ప్రభుత్వం చేసిన కల్యాణాలు 10 లక్షలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు నాణ్యమైన, ఉచిత వైద్యం అందించాలని, పెళ్ళీడుకు వచ్చిన పేద ఆడపిల్లల పెళ్ళిళ్ళకు ఇతోధిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్య శాలలను అభివృద్ధి పరచి, అందులో అధునాతన వసతులు కల్పించి, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. పేద ఆడబిడ్డలు ప్రసూతి సమయంలో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి, అక్కడ వేలాది రూపాయలు ఖర్చు చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే విధంగా వారికి ప్రోత్సహకాలు కల్పించారు. ఈ ప్రోత్సాహక పథకానికి కేసీఆర్ కిట్ అని పేరు పెట్టి ఆ కిట్ ద్వారా ప్రసూతి జరిగిన తరువాత పుట్టిన శిశువుకు, తల్లికి అవసరమైన 16 (సబ్బులు, నూనె, పౌడర్, దోమతెర, చిన్నబెడ్, రెండు బేబీ డ్రెస్‌లు, తల్లికి రెండు చీరలు, టవళ్లు వంటివి ఇందులో ఉంటాయి) రకాల వస్తువులతో కూడిన రూ.2 వేల విలువ చేసే కిట్‌ను పథకం ప్రారంభమయినప్పటి నుంచి ఇప్పటివరకు అందజేస్తూనే వున్నారు. మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డకు 13 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం జనవరి 17 నాటికి 1,96,519 కిట్లు, ఇప్పటివరకు మొత్తం 10,80,079 కిట్ల పంపిణీ జరిగింది.
4 విడతలుగా ఆర్థిక సాయం
- గర్భం దాల్చినప్పటి నుంచి 9వ నెల వరకు 4దశల్లో ఆర్థికసాయాన్ని అందజేస్తున్నారు.
- 5-6 నెలల మధ్య పరీక్షల కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చినప్పుడు 3 వేలు ఇస్తారు.
- ప్రసవం సమయంలో బాలుడు జన్మిస్తే రూ.4వేలు, బాలిక జన్మిస్తే రూ.5 వేలు రూ.2 వేలు విలువైన కిట్‌ను అందజేస్తారు.
- శిశువుకు మూడున్నర నెలల్లో టీకాలు వేస్తే రూ.2 వేలు, 9 నెలల సమయంలో టీకాలు వేస్తే రూ.3 వేలు బ్యాంకు లో జమ చేస్తారు.
ఈ పథకం ద్వారా ఐదేండ్లలో లబ్ధి పొందిన గృహిణుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఇప్పటివరకు పుట్టింటి కానుక రూపంగా ప్రభుత్వం వైపు నుండి యేటా 2 లక్షల మందికి సాయం అందింది. పది లక్షల మంది గర్భిణులకు 1,700 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది. ఈ పథకం 2017 జూన్ 3న ప్రారంభమయ్యింది. కేసీఆర్ కిట్ పథకం గర్భిణీ మహిళలకు ఆర్ధిక సాయం అందించడంమే కాకుండా, సామాజికంగా ఎన్నో విప్లవాత్మక మార్పులకు కారణమైంది.
పదిలక్షలు దాటిన కళ్యాణ లక్ష్మీ
పేద ప్రజలకు తమ ఆడపిల్లల పెళ్ళిళ్ళు భారంగా మారిన నేపథ్యంలో వారికి ప్రభుత్వం వైపున చేయూత నందించాలని సంకల్పించారు. ఆ సంకల్పం నుంచి పుట్టిందే కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం.ఈ పథకం, 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టడం జరిగింది.పేద ప్రజల పెళ్ళిళ్ళకు సహాయం చేయడం ప్రారంభించి ఏడు సంవత్సరాలు పూర్తయి, పదిలక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. దీనితో ప్రజలు సంబరాలు జరుపు కుంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా పేద ప్రజల పెళ్ళిళ్లకు సహాయాన్ని చేసేవారు. ఎవరు పెళ్ళి పత్రిక తెచ్చి ఇచ్చినా, వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి పంపేవారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించాక తెలంగాణలోని గ్రామాలు, తండాలలో పర్యటిస్తుండగా ఒక తండాలో వారి ఇల్లు కాలిపోయి, అందులో తమ పిల్ల పెళ్ళికి దాచుకున్న డబ్బులు దగ్ధం కావడంతో కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్న జంటను చూసి చలించిపోయారు. వెంటనే వారి పెళ్ళికి కావాల్సిన డబ్బులు సహాయం చేశారు. అప్పుడే తెలంగాణ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పేద ఆడబిడ్డల పెళ్ళిల్లకు ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్.
మొదట ఎస్సీ, బీసీలకే ఇచ్చిన ప్రభుత్వం అనంతరం తెల్ల రేషన్‌కార్డు కలిగిన అందరికీ, కులాలలతో సంబంధం లేకుండా ఇవ్వడం ప్రారంభించింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న, తెల్ల రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలలోని ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరిగితే వారికి సహాయం చేయడానికి తొలుత రూ. 51 వేలతో ప్రారంభించిన ఈ పథకం, పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా 2017-18 బడ్జెట్‌లో 75,116 రూపాయలకు పెంచడం జరిగింది. ఆ తరువాత 2018, మార్చి 19 నుంచి ఇప్పటివరకు ఒక లక్షా నూట పదహారు రూపాయల ఆర్థిక సాయంగా అందిస్తున్నారు.
పద్దెనిమిది సంవత్సరాల వయోపరిమితి దాటిన నిరుపేద (గిరిజన, దళిత, బీసీ, ఓబీసీ) యువతులకు ఈ పథకం వర్తిస్తుంది. పట్టణాల్లో రెండు లక్షల రూపాయల ఆదాయం, గ్రామాల్లో లక్షన్నర రూపాయల ఆదాయం వున్న వారు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటివరకు 10,56,239 మంది తెలంగాణ ఆడబిడ్డలకి ఆర్థిక సహాయం అందింది.
- 2017-18 లో 2,02,142 కిట్లు
- 2018-19 లో 2,43,095 కిట్లు
- 2019-20 లో 2,23,720 కిట్లు
- 2020-21 లో 2,14,603 కిట్లు
2014 | 2021 | |
మాతృమరణాలు (ప్రతి వెయ్యి మందిలో) | 92 | 63 |
నవజాత శిశు మరణాలు (ప్రతి వెయ్యి మందిలో) | 25 | 16 |
శిశు మరణాలు (ప్రతి వెయ్యి మంది జననాల్లో) | 39 | 23 |
ఐదేండ్ల లోపు పిల్లల మరణాలు (ప్రతి వెయ్యి మందిలో) | 41 | 29 |
వాక్సినేషన్ | 68 శాతం | 100 శాతం |
దవాఖానాల్లో ప్రసవాలు | 91 శాతం | 97శాతం |
ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు | 30 శాతం | 52 శాతం |