నృసింహ ఆలయాలకు నెలవు తెలంగాణ
By: శ్రీ కన్నెకంటి వెంకట రమణ
- తెలంగాణలో 176 నారసింహ క్షేత్రాలు

తెలంగాణా…. అత్యంత పురాతన వంశాలుగా భావించే శాతవాహనులు, ఇక్ష్వాకులు పరిపాలించిన రాజ్యం ఇది. ఇవే కాకుండా పురాణాలూ, ఇతిహాసాలలో పేర్కొన్న ఎన్నో ఆలయాలు, సంస్కృతులకు నిలయంగా ఉంది ఈ తెలంగాణా ప్రాంతం. బౌద్ధం, జైనం,శైవం, వైష్ణవంలతో పాటు ప్రకృతి ఆరాధకులుగా శాక్తేయ దేవతలను, గ్రామ దేవతలను కూడా సమాన స్థాయిలో ఆరాధించారు. ఈ క్రమంలో నరసింహ తత్వాన్ని కూడా సమాన స్థాయిలో ఆరాధించారు.
ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలో 11వ శతాబ్దకాలం నుండే నారసింహ ఆలయాలున్నాయి. ఈ నారసింహ క్షేత్రాల గురించి పురాణాలలోనూ ప్రస్తావన కన్పిస్తుంది. ఒక్క తెలంగాణాలోనే పురాతనమైనవిగా భావించే 176 నారసింహ క్షేత్రాలున్నాయంటే, ఈ తెలంగాణ గడ్డలో నారసింహ తత్వాన్ని అనుసరించడం ఎంత బలంగా ఉందో దీనిని ఉదాహరణగా చెప్పవచ్చు. వాయుపురాణం, బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, మత్స్య, హరివంశ, కూర్మ పురాణం, అగ్ని పురాణం, పద్మ పురాణంలతో పాటు మరికొన్ని ప్రాచీన పురాణాలలో నారసింహ తత్వాన్ని ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్రంలో 11వ శతాబ్దం నుండి 17 శతాబ్దం వరకు నారసింహ ఆధ్యాత్మిక ధోరణులను పెద్ద ఎత్తున ఇక్కడి ప్రజానీకం ఆరాధించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నారసింహ ఆరాధకులు అధికంగా ఉన్నందున పెద్ద ఎత్తున నారసింహ క్షేత్రాలున్నాయి. మన పొరుగు రాష్ట్రమైన ఒరిస్సాలో జగన్నాధ ఆరాధకులు అధికంగా ఉన్నారు.
ఇక, తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలలో ఉన్న 176 నారసింహ ఆలయాలను పరిశీలిస్తే ఒక్క కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా 35 నారసింహ ఆలయాలున్నాయి. దీని తర్వాత నల్లగొండ, వరంగల్ జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో 27 నారసింహాలయాలున్నాయి. వీటితర్వాత, మహబూబ్నగర్ జిల్లాలో 19, మెదక్ జిల్లాలో 17, హైదరాబాద్ జిల్లాలో 14, నిజామాబాద్లో 14, ఖమ్మం జిల్లాలో 11, ఆదిలాబాద్ జిల్లాలో 7, రంగారెడ్డి జిల్లాలో 5 నృసింహా ఆలయాలున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన నృసింహాలయాలుగా పేర్కొనే వాటిలో ప్రధానంగా ..నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట, మట్టపల్లి, అర్వపల్లి, వాడపల్లి, కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి, వరంగల్ జిల్లాలోని కొడవటంచ, మల్లూరు, నిజామాబాద్ జిల్లాలోని భీంగల్, చుక్కిపురలున్నాయి.
తెలంగాణలో అత్యంత పురాతన నారసింహ ఆలయంగా నల్లగొండ జిల్లాలోని వాడపల్లి లోఉన్న నరసింహా ఆలయాన్ని భావిస్తారు. ఇది, 7వ శతాబ్దంలో నిర్మించారని శాసనం ద్వారా స్పష్టమవుతోంది.. ఇక్కడి ఆలయంలోని స్తంభంపై కన్నడ, ప్రాకృత లిపిలో ఉన్న శాసనం అనుసరించి ఈ ఆలయం తెలంగాణలో ఉన్న అతి ప్రాచీనమైన నారసింహాలయం అని భావిస్తున్నారు.
ఆలంపూర్లోని శివబ్రహ్మ ఆలయంలోని దక్షిణ భాగంలోని కుడ్యాలపై నరసింహ, హిరణ్యాక్ష శిల్పాలున్నాయి. 7-8 శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు. 10వ శతాబ్దం ప్రథమాబ్దములో ధర్మపురిలో లక్ష్మి, నరసింహాలయాన్ని నిర్మించారు.
వరంగల్ జిల్లా మంగపేట మండలం మల్లూరు గుట్టల్లో ఉన్న మల్లూరు నరసింహ స్వామి ఆలయానికి ప్రత్యేకత ఉంది. దట్టమైన అడవుల మధ్య గుట్టపై నిలువెత్తు విగ్రహముంది. తల సింహంలాగా, శరీరం మానవాకృతి మాదిరిగా ఉంటుంది. ఉగ్రరూపంలో ఉన్న ఈ మల్లూరు విగ్రహం బొడ్డు సమీపంలో మెత్తగా ఉంటుంది. మల్లూరు నరసింహ స్వామిని దేశంలోనే అరుదైనదిగా భావిస్తారు.

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో 11వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు పెద్దగా నరసింహా ఆలయాలు నిర్మాణం లేదా వెలువడలేదు. దీనికి కాకతీయుల పాలన అనంతరం తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలు ముస్లిం పాలకుల చేతుల్లోకి వెళ్లడం ఒక కారణంగా చెప్పవచ్చు. గోల్కొండ రాజులైన కుతుబ్ షాహీల హయాంలో మహ్మద్ కులీ కుతుబ్షా, అబ్దుల్లా కుతుబ్షా, అబ్దుల్ హాసన్ తానీషాలు హిందూ మతానికి స్వేచ్ఛ నివ్వడంతో నారసింహాలయాలు నిర్మితమయ్యాయి. 1687లో గోల్కొండ పతనం తర్వాత ఔరంగాజేబ్ హయాంలో ఆయన అనుచరుడు, హైదరాబాద్ సుబేదార్గా ఉన్న రుస్తుం దిల్ఖాన్ ధర్మపురి ఆలయాన్ని 1693లో మసీదుగా మార్చాడట. కాకతీయుల హయాంలో గణపతి దేవ మహారాజు నృసింహతత్వ వ్యాప్తికి కృషి చేశారు. ముసునూరి, రేచర్ల నాయకుల కాలంలోనూ నారసింహ తత్వం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక, 1724లో నిజాం ఉల్ ముల్క్ దక్కన్ రాజ్య పగ్గాలు చేపట్టడంతో తిరిగి నరసింహ తత్వం ప్రాణం పోసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 176 నారసింహ క్షేత్రాలు ఉమ్మడి జిల్లాలవారీగా వివరాలు
ఆదిలాబాద్ జిల్లా – క్కలవా (నిర్మల్), బైంసా, ద్వారకా (లక్సెట్టిపేట), కాసిపేట, మండవల్లి, దిల్దార్ నగర్, ఖానాపూర్.
హైదరాబాద్ జిల్లా – అహోబిల్ మఠ్ (బాగ్ అంబార్ పేట్), నరసింహ మందిరం (సుల్తాన్ బాజార్), లక్ష్మి నరసింహ స్వామి మందిర్ (మార్వాడి బస్తి, బేగం బాజార్), నర్సింగ్ మందిర్ (బేగం బజార్), పారిఖ్ నర్సింగ్ మందిర్ (కోస్లీ వాడి, బేగంబజార్), నర్సింగ్ మందిర్ (కసరట్టా, చార్మినార్ చౌక్), నర్సింగ్ భాను టెంపుల్ (కబూతర్ ఖానా), లక్ష్మి నర్సింహా టమోలే (కుమ్మరివాడి, ముస్తాక్ పురా), నరసింహ ఆలయం (చిలకల గూడా), లక్ష్మి నరసింహ స్వామి ఆలయం (చైతన్యపురి). సికిందరాబాద్ ప్రాంతంలో నరసింహ స్వామి టెంపుల్ (కింగ్స్ వే), నరసింహ స్వామి టెంపుల్ (నాలా బజార్), నర్సింహా ఆలయం (మహంకాళి స్ట్రీట్), నరసింహ ఆలయం (జీరా).
కరీంనగర్ జిల్లా – నరసింహులు పల్లె, నాగుల మల్యాల, ఎలగందుల, బెజ్జంకి, శనిగరం, చెర్లాపూర్, చెర్ల భోతిపూర్, కూరెళ్ల, రామంచ, నల్లగొండ, గన్నవరం, సిరిసిల్ల ప్రాంతంలోని నల్లగొండ, నాంపల్లి, తాంసీళ్లపల్లి, మెట్పల్లి ప్రాంతంలోని మేడిపల్లి, వెల్లుల్లి, పొగర్ల, దుంపేట. జగిత్యాల డివిజన్లలోని తుంగూర్, బీర్పూర్, చెర్ల కొండాపూర్, గోపాల్పూర్, చిన్ని పురం, లింగా పురం, గౌరాపురం, నెమలికొండా, ధర్మపురి. సుల్తానాబాద్ డివిజన్లో రాఘవాపురం, కుదురుపాక, సుందిళ్ల, పెద్దాపూర్, మూలసాల, నిమ్మకపల్లి. హుజురాబాద్ ప్రాంతంలోని బిజిగిరి షరీఫ్, రత్నగిరి ఆలయాలున్నాయి.
ఖమ్మం జిల్లా – ఖాయమా, నాగులవంచ, పాతర్ల పాడు, ముదిగొండ, యడవల్లి, లచ్చగూడెం, కంబాల పాళీ, రంపాడు, పుల్లూరు, కాచవరం, మీనవోలు. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ పట్టణం, ఇప్పటూరు, కోయిల కొండా, కొందుర్గ్, కంసానిపల్లె, బైరుఖాన్పల్లి, శాంతాపూర్, తలకొండ పల్లి, భైరాంపల్లి, మామిళ్ళ పల్లి, సింగవటం (సింగోటం), వట్టెం, యెండ బెట్ల, పెద్ద పల్లె, వనపర్తి, కేతవరం, అలంపూర్, మాగనూర్.
మెదక్ జిల్లా – సంగారెడ్డి, రామేశ్వర్ బాండ, ఊట్ల, షేర్ఖాన్ పల్లె, పెద్ద చింతకుంట, సికిందలాపూర్, రామయం పేట, కొండాపూర్, హస్తాల పూర్, దిలాల్ పూర్, అంగడి కేసులాపూర్, వెల్లూర్,కూచారం, నాచారం, ఘణపురం, గుర్రాలగొంది. పుల్లూరు.
నల్లగొండ జిల్లా – కొమ్మేపల్లి, శాపల్లి, మెల్ల దుప్పలపల్లి, కొండాపూర్, గొట్టిపర్తి, కుక్కడం, తుంగతుర్తి, అర్వపల్లి, కందగట్ల, ఉర్లుగొండ, సిరికొండ, చందుపట్ల, రేపాల, మట్టపల్లి, సల్కనూర్, వాడపల్లి, సారంపెట, ఏరుగొండ్ల పల్లి, మదనాపూర్, తుంగపాటి గౌరారం, ఇబ్రహీంపూర్, యాదగిరి పల్లె (యాదగిరి గుట్ట, పెద్ది రెడ్డి గూడా (దాతార్ పల్లె), బిజిల్లా పూర్, వెంకటాపూర్, కక్కిరేణి.
నిజామాబాద్ – నిజామాబాద్ టౌన్, ధరిపల్లి, బినోలా, మాణిక్ చందర్, ఆర్మూర్, జలాల పూర్, నాగపూర్, చౌటుపల్లె, భీంగల్, బాల్కొండ, చుక్కాపూర్, మద్నూర్, కొప్పెర, జానకం పేట.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్, మూసాపేట, ఇబ్రాహీం పట్నం, రావిర్యాల్, కొంగర కలాన్.
వరంగల్ జిల్లా ఊరుగొండ, కొమ్మాల, గీసుకొండ, వేల్పుగొండ, చిల్పూర్, వర్ధన్నపేట, హన్మకొండ, చిన్న పెండ్యాల, కక్కిరాల పాళీ, కొత్తూరు,ఇల్లందు, కొడవటంచ, గంగారాం, మల్లూరు.
దేశంలో తొలినాళ్లలో జీవన విధానాన్ని ప్రభావితం చేయడంలో మతం కీలక పాత్ర వహించింది. అనేక, మతాలున్నప్పటికీ నారసింహ తత్వం ప్రాధాన్యం పొందింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నారసింహ క్షేత్రాలున్నప్పటికీ ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 35 నారసింహ క్షేత్రాలున్నాయి. కరీంనగర్ జిల్లాలోని నరసింహులు పల్లెలో పంచ ముఖ నరసింహ స్వామి విగ్రహం ఒక పెద్ద రాతిపై చెక్కి ఉంది. 16 చేతులు గలిగిన ఈ విగ్రహం లాంటిది మరెక్కడా లేకపోవడం విశేషంగా చెప్పవచ్చు. మొత్తానికి, నరసింహ తత్వం తెలంగాణాలో ఎంతగా ప్రభావితం చూపిందంటే, ప్రతీ పది మందిలో కనీసం ఒకరైన యాదగిరి లేదా నరసింహ అనే పేరు కలిగివుంటారు.