|

తెలంగాణా జీవన చిత్రాలు

trs‘‘ఈ పోరన్ని సద్వుకోరా అని బడికి పంపుతె, బడి ఎగ్గొట్టి ఆ గల్లీల పోరాగాళ్ళ తోటి పొద్దంత ఆ వాగులపొంటి, ఈ బురుజుల పొంటి, చేన్లల్ల మ్యాకల పొంటి, తాళ్ళల్ల తాడి చెట్లపొంటి తిరిగి తిరిగి, మాపటికి ఆచ్చి ఆడినుండి ఈడిదాక బొగ్గు ముక్కలు, జాజు పెడ్డలు, సున్నం రాళ్ళ తోటి అడ్డమైన బొమ్మలు దించుకుంట ఇల్లంత కరాబు జెస్తుండు. ఈ యాళ్ళ పండ్గనాయే! ఇంట్ల చేతినిండ పని! ఏమన్న చేతికిందికి గింతపనికి ఆసరకుంటడు అంటే ` పొద్దు పొడ్వంగనె బత్కమ్మపూలు, తంగెడుపూలు తెస్తనని పోయిండు ` గింత పొద్దయిన పత్తకులేడు ` ఏడ బత్కమ్మల సూస్త కుసుండో, లేకుంటె ఎవరింట్ల బత్కమ్మకు రంగులు పెడ్తున్నడో?

ఆ బోనాల పండ్గకు గంతేనాయే! బోనాలకు రంగులు బెట్టుకుంట, రాత్రంత బుర్రకథ ఇనుకుంట ఎల్లమ్మ గుడిలనే ఉన్నడు.

పొయినేడు కొమరెల్లి జాతరకని బోయినప్పుడు ‘సీద మల్లన్నకు మొక్కి మాపటికల్ల ఇంటికి రారా బిడ్డా’ అని చెప్పి పంపితే, ఆడనే రాత్రంత భాగవత మాడిండంట.

మొన్నటి సోమారం ఏములాడ రాజన్నకాడ ఒగ్గుకథ చెప్తున్నరని పోయి రెండ్రోజులు ఆడనే ఉన్నడు.

నిన్నటికి నిన్న మొగులుకు శిల్లుపడ్డట్టు వానపడుతుంటే ` ‘యవ్వ! చెర్వుగట్టు విూద సక్కదనంగ సింగిడి బూస్తదంట, సూడన్కిబోత’ నని మోకాళ్ళ వంటి నీళ్ళల్ల పోయి పెయ్యంత బట్టంత బుర్దచేస్కున్నడు.

వీడికి ఏడ కాలునిల్వదు ` చేయి నిల్వదు! పకాతు బొమ్మలెన్కపడ్డడు ` గవ్వి ఏమన్న కడ్పులకత్తయా? కాళ్ళ కస్తయా? వీడికి ఎట్ల సద్వస్తదో? వీడు ఎట్ల బత్కుతడో?

పిల్లగాడు గప్పుడనంగ గింత సద్దిదినిపోయిండు ` బువ్వదిన ఎప్పుడస్తడో??’’

ఆ అమ్మ ఎదురు చూపుల్లోంచి, ఇలాంటి స్వచ్ఛమైన తెలంగాణ మట్టిలోంచి, వగరు బాల్యంలోంచి నడచి వచ్చిన వాడాయన. చిన్ననాటి నుండి తన మస్తిష్కంలో నాటుక పోయిన తెలంగాణ జీవనాన్ని, జీవన వృత్తులను, జీవన సౌందర్యాన్ని తనలోకి ఒంపుకొని దృశ్యబద్ధం చేసిన చరిత్రకారుడాయన! కళా జీవితం అంటే తాను నమ్మిన సిద్ధాంతాలను తాను పుట్టిన భూమిని, భూమికను విడవకుండా, తన ఎనభై ఏడేళ్ళ జీవితాన్ని కళామతల్లికి అంకితం చేసి ప్రపంచ చిత్రకళా పటంలో తెలంగాణ జీవితాన్ని పదిల పరిచిన చిత్రకళా తపస్వి కీ.శే. డా॥ కాపు రాజయ్య గారు.

పాశ్చాత్య చిత్రకళా ప్రస్థానంలో ఎన్నో వాదాలు (ఇజాలు) పుట్టాయి. నేచరిజం, కూబిజం, ఇంప్రెషనిజం, సర్రియలిజం, పాయింటలిజం, ఎక్స్‌ప్రెషనిజం, ఇజం లాంటివి ఎన్నో… ఇవన్నీ కలిపి స్థూలంగా మూడు వాదాలుగా ఇమిడాయి. ఒకటి వాస్తవవాదం (రియలిజం) ఇందున బాహ్య జగత్తులోని రూపాలకు ప్రతి రూపాలుగా అనుకరించటం, రెండు ఆదర్శవాదం (ఐడియలిజం) ఇందు అవసరమైన సృజనాత్మకతను జోడించి అనుకరించటం. మూడవది కల్పనావాదం (అబ్‌స్ట్రాక్ట్‌).

ముఖ్యంగా భారతీయ చిత్రకళ రేఖా సదానం. వర్ణలేపనం సమంగా ఉండి, ఎత్తుపల్లాల విభేదం లేకుండా నీటి రంగులు వాడేవారు. అందరిలానే రాజయ్యగారు కూడా మొదట వాస్తవవాదంవైపు ఆకర్షితులైనారు ` ఇరవై మూడేళ్ళ ప్రాయంలో హైదరాబాదు ఫైనార్ట్స్‌ కాలేజిలో డిప్లమా పొందాక నవరంగ సంప్రదాయంగా ప్రాచుర్యంలో ఉన్న నీటి రంగుల క్షాళన పద్ధతిలో వాస్తవిక వాదంతో ‘దమయంతి’, ‘కోయదంపతులు’, ‘ఉడతా భక్తి’ వంటి చిత్రాలు చిత్రించారు.

కాని రాజయ్య గారు చిత్రాకారుడుగా ఎదిగేందుకు ప్రేరకాలైన, చిన్ననాటి నుండి తనలో జాగృతమై మార్వాడి ఇండ్లలో చూసిన నకాషీ చిత్రాలు, పట చిత్రాలు ఆదర్శ దేశి వాదం వైపు నడిపించాయి. ఇదే సమయంలో బెంగాలీ జానపద కళారూపాలతో భారతీయ చిత్రా కళారూపాల్లో తనదైన ముద్ర, వేసిన జామిని రాయ్‌ చిత్రాలు వీరికి సాంకేతిక కొలబద్దగా నిలిచాయి.

వీరి చిత్రాల్లో, రేఖల్లోని లయ జనపద సోయగాన్ని, రంగులలోని స్పందన ఆ పల్లె రాగాన్ని, చూపిస్తాయి. వీరు వీలయినంత వరకు మిశ్రమ వర్ణాల కంటే శుద్ధ వర్ణాలనే ఎక్కువగా వాడారు.

చిత్రాల్లో వాడే ఉష్ణవర్ణాలు, పసుపు, ఎరుపు, నారింజ తెలంగాణ ఒరవడికి, జౌన్నత్యానికి మట్టివాసనకి సంకేతాలుగా నిలుస్తాయి. అట్లే శతృవర్ణాలు, మిత్ర వర్ణాలు, శీతల వర్ణాలు వాడటంలో రాజయ్యగారు తన ప్రత్యేకతను కనపరుస్తూ చిత్రించారు.

ఈ క్రమంలోనే బతుకమ్మ, బోనాలు, మొహరమ్‌, ఎల్లమ్మ జోగి వంటి తెలంగాణ పండుగలు, వీధి నాటకం, బుర్రకథ, ఒగ్గుకథ, శారదకాళ్ళు వంటి తెలంగాణా కళా వారసత్వ సంపదలను మొదటగా భారతీయ చిత్ర కళాసీమకు పరిచయం చేశారు. ఈ పరంపరలోనే కలలం (టెంపెరా) రంగులతో కార్డుబోర్డుపై గీసిన ‘బోనాలు’ చిత్రం 1956 లో ‘ది స్టూడియో’ లండన్‌ మ్యాగజెన్‌ ముఖచిత్రంగా అచ్చయి, రాజయ్యగారికి అంతర్జాతీయ చిత్రకళాలోకంలో గుర్తింపునిచ్చింది. అంతేకాకుండా కేంద్ర లలిత కళా అకాడమి వారు ‘కాంటెంపరరీ ఆర్టిస్ట్‌’ పేరిట వేసిన ఐదవ సంచికలోనే వీరి కళాకౌశలాన్ని ప్రస్తుతిస్తూ చిత్రాలతో సహా వ్యాసాలు ప్రచురించారు. అలాగే గ్రామీణ కులవృత్తులు కుమ్మరి, జాలరి, చాకలి, యాదవ, కల్లుగీసే గౌడుల, పాలమ్మేవారిని, సోది చెప్పేవారిని, కోయల జీవితాల సహజ సౌందర్యాన్ని ఆటు పోట్లను భారతీయ కళా చరిత్రలో దృశ్య చబద్ధం చేశారు. ఈ ప్రతిభాత్మకమైన సృజనాత్మక సేవను గుర్తించి కేంద్ర, లలితకళా అకాడమి వాళ్ళు ‘కడగండ్ల బ్రతుకులు’ (కల్లు గీయు దృశ్యం) చిత్రానికి 1990లో జాతీయ అవార్డు ప్రకటించారు. రాజయ్యగారు తన చిత్రాల్లో సూక్ష్మమైన అందాలను అందించటంలో సిద్ధహస్తులు.

art

ప్రత్యేకించి పల్లె పడుచుల అందాల చిత్రణలో ముక్కుకు ముక్కెరలను, బులాకీలను, చెవుల్లో వివిధ రకాలైన కొనికె పోగులు, మాటీలు, కమ్మలను ` మెడలో పూసల పేరులు, రకరకాల రంగుల తాడుల పేరులు, కంటెలు, నానులను ధరింప చేయటంలోను, తలలో పాపెటపూవు పట్టగొలుసులు ధరింపచేసేవారు. అలాగే రవికల్లో, చీరల్లో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన సున్నితమైన రేఖలతో నిండిన అల్లికలతో రాజయ్య గారి చిత్రాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వీరి ప్రతిచిత్రంలో పల్లెకు ప్రతిరూపమైన చెట్టు సుమారుగా ఉంటుంది. రకరకాల చెట్ల ఆకుల పూవుల చిత్రణలో రాజయ్యగారు తన ప్రత్యేకమైన ప్రతిభను చూపారు. సుమారుగా ఈనాడు తెలంగాణా జీవితాన్నే నేపథ్యంగా స్వీకరించిన వర్తమాన చిత్రకారులందరూ రాజయ్య గారి చిత్రాల ప్రభావంతో ఎదిగినవారే! ఏ రంగంలోనో, రూపంలోనో, మరే వస్తు స్వీకరణలోనో రాజయ్యగారు మార్గదర్శులే!

ప్రతి తరానికి తన వారసత్వ సంపదను తనదైన కోణంతో చూసే హక్కుఉంది.

ఎందుకంటే పాశ్చాత్యులైన రేవాల్ట్‌, మాటిసే, ప్రాంసిక్‌ బేకన్‌ వంటి ఆధునిక చిత్రకారులు తమ క్రైస్తవ వారసత్వాన్ని తమదైన దృష్టితో చూసినవారే! వారు అన్వయించుకున్న స్థాయిబట్టి పున:సృష్టి చేసిన వారే! సరిగ్గా అలానే రాజయ్యగారు మన ఇతిహాసాలైన రామాయణ, మహాభారత భాగవతాల నుండి తాను అన్వయించుకున్న అనుభూతిలో తన జానపదశైలిలోనే రామపరాజయం, అంపశయ్య, రామదూత, కామధేనువు, కాళింగమర్థని, వటపత్రశాయి, శాశ్వతప్రేమ, గోపీకృష్ణ వంటి ఎన్నో చిత్రాలు చిత్రించారు.

ప్రపంచ చిత్రకళలో నైరూప్యవాదం 1912లో పుట్టి ఈనాడు ఆధునిక చిత్రకళలో నైరూప్య చిత్రావళే మొదటిగా నిలిచింది. ఇందు చిత్రించే చిత్రాలకు దృశ్య జగత్తులో కనిపించే చిత్రాలకు ఎలాంటి సారూప్యత ఉండదు. 1970 తరువాత రాజయ్యగారి చిత్రాల్లో ఆయన్ను పోల్చుకో లేనంతగా మార్పుచెందారు. ఇన్నాళ్ళు తన సూక్ష్మగ్రాహక మైన అన్వేషణ ఫలితంగా వీరు ప్రతీకాత్మకతను, సంప్రదాయాన్ని మేళవించి కొత్తదనంతో వ్యక్తిగతమైన ప్రత్యేకమైన నైరూప్య శైలిని ఏర్పరుచుకున్నారు. ఈ శైలిలో పాశ్చాత్య మాధ్యమమైన తైలవర్ణాల్లో ఆధ్యాత్మిక, తాత్విక చింతనలో నడిచి తన సృజనాత్మక శక్తి ఎంతటి ఆలోచనా వంతమైనదో భారతీయ కళా జగత్తుకు తెలియపరిచారు. తన చిత్రాల్లో ముఖ్యమైన అంతస్సారమైన సంప్రదాయాన్ని వీడకుండా తెలంగాణా బండరాళ్ళను సంకేతంగా ఉపయోగిస్తూ, శ్రీ వెంకటేశ్వరునిపై అలాగే శివలింగంలోని ఒక బాణాన్నే సంకేతంగా ఉపయోగిస్తూ, శివునిపై వందలాది చిత్రాలు చిత్రించారు. అలాగే నిత్య జీవన సామాన్య దృశ్యాలైన, చెప్పులు కుట్టే మోచి, జాతరలో పట్నాలు వేయుట, పిండిరుచ్చే గృహిణి, మేకలు మేపే చంటిది వంటి అంశాలను తన జానపద శైలిలోకి మార్చకుండానే డ్రాయింగ్‌ల ద్వారానే వాస్తవికతకు దగ్గరగా చిత్రించారు.

ఆరున్నర దశాబ్దాల తన కళా జీవనంలో వీరి చిత్రాలు 1948 నుండి జాతీయంగా అన్ని ప్రతిష్టాకరమైన చిత్రకళా ప్రదర్శనలలో, అంతర్జాతీయంగా జెకొస్లోవికియా, హంగరీ, రుమేనియా, బల్గేరియా, ఆస్ట్రేలియా, యుఎస్‌ఏ వంటి మరెన్నో దేశాల అంతర్జాతీయ ప్రదర్శనల్లో ప్రదర్శింపబడ్డాయి. వీరి చిత్రాలు దేశవిదేశాల్లో అన్ని ప్రధాన ఆర్ట్‌ గ్యాలరీల్లో ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వీరి వ్యక్తిగత ప్రదర్శనలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌ తరుపున కేంద్ర లలితకళా అకాడమి సభ్యులుగా, ఆలిండియా ఫైనార్ట్స్‌ అండ్‌ క్రాప్ట్ప్‌ సొసైటీలో విశిష్ట సభ్యులుగా, హైదరాబాదు ఆర్ట్‌ సొసైటీ అధ్యక్షులుగా, లలితకళా సమితి సిద్ధిపేట సంస్థాపకాధ్యక్షులుగా ఉంటూ చిత్రకళామతల్లికి ఆఖరు శ్వాస వరకు సేవలందించారు.

art-trs

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి. అందులో జెఎన్‌టియూ గౌరవ డాక్టరేటుతో ‘కళాప్రవీణ’ బిరుదు ‘హంస అవార్డు’, తెలుగు విశ్వవిద్యాలయం ‘విశిష్ట పురస్కారం’, లలిత కళారత్న’, ‘రాజీవ్‌ పురస్కారం’ మచ్చుకుకొన్ని – కళా గరిమతో తమ గురుత్వంలో సిద్ధిపేట కళాభవన్‌లో ఎంతో మంది శిష్యులకు చిత్రకళలో ఓనమాలు దిద్దించిన సారు రాజయ్యగారు! విశ్వవిఖ్యాత శిఖరాలను అధిరోహించినా నిరాడంబరులుగా వెలిగిన ప్రతిభామూర్తి రాజయ్యసారు! ఏబది ఏళ్ళ వ్యక్తితో కాని, ఎనిమిదేళ్ళ పిల్లడితో కాని అదే ఆత్మీయతతో పలకరించే నిగర్వి రాజయ్యసారు!

రెండేళ్ళ కింద రాజయ్యగారు అవ్వచేతి బుక్క తినేందుకు ఆవలి లోకాలకు బోయినా, తెలంగాణ పండ్గలున్నంత కాలం, రాజయ్యసారు దించిన ఆకల్లు గీసే కాశయ్య, పాలమ్మె బుచ్చవ్వ, బతకమ్మ నెత్తుకున్న మల్లమ్మ, బోనం ఎత్తుకున్న బాగవ్వ, తంగెడు బూలు పట్కున్న శిన్నది, పతంగులు ఎగరేసే చిన్నోడు బతికే ఉంటారు. వీటిని మన తెలంగాణ సాంస్కృతిక సంపదగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది!