| |

ప్రగతి పథంలో పారిశ్రామిక రంగం… పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న  ప్రోత్సాహంతో పారిశ్రామిక ప్రగతి తారాజువ్వలా దూసుకుపోతున్నది. దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. 2014లో ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత ఇప్పటి వరకు వచ్చిన పారిశ్రామిక పెట్టుబడులు  రూ.2,32,311 కోట్లు. వీటివల్ల వచ్చిన పరిశ్రమలు 96,863, ఈ పరిశ్రమల ఏర్పాటు వల్ల వచ్చిన ఉద్యోగాలు 16.48లక్షలు. ఇక 2021-22లో ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ డివైజెస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎయిరోస్పేస్‌, డిఫెన్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, టెక్స్‌టైల్స్‌ రంగాల్లో పెద్దమొత్తంలో పెట్టుబడులు రావడంతో పారిశ్రామిక ప్రగతి ఊపందుకుంది. ఈ సందర్భంగా 2021-22 సంవత్సరానికి గాను తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విడుదల చేశారు.

వార్షిక నివేదికలో ఈ సంవత్సరం పారిశ్రామిక పెట్టుబడులు రూ.17,867 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు.  సుమారు నాలుగువేల పరిశ్రమలు స్థాపించబడగా,  96 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చినట్లు పేర్కొన్నారు.  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 810 ఎకరాల్లో 13 కొత్త పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశారు. ఈ భూములలో ఇప్పటి వరకు 526 పరిశ్రమలకు కేటాయింపు జరిపారు. వీటి ద్వారా రూ.6,123 కోట్ల పెట్టుబడులు, 5,626 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా. తెలంగాణ ఏర్పడింది మొదలుకుని ఇప్పటి వరకు 19,961 ఎకరాల్లో 56 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. మరో 15,620 ఎకరాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి దేదీప్యమానంగా వెలిగిపోతుండడంతో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరగడంతో పాటు, దేశ జీడీపీ కంటే కూడా ఎక్కువగా రాష్ట్ర జీడీపీ నమోదవుతున్నది.  వాణిజ్య వాతావరణంలో తెలంగాణ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తున్నది. నీతి ఆయోగ్‌ ‘ఎక్స్‌పోర్ట్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇండెక్స్‌ 2021’ప్రకారం ఉత్తమ వాణిజ్య వాతావరణం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణది అగ్రస్థానం. నీతి ఆయోగ్‌ లెక్కల ప్రకారం మన దేశం నుండి విదేశాలకు చేసిన ఎగుమతుల్లో 75 శాతం వాటా మహరాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలదే. దేశంలో వాణిజ్య, పారిశ్రామిక రంగ ర్యాంకుల్లో తెలంగాణది ప్రథమ స్థానం.  దేశంలోనే తొలి ఐపీ మస్కట్‌ బడ్డీ ‘రచిత్‌’ను ఆవిష్కరించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

జీఎస్‌డీపీలో 19.1 వృద్ధి

ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2021-22లో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.11.54 లక్షల కోట్లు. జీఎస్‌డీపీలో రాష్ట్రం 19.1 శాతం వృద్ధిని నమోదు చేసింది.  2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో జీఎస్‌డీపీలో తెలంగాణ ఐదేళ్లలో 11.4 శాతం సీఏజీఆర్‌ (కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌) సాధించింది. ఇదే సమయంలో దేశంలో 8.5 శాతం సీఏజీఆర్‌ను మాత్రమే సాధించింది.  ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే 2014-15 నుంచి 2021-22 మధ్యకాలంలో తెలంగాణ జీఎస్‌డీపీ 128.3 శాతం వృద్ధి చెందగా, ఇదే కాల వ్యవధిలో దేశం 89.6 శాతం వృద్ధి మాత్రమే సాధించింది.

తలసరి ఆదాయం రూ.2,78,833

రాష్ట్ర జీఎస్‌వీఏ (గ్రాస్‌ స్టేట్‌ వాల్యూ అడిషన్‌) 2021-22లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 18.3 శాతం, పారిశ్రామిక రంగం వాటా 20.4 శాతం, సేవా రంగం వాటా 18.3 శాతంగా నమోదైంది. 2021-22లో జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం కాగా, రాష్ట్ర అవతరణ నాటి నుంచి ఒక శాతం పెరిగింది. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,78,833 కాగా జాతీయ స్థాయిలో రూ.1,49,848 మాత్రమే. 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమే కావడం గమనార్హం. 2014-15 నుంచి 2021-22 మధ్యకాలంలో తెలంగాణ తలసరి ఆదాయంలో 124.7 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి 72.9 శాతం మాత్రమే.   ఇలా పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నది.