|

తెలంగాణ చేనేత కళావైభవం అద్భుతం

  • అమెరికా పరిశోధకురాలి ప్రశంస

తెలంగాణ చేనేత వస్త్ర పరిశ్రమ నైపుణ్యం, ఆ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని అమెరికాకు చెందిన హ్యాండ్లూమ్‌, టెక్స్‌ టైల్‌ రీసెర్చ్‌ స్కాలర్‌ కైరా ప్రశంసలు కురిపించారు. దీర్ఘకాలం పాటు తాను కొనసాగిస్తున్న చేనేతల అధ్యయనంలో భాగంగా ఆమె తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో కొనసాగుతున్న చేనేత వస్త్రాల ఉత్పత్తి, అక్కడి స్థితిగతులపైన ఆమె క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా టెక్స్‌టైల్‌ శాఖ మంత్రి కే. తారక రామారావుని ప్రగతి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తాను పర్యటించిన ప్రాంతాల్లో గుర్తించిన అనేక ముఖ్యమైన అంశాలను మంత్రి కేటీఆర్‌తో పంచుకున్నారు. నేతన్నలకు ముఖ్యంగా చేనేత పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలతో పాటు వారి కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి కైరాకు కేటీఆర్‌ వివరించారు.

మంత్రి కేటీఆర్‌తో సంభాషణ సందర్భంగా కైరా కొన్ని ముఖ్య అంశాలను తెలిపారు. తన పరిశోధనలో భాగంగా ఇప్పటిదాకా 9 దేశాలలో పర్యటించానన్న కైరా, భారత దేశంలో చేనేతల అధ్యయనానికి తెలంగాణనే మొదటి గమ్యస్థానంగా ఎంచుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కళాకారులు తమ
ఉత్పత్తులు, తమ కళపట్ల అత్యంత గర్వంగా ఉన్నారని, ముఖ్యంగా తాము చేసే పని పట్ల వారి నిబద్ధత చాలా గొప్పగా ఉందని ఆమె ప్రశంసించారు. తరతరాలుగా వస్తున్న చేనేత కళల సాంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్న తపన ఇక్కడి నేతన్నల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. ఇతర దేశాలకు భిన్నంగా ఒకే చోట వందలాదిమంది చేనేత కార్మికులు కలిసి పనిచేయడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతున్నట్టు తాను గుర్తించానన్నారు. తమ ఉత్పత్తులకు బ్రాండ్‌ ని క్రియేట్‌ చేయడంతో పాటు మార్కెట్‌ విస్తృతికి ఈ అంశం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇతర ప్రోత్సాహకాల పట్ల ఇక్కడి కార్మికులకు ఉన్న అవగాహన ఆశ్చర్యానికి గురిచేసిందన్న కైరా, ప్రభుత్వం తమకు ఏం చేస్తోంది? ఎలాంటి పథకాలు అమలవుతున్నాయన్న అంశాల మీద ప్రతీ కార్మికుడికి పూర్తి సమాచారం, స్పష్టత ఉందన్నారు. 9 దేశాల్లో చూడనంత గొప్ప కళా నైపుణ్యం ఇక్కడి చేనేత వస్త్రాల్లో ఉందని కైరా అబ్బురపడ్డారు.

ఇక్కడి చేనేతల్లో ఉన్న కళా నైపుణ్యం ఎంతో విలువైనదన్న కైరా, ప్రపంచ మార్కెట్లలో దీనికి అద్భుతమైన డిమాండ్‌ ఉందన్నారు. భారతదేశంలో చేనేతల ఉత్పత్తులు కేవలం చీరలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని అయితే, దుస్తులు, ఇతర ఉత్పత్తులకు చేనేత, పట్టు పరిశ్రమలను అనుసంధానం చేస్తే మంచి మార్కెట్‌ ఏర్పడుతుందని కైరా సూచించారు. ఇక్కడి పవర్లూమ్‌ కార్మికులు సైతం డబుల్‌ జకార్డ్‌ వంటి వినూత్నమైన టెక్నిక్‌ లతో దుస్తులను నేయడం బాగుందన్నారు. ఇన్నోవేషన్‌, టెక్నాలజీ లను హ్యాండ్లూమ్‌ రంగానికి అనుసంధానిస్తే భవిష్యత్తు తరాలకి చేనేత కళ సమున్నతంగా అందుతుందన్న విశ్వాసం తనకున్నదని కైరా తెలిపారు.

చేనేత కళా నైపుణ్యం,వస్త్రాలపై ప్రేమతో దీర్ఘకాల పరిశోధన కోసం తన సమయాన్ని వెచ్చిస్తున్న కైరా ప్రయత్నానికి మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన కైరా లాంటి పరిశోధకుల పక్షపాతం లేని అభిప్రాయాలు ఎంతో విలువైనవన్న కేటీఆర్‌, పరిశ్రమ అభివృద్ధికి వారి నుంచి విలువైన సూచనలు తీసుకుంటామన్నారు. దీంతో పాటు ఇతర దేశాల్లో చేనేత వస్త్ర పరిశ్రమ ఉన్నతికి అమలవుతున్న కార్యక్రమాల గురించి వారి నుంచి సమాచారం తెలుసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే నేతన్నల కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలను చేపట్టిందని, అందులో భాగంగానే ఆత్మహత్యల సంక్షోభం నుంచి ఈరోజు నేతన్నల పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిన విషయాన్ని కేటీఆర్‌ తెలిపారు.

కైరా లాంటి విస్తృత అధ్యయనం చేసిన నిపుణులు, సంస్థల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు. భారతదేశంలో పర్యటిస్తున్న సందర్భంగా ఇతర రాష్ట్రాల టెక్స్‌ టైల్‌ శాఖలతో సమన్వయం చేసే విషయంలో కైరాకు సహాయం చేయాలని తెలంగాణ టెక్స్‌ టైల్‌, చేనేత అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.