ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణకు అవార్డు

వ్యాపారాన్ని సులభతరం చేయడం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ అవార్డును అందించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్నాయని ప్రశంసించింది. ఢిల్లీలో జరిగిన ‘డిజిటెక్‌ కాంక్లేవ్‌ 2022’లో తెలంగాణ ప్రభుత్వం తరపున  మంత్రి కే.తారకరామారావు పాల్గొని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలతోపాటు క్షేత్రస్థాయిలో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా తెలంగాణను అవార్డుకు ఎంపిక చేశారు. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలుచేస్తున్న సంస్కరణలతోపాటు ‘మీ సేవ’ పోర్టల్‌ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్‌ సేవలను అందిస్తున్నందుకు గానూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ అవార్డు వరించింది.

75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం డిజిటల్‌ రంగంలో సాధిస్తున్న విజయాలను పురస్కరించుకుని సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాలతో న్యూఢిల్లీలో డిజిటెక్‌ కాన్‌ క్లేవ్‌ 2022 ను ఎకనామిక్‌ టైమ్స్‌ నిర్వహిస్తోంది. నీతీ ఆయోగ్‌, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖతో పాటు ఇజ్రాయెల్‌, స్వీడన్‌ రాయబార కార్యాలయాలు సంయుక్తంగా ఈ కాన్‌ క్లేవ్‌కు సహకారం అందిస్తున్నాయి. 

డిజిటల్‌ రంగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న రాష్ట్రాలను గుర్తించేందుకు ఈ కాన్‌ క్లేవ్‌కు నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌గా డెలాయిట్‌ టచ్‌ తో మట్స్‌ ఇండియా సహకారాన్ని తీసుకున్నట్టు  ఎకనామిక్‌ టైమ్స్‌ తెలిపింది.  కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసే నివేదికలతో పాటు క్షేత్ర స్థాయిలో విస్తృతమైన పరిశోధన, అధ్యయనం చేసిన తరువాతనే తాము తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేశామని పేర్కొన్నది. 

ఈ సందర్భంగా మంత్రి కే.తారకరామారావు మాట్లాడుతూ  రాష్ట్రంలో ఉన్న మీసేవ (Mee Seva) కార్యకలాపాల్లో తీసుకువచ్చిన మార్పులు ముఖ్యంగా మొ బైల్‌ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్‌ లెస్‌ గవర్నెన్స్‌ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు… టి వాలెట్‌ సాధించిన మైలురాళ్లను వివరించారు. టీఎస్‌ ఐపాస్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో, టీఎస్‌ బీపాస్‌లో దరఖాస్తు చేసుకున్న 21 రోజులలో అనుమతులను పొందవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణ ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉన్నది అని అన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారం మరో నిదర్శనం అని తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విస్తృతమైన  పరిశోధన చేసిన ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ పత్రికకు ధన్యవాదాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌,తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమీషనర్‌ డా.గౌరవ్‌ ఉప్పల్‌  ఉన్నారు.