| | |

ఐటీ రంగ ప్రగతి ప్రస్థానం… ప్రతిఫలిస్తున్న డిజిటల్‌ తెలంగాణ స్వప్నం

By: ముడుంబై మాధవ్‌

ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, పురోగతి, పనితీరును ప్రజలముందు వార్షిక నివేదికల రూపంలో ఉంచాలన్న మంత్రి కేటీ రామారావు నిర్ణయం మేరకు ఐటీ శాఖ గత ఏడేళ్లుగా రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా ప్రగతి నివేదికలను వెలువరిస్తున్నది. ఆ క్రమంలోనే 2021-22 సంవత్సరం వార్షిక ప్రగతి నివేదికను ప్రముఖ ఐటీ సంస్థ టెక్‌ మహీంద్రా హైదరాబాద్‌ ప్రాంగణంలో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు 1 జూన్‌, 2022 నాడు విడుదల చేశారు. కోవిడ్‌ రెండవ, మూడవ దశల ప్రతికూల ప్రభావాన్ని తట్టుకుని ఐటీ శాఖ స్ఫూర్తిదాయకంగా పనిచేసింది. దాని పర్యవసానంగా తెలంగాణ ఐటీ రంగం అప్రతిహతంగా తన ప్రగతి ప్రస్థానం కొనసాగిస్తున్నది. డిజిటల్‌ తెలంగాణ స్వప్నాన్ని ప్రతిఫలింపచేస్తున్నది. ఐటీ శాఖ వార్షిక నివేదిక ఈ పనితీరుకు, ఫలితాలకు అద్దంపట్టింది. 

2021-22 సంవత్సరానికి గాను ఐటీ/ ఐటీ సేవల ఎగుమతుల విషయంలో తెలంగాణ రాష్ట్రం మునుపెన్నడూ చూడని ప్రగతిని సాధించింది. గత ఏడాది 1,45,522 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతుల విలువ 2021-22 సంవత్సరానికి 1,83,569 కోట్లకు చేరింది. రాష్ట్ర ఏర్పాటునుండి ఇదే అత్యధిక వార్షిక వృద్ధిరేటు (26.14శాతం). ఇదే కాలానికి భారతదేశపు ఐటీ ఎగుమతులు 17.20శాతం వృద్ధిని సాధిస్తాయని నాస్‌కాం అంచనా వేసింది. భారతదేశ స్థూల ఐటీ ఎగుమతులలో తెలంగాణ రాష్ట్ర వాటా క్రమేపీ పెరుగుతూ వస్తున్నది. 2014-15 సంవత్సరంలో 13.22శాతం గా ఉన్న తెలంగాణ వాటా 2021-22 నాటికి 15.79శాతానికి ఎగబాకింది. ఇంకా, తెలంగాణ ఐటీ రంగం 2021-22 సంవత్సరానికి రికార్డు సంఖ్యలో 1,49,506 కొత్త ఉద్యోగాలను సృష్టించింది. భారతదేశం గత సంవత్సరం సుమారు 4,50,000 ఉద్యోగాలను కల్పించనున్నదని నాస్‌కాం లెక్క వేసింది. అంటే దేశం మొత్తంమీద ఐటీ రంగంలో వచ్చిన ఉద్యోగాలలో మూడో వంతు (33 శాతం) ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కల్పించబడ్డాయి. నేడు తెలంగాణ ఐటీ/ ఐటీ సేవల రంగంలో 7,78,121 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పోయిన ఏడాది ఉద్యోగుల సంఖ్య (6,28,615) కంటే ఇది 23.78 శాతం అధికం. రాష్ట్రం ఏర్పడ్డనాటినుండి ఒక సంవత్సర కాలంలో కల్పించిన ఉద్యోగాలలో ఇదే అత్యధికం.

2013-14లో 57,528 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతుల విలువ 2021-22 సంవత్సరానికి 1,83,569 కోట్లకు చేరడంతో ఐటీ ఎగుమతులలో తెలంగాణ 15.67శాతం వార్షిక చక్ర వృద్ధిరేటును (సిఎజిఆర్‌) నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి ఐటీ రంగం నాలుగున్నర లక్షల నిపుణులకు ఉద్యోగాలు కల్పించింది. ఈ సంఖ్యకు మూడు రెట్లు పరోక్ష ఉపాధి అవకాశాలు లభించాయి.   

తెలంగాణ ఏర్పడ్డనాటికి ఐటీ రంగం భవిష్యత్తుపై నెలకొన్న సంశయాలను ఈ గణాంకాలు పటాపంచలు చేయడమే కాదు భవిష్యత్తుపై కొండంత భరోసాను నింపాయి. ‘తెలంగాణ ఐసీటీ విధానం 2021-26’ కింద వచ్చే అయిదేళ్లలో ఐటీ రంగం నుండి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాల్ని 10 లక్షలకు, ఐటీ ఎగుమతుల విలువను రూ.3 లక్షల కోట్లకు పెంచాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లక్ష్యాలను సాధించే దిశగా, అనుకూల పరిస్థితులలో లక్ష్యాలను మించి ఫలితాలు సాధించే విధంగా, తెలంగాణ ఐటీ రంగ ప్రస్థానం సాగుతున్నది. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటిఐఆర్‌) సమగ్ర ప్రాజెక్టు నివేదికలో (డిపిఆర్‌)  అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2035 నాటికి ఐటీ రంగ వార్షిక ఎగుమతులు సుమారు 2.10 లక్షల కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. ప్రస్తుత వార్షిక చక్ర వృద్ధిరేటు (సిఎజిఆర్‌) ప్రకారం తెలంగాణ వచ్చే సంవత్సరంలోనే ఈ ఎగుమతుల విలువను అందుకోనున్నది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినా ఈ ఫలితాలు సాధించడం తెలంగాణ ఐటీ రంగం గతిశీలతను ప్రస్ఫుటం చేస్తున్నది.

((RBIs Yearly Survey on Computer Software & Information Technology Enabled Services Exports)

గతంలో మాదిరిగానే 2021-22 సంవత్సరంలో ఐటీ శాఖ మంత్రి శ్రీ కేటీ రామారావు ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమలకు చెందిన ముఖ్య నాయకులు, పరిశ్రమ సమాఖ్యలతో అనేక సమావేశాలు నిర్వహించారు. ఐటీ రంగ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనుకూలతలను వివరించి కొత్త సంస్థలు తమ కార్యకలాపాలు నెలకొల్పేలా, అప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు మరింత విస్తరించేలా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారుల బృందాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇంగ్లండ్‌, స్విట్జర్లాండ్‌ వంటి దేశాలను సందర్శించాయి. సాంకేతిక రంగంలో పెట్టుబడుల కోసం పోటీ కేవలం భారత దేశ రాష్ట్రాల మధ్య మాత్రమే ఉండదని, తెలంగాణ ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలతో, మహా నగరాలతో పోటీ పడవలసి ఉంటుందన్న ఐటీ శాఖ మంత్రి నిర్దిష్టమైన అవగాహనే ఐటీ శాఖ గమనానికి దిక్సూచి. ఈ దృక్పథం, ఆచరణ వల్ల అనేక ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థలు గత సంవత్సరం తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి.