ఈవీ కేంద్రం తెలంగాణ : మంత్రి కేటీఆర్
- జహీరాబాద్‌లో ఈవీ పార్కు ప్రారంభం : రూ.50 కోట్ల పనులకు శంకుస్థాపన

తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈవీ, ఎనర్జీ స్టోరేజీ పాలసీని తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ఈ పాలసీ అత్యుత్తమంగా ఉండడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల స్థాపనకు తెలంగాణనే ఎంచుకుంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ పార్కును కేటీఆర్ ప్రారంభించారు. జీరో 21 ద్వారా ఉత్పత్తి చేసిన ఎలక్ట్రిక్ బైక్, త్రీవీలర్లను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు కేంద్రంగా మారుతున్నదన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వచ్చిందని, ఈవీల ఉత్పత్తి, వాడకం పెరుగుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీతో జహీరాబాద్‌లో ఎంజీ పరిశ్రమ ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేస్తున్నదని వెల్లడించారు. నిమ్జ్‌కు ట్రైటాన్, వన్‌మోటో లాంటి ఎలక్ట్రిక్ వాహన తయారీ పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. త్వరలో మహీంద్రా కంపెనీ సైతం ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల ఉత్పిత్తిని ప్రారంభించనున్నదని వివరించారు. భవిష్యత్తులో ఇతర ఎలక్ట్రిక్ వాహన తయారీ పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెడతాయని అన్నారు. జహీరాబాద్ ఆటోమొబైల్ హబ్‌గా మారుతున్నదని చెప్పారు.

దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ ఫెసిలిటీ సెంటర్
ఆగస్టులో హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించననున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. ఇక్కడి పరిశ్రమలో ఆ కంపెనీ 3 లక్షల ట్రాక్టర్లను ఉత్పత్తి చేసింది. అనంతరం మహీంద్రా కంపెనీలో తయారైన మూడో లక్ష ట్రాక్టర్‌ను మంత్రి కేటీఆర్ మార్కెట్లోకి విడుదల చేశారు.
జహీరాబాద్ అభివృద్ధికి నిధులు
జహీరాబాద్ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. జహీరాబాద్‌లో కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.66 కోట్ల నిధులు ఇస్తున్నట్టు ప్రకటించారు. జహీరాబాద్‌లో ట్యాంక్ బండ్ నిర్మాణానికి నిధులు ఇస్తామని పేర్కొన్నారు.
భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉద్యోగ కల్పన
తెలంగాణ ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టే ప్రభుత్వం కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జహీరాబాద్ నిమ్జ్‌లో భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటామని తెలిపారు. రైతులకు మెరుగైన పరిహారం అందజేస్తామని, వారి కుటుంబాల్లోని యువకులకు నిమ్జ్‌లో ఉద్యోగాలు వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. జహీరాబాద్‌లోని స్థానిక యువతకు ఉపాధి లభించేలా జహీరాబాద్‌లో ‘అబ్దుల్ కలాం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఐటీఐ, పదో తరగతి చదివిన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి నిమ్జ్, మహీంద్రా, ఈవీ పార్కు తోపాటు ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించేలా చూస్తామని వెల్లడిరచారు. నిమ్జ్ నిర్వాసితుల భవిష్యత్తుకు భద్రత ఇచ్చేలా చర్యలు తీసుకొంటామని భరోసా ఇచ్చారు. రైతులకు తగిన పరిహారంతోపాటు అదనపు సహాయం అందేలా చూడాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్‌ను మంత్రి ఆదేశించారు.
వెమ్ టెక్నాలజీస్‌కు శంకుస్థాపన
అంతకుముందు, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చీలపల్లిలో నిమ్జ్‌లో ఏర్పాటవుతున్న తొలి పరిశ్రమ వెమ్ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో 12,635 ఎకరాల్లో నిమ్జ్ ఏర్పాటు అవుతున్నదని చెప్పారు. వెమ్ టెక్నాలజీస్‌కు కోరిన మేరకు భూములు, రాయితీలు ఇచ్చామని, పరిశ్రమ ఏర్పాటు అనంతరం స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కంపెనీని కోరారు. పరిశ్రమకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల అభివృద్ధికి చేయూతనివ్వాలని అన్నారు.

మంత్రి కేటీఆర్ పర్యటనలో ఎంపీలు బీబీ పాటిల్, కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, యాదవరెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతారెడ్డి, కార్మికుల సంక్షేమ ఛైర్మన్ దేవేందర్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ శివకుమార్, వెమ్ టెక్నాలజీస్ ఛైర్మన్ వెంకటరాజు, పద్మజా గ్రీన్ టెక్ సీఈవో అమిత్‌రెడ్డి, మహీంద్రా ప్లాంట్ హెడ్ రాయ్, ఎంజీ గ్రూప్ ఎండీ అమిత్ కామత్ తదితరులు పాల్గొన్నారు.