చేయిచాచకూడదని ఎకరాకు రూ.4 వేలు, ఏడాదికి వానాకాలం, యాసంగి కలిపి రూ.8 వేలు అందించేలా ప్రారంభించారు. దానిని ఎకరాకు రూ.5 వేలకు పెంచి ఏడాదికి రూ.10 వేలు అందిస్తూ వస్తున్నారు. ఈ పథకం ఇప్పటివరకు ఎనిమిది విడతలు పూర్తి చేసుకోగా ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో రూ.50,448.15 కోట్లు నేరుగా జమచేయడం జరిగింది.

ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్రా అన్న పరిస్థితి. సాగునీరు లేక, సాగునీరుంటే కరంటు లేక, రెండూ ఉంటే పెట్టుబడి లేక, తల తాకట్టు పెట్టి పెట్టుబడి తెచ్చి ఆరుగాలం కష్టించి పంట పండించినా కొనే నాధుడు లేని పరిస్థితి. ఇన్ని సమస్యల మధ్య సాగులో ముందడుగు వేయలేక వ్యవసాయాన్ని విడిచి, నివాసమున్న పల్లెలను విడిచి ఇతర రంగాలలో ఉపాధిని వెతుక్కుంటూ వలసపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు దెబ్బతిని, సాగునీటి వసతులు లేక, బోర్ల మీద వ్యవసాయం భారంగా మారి రైతులు వలసబాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి, నూతన ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయ పథకం కింద 46 వేల పై చిలుకు చెరువులు, కుంటల పునరుద్ధరణతో రైతులకు సాగుకు ప్రధానంగా అవసరమయిన సాగునీరు అందుబాటులోకి వచ్చింది.

ఆ తరువాత రైతులకు కావాల్సింది పంటల సాగుకు పెట్టుబడి. దానికోసమే రైతుబంధు పథకం తీసుకు వచ్చారు. ఈ పథకం కింద ప్రతి ఏటా రెండు విడతలలో 2018 – 19లో రూ.10,488.19 కోట్లు, 2019-20 లో రూ.10,532.02 కోట్లు, 2020 – 21లో రూ. 14,656.01 కోట్లు, 2021 – 22లో 14,771.93 కోట్లు మొత్తం 50,448.15 కోట్లు రైతుల ఖాతాలలో జమచేయడం జరిగింది. ఈ విడత యాసంగిలో 62.99 లక్షల మంది రైతులకు రూ. 7411.52 కోట్లు జమ అయ్యాయి.కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతు బంధు నిధులు అందజేయడం జరిగింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రూ. 601,74,12,080 నిధులు, అత్యల్పంగా మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలో 33,452 మంది రైతులకు రూ.33.65 కోట్లు అందాయి.

రైతుబంధుతో వ్యవసాయరంగానికి దిక్సూచిలా నిలిచిన కేసీఆర్‌ రైతుబీమా పథకంతో రైతులకు ఆత్మబంధువుగా మారారు. 2018 నుండి అమలవుతున్న రైతుబీమా పథకం కింద ఇప్పటివరకు 72,814 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.3640.7 కోట్లు అందాయి. భూమినే నమ్ముకుని బతుకునీడుస్తున్న రైతు కుటుంబాలు ఆ కుటుంబ యజమాని మరణిస్తే వారికి చేదోడుగా ఉండాలని 18 నుండి 59 ఏళ్ల వయసున్న రైతు ఏ కారణం చేత మరణించినా ఆ కుటుంబానికి రూ.5 లక్షలు అందేలా ప్రభుత్వం రైతుల తరపున ప్రీమియం చెల్లించడం జరుగుతున్నది. 2021 – 22 కు గాను 35.64 లక్షల మంది రైతులకు రూ.4110.11 చొప్పున భారత జీవితబీమా సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తున్నది.

రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరంటు, సాగునీరు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన పథకాలు దేశానికి దిక్సూచిలా, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. రైతుబంధును ఎన్నికలకోసమని, 24 గంటల కరంటు అనవసరం అని చెప్పిన వారే నేడు ముక్కుమీద వేలేసుకుని కేసీఆర్‌ పథకాల అమలుతీరును పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికే దారి చూపే దిశగా ముందుకుసాగుతుందన్నది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం.