స్వీయపన్నుల రాబడిలో నెంబర్‌ వన్‌: ఆర్థికమంత్రి హరీష్‌రావు

స్వీయపన్నుల రాబడిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీష్‌రావు తెలిపారు. డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధికేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ఆదాయానికి సంబంధించి పలు విషయాలు గణాంకాలతో సహా వివరించారు. తెలంగాణ ఏర్పాటు జరిగాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల ద్వారా అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో దూసుకుపోతున్నదన్నారు. సొంత పన్నుల ఆదాయం ఆరేళ్లలో 90 శాతం పెరిగిందని మంత్రి తెలిపారు. వృద్ధిరేటు 11.52 శాతమని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా తెలంగాణ దరిదాపుల్లో లేదని స్పష్టం చేశారు. సంపద సృష్టించడంలో తెలంగాణకు సాటి ఎవరూ లేరన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిమితికి లోబడే జీఎస్డీపీలో 22.83 శాతం మాత్రమే అప్పులు తీసుకున్నామని మంత్రి వివరించారు. అయినా ప్రతిపక్షాలు కావాలని విమర్శలకు దిగుతున్నాయని ఆయన ప్రతిపక్షాల తీరును దుయ్యబట్టారు. జీడీపీలో రాష్ట్రం దేశంలో ఆరవ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 4 శాతం ఉన్న జీడీపీ ఇప్పుడు 5 శాతానికి  పెరిగిందన్నారు. జీఎస్‌డీపీలో రాష్ట్రం దేశంలో మూడవ స్థానంలో ఉందని, దక్షణాధిలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. తలసరి ఆదాయంలో దేశ సగటుకంటే 1.84 శాతం ఎక్కువ వృద్ధిని సాధించిదని పేర్కొన్నారు. కరోనా సంవత్సరాల్లోను రాష్ట్రం 2.4 శాతం వృద్ధిరేటు సాధించిందన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో తలసరి ఆదాయం విషయంలో పదోస్థానంలో ఉండగా, రాష్ట్రావతరణ తరువాత ఈ ఆరు సంవత్సరాల్లో ఇది మూడవ స్థానానికి చేరుకున్నదని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే 1.84 రేట్లు ఎక్కువగా ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో దేశం వృద్ధిరేటు 3.6 శాతం మాత్రమేనని, తెలంగాణ వృద్ధిరేటు 14.3 శాతమని తెలిపారు. తయారీ రంగంలో 72 శాతం, ఐటీ రంగంలో 120 శాతం వృద్ధి సాధించినట్లు మంత్రి వివరించారు. ఆరేళ్లలో ధాన్యం దిగుబడి 500 రేట్లు, పత్తి మూడు రెట్లు పెరిగిందని తెలిపారు. పరిశ్రమల రంగంలో 72 శాతం వృద్ధిరేటు నమోదైందని హరీష్‌ తెలిపారు. దళితబంధు విషయంలో మాట్లాడుతూ ఇది దళితులను అభివృద్ధిపథంలో పయనింపచేయడమే కాకుండా రాష్ట్రానికి ఆదాయాన్ని కూడా సమకూరుస్తుందన్నారు. వారు ఏర్పాటు చేసుకునే యునిట్లు, పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుందన్నారు. మల్లన్న సాగర్‌లోకి గోదావరి జలాలు రావడంతో రైతులకు సంపూర్ణంగా మేలు కలుగుతుందని ఆయన ఆకాంక్షించారు. 

ఉద్యోగ ఖాళీలపై నివేదిక సిద్ధం

ఉద్యోగ ఖాళీలపై నివేదిక సిద్ధమైందని, అన్ని జిల్లాలకు, ఉద్యోగులకు సమ న్యాయం జరిగేలా జోనల్‌ విధానంపై పరిశీలన జరుపుతున్నామని మంత్రి తెలిపారు. దీనిపై స్పష్టత వచ్చాక మంత్రి మండలికి సమర్పిస్తామని ఆయన తెలిపారు. అనంతరం నోటిఫికేషన్‌ జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.