|

అన్నింటా ఆదర్శం తెలంగాణ

tsmagazineగణతంత్ర దినోత్సవ సభలో గవర్నర్‌

అన్ని వర్గాల ప్రజల ఆశలను అక్షరాలా నెరవేరుస్తూ, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుకు వెళ్తోందని రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ లోని పరేడ్‌ మైదానంలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గవర్నర్‌ ప్రసంగిస్తూ, ఆవిర్భవించిన అనతికాలంలోనే ఆటంకాలు, సవాళ్ళను అధిగమించి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలియజేయడానికి తన కెంతో గర్వంగా, సంతోషంగా వుందన్నారు. అన్ని రంగాల్లో ఇదేతరహా ప్రగతిని సాధిస్తూ, త్వరలోనే బంగారు తెలంగాణ లక్ష్యానికి చేరుకోగలదన్న విశ్వాసం తనకున్నదన్నారు.

రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రం అవతరించిన 2014లో 6,574మెగావాట్లుగా ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి ఈరోజు 14,845 మెగావాట్లకు చేరిందని, త్వరలోనే రాష్ట్రంలో నిర్మిస్తున్న కొత్త విద్యుత్‌ ప్లాంట్ల ద్వారా 28,000 మెగావాట్ల లక్ష్యాన్ని సాధించి, రాష్ట్రం మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారనుందని అన్నారు. రాష్ట్రం ప్రభుత్వం అనుసరించిన వ్యూహం, విధానాలు, విద్యుత్‌ సంస్థ ఉద్యోగుల అంకితభావం వల్ల రాష్ట్రం ఏర్పడిన ఆరుమాసాలలోనే విద్యుత్‌ కోతలనుంచి రాష్ట్రాన్ని బయటపడవేయగలిగామని అన్నారు. ఈ రోజు రైతాంగానికి 24 గంటల నాణ్యమైన, అవాంతరాలులేని విద్యుత్‌ అందిస్తూ, రాష్ట్రం సగర్వంగా తలఎత్తుకొని నిలబడగలిగిందని గవర్నర్‌ ప్రశంసించారు.

పేదల సంక్షేమానికి, వ్యవసాయ రంగం అభివృద్ధికి, గ్రామీణ ప్రాంత ఆర్థిక ప్రగతికి, కనీస అవసరాల కల్పనలో, పారిశ్రామికాభివృద్ధిలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ పథకాల ఫలితాలు ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నాయి. నిరుపేదలు, ఆపదలో వున్నవారిని ఆదుకొనే లక్ష్యంతో సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 40,000 కోట్ల రూపాయలు వ్యయపరుస్తోందన్నారు.

38.87 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందజేస్తోందని, కుటుంబసభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి నిరుపేదకి 6 కిలోలవంతున సబ్సిడీ బియ్యం అందజేస్తోందని, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద 75,116 రూపాయలు అందజేస్తోందని, మొదట్లో ఎస్‌.సి, ఎస్‌.టి, మైనారిటీలకే పరిమితంగా వున్న ఈ పథకాన్ని బి.సి లకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా వర్తింపజేస్తోందన్నారు.

నిలువ నీడలేని నిరుపేదలు గౌరవప్రదంగా జీవించేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళను నిర్మించి ఇస్తోంది. వచ్చే ఏడాదిలోగా మొదటి దశగా 2 లక్షల 65 వేల ఇళ్ళు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా సాగుతోంది.
tsmagazine

2018-2019 బడ్జెట్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నదని చెపుతూ, 35 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన విషయాన్ని గవర్నర్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ ఏడాది నుంచి రైతులకు ఎకరానికి రెండు పంటలకూ కలిపి 8.000 రూపాయల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించనున్నది. ఈ పథకానికి అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి వుండే విధంగా రాష్ట్రప్రభుత్వం 2,638 మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించింది.

రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతోందని, సాగునీటి పథకాల సత్వర పూర్తికి బడ్జెట్‌లో ఏటా 25,000 కోట్లు కేటాయిస్తోందని చెప్పారు. అందుబాటులో వున్న ప్రతి నీటిచుక్కనూ వినియోగించుకోవడానికి వీలుగా 1.5 లక్షల కోల రూపాయల వ్యయంతో గోదావరిపై కాళేశ్వరం, సీతారామ వంటి ప్రాజెక్టులు, కృష్ణా నదిపై పాలమూరు ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులను నిర్మిస్తోందని గవర్నర్‌ తెలిపారు. కాళేశ్వరం ప్రాజక్టు పూర్తయితే, రాష్ట్రంలో అత్యధిక భూములకు సాగునీరు లభిస్తుందన్నారు. 46,000 చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్‌ కాకతీయ కార్యక్రమం విజయపథంలో సాగుతోంది. ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందించే మిషన్‌ భగీరథ కార్యక్రమం42, 000 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగింది.

ఆదాయ వనరులను పెంచేందుకు రాష్ట్రంలోని యాదవ, కురుమలకు 5,000 కోట్ల రూపాయలతో 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణాచేయడం జరుగుతోంది.7.61 లక్షల యాదవ, కురుమ కుటుంబాలకు కోటి 50 లక్షల గొర్రెలను పంపిణీచేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటి వరకూ 40 లక్షల గొర్రెలు పంపిణీచేశారు. చేపల పెంపకాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
tsmagazine

నాయీబ్రాహ్మణులు అత్యాధునిక సెలూన్లను ఏర్పాటుచేసుకొనేందుకు వీలుగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించో పథకాన్ని కూడా ప్రభుత్వం రూపొందించింది.

రాష్చ్రప్రభుత్వం చేనేత రంగానికి కూడా ప్రాధాన్యతనిస్తోంది. ఈ రంగాన్ని పటిష్టపరిచే చర్యలలో భాగంగా వరంగల్లులో కాకతీయ హాడ్‌ లూమ్‌ మెగా టెక్స్‌ టైల్‌ పార్కుకు శంకుస్థాపన కూడా చేసింది. రాష్ట్రంలో కె.జి నుంచి పి.జి వరకూ ఉచిత విద్యను అందించే లక్ష్యంలో భాగంగా గత మూడున్నరేళ్ళలో రాష్ట్రప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది.

రాష్ట్రంలో ఐ.టి రంగం గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. ఐ.టి ఎగుమతులలో 12 శాతం వృద్ధిని సాధించింది. దేశంలో నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అవకాశాలను అనుకూలంగా మలుచుకుంటూ, అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్‌ తెల్పారు.