|

అభివృద్ధి, సుస్థిర పాలనలో అగ్రగామి తెలంగాణ

అభివృద్ధి, సమానత్వం, సుస్థిరాభివృద్ధి విభాగాల్లో రాష్ట్రాలు సాధించిన ర్యాంకులను క్రోడీకరించి ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌ కేటాయించారు. ఈ ర్యాంకులు ఆయా రాష్ట్రాల పాలనా సమర్థతకు (గవర్నెన్స్‌) నిదర్శనంగా తెలిపింది. ఈ జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. గతేడాది గవర్నెన్స్‌ ర్యాంకింగ్‌లో తెలంగాణ ఆరో స్థానంలో నిలువగా ఏడాది కాలంలోనే మూడవ స్థానానికి ఎగబాకింది.

అభివృద్ధి, సుస్థిర పాలనలో అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. బెంగుళూరుకు చెందిన పబ్లిక్‌ అఫైర్స్‌ సెంటర్‌ నివేదికలో తెలంగాణ అభివృద్ధి, సుపరిపాలనలో ముందువరసలో ఉంది. గత సంవత్సరం నాలుగవ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఈ సారి దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నది. రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు మాత్రమే అవుతున్నా ఎన్నో రాష్ట్రాలను వెనక్కునెట్టి మొదటి స్థానాన్ని సంపాదించడం సీఎం కేసీఆర్‌ పరిపాలన దక్షతకు, ఆర్థిక వనరులు సమకూర్చడంలో ఉన్న ముందుచూపుకు అద్దం పడుతున్నది. కరోన కష్ట కాలంలో ఎన్నో రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా కొనసాగించింది. అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిలువరించలేదు. కరోనను నిరోధించడంలో కూడా నిబద్దతతో పనిచేసింది. సమర్థ పాలనలో దేశంలోనే మూడోస్థానం, సమానత్వ సూచీలోనూ గణనీయ వృద్ధి, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పలువురు ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానించారు. 

తెలంగాణ రాష్ట్రం వెనకబడ్డ ప్రాంతం కాదు, వెనక్కు నెట్టివేయబడ్డ ప్రాంతమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యమ సమయంలో పలుమార్లు ప్రస్తావించారు. ఆయన చెప్పినట్టే తెలంగాణ సమైక్య పాలనలో నిర్లక్ష్యం చేయబడి, ప్రత్యేక తెలంగాణ అయ్యాక ఎన్నో విషయాలలో గణనీయమైన అభివృద్ధి వైపు దూసుకుపోతున్నది. రాష్ట్రాలు ఏర్పడి ఆరు దశాబ్దాలు దాటిన వాటిని కూడా వెనక్కు నెడుతూ ఏడు సంవత్సరాల పసికూన తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా పాలన సాగిస్తున్నది. ఒక్కసారి తెలంగాణలో ఈ ఏడు సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని గణాంకాలలో చూసుకుంటే ఎంతటి సత్వర అభివృద్ధి జరిగిందో, ప్రజల జీవన ప్రమాణం ఏ విధంగా పెరిగిందో అవగతమవుతుంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు జీఎస్డీపీ రూ.4 లక్షల కోట్లు.. ఏడున్నర సంవత్సరాల తర్వాత అక్షరాలా రూ.9.80 లక్షల కోట్లు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు తలసరి ఆదాయం సుమారు రూ.95 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.2.37 లక్షలు. ఈ అంకెలు చూస్తుంటే రాష్ట్రంలో ఎవరి ఊహకందని అభివృద్ధి జరిగిపోతున్నదని అవగతమవుతున్నది. ఇలాంటి అభివృద్ధి చక్కటి పరిపాలనాదక్షుడైన పాలకుడు ఉంటేనే, అవినీతి రహితంగా పాలన సాగితేనే సాధ్యమవుతుందనేది స్పష్టమవుతున్నది. ఈ వృద్ధి రాజధానికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రమంతటా సమగ్రంగా కనిపిస్తున్నది. గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో మొదటి స్థానంలో, అన్ని రంగాల్లోను కనబరచిన పనితీరుకు మూడవ స్థానంలో, సుస్థిరాభివృద్ధిలో 5వ స్థానంలో, సమానత్వంలో 6వ స్థానంలో నిలి చింది. పరిశ్రమలను ప్రోత్సహించడానికి, పారిశ్రామిక వేత్తలకు అనుమతుల మంజూరీలో ఇబ్బందులు కలుగకుండా ఉండడానికి ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో టీఎస్‌ ఐపాస్‌ వంటి సంస్కరణలు తెచ్చింది. పలు రాయితీలు కల్పించింది. ఇలా పారిశ్రామిక రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం అభివృద్ధికి దోహదం చేస్తున్నది. రాష్ట్రంలో నిపుణులైన మానవ వనరులు ఉండటం, ప్రభుత్వం మౌలిక 

సదుపాయాలు కల్పించడంతో అభివృద్ధిలో తెలంగాణ ముందు వరుసలో నిలుస్తున్నది. ఇప్పటికే అనేక నివేదికలు దీనిని రుజువు చేశాయి. తాజాగా పబ్లిక్‌ అఫైర్స్‌ సెంటర్‌ ఇచ్చిన ర్యాంకింగ్స్‌, తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు మరో నిదర్శనంగా నిలిచింది. 

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సుపరి పాలనను పబ్లిక్‌ అఫైర్స్‌ ఇండెక్స్‌లో ఆ సంస్థ సంపూర్ణంగా విశ్లేషించింది. 43 అంశాలు, 14 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను పరిశోధన అంశాలుగా ఎంచుకున్నది. వీటన్నింటినీ 1) అభివృద్ధి (గ్రోత్‌), 2) సమానత్వం (ఈక్విటీ), 3) సుస్థిరాభివృద్ధి (సస్టెయినబిలిటీ) విభాగాలుగా విభజించింది. ఈ మూడు విభాగాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును అధ్యయనం చేసింది. రాష్ట్రాల ఆర్థిక, భౌగోళిక పరిమాణాన్ని బట్టి పెద్ద రాష్ట్రాలు (18), చిన్న రాష్ట్రాలు (11), కేంద్ర పాలిత ప్రాంతాలుగా (6) వర్గీకరించింది. పీఏసీ బృందాల సమగ్ర అధ్యయన నివేదికలన్నీ క్రోడీకరించి.. ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. ఇందులో అభివృద్ధి విభాగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సుస్థిరాభివృద్ధిలో 5, సమానత్వ సూచీలో ఆరో స్థానంలో నిలిచింది.

అభివృద్ధిలో మొదటి ర్యాంకు

మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, బడ్జెట్‌ కేటాయింపుల ఆధారంగా రాష్ట్రాల వృద్ధి సూచీని నిర్ధారించారు. ఒక రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఈ మూడు అంశాలు కీలకమని పీఏసీ పేర్కొన్నది. ఉత్తమ విద్యాసదుపాయాలు ఉన్నప్పుడే నైపుణ్యం గల మానవ వనరులు తయారవుతాయని, మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్య రంగాలను ఎంచుకొని నిధులు కేటాయించి, వాటిని సక్రమంగా వినియోగించినప్పుడే ఆ రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పింది. ఈ అంశాల్లో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచినట్టు సంస్థ తెలిపింది. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ పలు సందర్భాల్లో ‘తెలంగాణలో నైపుణ్యమున్న మానవ వనరులు, అద్భుతమైన మౌలిక సదుపాయాలున్నాయి’ అని పేర్కొంటారు. ఇవే తెలంగాణను పెట్టుబడుల ఆకర్షక కేంద్రంగా మార్చాయి. కేటీఆర్‌ వ్యాఖ్యలను ‘పీఏఐ-2021’ మళ్లీ ధృవీకరించింది.

మెరుగైన జీవన విధానం

రాష్ట్రంలో సమానత్వం పెంపొందించేలా, అన్ని వర్గాల ప్రజలను, అన్ని వయస్సుల వారిని ఆదుకొనేలా ప్రభుత్వం పథకాలు రూపొందించి అమలుచేసింది. ఈ విధానం ఆధారంగా పీఏసీ ‘ఈక్విటీ’ ర్యాంకింగ్స్‌ ఇచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, సంస్కరణలతో రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల ప్రజలు కూడా సంపాదన పరులుగా మారారు. దీంతో కొనుగోలుశక్తి పెరిగి ప్రజలు మెరుగైన జీవితాన్ని అనుభవించగలిగారు. దాంతో ఈ జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది.

పాలన సంస్కరణలు

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఏడేండ్ల కిందట ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు రచించి, అమలు చేస్తున్నారు. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు టీఎస్‌ఐపాస్‌ వంటి విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో విస్తృతంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. ఫలితంగా రాష్ట్రానికి ఏడేండ్లలో 11 వేలకుపైగా పరిశ్రమలు తరలిరాగా, దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సుమారు 13 లక్షల మందికి ఉపాధి లభించింది. ఐటీ, ఫార్మా రంగాల్లో దేశంలోనే టాప్‌ స్థానానికి చేరుకున్నది. 

మరోవైపు స్థానిక యువతకు ఉపాధి కల్పన, రాష్ట్రంలో నిపుణులైన మానవ వనరుల తయారీకి తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) వంటి సంస్థల ద్వారా లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ కృషిని గుర్తించి ఇప్పటికే అనేకమంది ఆర్థికవేత్తలు, నిపుణులు, వివిధ నివేదికలు ప్రశంసించాయి. ఈ విధంగా రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ తెస్తున్న పథకాలు, పాలనా సంస్కరణలు, ప్రాజెక్టులు, ఆదాయ వనరులు రాష్ట్రాన్ని ముందువరుసలో నిలబెడుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు.