|

తెలంగాణ కుంభమేళ ‘మేడారం’

tsmagazineమేడారం.. ‘అదో’ కుంభమేళ !
మేడారం ‘మహా జాతర’ ఓ అద్భుతం…
మేడారం మహా జాతర ఓ అద్భుతం. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం. గత ఎనిమిది వందల ఏళ్లుగా ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తున్న ఆదివాసీల ఆరాధ్య దైవాల సజీవ సంస్కృతుల సమ్మేళనం. అడవిబిడ్డల ఆరాధ్య దేవతలైన సమ్మక్క-సారలమ్మ పోరాట పటిమకు.. ధిక్కారస్వరానికి.. ఆత్మగౌరవానికి ప్రతీకలు. ఆదివాసీల పరిభాషలో పంచభూత ప్రకృతి దైవాలుగా విరాజిల్లుతున్న సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, నాగులమ్మల కలయికే మేడారం జాతర. కీకారణ్యంలో రెండేళ్లకోమారు ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించడంతో.. మేడారం జాతర అంతర్జాతీయస్థాయికి ఎదిగింది. గూగుల్‌, ఇంటర్‌నెట్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల్లో మేడారం జాతర విశేషాలు మారుమోగాయి. స్వదేశీయుల జానపద పాటలు, విదేశీయుల లఘుచిత్రాలు హైలైట్‌గా నిలిచాయి. బహుభాషల్లో అడవితల్లుల స్మరణ కొనసాగింది. మామూలు రోజుల్లో మౌనం ఆవహించినట్లుండే మేడారం ఒక్కసారి ఆధ్యాత్మిక చింతనతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. ఆదిమ వారసత్వాన్ని ఒకసారి గుర్తుచేసింది. అడవి తల్లులైన సమ్మక్క, సారలమ్మకు భక్తి విశ్వాసమే ప్రధానాలంబనగా సేవించుకొని తరిస్తున్న భక్తులతో మేడారం పులకరించిపోయింది. జంపన్నవాగు.. భక్తిసాగరమైంది. చిన్నారులను కేరింతలు కొట్టించింది. భక్తులకు పూనకాలు తెప్పించింది. అశేష జనాలకు పుణ్యస్నానాలు చేయించింది. జలాశీస్సులు ఇచ్చి.. పరమపవిత్రంగా గద్దెలకు చేర్చింది.

2018 జనవరి 31 మాఘశుద్ధ పౌర్ణమి రోజు జన దేవతల ఆగమనంతో ప్రారంభమైన మేడారం మహాజాతర ఫిబ్రవరి 3 శనివారం ఆ దేవతల వన ప్రవేశంతో ముగిసింది. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు, నాగులమ్మ పంచదైవాలు మేడారానికి వెలుగునిచ్చారు. జాతరకు నిండుదనం తెచ్చారు. తీరొక్కమొక్కులు స్వీకరించారు. మనసారా దీవెనలందించారు. మేడారంలో తల్లుల దర్శనం అపురూపం. తల్లుల చెంత భక్తిపారవశ్యం పొంగిపొర్లడంతో.. సమ్మక్క-సారలమ్మ జాతరలో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది. అది మారుమూల ఆదివాసిపల్లె మేడారం.

‘చూ మంతర్‌’.. అని మాయా నగరం సృష్టించినట్లు నాలుగురోజుల్లోనే ఆ పల్లె.. ఒక మహానగరంగా మారిపోయింది. కోటి మంది భక్తుల తాకిడితో హైటెక్‌ నగరాన్ని తలపింపజేసింది. సాధారణ రోజుల్లో కటిక చీకటిని తలపించే ‘మేడారం’ విద్యుత్‌ దీపాలతో ధగధగ మెరిసి పోయింది. వనమంతా వెలుగుజిలుగులతో కాంతులీనింది. మహానగరాన్ని తలపిస్తూ ముగ్ధమనోహరంగా మారింది. పండు వెన్నెల వెలుగుల్లో మేడారం దేదీప్యమానంగా వెలుగొందింది. కోటిమందికిపైగా భక్తజనం ‘సమ్మక్క తల్లి సల్లంగ సూడు’.. అంటూ చేతులెత్తి మొక్కి పరవశించి పోయారు. భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, చత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌తో పాటు, ఇద్దరు కేంద్రమంత్రులు, రాష్ట్ర శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నేతలు వనదేవతలను దర్శించుకొని పట్టువస్త్రాలు, బంగారాన్ని సమర్పించారు.

2018 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వరకు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ మేడారం జాతర మహాకుంభమేళాను తలపించింది. నేల ఈనిందా అన్నట్లు.. కోటి మంది భక్తజనం ఈ జాతరకు హాజరయ్యారు. అడుగడుగునా భక్తిభావం.. చెట్టుచెట్టుకు పూజలు.. వెరసి మేడారం ‘జన’ వనంలా మారింది. ఇష్టదైవాలను కనులారా చూడానికి భక్తజనులు వెల్లువలా తరలివచ్చారు. తన్మయత్వంతో ఊగిపోయారు. మనసారా స్మరించుకొన్నారు. తనవితీరా మొక్కులు సమర్పించుకొన్నారు. జయజయ ధ్వానాలతో వనదేవతల ప్రాంగణం పరవశించిపోయింది. తల్లుల నామస్మరణతో ఆధ్యాత్మికత వైభవం ఆవిష్కతమైంది. ఎటుచూసినా పచ్చని పంటపొలాలతో ఉండే భూములు జనంతో కిటకిటలాడాయి. శివసత్తుల పూనకాలతో పుడమితల్లి పులకరించి పోయింది. వరాలు ఇచ్చే వనదేవతలకు వందనం.. సమ్మక్క జయహో.. అంటూ భక్తులు భక్తిపారశ్యంతో ఊగిపోయారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిషా, మహారాష్ట్రల నుంచి లక్షలాదిగా తరలి వచ్చారు. ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా, మేడారం జాతర ముచ్చట్లే ప్రతిధ్వనించాయి.

అయితే, కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా మేడారాన్ని గుర్తించకపోయినా, తెలంగాణ ప్రభుత్వం ఈసారి జాతరకు అంతర్జాతీయ మీడియాను రప్పించి జాతర విశేషాలను విశ్వవ్యాప్తం చేసింది. అంతేగాక, గతంలో రాష్ట్ర మంత్రుల వరకే పరిమితమ్కెన జాతరకు ఈసారి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మీడియా ప్రచారం అదనపు ఆకర్షణగా నిలిచింది. ఉపరాష్ట్రపతితో పాటు, ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరువురు కేంద్రమంత్రులు కూడా అమ్మల మీద భక్తితో మేడారం రావడం, తల్లులను దర్శించుకొని పట్టువస్త్రాలను సమర్పించి ఆ వనదేవతల అనుగ్రహానికి వచ్చామని ప్రకటించడంతో జాతరకు ప్రత్యేక గుర్తింపు లభించినట్లయింది.

2018 ఫిబ్రవరి 2న ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు మేడారం వచ్చి గద్దెల వద్ద సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని పూజలు నిర్వహించారు. తల్లులకు పట్టువస్త్రాలను తన బరువు 86 కిలోలకు సరితూగిన బంగారాన్ని (బెల్లం) సమర్పించుకున్నారు. మేడారం జాతరను ఆధ్యాత్మిక సంపదకు ప్రతీకగా అభివర్ణించిన ఆయన జాతరను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తీరుకు మంత్రముగ్ధుడయ్యారు. ఈ సందర్భంగా మేడారం జాతరపై యావత్‌ దేశం దృష్టిపడాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఈ మహాజాతరకు కేంద్రప్రభుత్వ గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. దేవతల ఆరాధనలో అందరి జీవితాలు సుఖమయం కావాలని ఆకాంక్షించారు. మరోవైపు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కుటుంబసమేతంగా మేడారం సందర్శించారు. వనదేవతలను దర్శించుకొని అమ్మవార్లకు పట్టువస్త్రాలను 68కిలోల నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. వనదేవతల దయతోనే ప్రత్యేకరాష్ట్రం ఆవిర్భవించిందని తెలంగాణ రాష్ట్రం సల్లగుండాలని ఆయన మొక్కుకున్నారు. అనంతరం మేడారం జాతరను రూ.200 కోట్లతో అభివృద్ధి చేసి మున్ముందు దక్షిణ భారత కుంభమేళాగా వైభవోపేతంగా నిర్వహిస్తామని ప్రకించారు.

tsmagazine
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీకే ఎన్నికల్లో ప్రజలు పట్టంకట్టడం, ఉద్యమనాయకుడు కేసీఆర్‌ సీఎం కావడంతో మేడారం జాతరకు మరింత ప్రాచుర్యం ఏర్పడింది. 2016 జాతరలో సమాచార, పౌరసంబంధాల శాఖ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్‌, వైఫై, ఈమెయిల్‌, వాట్సాఫ్‌, ఫేస్‌బుక్‌ తదితర ప్రచార సామాజిక మాధ్యమాలను వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. తెలుగున్యూస్‌ ఛానళ్లతో పాటు, ఇతర భాషల న్యూస్‌చానళ్లు ఓబీ వ్యాన్లను ఏర్పాటు చేసుకుని జాతరలో జరుగుతున్న ప్రతీ పరిణామాన్ని ప్రపంచానికి తెలియజేశాయి. ఆధునిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి రావడంతో.. ప్రపంచం అబ్బుర పడేలా ‘మేడారం’ జాతర విజయవంతమైంది. తల్లుల వనప్రవేశంతో ద్వైవార్షిక మహాక్రతువు పరిపూర్ణమైంది. తల్లీబిడ్డల సంబురానికి.. మళ్లీ రెండేళ్లకు వస్తామని భక్తజనం మొక్కుకున్నారు. వన దేవలతను దర్శించుకున్న భక్తులు మేడారం జాతర జ్ఞాపకాలను మదిలో పదిలపర్చుకున్నారు.

tsmagazine
tsmagazineమేడారం జాతర అంతా సీసీ కెమెరాల నడమ కొనసాగింది. జాతరలో తొలి సారిగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించారు. దీంతో మేడారం మెగా సిటీని తలపించింది. పోలీసులు డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాల పుటేజీలతో అప్‌డేట్‌ సమాచారాన్ని అందుకొని తగిన చర్యలు చేపట్టారు. పోలీసులు శాంతిభద్రతలు కాపాడడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహదం చేసింది. జాతరలో ఆర్టీసీ విస్తృతసేవలు అందించింది. పూజారులు, ఆదివాసీ సంఘాలూ సహకరించారు. 40 సెక్టార్లలో అధికారులు సమర్థవంతంగా పనిచేశాయి. సింగరేణి రెస్క్యూ టీం సేవలు ప్రశంసనీయం. భూపాలపల్లి జిల్లా యంత్రాంగంతో పాటు, రెవెన్యూ ఇంజినీరింగ్‌, విద్యుత్‌, వైద్య, పర్యాటక, దేవాదాయ, సమాచార శాఖలు సమర్థవంతంగా పనిచేశాయి. ముందస్తుగానే మేడారం పరిసరాల్లో రోడ్ల విస్తరణ చేపట్టిన అధికార యంత్రాంగం ట్రాఫిక్‌ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసింది. పారిశుధ్యం, తాగునీటి సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత నిచ్చింది. వైద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో సత్వర చికిత్స అందడమేగాక ప్రసవాల సంఖ్య పెరిగింది. అమ్మల సన్నిధిలో సేవలు చేయడం అధికారులు, సిబ్బంది అదృష్టంగా భావించారు. వీఐపీల తాకిడి పెరిగినప్పటికీ.. జాతర ప్రశాంతంగా జరగడంలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప ఇబ్బందులు మినహా జాతర ప్రశాంతంగా ముగిసింది.

  • గడ్డం కేశవమూర్తి