|

ఆధ్యాత్మిక పర్యాటకానికి సరికొత్త చిరునామా

By: కన్నెకంటి వెంకట రమణ

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న తెలంగాణా రాష్ట్రం పర్యాటక రంగంలోనూ గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం ద్వారా రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ తెలంగాణాలో అనేక ప్రాంతాల్లోని చెరువులు నీటితో కళకళ లాడుతూ పర్యాటకులనూ ఆకర్షిస్తున్నాయి. ములుగు జిల్లాలోని సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని చారిత్రక కట్టడంగా యునెస్కో ప్రకటించడంతో అంతర్జాతీయ టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

వీటితోపాటు, విశ్వనగరమయిన హైదరాబాద్‌కు నలువైపులా టెంపుల్‌ టూరిజం అపూర్వ రీతిలో అభివృద్ధి జరిగి సరికొత్త పర్యాటకులను ఆకర్షించే అద్భుత నిర్మాణాలు తెలంగాణా కు అదనపు ఆకర్షణగా మారాయి.   వీటిలో ప్రధానంగా హైదరాబాద్‌-వరంగల్‌ మార్గంలో 50 కిలోమీటర్ల దూరంలో అద్భుత రీతిలో పునర్నిర్మితమైన యాదాద్రి లక్ష్మి నరసింహాలయం, దాదాపు 120  కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం కొత్తగా నిర్మించిన బుద్ధవనం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం, కొత్తూరు మండలం చేగూరుకు కొద్ది దూరంలో శ్రీ రామచంద్ర మిషన్‌ ఆధ్వర్యంలో నిర్మితమైన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం శాంతి కన్హా ఆశ్రమం, హైదరాబాద్‌కు దక్షిణ మార్గంలో శంషాబాద్‌ ముచ్చింతల్‌ వద్ద నిర్మించిన అతిపెద్ద రామానుజులవారి విగ్రహం, యునెస్కో ఇటీవల ప్రపంచ వారసత్త్వ సంపదగా ప్రకటించిన రామప్ప దేవాలయాలు ఇకనుండి దేశ విదేశాల్లోని హిందువులతోపాటు, సంస్కృతీ, సాంప్రదాయాలను ఇష్టపడే ఆధ్యాత్మిక  పర్యాటకులను ఆకర్షించనున్నాయి. ఇప్పటికే ఈ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలను పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు.

గత కొన్ని శతాబ్దాలకు ముందే, మహమ్మదీయులకు  చెందిన మక్కా మస్జీద్‌ తోపాటు ఎన్నో ప్రఖ్యాతమైన మసీదులు, దర్గాలు, పైగా, కుతుబ్షాహీ సమాధులు ఇప్పటికీ ప్రపంచవాప్తంగా ముస్లిమ్‌ మతానికి చెందిన వారిని పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. సుప్రసిద్ధ మెదక్‌ చర్చి తోపాటు అద్భుత పాశాత్యనిర్మాణ శైలితో నిర్మించిన హైదరాబాద్‌ లోని అత్యంత పురాతన చర్చిలు నిత్యం సందర్శకులతో సందడిగానే ఉంటాయి. హిందూ, బౌద్ధ, జైన, పారసీ… ఇలా, అన్ని మతాలకు చెందిన చారిత్రక కట్టడాలు కలిగిన రాష్ట్రంగా పర్యాటకపరంగా దేశంలోనే తెలంగాణాకు ప్రత్యేక స్థానం ఉంది. దీనికి ఉదాహరణ తెలంగాణను సందర్శిస్తున్న దేశ, విదేశీ పర్యాటకుల సంఖ్యే  నిదర్శనం.

తెలంగాణలో ప్రపంచ శ్రేణి  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు

యాదాద్రి  దేవాలయం ::   స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన  అతిపెద్ద దేవాలయం యాదాద్రి.  యాదాద్రిగా మారిన యాదగిరిగుట్ట రూపురేఖలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పంతో పూర్తిగా మారిపోయాయి.. పూర్తిగా కృష్ణ శిల అంటే నల్ల రాయితో నిర్మించిన ఏకైక ఆలయం ఇది. . యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి నూతన దేవాలయాన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించిన అనుభూతి కలిగేలా తీర్చిదిద్దారు. అలనాటి వైభవం, ఆధునిక పరిజ్ఞాన మేళవింపు ఈ నిర్మాణంలో కనిపిస్తుంది. రూ.1200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ చరిత్రలోనే కృష్ణ శిలలతో నిర్మించిన ఏకైక దేవాలయం.  ఈ పునర్నిర్మిత ఆలయాన్ని సందర్శించేందుకై దేశ విదేశాల్లోని హిందువులు పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం.

బుద్ధ వనం – నాగార్జున సాగర్‌

ప్రపంచంలోని అన్ని ప్రముఖ మతాలకు తెలంగాణా రాష్ట్రం చిరునామాగా ఉంది. దీనిలో భాగంగా బౌద్ధ మతం వెయ్యేలకన్నా పూర్వమే తెలంగాణా రాష్ట్రంలో విస్తృతంగా ఉంది. ఫణిగిరి, నందికొండ, ఏలేశ్వర, కోటిలింగాల, ధూళికట్ట తదితర ప్రాంతాల్లో బౌద్ధ స్తూపాలు, ఆరామాలు ఉన్నాయి. తెలంగాణాలో తిరిగి బౌద్ధ మత సంస్కృతికి మరింత విస్తృత స్థాయిలో వైభవం కల్పించేందుకు నాగార్జున సాగర్‌ లెఫ్ట్‌ బ్యాంక్‌ వద్ద 274 ఎకరాల్లో బౌద్ధవనం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. కృష్ణా నదీ తీరంవెంట నిర్మించిన ఈ బౌద్ధ వనం లో మొత్తం ఎనిమిది భాగాలున్నాయి. వీటిలో, బుద్ధ చరిత వనం, బోధిసత్వ పార్క్‌ – జాతక కథలు,  ధ్యాన వనం, మహాస్తూపం, బౌద్ధ విజ్ఞాన కేంద్రం, సాంప్రదాయ బుద్ధిస్ట్‌ చికిత్స కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ తదితర కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీలంక ప్రభుత్వం బహూకరించిన 27 అడుగుల ఎత్తుగల ధర్మగంట ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. పూర్తిగా బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే ఈ అంతర్జాతీయ బౌద్ధ కేంద్రం ప్రపంచశ్రేణి బుద్ధపర్యాటక ప్రాంతంగా ఇప్పటికే ప్రాచుర్యం పొందింది.

సమతా మూర్తి విగ్రహం:  శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌ లో సర్వాంగ సుందరంగా నిర్మించిన 216 అడుగుల శ్రీ రామానుజులవారి  సమతా మూర్తి విగ్రహం తెలంగాణకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.  ప్రపంచంలోనే అతిపెద్ద ఈ రామానుజుల విగ్రహ నిర్మాణంతోపాటు ఈ విగ్రహం చుట్టూ  108 దివ్యదేశాల (గర్భగుడి ఆకారంలో దివ్య క్షేత్రాలు) ఆలయాలనూ నిర్మించారు. ఈ ప్రాంగణంలో అడుగుపెడితే భక్తితో మనసంతా పులకిస్తుంది. ఇప్పటికే  ముచ్చింతల్‌ ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారింది.

కన్హా  శాంతి  వనం, ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రం

మానవ పరిణామానికి చిహ్నంగా ప్రపంచంలోనే విలక్షణమైన నిర్మాణ శైలితో శ్రీ రామ చంద్ర మిషన్‌ కన్హా శాంతి వనాన్ని రూపొందించింది.. అద్భుతమైన ఈ నిర్మాణంలో  ఒక సెంట్రల్‌ హాల్‌, ఎనిమిది సెకండరీ హాళ్లు ఉన్నాయి. ధ్యానకేంద్రం మొత్తం 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఒకేసారి లక్ష మంది అభ్యాసీలు ధ్యానం చేయవచ్చు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రపంచంలోనే ఈ అతి పెద్ద ధ్యాన మందిరాన్ని నిర్మించారు. 1945లో ఉత్తర్‌ ప్రదేశ్‌లో అప్పటి గురూజీ బాబూజీ మహరాజ్‌ శ్రీ రామచంద్ర మిషన్‌ అనే ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించారు. ధ్యాన సాధన ద్వారా తమ తమ జీవితాలను మెరుగు పరుచుకుందామని ఆకాంక్షించే వారందరికీ స్ఫూర్తి దాయకంగా ఉండేందుకు నిర్మించిన ఈ కన్హా ధ్యాన కేంద్రానికి దేశ విదేశాల నుండి వేలాదిగా అభ్యాసీలు సందర్శిస్తున్నారు