విత్తనోత్పత్తికి తెలంగాణ అనుకూలం

కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్‌ చౌదరి

దేశంలో విత్తనాలు ఉత్పత్తి చేయడానికి అనువైన వాతావరణం తెలంగాణలోనే ఉంది. అందుకే దేశవ్యాప్తంగా 500కు పైగా విత్తనోత్పత్తి సంస్థలుంటే తెలంగాణలోనే 400కు పైగా ఉన్నాయి. తెలంగాణలో విత్తనరంగ అభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అభినందనలు అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి అన్నారు.

హైదరాబాద్‌ నోవాటెల్‌ లో అంతర్జాతీయ విత్తన సదస్సు (ఇస్టా) కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి ప్రసంగించారు. రైతాంగ అభివృద్ధికి, దేశ ఆహార భద్రతకు విత్తనమే కీలకమని, ఆసియాలో తొలిసారి అంతర్జాతీయ విత్తన సదస్సు భారతదేశంలో జరగడం గర్వకారణం అని, ప్రపంచంలోనే పత్తి విత్తనోత్పత్తిలో భారత్‌ది అగ్రస్థానం కాగా వరి, గోధుమ, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, కూరగాయలలో మేలైన విత్తనాల ఉత్పత్తి జరుగుతోందని ఆయన అన్నారు.

దేశంలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే, దేశం ఆర్థిక పరిపుష్ఠి సాధిస్తుందని, మారుతున్న పర్యావరణం, తరుగుతున్న సహజవనరుల నేపథ్యంలో వ్యవసాయ ఉత్పాదకత పెంచాలంటే నాణ్యమయిన విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చి సరఫరా చేయాల్సిన అవసరం ఉందని కైలాష్‌ చౌదరి అన్నారు. ప్రపంచంలో భారతీయ విత్తన పరిశ్రమ వేగంగా ఎదుగుతోందని, ఆసియా దేశాలలో తొలిసారి భారతదేశంలో విత్తన సదస్సు నిర్వహించడం గర్వకారణం అని, నాణ్యత గల విత్తనాలు అవసరం మేర రైతాంగానికి అందించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. దేశంలో వందకు పైగా వ్యవసాయ పరిశోధనా సంస్థలు, 60కి పైగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విత్తనాలు, పంటల అభివృద్ధిపై రైతులకు సహకారం అందిస్తున్నాయని, ఒక జాతీయ, 16 రాష్ట్ర స్థాయి విత్తన కార్పోరేషన్లు, 26 రాష్ట్ర విత్తన ధృవీకరణ ఏజన్సీలు, విత్తన లా ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అథారిటీ ద్వారా విత్తనాల నాణ్యత పరీక్షించడం జరుగుతుందని, 1966లోనే దేశంలో భారత విత్తన చట్టం రూపొందించుకుని నాణ్యమయిన విత్తనాలు రైతులకు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

దేశ విత్తన రంగంలో తెలంగాణది పెద్దన్న పాత్ర

భారతదేశ విత్తన పరిశ్రమలో తెలంగాణ పెద్దన్న పాత్ర పోషిస్తుందని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కృషితో గత ఐదేళ్లలో తెలంగాణ విత్తనోత్పత్తికి చిరునామాగా మారిందని, ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ ఎదిగేందుకు అంతర్జాతీయ విత్తన సదస్సు దోహదపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు.


సదస్సుకు ఆయన గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో ప్రైవేటు విత్తనరంగ సంస్థలకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తూనే, ప్రభుత్వ విత్తన రంగ సంస్థలను బలోపేతం చేస్తామని, నాణ్యమయిన విత్తనమే వ్యవసాయాభివృద్ధికి మూలం అని, విత్తన నాణ్యత, సరఫరా పెరిగేందుకు మరిన్ని పరిశోధనలు జరగాలని నిరంజన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న సంస్థలలో విత్తన పరిశ్రమ ఒకటి అని, ఆధునిక శాస్త్రీయతను విత్తనానికి ఆపాదించి నాణ్యమయిన విత్తనాలను రూపొందించాలని, తెలంగాణ నుండి ఏడాదికి 65 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు.

ఇప్పటికే విత్తనోత్పత్తికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, ఇప్పటికే ఓఈసీడీ (ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ & డెవలప్‌ మెంట్‌) విత్తన ధృవీకరణ వ్యవస్థ ద్వారా పలు దేశాలకు తెలంగాణ నుండి విత్తనాల ఎగుమతి కొనసాగుతోందని, ఐరోపా దేశాలకు కావలసిన విత్తనాలను దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయని, భారతదేశం నుండి విత్తనాలను ఎగుమతి చేసేందుకు అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకున్నామని, త్వరలోనే దీనికి సంబంధించిన అనుమతులు రాగానే తెలంగాణ నుండి విత్తనాలను ఎగుమతి చేయడం ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. విత్తనోత్పత్తిపై రైతాంగానికి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, వారికి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, సాంకేతిక సహకారం అందిస్తామని, రైతులకు విత్తనోత్పత్తిలో సహాయంగా ఉండే పాలసీలను తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు.

తెలంగాణ విత్తనోత్పత్తిలో కీలకంగా ఎదిగేందుకు ప్రభుత్వ పాలసీలతో పాటు ఇక్కడి అనుకూల వాతావరణం, తెలంగాణ రైతుల శ్రద్ధతో పాటు పరిశోధనా సంస్థల సహకారం ఉందని, మానవ మనుగడకు అంత్యంత కీలకం ఆహార పంటల సాగు అని, అందులో ప్రధాన భూమిక విత్తనాలది అని, నాణ్యమయిన విత్తనాలు లేకుంటే ఇది సాధ్యం కాదని అన్నారు.

నాణ్యతకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది

నాణ్యమయిన ఉత్పత్తులకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, తెలంగాణ విత్తనాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆదరణ పొందడానికి అదే కారణం అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సుకు గౌరవ అతిథిగా హాజరయిన ఆయన మాట్లాడుతూ , ఇస్టా సదస్సు మూలంగా విత్తన పరీక్షా ప్రమాణాలు మన రైతులకు, మన నిపుణులకు తెలుస్తాయని, దానికి అనుగుణంగా పంటలు పండించి విత్తనాలను రూపొందించడం మూలంగా జాతీయంగా, అంతర్జాతీయంగా తెలంగాణ విత్తనాలకు మరింత డిమాండ్‌ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు

ప్రమాణాల పెరుగుదలకు సదస్సు దోహదం

వివిధ దేశాల విత్తన అవసరాలు, ప్రమాణాలు పరస్పరం తెలుసుకునేందుకు అంతర్జాతీయ విత్తన సదస్సు వేదికగా ఉపయోగపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విత్తన మొలకశాతం, నాణ్యత పరీక్షలు, బయోటెక్నాలజీ వంటి అంశాలపై జరిగిన పరిశోధనా ఫలితాలు అందరూ తెలుసుకునేందుకు ఇది అవకాశం అని, తెలంగాణ విత్తన బ్రాండ్‌ ను అంతర్జాతీయంగా మార్కెట్‌ చేయడానికి, నూతన ఎగుమతి అవకాశాలు దీంతో మెరుగవుతాయని అన్నారు. తెలంగాణ విత్తనరంగాన్ని మరింత బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా తెలంగాణ విత్తన రైతులకు త్వరలోనే గుర్తింపు కార్డులు అందజేస్తామని పార్ధసారధి అన్నారు.


భవిష్యత్‌ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టబోయే విత్తన పంట సబ్సిడీలు, ఇతర పథకాలకు విత్తన రైతు గుర్తింపు కార్డులు ప్రధాన భూమిక పోషిస్తాయని అన్నారు. విత్తన రైతుల పూర్తి వివరాలతో కూడిన డాటాబేస్‌ ను కంప్యూటర్‌ లో నిక్షిప్తం చేస్తామని వెల్లడించారు. గ్రామాలు, జిల్లాలు, పంటల వారీగా విత్తన రైతులకు సాంకేతిక శిక్షణ అందిస్తామని, దేశంలోనే నర్సరీ చట్టం ద్వారా కూరగాయ పంటలలో కల్తీకి అడ్డుకట్ట వేయగలిగామని తెలిపారు. విత్తన వ్యాపారంలో కల్తీ పెరుగుతున్న నేపథ్యంలో విత్తనం ఎక్కడ పండించబడింది ? ఆ భౌగోళిక ప్రాంతం, ఉత్పత్తిదారుని వివరాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని మార్కెట్లో లభించే విత్తన పాకెట్లపై ఉండేలా బార్‌ కోడింగ్‌ విధానం అమల్లోకి రాబోతోందని తెలిపారు.

ప్రపంచానికి ఆదర్శం మన వ్యవసాయ పాలసీలు

తెలంగాణ వ్యవసాయ పాలసీలు ప్రపంచానికే ఆదర్శం. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రైతులకు అండగా నిలుస్తున్న 20 అత్యుత్తమ పథకాలలో తెలంగాణ నుండి రైతుబంధు, రైతుబీమా పథకాలు నిలిచాయి. ఐక్యరాజ్యసమితి ఈ పథకాలను అన్ని దేశాలకు వివరించాలని ఆహ్వానించిందని, రైతుల పట్ల కేసీఆర్‌ నిబద్ధత, చిత్తశుద్ధి మూలంగా ఇలాంటి పథకాలు సాధ్యం అయ్యాయని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా రెండవరోజు హైటెక్స్‌ లో జరిగిన విత్తన రైతుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణలోని రైతుబంధు, రైతుబీమా పథకాలు మాత్రమే కాకుండా కళ్యాణలక్ష్మి, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ వంటి ప్రతి పథకమూ ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఆదర్శనీయం, ఆచరణీయం అని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు చనిపోయిన వారం రోజులలో రూ.5 లక్షలు సాయం ఎలాంటి సిఫారసులు లేకుండా ఆ బాధిత కుటుంబం దరిచేరడం మామూలు విషయం కాదని, ఇప్పటికి 1200 పైచిలుకు కుటుంబాలకు రూ.650 కోట్ల వరకు పరిహారం అందిందని, రాష్ట్రంలో మొత్తం 58 లక్షల మంది రైతులలో 53 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులేనని, వారికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ఈ పథకం అమలులో తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారుల కృషి అభినందనీయమని పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

తెలంగాణ విత్తన రంగం గత ఐదేళ్లలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని, దీనికి కేసీఆర్‌ మార్గదర్శనమే కారణం అని, ఇస్టా సదస్సు మూలంగా భవిష్యత్‌లో ప్రపంచంలో ప్రముఖ స్థానానికి చేరుకుంటుందన్న నమ్మకం ఉందని తెలిపారు. మిషన్లు తయారు చేయలేని ఏకైక వస్తువు విత్తనం అని, విత్తన పంటల సాగుమీదనే రైతులు దష్టి సారించాలని, తెలంగాణ రైతు సుసంపన్నమైన రైతు కావాలి అని పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆకాంక్షించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇస్టాలో 80 సభ్యత్వదేశాలు ఉన్నాయని, మన విత్తనాలు ఆయా దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు మరింత మెరుగుపడతాయని, తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎదగడానికి ఇది ఒక్క మెట్టు అని అన్నారు.

రైతు బంధును కర్ణాటకలో అమలుచేస్తాం

తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు పథకాన్ని త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తామని, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భరోసానిచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలు ఎంతో బాగున్నాయని కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రి శివశంకర్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా రెండవరోజు హైటెక్స్‌ లో నిర్వహించిన విత్తన రైతుల సమావేశానికి గౌరవ అతిథిగా హాజరయిన ఆయన రైతులను ఉద్దేశించి పూర్తిగా తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

డిమాండ్‌ ను బట్టి పంటలు సాగుచేయాలి

రైతులు డిమాండ్‌ ను బట్టి పంటలను సాగుచేయాలని, సేంద్రీయ తరహాలో పంటలను సాగుచేస్తే మార్కెట్‌ లో ఆదరణ ఉంటుందని, ఎక్కువ ధర వస్తుందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అవసరం అయిన 65 శాతం విత్తనాలు అందిస్తోందని, విత్తనపంటల సాగులో రైతు సమన్వయ సమితిలు కీలకంగా పనిచేస్తాయని వెల్లడించారు.