|

తెలంగాణ పట చిత్రాలు ‘కాకిపడిగెలు’

భారతీయ తత్వాన్ని, జానపదుల కుల-మత ఆచార వ్యవహారాలను, అందులోనూ మరీ ముఖ్యంగా – తెలుగువారి సంస్కృతిని, జీవనాన్ని కాకిపడిగెలు – నకాశీ చిత్రాలు అంటే తెలంగాణ పట చిత్రాలు నూటికి నూరుపాళ్ళు స్వచ్ఛందంగా పరిరక్షించాయి.

పల్లె పట్టులలోని ప్రాచీన చిత్రకారుల ఓపిక, ఊహాశక్తి, ప్రతిభావ్యుత్పత్తులను మాత్రమే కాకుండా బహువిషయ గ్రాహ్యతను, పఠనాశీలాన్ని నకాశీ చిత్రకళ ప్రతిబింబిస్తుంది.

తెలంగాణాలోని కాకిపడిగెలు చూసే కాపు రాజయ్య కుంచెపట్టారు. జాతీయ స్థాయి చిత్రకారుడుగా ఎదిగి, పుట్టిన నేలకు, స్ఫూర్తినిచ్చిన కళకు గుర్తింపు తెచ్చాడు. నకాశీ చిత్రాల ప్రేరణతోనే వందలాది చిత్రాలు గీశాడు. ఎందరో శిశ్యులను తయారు చేశాడు.

ఇప్పుడు ప్రతిమారుమూల పల్లెలో టెలివిజన్లు వచ్చి మన సంస్కృతిని పూర్తిగా భూ స్థాపితం చేశాయి గాని, ఇటీవలి వరకు తెలంగాణలోని ప్రతి పల్లెలో నిడివైన చిత్రపటాలను ఆటపాటలతో ప్రదర్శించి పొట్ట పోసుకునే కళాకారులుండేవారు. కొన్ని వర్ణాల వారినే యాచించే తెగల వారికోసం, ఉద్భోదనకు తోడయ్యే చిత్రకళా చాతుర్యంతో, కమనీయ చిత్రశ్రేణిని సుమారు మూడు అడుగుల వెడల్పు, ముప్పై – నలబై అడుగుల పొడవైన తానుపై ఒక క్రమంలో చిత్రిస్తారు. చుట్టచుట్టి ఈ పొడవైన చిత్రపటాలనే కాకి పడిగెలు అంటారు. ఆచిత్రాలను నకాశీ చిత్రాలని కూడా వ్యవహరిస్తారు. ఈ సంప్రదాయ చిత్రాలను గీసే వారిని కాకిపడిగెల వారంటారు లేదా నకాశీ వారంటారు.

”కాకీ” అనే మాట పార్సీ భాషనుంచి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆ భాషలో ‘ఖాకా’ అంటే చిత్రవర్ణమని అర్థం. పడగ అన్నా పటము అనే అర్థం. అట్లాగే ‘నక్షా’ పదం నుంచే నకాశీ కూడా పుట్టింది.

ఈ పటాలను ఆయా కథకులు గుండ్రంగా చుట్టి ఉంచి రెండు కర్రలపై వ్రేలాడదీసి, కథ చెబుతూ దీనికి సంబంధించిన దృశ్యం వచ్చేవిధంగా చుట్టను త్రిప్పుతూ చూపి ప్రేక్షకులను రంజింపచేస్తారు. ప్రధానంగా మతపరమైన కథలను, చారిత్రాత్మక, జానపద కథలను విజ్ఞాన దాయకంగా, వినోదాత్మకంగా వీరు చెబుతారు.

కాకిపడిగెల సంప్రదాయం బౌద్ధమతం బాగా ప్రచారంలో ఉన్న కాలం నుంచి ఉన్నట్లు ‘హర్ష చరిత్రము’ వల్ల తెలుస్తున్నది. అప్పట్లో బుద్దుని జాతక కథలు కూడా ఎడ్ల బండ్లపై ఈ కాకిపడిగెలు కట్టి ఊరూరా ప్రదర్శించేవారు, ప్రచారం చేసేవారు. ఈ కాకి పడిగెల ప్రభావమే, పిల్లల మర్రిలోని ఆలయ చిత్రాలపైన, మాచెర్లలోని చిత్రాలపైన ఉంది.

కాకిపడిగెల వాళ్ళు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఒకప్పుడు విస్తరించి ఉండేవారు. కృష్ణా, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కూడా కులాలవారికి కాకిపడిగెలతో కథలు చెప్పేవారు, జీవనం సాగించేవారు.

కాని ఈ ఆధునిక ప్రపంచంలో ఆదరణ లేక కాకిపడిగెల కళాకారులు ఇతర వృత్తులలో స్థిరపడి పోవడంతో ఈ కళ ఇవాళ్ళ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నది.

నిజానికి చలన చిత్రాలు ప్రదర్శించే థియేటర్ల రాకతోనే ఈ సంప్రదాయక కళ కంచిదారి పట్టింది. కాని వేములవాడ సమీపంలోని తిప్పారంకు చెందిన ధనాకోట వెంట్రామయ్య చేర్యాలకు వలస వచ్చి స్థిపరడి మనోహరమైన కథాచిత్రాలెన్నో గీశాడు. ముదిరాజు లేదా ముత్రాచ కులం వారికి పాండవులోరాడ్లు చేప్పే కథలు, సాలెకులం వారికి

ఏ నూటోండ్లు లేదా జెట్టోండ్లు చెప్పేకథలు, సాలెకులం వారికి కునెపులికాండ్రు చెప్పే కథలు, చాకలి వారికి గంజికూటివాడ్లు చేప్పే కథలు, మాదిగలకు డక్కలోండ్లు చెప్పే కథలు, పడిగె రాజులు, గునెపులివాండ్లు, ఇతరులకు సంయవాండ్లు చెప్పే కథలు, మంగలి వారికి అద్దవోండ్లు చెప్పే కథలు, గొల్ల వారికి మందెచోళ్ళు చెప్పే కథలు, ఇట్లా కులపురాణాలను కాకిపడిగెలలో పొరదు పరుస్తారు. వాటిలో గౌడపురాణం, మడేలు పురాణం, మార్కండేయ పురాణం, దాక్షాయనాపురాణం, పొలం రాజు కథ మొదలగు కాల్పినిక గాథలున్నాయి.

ఈ కుల పురాణాలను రంగుబొమ్మలుగా – కాకిపడిగెలు ప్రదర్శిస్తూ యాచక గాయకులు పాడుతారు. మద్దెల, తాళాలు, హార్మోనియం వాయిస్తూ గొంతెత్తి పాడుతారు. గొల్లలకైతే మందెచ్చోళ్ళ రుజ, జగ్గు, తాళాలు కూడా వాయిస్తారు. స్త్రీలే, పురుషులు శ్రవణానందంగా గానం చేస్తూ, వ్యాఖ్యానం చేస్తూ ఆ బాల గోపాలాన్ని ఆకర్షిస్తారు.

నకాశీ వెంకట్రామయ్య తర్వాత ఆయన కుమారులు – చంద్రయ్య, వైకుంఠం ఈ కళా పరంపరను కొనసాగించారు. ప్రస్తుతం వైకుంఠం కుమారులు రాకేశ్‌, వినయ్‌ కూడా ఈ రంగంలోనే ఉన్నారు. అయితే లోగడ లాగా పూర్తి నిడివి కాకి పడిగెలు తగ్గిపోయాయి. అంతే కాకుండా వీరి తర్వాత ఈ కళను ప్రభుత్వం ప్రోత్సహించి, ఈ కళాకారులను ఆదరించకుంటే ఈ కళ అంతర్ధానమైపోతుంది. ఇంతటి కాకిపడిగెల సృజనాత్మకంగా చిత్రించినందుకు 1983లో చంద్రయ్యకు జాతీయ అవార్డు లభించింది. 1985లో ఈయన పశ్చిమ జన్మనీ వెళ్ళి అక్కడ కాకిపడగలు ప్రదర్శించి ప్రచారం చేసి రావడం గర్వకారణం.

ఈ నకాశీ చిత్రకళ ఒరిస్సా, బీహార్‌ రాష్ట్రాలలో కూడా ఉంది. మత సంబంధమైన పురాణ గాథలతో పలు చిత్రాలను బీహార్‌, ఒరిస్సాలలో రూపొందించగా రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో జైన తాంత్రిక కళ ప్రచారానికి జాతరలలో దీన్ని వినియోగిస్తున్నారు.

చెడుపనులు చేస్తే నరక ప్రాప్తి తప్పదని, మనవ మాత్రులను హెచ్చరిస్తూ నరకయాతనలు కళ్ళకు కట్టే ‘యమపటాలు’ కూడా నకాశీ బాణీ చిత్ర కళకు చెందినవే.

ప్రస్తుతం 1625 నాటి పటం కూడా మనం చూడవచ్చు. సుమారు వంద సంవత్సరాలకు పూర్వం తెలియని నకాశీ చిత్రకారుడు మ¬న్నతంగా చిత్రించిన ‘పటం’ లోగడ రాష్ట్ర లలిత కళా అకాడెమీ ఉండగా కొనుగోలు చేసి భద్ర పరిచింది. ఆ అకాడెమీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో విలీనమైనందున ఆ ‘పటం’ విశ్వ విద్యాలయంలో ఉందనే భావించాలి మరి. నీటి రంగుల్లో ఈ చిత్రాలు వేశారు. గణేశస్తుతిలో ఈ చిత్రం ప్రారంభమైంది. ప్రధానంగా ఎరుపు, నీలం, నలుపు, పసుపు వర్ణాలనే వాడారు. నకాశీ చిత్రాలకు తొలి రోజులలో స్వయంగా వారు తయారు చేసుకున్న ప్రకృతి రంగులే వాడేవారు. ఏటిలో లభించే కౌచిప్పలను తెచ్చి దంచి, వస్త్రగాగితం పట్టి, బండపై పెట్టి రాయితో నూరి తెల్లరంగు తయారు చేస్తారు. పిడకలు బూడిద కాకుండా కాల్చి – ఆ బొగ్గును రాతిపై బాగా నూరి నలుపురంగు రూపొందిస్తారు. తెల్ల పేవ్దీ మర్ధించి నూరి అంకారాలకు, ఎర్ర పేవ్దీ మర్ధించి నూరి శరీర అలంకరణకు ‘పసుపుగా’ వాడతారు. తాళకం కూడా వాడతారు. చైనీస్‌ బ్లూ గుడ్డలు నూరి, కొంత తెలుపు కలిపి నీలంగా ఉపయోగిస్తారు. నీలం, తెల్ల పేవ్దీ కలిపితే ఆకుపచ్చ అవుతుంది. హనుమంతుని విగ్రహాలకు పూసే ఇంగిలీకం ఎరుపుగా వాడతారు.

లోగడ మేక తోకల వెంట్రుకలతో ఒకరకం కుంచెను, ఉడత తోక వెంట్రుకలతో మరో రకం కుంచెను తయారు చేసేవారు. దీన్ని ‘కలం’ అనే వారు.

కొత్త సైను గుడ్డ తెచ్చి, నీళ్ళలో పెట్టకుండా, దీన్ని నేలపై పరిచి, ఖడి, తిరుమణి బంక, గంజి కలిపి వడబోసి వెడల్పు బ్రష్షుతో గాని, గుడ్డముంచి గాని సమంగా పూస్తారు. అది ఆరిపోయిన తర్వాత నల్ల రేఖలతో డ్రాయింగ్‌ గీసి, తర్వాత రంగులు నింపుతారు. ఆయా భిక్షక గాయకులు కోరిన మేరకు రామాయణ, మహాభారత గాధలు, కుల పురాణాలు, ఈ పొడగాటి గుడ్డపై కథా క్రమంలో కమనీయంగా చిత్రిస్తారు.

ఇవాళ్ళ ఆ పాత పటాలు ఎక్కువగా లభ్యం కాకపోవడానికి ప్రధాన కారణం ఏమంతే – మనిషి చనిపోతే దహనం చేసినంత ఆందోళనతో జీర్ణపటాణ్ణి భిక్షుక గాయకులు కాల్చివేయడం లేదా గంగలో అంటే కృష్ణలో లేదా గోదావరిలో నిమజ్జనం చేయడం.

కొత్త పటం చిత్రించి ప్రదర్శనకు ఇచ్చిన సందర్భంలో కూడా కొత్తగా శిశువు పుడితే బారసాల చేసినందత సంతోషంలో భిక్షుక గాయకులు పండుగ చేసుకుంటారు.

అయితే ఇట్టి పటాలను వేసే చిత్రాలకు చేతి నిండా పని ఉన్నా, డుపునిండా తిండి కరవే. ఎందు చేతంటే – వీరి వద్ద పటాలు గీయించుకునే వారంతా దాదాపు యాచకులే కాబట్టి ఎంతో డబ్బును ఇంత కళాత్మకంగా బొమ్మలు వేసినందుకు ఇచ్చుకోలేరు. పైగా ప్రతి పటం వేయడానికి ఎంతో సమయం తీసుకుంటుంది. శ్రమ కలుగుతుంది. పది గజాలపై ఇరువురు కళాకారులు పటం వేయాలంటే – కనీసం ఇరవై రోజులు పడుతుండట. కర్రతో చేయాలన్నా శ్రమతో కూడిందే. దీని కోసం మెదక్‌ జిల్లా కొండపాక గుట్ట నుంచి పొనికి కర్ర తెచ్చి, ఒక్కొక్క కథకు కనీసం ఏభై బొమ్మలు వేయవలసి ఉంటుంది. దీనికి కథకు కనీసం నెల రోజుల కాలం పడుతుంది.

తెల్ల పునికి కర్రతో బొమ్మలు చెక్కి, రంపపు పొట్టు లేదా చింతంబలి కలిపి ఆకృతిని పూర్తి చేసి, ఆ తర్వాత సుద్ధ, చింతంబలి కలిపి ఒక పూత పూసి, దీనిపై తెల్ల ఖడి పూస్తారు. ఈ తెల్ల ఖడిలో తిరుమణిబంక కలిపి పూస్తారు. తయారైన బొమ్మలకు మంచినూను గుగ్గిలం, రోజన్‌తో తయారు చేసుకున్న ప్రత్యేకమైన వంట వార్నిషు కేవలం చెక్క బొమ్మలకు పూసి చెమక్‌ మనిపించే మెరుపు తెస్తారు.

లోగడ పల్లెపట్టులలో జరిగే జాతరలలో దేవుళ్ళ అంగరంగ వైభవంగా ఊరేగించే రథాలను ఈ నకాశీ చిత్రకారులే భారత – భాగవత కథల ఆధారంగా కడు రమణీయమైన బొమ్మలు గీసి అలంకరించేవారు. ఈరథాలపై అనేక కథలను సవివరంగా, సుస్పష్టంగా, సుందరంగా, పలకలు పలకలుగా, లతలు – తీగలు, ఇంతర డిజైన్‌లతో తీర్చిదిద్దేవారు. ఆలయాలలోని కుడ్చ చిత్రాలు కూడా వీరి ప్రతిభాత్యుత్పత్తులకు ఆనవాళ్ళే.

ఆడుక్కునే పెద్దమ్మల వాండ్లు ఉపయోగించే దేవతల కొయ్యబొమ్మలు, పేడ బొమ్మలు, పులిముఖం ఇత్యాది ముఖోటాలు వీరు తయారు చేసినావే. ఒకప్పుడు దక్కనులో వర్ధిల్లిన ఈ విశిష్టమైన నకాశీ కళ నాలుగు కాలాలపాటు బతికించడానికి, ఇవ్వాళ్ళటి ఆధునిక సమాజానికి అనువుగా బట్టలపై గ్రీటింగ్‌ కార్డులుగా, ఆల్‌ హాంగింగ్స్‌ తదితర వినిమయ వస్తువులుగా ఆట బొమ్మలుగా సమయ స్ఫూర్తితో రూపొందించడం ఈ విద్య తెలిసిన కళాకారులు నేర్చుకోవాలి. అఖిల భారత హస్తకళల సంస్థ, తెలంగాణ హస్తకళల సంస్థ ఈ కళలో యువచిత్రకారులకు శిక్షణ ఇస్తే కూడా ఈ కళ కనుమరుగై పోకుండా కళకళలాడుతుంది.
టి. ఉడయవర్లు