తెలంగాణ కళల తావు తిరుమల రావు

By: డా. ద్యావనపల్లి సత్యనారాయణ

ఏ ప్రాంతపు ప్రత్యేకతనైనా ఆ ప్రాంతపు సాంస్కృతిక వైవిధ్యాన్ని బట్టి ఉంటుంది. సంస్కృతి అంటే స్థూలంగా లలిత కళల సమాహారం. లలిత కళల్లో సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రం, శిల్పం ముఖ్య భూమికను పోషిస్తాయి. ఇవి ప్రాక్‌ చారిత్రక యుగాలలో పుట్టి అనేక చారిత్రక యుగాలలో వికసించి, రాజ పోషణకు నోచుకుని ఇంకా అక్కడక్కడా ఆశ్రిత కులాలు, గిరిజనులలో మిణుకు మిణుకుమంటున్నాయి. అయితే ఆధునిక యుగ వైపరీత్యంలో పడి కొట్టుకుపోతున్నాయి. వాటిని ఒడిసి పట్టుకుని ఒడ్డుకు చేరుస్తున్నవారు జయధీర్‌ తిరుమలరావు.

వారు గత నాలుగు దశాబ్దాలుగా జానపద సాహిత్యాన్ని సేకరించి, ప్రచురిం చడమే సాహిత్య లోకానికి తెలుసు గాని, వారి సాంస్కృతిక లోకం గురించి కొద్ది మందికే తెలుసు. ఇప్పుడు… రెండేళ్ళ కిందట వారు ‘మూల ధ్వని’ పేరిట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రదర్శించిన సంగీత వాయిద్యాల ద్వారా … ఈ ఆగస్ట్‌ మొదటి పక్షంలో ‘ఆద్యకళ’ పేరిట రాష్ట్ర కళా ప్రాంగణం (స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ) లో ప్రదర్శించిన గిరిజన, జానపద లలిత కళల ప్రదర్శన ద్వారా తెలుగు కళాభిమానులందరికీ తెలిసింది – తమకు ఎంతటి ప్రాచీనమైన, వైవిధ్య భరితమైన, వైభవోపేతమైన కళా సంస్కృతి ఉందో. ఈ ఆద్యకళ ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రులు సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు, రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌, ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు కె. శ్రీనివాస్‌, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్‌ తదితర పెద్దలెందరో హాజరయ్యారు. తిరుమలరావు సేకరించిన కళా సంపదను ప్రత్యేక మ్యూజియంలో పెట్టి భావి తరాలకు భద్రంగా అందిం చేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఆయా లలిత కళలు పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఏయే రూపాలు సంతరించుకున్నాయనేది ఒక్కొక్కటిగా చూసి నట్లయితే కింది విధంగా ఉంటుంది.

ఆది అక్షరం (లిపి, భాషా, సాహిత్యాలు):

ఆది మానవులు తొలి అక్షరాలను జంతువుల ఎముకలపై లిఖించారు. ఆ తరువాత వాటి చర్మాలపై లిఖించారు. అనంతరం చదునైన చెక్కల మీద, ఆ తరువాత తాళ పత్రాల మీద లిఖించారు. చివరగా కాగితాలపై రాయడం ప్రారంభించారు. సమాంతర కాలాల్లో ప్రధానంగా ప్రభువులు శిలల మీద, రాగిరేకుల మీద శాసనాలు రాయించారు.

ఈ చారిత్రక క్రమమంతా – అక్షరాలు పురుడు పోసుకుని, అనేక మార్పులకు లోనైన విధానం, వాటిని రాసిన ఘంటం, కలం తదితర సాధనాలు, సిరాలు, సిరా బుడ్లతో సహా – ఆది అక్షరం అనే గ్యాలరీలో ప్రదర్శించారు. ఈ అక్షరాలలో బ్రాహ్మీ మొదలుకొని తెలుగు, మరాఠీ, హిందీ, ఉర్దూ, అరబిక్‌, పర్షియన్‌ లిపులున్నాయి. ఆయా లిపుల్లో గొలుసు రాతలున్నాయి. అనేక రాత ప్రతులను విప్పి గోడలకు వేలాడదీయగా ఆయా గ్రంథాలు రెండు మనుషుల ఎత్తుతో సాగాయి. కొన్ని తాళపత్ర గ్రంథాలలో పలు చోట్ల కథా భాగాలను ఆకర్షణీయంగా వివరించడానికై వేసిన చిత్రలేఖనాలున్నాయి. ఆ తాళపత్రాల గ్రంథాలను భద్రపరచడానికి ఒక్కో గ్రంథానికి, కిందా మీదా వేసిన చెక్క పలకల మీద చిత్రలేఖనాలను వేశారు. ఈ గ్రంథాలను చదువు కోవడానికి చేయించుకున్న పీటలు, దాచుకోవడానికి చేయించుకున్న చెక్క పెట్టెలు, లోహపు పెట్టెలు, బండ్లు సాలంకృతంగా ఉన్నాయి. తాళ పత్రాలు, కాగితపు రాత ప్రతులలో భారతం, భాగవతం, పురాణ ఘట్టాలు మొదలు కొని అనేక యక్షగానాలున్నాయి. వాటిలో యెల్లమ్మ చరిత్ర, యాదవ / గొల్ల చరిత్ర, దేవగిరి చరిత్ర, కొల్లంపల్లి గ్రామ చరిత్ర, విశ్వపురాణం వంటి గ్రంథాలు అనేకంగా ఉన్నాయి. బమ్మెర పోతన వరంగల్‌ వాడు కాదు, ఒంటి మిట్టవాడు అని ఒక వాదన, శతాబ్దం క్రితమే బయలుదేరింది. దానిని ఖండిస్తూ ‘‘బమ్మెర పోతరాజు విజయము : వరంగల్‌- ఒంటిమిట్ట వివాద ఖండనము’’ అనే ఒక రాతప్రతి తిరుమలరావు గ్రంథ సంచయంలో ప్రముఖంగా కనిపిస్తున్నది.

ఆది చిత్రం :

ఆది చిత్ర గ్యాలరీ నిజంగా చిత్రమైనదే. ఇందులో రెండు కొలతల (పొడవు X వెడల్పు) చిత్రలేఖనాలు, మూడు కొలతల (పొడవు X వెడల్పు X ఎత్తు) చిత్ర లేఖనాలున్నాయి. మొదటివాటిని నూలు బట్టలపై చిత్రించగా రెండవ రకం చిత్రలేఖనాలను కట్టె బొమ్మలపై, కాగితపు ఉండలతో చేసిన బొమ్మలపై చిత్రించారు. ఇలాంటి చిత్రలేఖనాలను అనాది కాలం నుంచి నకాశి వారు వేస్తున్నారు. అయితే తిరుమలరావు సేకరించిన వాటిలో 1942, 1959 సంవత్సరాలలో వేసిన చిత్రలేఖనాలు కన్పిస్తాయి. ఆ కాలాల్లో నల్లగొండ జిల్లాలోని చిలుకూరు మండలంలో కొండాపురం గ్రామం, మిరియాలగూడెం తాలూకాలోని గోగువానిగూడెం నకాశి వారికి నిలయాలని చిత్రలేఖనాల మధ్యనున్న రాతలు తెలుపుతున్నాయి.

నూలు బట్టలపై చిత్రించిన కథాత్మక పటాలను ‘‘పటాలు’’ లేదా కాకిపడిగెలు అంటారు. వాటి ఆధారంగా కథలు చెప్తూ ఆడిపాడేవారిని కాకి పడిగెలవారు అంటారు. ఇవి సుమారుగా గజం వెడల్పుతో పది నుంచి ముప్పై గజాల పొడవు వరకు ఉంటాయి. కథా ఘట్టాలు చిత్రించిన ఈ పటాలను చుట్టగా చుడుతారు – మామూలు సమయాల్లో. తెలంగాణలో ఉన్న సుమారు పన్నెండు ఆశ్రిత కుల కళాకారులు వీటిని మెల్లిగా విప్పుతూ కథలు చెప్తారు. ఇలాంటి వారిలో ప్రధానమైనవారు మందెచ్చులవారు. వీరు యాదవులను ఆశ్రయించి వారి మందలు హెచ్చాలని కోరుతూ పటం ఆధారంగా కథా గాన నృత్యాలు చేస్తారు. ఆ పటం సామాగ్రిని భద్రపరుచుకునే పల్లకి వంటి యాదవ పెట్టెలో మల్లన్న దేవుడుంటాడు. గ్రామంలో ఒక సాందిరి కింద పటం కథలు చెప్తారు.

హరిజన, పురజనుల కథలు పటాలలో ఉంటే గిరిజనుల గాథలేమో కాకి పడిగెలలో చిత్రితమై ఉంటాయి. ప్రత్యేకించి కోయలవి. వీరికి సంబంధించిన మేడారం సమ్మక్క – సారలమ్మల చరిత్రలు, వారి గోత్రాల చరిత్రలు పడిగెలలో బట్ట బొమ్మలతో చిత్రితమై ఉంటాయి. ఈ పడిగెలు త్రిభుజాకారంలో ఉంటాయి. పడిగెలలో ఆయా గోత్ర వంశాలకు చెందిన సోదరుల బొమ్మలు, వారు సుదూర ప్రాంతాలకు వలసబోయిన చరిత్రలు, వారితో పాటు ప్రయాణించిన పశువులు, కుక్కలు, గుర్రాలు, చిలుకలు, ఏనుగులను ఎత్తుకెళ్ళే గండభేరుండ పక్షులు, వారు మేనమామగా భావించే హనుమంతుడు, అమ్మవారు, గంగాదేవి మొదలైన దేవతల చిత్రాలున్నాయి. కోయలు తమ వంశ చరిత్రను తెలిపే బొమ్మలను చెక్కిన ధర్మస్తంభాన్ని (స్మారక స్తంభం) కూడా పూజిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెలపై కూడా ఇలాంటి దారు స్తంభాలనే పూజిస్తారు. ఈ సందర్భంగా ఆట, పాటలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి దృశ్యాలతో తిరుమలరావు కలెక్షన్లో ఒక చతుర్భుజాకార పడిగె ఉంది. ఇలాంటి మరో పడిగెలో కోడిపుంజుల ఆట దృశ్యాలున్నాయి. క్రీ.శ. 13వ శతాబ్దంలోనే పాల్కురికి సోమనాథ కవి తన ‘పండితారాధ్య చరిత్ర’లో కథాగాన నాట్యాలను తోలు బొమ్మలు, చెక్క బొమ్మలను, తెర వెనుక ధారాల సహాయంతో ఆడించడం ద్వారా ప్రదర్శించే పద్ధతులు మనుగడలో ఉండేవని చెప్పాడు. అలాంటి అరుదైన బొమ్మలు తిరుమలరావు ప్రదర్శనలో చోటుచేసుకున్నాయి.

నకాశి వారు రకరకాల దేవతల శిరస్సులను చెక్కతో చేసి, వాటికి రకరకాల డిజైన్లతో రంగులద్ది ఆకర్షణీయంగా తయారు చేస్తారు. ప్రత్యేకించి నాయకపోడ్‌ గిరిజనులకు పంచ పాండవులు, లక్ష్మీ దేవర, కిట్టమూర్తి, సాంబమూర్తి, పోతరాజు, సింగబోయడు మొదలైన దేవతలు, చారిత్రక పురుషుల శిరస్సులను తయారు చేస్తారు. మందెచ్చులవారికైతేనేమో అమ్మవారు, కల్లుకుండలను, కొలువు దీరే బొమ్మలను తయారు చేస్తారు. ఇలాంటి బొమ్మల పలు సెట్లను తిరుమలరావు సేకరించి పెట్టారు. చినిగిపోయిన పడిగెలకు మరమత్తులు చేయించారు.

ఆది లోహ కళాకృతులు:

ఈ విభాగంలో ఇత్తడి, రాగి, కంచు, ఇనుము, కర్ర, వెదురు కాల్చిన మట్టి బొమ్మలు, పాత్రలు కనిపిస్తాయి. వీటిలో ఎక్కువ శాతం గిరిజన కళలకు సంబంధించిన డోక్రా లేదా ఓజ అనే హస్తకళలకు సంబంధించినవి. తెలంగాణ రాష్ట్రంలో కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో కేస్లాగూడ, ఊషగామ్‌, జంగామ్‌ అనే గ్రామాలలో ఉండే ఓజ గోండ్‌ అనే గిరిజనులు వీటిని తయారు చేస్తారు – లోహ పోత పద్ధతిలో. ఈ ఓజ హస్త కళలల్లో పశుపతి శివుని శిరస్త్రాణం (కిరీటం), దీపంతెలు, దూపంతెలు, గజ్జెలు, గంటలు, చారిత్రక వీరుల ముఖా కృతులు, జలకం అనే వేలాడే దీపాలు, అంగన్‌ దేవి పల్కి, ఆశ్వికులు, అశ్వాలు, ఎద్దులు, ఏనుగులు, కొలమానాలు తదితర పవిత్ర వస్తువులు ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటివే మట్టి బొమ్మలు చేసి వాటిని కొలిమిలో కాల్చి పవిత్ర పూజా వస్తువులుగా వాడుతారు. ఇలాంటివి కూడా చాలా తిరుమలరావు సంచయంలో దర్శనమిస్తాయి. వీటి ప్రతి రూపాలు ఇనుపవి మధ్య భారతంలో కన్పిస్తాయి. వాటినీ తిరుమలరావు సేకరించారు. కొండొకచో కర్రలో కూడా గొడ్డలి భుజాన వేసుకుని అడవికి వెళ్ళే గిరిజనుడి శిల్పం, గొడుగు పట్టుకున్న గోండు పురుషుడి శిల్పం, కోయ దంపతుల శిల్పాలు కనిపిస్తాయి.

కాకిపడిగెలవారు, మందెచ్చులవారు, కొర్రాజులవారు తదితర పటం కథకులు ఇత్తడి, రాగి లోహాలతో చేసిన తమ చిహ్నాలను తమ వెంట పవిత్ర వస్తువులుగా తీసుకు వెళ్తుంటారు. అలాంటి బొమ్మలలో కాకి, శంభులింగం, శూలాలు వంటివి ఉంటాయి. అలాంటి మౌలికమైన వస్తువులు కూడా తిరుమలరావు కలెక్షన్లో ఉన్నాయి.

ఇలా లలిత కళల్లో అన్ని కళలకు సంబంధించిన కళాకృతులు ఎన్నింటినో తిరుమలరావు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సేకరించారు – అదొక జీవన విధానం అనుకొంటూ. ఆయన దగ్గరున్న కళా సంపద తెలుగు వారి సాంస్కృతిక సంపద. అది కాలగర్భంలో కలిసిపోకుండా ఆయన కాపాడారు. ఆయనకు సహకరించినవారిలో ఆచార్య గూడూరు మనోజ ముందు వరుసలో నిలుస్తారు. వారి వస్తు సంచయ ప్రదర్శనలకు హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, రాష్ట్ర కళా ప్రాంగణం సహకరించాయి. ఇంకా ప్రజలు, పరిశోధకులు, ప్రభుత్వం వారి కృషిని అందిపుచ్చుకుని భావి తరాలకు అందించవలసిన పని మిగిలే ఉంది. శుభస్య శీఘ్రమ్‌.

ఆది ధ్వని (సంగీత పరికరాలు):

ఆది ధ్వని గ్యాలరీలో గిరిజనులు, హరిజనులు, పురజనులు, తెలంగాణకు వలస వచ్చిన విదేశీయులైన సిద్దీలు వాయించే వాయిద్యాలు ఎన్నో ఉన్నాయి. గిరిజనులో ఆంధ్‌ లు వాయించే టుయ్‌ టుయ్‌ న, మృదంగ్‌, గోండులు వాయించే డోల్‌, డప్పులు, గుమేల, మద్దెల, వెట్టె, వారిని ఆశ్రయించే పర్ధాన్‌ లు వాయించే తుడుం, పేప్రె, సన్నాయి, శృతి, కాలికొమ్‌, కింగిరి, వారిలాగే గోండులను ఆశ్రయించిన తోటీలు వాయించే కీకిరి, డహ్కి, కర్నాట్‌, కోయలు వాయించే పొడవాటి డోలా, డోలి, తూతకొమ్ము, కొండరెడ్లు వాయించే పొడవాటి ఔజం (డమరుకం వంటిది), నాయకపోళ్ళు వాయించే తప్పెట గూళ్ళు (పెద్ద డప్పులు), లంబాడీ భాట్‌లు వాయించే డపిడీలు (చిన్న డప్పులు), నంగారాలు, రబాబ్‌, సారంగి, ఎరుకల సోదమ్మ వాయించే ఏకతార, చెంచువారు వాయించే జేగంటలు, మెట్లకిన్నెరలు, ఊదనగోవులు ఎన్నో తిరుమలరావు సంచయంలో ఉన్నాయి. పది అడుగుల పొడవైన అరుదైన కోయ వాద్యం డోలా ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా కనిపించింది.

హరిజనులలో డుబ్బుల వాళ్ళు వాయించే డుబ్బు వాద్యంతో పాటు వారి పటం కోల / పలక, వీరగోల, పంబాలవారు వాయించే జమిడిక / జముకు, బుడిగ జంగాలు వాయించే శారద వీణ, బుడిగెలు తదితర వాయిద్యాలు ప్రదర్శనలో పెట్టారు.

పురజనులు – గ్రామీణులు – సాయంకాలాల్లో వీధుల్లో పాడుతూ సేదదీరుతున్నప్పుడు వాయించే మద్దెలలు, తాళాలు, హార్మోనియం, కంజీర వంటి వాయిద్యాలను కూడా ప్రదర్శించారు. అరుదైన వాయిద్యాలైన కంక బొంగు (రిమ్‌ జిమ్‌) వాద్యం, రెండు కట్టెల మధ్య మోగే గజ్జెల వాద్యాలు, గుజ్జిడి మొగ్గల వాద్యం, తాంబూర, పలు రకాల వీణలు, కడ్డీ తంత్రి, మెట్ల కిన్నెరలు, బూరలు, బాకాలు, తూర్యాలు, పేకలు, గోండ రుంజ, గాలి గ్రోవులు, గంటలు, గజ్జెలు, నగారాలు ఎన్నో సంగీత పిపాసుల మనసులను కొల్లగొట్టే విధంగా ప్రదర్శనలో కొలువుదీరాయి.

శతాబ్దాల క్రితం ఆఫ్రికా ఖండం నుంచి పశ్చిమ భారతం ద్వారా భాగ్యనగరానికి వచ్చిన సిద్దీల వాద్యం మార్ఫా, దాని శబ్దాలకు అనుగుణంగా నర్తిస్తున్నప్పుడు పట్టుకునే జంబియా కూడా ప్రదర్శనలలో కనిపించాయి.

సంగీత పరికరాలను వాయించేవారు, వాటి శబ్దాలకు అనుగుణంగా నర్తించే నర్తకులు ధరించే ఆహార్యం (వేష భూషణాలు) కూడా ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి.