తెలంగాణ జాతి గర్వించేలా జరిగిన వజ్రోత్సవ వేడుకలు

తెలంగాణ రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగిడిన రోజైన సెప్టెంబరు 17వ తేదీని పురస్కరించుకుని జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ మేరకు సెప్టెంబరు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు రాష్ట్రమంతటా అంగరంగ వైభవంగా జరిగాయి. వజ్రోత్సవ వేడుకల్లో తొలిరోజు 16వ తేదీన ప్రజలు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీ, మున్సిపల్‌ ఛైర్మన్‌లు, ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు 119 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో జాతీయ పతాకాలతో ప్రదర్శనలు నిర్వహించారు. రెండవ రోజైన 17వ తేదీన జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. చివరి రోజైన 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. 

మొదటి రోజు కార్యక్రమాలు..

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అట్టహాసంగా జరిగాయి.రాజధాని నగరం హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ, సి.ఎస్‌ సోమేశ్‌ కుమార్‌లు పాల్గొన్నారు. తెలంగాణా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో అత్యంత ఉత్సాహంగా జాతీయ సమైక్యతా ర్యాలీలు జరిగాయి. ఆయా నియోజక వర్గాల్లో సంబంధిత జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, మున్సిపల్‌ ఛైర్మన్‌లు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ పతాకాలను ధరించి కొనసాగిన ఈ ర్యాలీలు కన్నుల పండగగా జరిగాయి. అనంతరం ఆయా నియోజక కేంద్రాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించి భారత యూనియన్‌లో హైదరాబాద్‌ సంస్థానం కలయికకు దారితీసిన పరిస్థితులు, అనంతర కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పై సంబంధిత ప్రజాప్రతినిధులు వివరించారు. అనంతరం, అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన సామూహిక భోజనాలలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

పీపుల్స్‌ ప్లాజాలో పాల్గొన్న మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ, సి.ఎస్‌. సోమేశ్‌ కుమార్‌ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్బంగా ఎన్టీఆర్‌ మార్గ్‌ ఐమాక్స్‌ నుండి పీపుల్స్‌ ప్లాజా వరకు నిర్వహించిన సమైక్యతా ర్యాలీలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, మహమూద్‌ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయ లక్ష్మి, జీహెచ్‌ ఎంసీ కమీషనర్‌ లోకేష్‌ కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌, పలువురు కార్పొరేటర్లు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనంతరం పీపుల్స్‌ ప్లాజా లో జరిగిన బహిరంగ సభలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ, తెలంగాణాకు నిజమైన స్వతంత్రం సెప్టెంబర్‌ 17 నే వచ్చిందని అందుకోసమే దీనిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవమైన గణేష్‌ నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకున్నామని, ప్రశాంతమైన హైదరాబాద్‌ నగరంలో శాంతి భద్రతల పరిస్థితిని దెబ్బతీసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ సచివాలయానికి భారత రత్న బీఆర్‌ అంబేద్కర్‌ పేరుపెట్టడం ద్వారా సీ.ఎం. కేసీఆర్‌ పేరు చరిత్రలో చిరస్థాయిగా  నిలిచిపోతుందని చెప్పారు.

రాష్ట్ర హోమ్‌ మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ, ‘సెప్టెంబర్‌ 17 చాలా ముఖ్యమైన రోజు. అంతకు ముందు నిజాం ప్రభుత్వం ఉండేది. మిగతా ప్రాంతాల్లోలా మనకు అంత సులభంగా స్వాతంత్య్రం రాలేదు. పెద్ద ఉద్యమం…చాలామంది ప్రాణాలు కోల్పోయాక మనకు స్వాతంత్య్రం వచ్చింది. నిజాం మంచి రాజు… భారతదేశంలో హైదరాబాద్‌ విలీనం కావాలని నెహ్రూకు లేఖ రాశారు. ఖాసీం రజ్వీ లాంటి వాళ్ళు వ్యతిరేకించినా ఆయనను జైల్లో పెట్టి స్వాతంత్య్రం ఇచ్చారు. దేశానికి గాంధీ ఎలాగో…తెలంగాణ కు గాంధీ కేసీఆర్‌. మన మన తెలంగాణ మోడల్‌ దేశానికే ఆదర్శం’  అని పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ, తెలంగాణలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు జరుపుతున్నాం. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం.  ఒక్క అసెంబ్లీ నియోజక వర్గంలో 15 వేల మంది ర్యాలీలో పాల్గొంటున్నారు. సెప్టెంబర్‌ 17 అందరికీ అవగాహన కలగాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా పురోగతి సాధిస్తోంది’ అని తెలిపారు.

DCIM\100MEDIA\DJI_0299.JPG

ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ, నూతన సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టడంతో.. కేసీఆర్‌ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. పార్లమెంట్‌ కు కూడా అంబేద్కర్‌ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని అన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం, మంత్రులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరైన వారితో కలసి సామూహిక భోజనాలు చేశారు.

రెండవ రోజైన 17వ తేదీన ఉదయం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. పబ్లిక్‌గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం రాజధాని హైదరాబాద్‌ నగరంలో నిర్మించిన కొమురం భీం ఆదివాసీ ఆత్మగౌరవ భవనం, సేవాలాల్‌ బంజార ఆత్మగౌరవ భవనాలను ప్రారంభించారు. అక్కడ ప్రసంగించారు. అనంతరం నెక్లెస్‌ రోడ్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం మీదుగా ఎన్టీఆర్‌ స్టేడియం వరకు ఆదివాసీ, గిరిజన కళారూపాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన ఆదివాసీ, గిరిజనుల ఆత్మీయ సమ్మేళనం, బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 

మూడవ రోజైన 18వ తేదీన రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాలతో పాటు, రాజధాని నగరం హైదరాబాద్‌లోను వివిధ సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించారు. కవులు, కళాకారులను సన్మానించారు. మొత్తంగా మూడు రోజులు రాష్ట్రమంతటా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అత్యంత వైభవంగా జరిగి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటిచెప్పాయ నడంలో అతిశయోక్తి లేదు.