తెలంగాణ మట్టి పరిమళం

magaపాఠకుడు ఏ మనస్థితిలో ఉన్నా కవి తన రచనా ప్రపంచంలోకి, తన ఆలోచనా మార్గంలోకి తీసుకెళ్ళి తన వెంటే తిప్పుకోవాలి. అప్పుడే ఆ కవిత్వానికి భావ సార్ధకత ఏర్పడుతుంది. సరికొత్త భావాలకు సృజనాత్మకతను అద్ది చక్కని అనుభూతిని పంచే కవిత్వమే ”బాయి గిర్క మీద ఊర విశ్క”విశ్వజనీనమైన ఊహాశాలీనత విభిన్నమైన వస్తు వైవిధ్యం, స్థానిక భాష, సౌజన్య వంతమైన అలంకారికత బూర్ల వేంకటేశ్వర్లు కవిత్వానికి పట్టు గొమ్మలయ్యాయి. తెలంగాణ చరిత్ర,ప్రాచీనత,అస్థిత్వం,తెలంగాణ ఉద్యమం దాని పూర్వోత్తర పర్యవసానాల పట్ల అవగాహన ఉన్న బూర్ల ”నేను తెలంగాణను” కవిత రాసారు. ఈ కవిత ముగింపులో తెలంగాణ తల్లి తన ఆత్మను, అస్థిత్వాన్ని చేప్పే తీరులో ఉన్న వాస్తవికత అందర్నీ ఆకట్టుకుంటుంది.ఎన్నీలమ్మను మరదలు పిల్లగా వరుస కలుపుతూ ”ఎన్నిల ముచ్చట్లు” కవిత ఎంతో అందంగా రాసారు.”

కవి తన తల్లిని యాది జేసుకుంటూ రాసిన ”పెద్ద బద్రమ్మ” కవితా కథనం గుండెను తడి చేస్తుంది, బరువెక్కిస్తుంది. పల్లె ఒడిలో ఒదిగి పోయి, కరిగిపోయి కనిపించని దూరానికి వెళ్లిన అమ్మ జ్ఞాపకాలు మరిచి పోలేనివి. కంట తడి పెట్టించే అమ్మ జ్ఞాపకాలు కవిత మరోసారి చదివించే గుణం కలిగి ఉంది.వ్యవసాయం చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర లేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరును చూసి ”బాయి గిర్క మీద ఊర విశ్క” కూడ కంట నీరు పెట్టుకుంటుంది. ఈ స్మశానాన్ని విడిచిపెట్టండని రైతులను వేడుకుంటుంది. ప్రపంచీకరణ ప్రభావం వ్యవసాయాన్ని కుదేలు చేసిన ఛాయలు బాయి గిర్క మీద ఊరవిశ్క కవితలో కనిపిస్తాయి. ”పల్లే నా పల్లే మళ్ళీ మళ్ళీ/నిలువునా పచ్చి కట్టెకు నిప్పు పెట్టి/బగ్గు చేసుకుంటున్న/ఆకాలపు చితిమీద/చితికి పోతున్న నా పల్లె/గుభిల్లు మంటది”. ఈ పంక్తుల్లో గ్లోబలైజేషన్‌ దుష్పప్రభావం అంతర్లీనంగా కాన వస్తుంది.

ఇప్పటికే వ్యవసాయాన్ని వదిలి రైతులు ఇతర వృత్తుల్లోకి,వ్యాపారాల్లోకి వలస వెళ్లిపోయిన వైనం చూస్తున్నాం. చక్కని పద బంధాలతో అర్ధాలంకార సొగసుతో ఈ కవిత జీవం పోసుకుంది.మొత్తం యాభై ఐదు కవితలున్న ఈ సంపుటిలో నేను తెలంగాణను,ఎన్నీల ముచ్చట్లు,బాయిగిర్క మీద ఊరవిశ్క,లేడీ కండక్టర్‌,మందార పూలు,పల్లెతల్లి,పెద్దబద్రవ్వ,పూల సింగిడి,రా!రా! మన్మధా,ఇటుక బట్టీ కార్మికులం, అలిశెట్టి ప్రభాకర్‌,అక్షరాలు మొదలైన కవితలు మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తాయి. వాకిలి,పెద్ద కచ్చురం తర్వాత బూర్ల కలం నుంచి వచ్చిన మూడవ వచన కవితా సంపుటి ”బాయి గిర్క మీద ఊరవిశ్క”. ఇది చక్కని స్థానిక నుడికారంతో,సామాజిక అంశాల మేళవింపుతో సాహిత్య ప్రియులని అలరిస్తుంది.

పుస్తకం : ”బాయి గిర్క మీద ఊరవిశ్క”
రచన: బూర్ల వెంకటేశ్వర్లు

వెల : 100/- ప్రతులకు : బి.సంతోష
ఇంటి నెం.2-10-1524/10, ప్లాట్‌ నెం.403
వెంకటేశ్వర టవర్స్‌,జ్యోతి నగర్‌,
పోస్ట్‌ & మం|| జిల్లా || కరీంనగర్‌