|

తెలంగాణ మహా కుంభమేళా…

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర

By: కన్నెకంటి వెంకట రమణ

ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా సమ్మక్క-సారలమ్మ జాతర వర్ధిల్లుతోంది. ఒక కుంభ మేళా, శబరిమల అయ్యప్ప మకర జ్యోతి దర్శనం, మక్కా సందర్శనను చేసే లక్షలాది భక్తుల మాదిరిగానే దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రోజుల్లోనే దాదాపు ఒక కోటి కి పైగానే భక్తులు సందర్శిస్తారు. వీరిలో అత్యధికంగా గిరిజనులు ఉండడం ఈ మేడారం జాతర ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 1996 లో ఈ జాతరను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరమే మేడారం జాతరకు ప్రపంచ ప్రఖ్యాతి లభించిందని పేర్కొనవచ్చు.

విలక్షణమైన జీవన విధానం ఉన్న ఆదివాసీలు ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలను కలిగిఉంటారు. ప్రకృతితో మమేకమైన ఈ గిరిజనులు ఆరాధించే దేవతలంతా ప్రాకృతిక సంబంధమైన భావనలతోనే ఉన్నారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘపౌర్ణమికి ముందు నాలుగురోజుల పాటు ఈ మహాజాతర భక్తజన సందోహంతో పోటెత్తుతుంది. మేడారానికి 3 కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గ్రామం నుండి సారలమ్మను గిరిజన సాంప్రదాయ మేళతాళాలతో, డప్పుచప్పుల్లతో గద్దె పైకి తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. దీనికి రెండు రోజుల ముందే సారలమ్మ తండ్రి అయిన పగిడిద్ద రాజును కొత్తగూడెం మండలం పూనుగొండ్ల నుండి తీసుకు వస్తారు. సారలమ్మ భర్త అయిన గోవిందరాజులు ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంనుండి ఒకే రోజు గద్దెలపైకి తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు. మరుసటి రోజు సమ్మక్క తల్లిని చిలుకల గుట్ట నుండి గద్దె పైకి తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు.

అమ్మవార్లు గద్దె మీద కొలువుతీరిన రోజు నుండి కోట్లాదిమంది గిరిజనులు, గిరిజ నేరులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి పసుపు కుంకుమలను, ఓడి బియ్యాలను, బెల్లాన్ని సమర్పిస్తారు. కోడిపుంజులు, మేకపోతుల బలులిస్తారు. సమ్మక్క గద్దె చేరే సమయంలో కోడిపుంజులు గాలిలో ఎగురవేసి ఆరగింపును చేస్తారు. తలనీలాలు సమర్పించి జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి తల్లులను దర్శించుకుంటారు. ఇదే జాతరలో లక్ష్మీ దేవరల సందడి, జానపదుల పూనకాలు, జంతు బలులు, స్త్రీ వేషాలు ధరించిన మగవారు, ఛత్తీస్‌ గఢ్‌ గిరిజనుల ప్రత్యేక నృత్యాలు… ఇలా మేడారం జాతర వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే గానీ ఆ సాంస్కృతిక వైభవాన్ని వర్ణించడం సాధ్యం కాదు.

మేడారం జాతరలో ప్రతీదీ వినూత్నమే

రెండు వెదురు కర్రలకు కట్టిన కుంకుమ భరిణెల రూపంలో జంట వనదేవతలుగా, తల్లీబిడ్డలు (సమ్మక్క-సారలమ్మ) భక్తుల్ని అనుగ్రహిస్తారని ప్రతీతి. నాలుగురోజులపాటు సాగే ఈ జాతరలో మొదటిరోజును ఆది ఘట్టంగా వ్యవహరిస్తారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క ప్రతిబింబమైన కుంకుమ భరిణెను తోడ్కొనివస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ ప్రతిరూపమైన పసుపు భరిణెను తీసుకొస్తారు. ఈ రెండింటిని కొత్త వెదురు కర్రలకు కట్టి, జలాభిషేకం చేస్తారు. సమ్మక్క, సారలమ్మలకు ‘మండెమెలిగే’ పేరిట తొలిపూజలు నిర్వహిస్తారు. రెండోరోజు మహాఘట్టంలో ‘మందిర సారె’ పేరుతో జంటశక్తి మాతలకు చీరసారెల్ని సమర్పిస్తారు. మూడో రోజున ‘నిండు జాతర’ నాడు మేడారం లక్షలాది భక్తుల సందోహంతో వర్ధిల్లుతుంది. బెల్లపు దిమ్మెల్ని ‘బంగారం’గా వ్యవహరిస్తూ వాటిని అమ్మతల్లులకు భక్తులు మొక్కుబడులుగా చెల్లిస్తారు. నాలుగోరోజు శక్తిమాతల ‘వనప్రవేశం’తో ఈ జాతర ముగుస్తుంది.

విగ్రహాలు లేని వినూత్న జాతర

సమ్మక-సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత ప్రజలంతా విస్తృతంగా జరుపుకుంటున్నారు, ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు, అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి, ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణలను తీసుకు వస్తారు, పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.

సమ్మక్క జాతర చారిత్రిక నేపథ్యం ఇదీ

కోయ గిరిజనుల ఉనికి కోసం పోరు సల్పిన సమ్మక్క-సారలమ్మ జాతర కీ.శ.1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థల పురాణాలు తెలుపుతున్నాయి. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పగిడిద్దరాజు పరిపాలించే వారు. ఇతను కాకతీయుల సామంతరాజు. అప్పటి కరీంనగరాన్ని పాలించిన మేడరాజుకు మేనల్లుడైన పగిడిద్ద రాజు సతీమణి సమ్మక్క. ఆమెకు పగిడిద్దరాజుతో వివాహం జరిపించారు. పగిడిద్దరాజు, సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. మేడారం పరిగణాలను కోయరాజులు కాకతీయులకు సామంతులుగా ఉండి పరిపాలించేవారు.

ఓసారి మూడు, నాలుగేళ్ళ పాటు మేడారం ప్రాంతంలో అనావృష్టి ఏర్పడింది. దీంతో ప్రజలు పన్నులు కట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నారు. పగిడిద్దరాజు తాను కప్పం కట్టలేనంటూ చేతులేత్తేశాడు. దీంతో ప్రతాపరుద్రుడు వారిపైకి సైనికులను పంపాడు. కాకతీయ సైన్యం ములుగు జిల్లాలోని ములుగు సమీపంలో లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పాటు చేసుకొని యుద్ధం ప్రకటించారు. పగిడిద్ద రాజు అతని కుమార్తెలు, నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువరించి పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి గాంచింది. తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది.ఈటెలు, బళ్ళాలతో కాకతీయసైన్యాలను పరుగెత్తించి అంతం చేసింది. ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక నుంచి పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది.తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారాడు.

పది రోజులనుండే జాతర పూజా కార్యక్రమాలు

జాతర గద్దెల ప్రాంగణానికి సాంప్రదాయ పద్ధతిలో దేవతలను తీసుకు వస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు. మేడారం జాతరకు సుమారు పది రోజుల ముందు నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మ వారిని పూజించి సమ్మక్క దేవతాపూజారులైన సిద్దబోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు చిలుకలగుట్ట వద్దకు వెళ్ళి దేవతను కుంకుమ భరిణ రూపంలో తీసుకు వస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెకు తీసుకు వస్తారు.భక్తుల మొక్కుబడుల రూపంలో బంగారం(బెల్లం)ని సమర్పించుకుంటారు. కోళ్లను, మేకలని, గొర్లని బలిఇస్తారు. మూడు రోజుల జాతర అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు.

గిరిజనులకు సంవత్సరం పొడుగునా ప్రకృతి పండగలే

ప్రకృతితో సహజీవనంచేసే కోయ గిరిజనులు సంవత్సరం పొడుగూతా పండగలే చేసుకుంటారు. ప్రధానంగా కోయజాతి వారు ప్రకృతి అందించిన పంటలను అనుభవించేటప్పుడు పండగలు చేసుకుంటారు. అడవినుండి లభ్యమయ్యే ఉత్పత్తులను కార్తెల లెక్క పండగ చేసుకుంటారు. ప్రధానంగా వీరు చేసుకునే పండగల్లో చిక్కుడు పండగ, మండమెలిగే పండగ, ఇప్పపువ్వు పండగ, విత్తనము పండగ, మాఘ పండగ, పెద్దల పండగ, పచ్చ పండగ, ఎల్లనంపుడు పండగ, వేల్పుల పండగ, కప్పతల్లి పండగ తదితర పండగలను జరుపుకుంటారు.

కేవలం కోయల సంప్రదాయాలను గౌరవించడం, గుర్తించడం వరకు మాత్రమే ఈ జాతర పరిమితం కాదు. నమ్మిన జనం కోసం ప్రాణమైనా ఇవ్వాలనే ఓ సందేశం కూడా అంతర్లీనంగా ఉంటుంది. యుద్ధంలో గెలిచిన కాకతీయులు సామ్రాజ్యాన్ని విస్తరించుకుని చక్రవర్తు లయ్యారు. పోరాటం చేసిన మేడరాజులు మాత్రం దేవుళ్ళు, దేవతలయ్యారు.

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర – 2022 వివరాలు

2022 ఫిబ్రవరి 16న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెల వద్దకు తీసుకురావడంతో జాతర ప్రారంభం.
ఫిబ్రవరి 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెల వద్దకు చేరుస్తారు.
ఫిబ్రవరి 18న సమ్మక్క-సారక్క అమ్మవార్లకు ప్రజలు మొక్కులు సమర్పించుకుంటారు.
ఫిబ్రవరి 19న దేవతల వన ప్రవేశంతో మహా జాతర ముగింపు.