|

విద్యుత్‌ రంగంలో నాడు – నేడు

By: శ్రీ రమేశ్‌ బాబు కాంచనపల్లి

 • భారీ పెట్టుబడులతో విద్యుత్‌ సంస్థల విస్తరణ.
 • జెన్‌కో ఆధ్వర్యంలో పెరిగిన పదివేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి.
 • భారీగా విస్తరించిన విద్యుత్‌ లైన్లు.
 • 57 లక్షలకు పెరిగిన నూతన కనెక్షన్లు
 • 19 నుంచి 26 లక్షలకు పెరిగిన వ్యవసాయ మోటార్‌ కనెక్షన్లు.
 • 6 గంటల నుండి 24 గంటల వరకు వ్యవసాయ విద్యుత్‌
 • కరోనాలోను అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా.
 • రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థ పటిష్టీకరణకు 33,722 కోట్లు ఖర్చు.
 • ఏడేళ్లలో 7778 మెగావాట్ల నుండి 16,623 మెగావాట్లకు విద్యుత్‌ ఉత్పత్తి పెంపు.
 • 26,915 కిలోమీటర్ల జును విద్యుత్‌ లైన్లు ఏర్పాటు.
 • రెండు లక్షల కిలో మీటర్ల పైగా పెరిగిన విద్యుత్‌ లైన్లు
 • కొత్తగా 1000 33/11 కెవి సబ్‌స్టేషన్లు
 • అదనంగా 2వేల పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌
 • మూడు లక్షలకొత్త డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌
 • 168 లక్షల వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా

తెలంగాణా ఒక రాష్ట్రంగా ఏర్పడితే అంధకారం అవుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి బెదిరింపులు. తెలంగాణ వస్తే విద్యుత్‌ ఎక్కడి నుండి వస్తుందన్న ప్రశ్నలు. విద్యుత్‌ వ్యవస్థలు కుప్పకూలతాయని జోస్యాలు. కాని ఇవేవి నిజం కాదని ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం నిరూపించింది. ఏడేళ్లలో అనేక ఇబ్బందులు ఎదురయినా, అవన్నీ ఎదుర్కొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో తెలంగాణ విద్యుత్‌ రంగం అద్భుత ప్రగతిని సాధించింది. తెలంగాణ ఏర్పడితే చీకటే అన్న వారి జోస్యం తప్పని నిరూపిస్తూ తెలంగాణ అంతటా విద్యుత్‌ వెలుగులు నింపుతోంది విద్యుత్‌ శాఖ.

2014లో తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన నాటికి ఒప్పంద సామర్థ్యం (Contracted Capacity) 7,778 మెగావాట్లు మాత్రమే. ఏడేళ్లలో 7,778 మెగావాట్ల నుండి 16,623 మెగావాట్లకు విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంచగలిగాం. ఈ ఏడేళ్లలో రాష్ట్ర అవసరాలకు తగిన రీతిలో నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా వ్యవస్థ పటిష్టీకరణ కోసం రూ. 33,722 కోట్లు ఖర్చు చేసింది.

రాష్ట్రం ఏర్పడే నాటి ముందు పరిస్థితులు
2014 నాటి పరిస్థితులు ఓసారి అవలోకనం చేసుకుంటే విద్యుత్‌ కొరత ప్రధాన సమస్య. ఈ కోతలతో రైతులు, పరిశ్రమలు, గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గల్లీ నుండి అసెంబ్లీ వరకు విద్యుత్‌ కోతలపై చర్చలు, రోడ్లపై ధర్నాలు, పొలాలు ఎండిపోయి, బోర్లలో నీరు ఇంకిపోయి రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా ఉండేవి. రాష్ట్రం ఏర్పడే నాటికి పీక్‌ డిమాండ్‌కి 2,700 మెగావాట్లు విద్యుత్‌ లోటు ఉండేది. రోజుకు నాలుగు నుంచి 8 గంటల వరకు గృహ అవసరాలతో పాటు, ఇతర వినియోగదారులకు కోతలు తప్పని సరి. పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్‌ హాలిడే ప్రకటించే పరిస్థితులు ఉండేవి. వ్యవసాయ రంగానికి నాలుగు నుంచి ఆరు గంటల విద్యుత్‌ అందిచడం కష్టంగా ఉండేది. అదీ నాణ్యమైన విద్యుత్‌ అందించలేని పరిస్థితి. మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్‌ ఫార్మర్లు పేలిపోవడం వంటి సంఘటనలు తరచూ జరుగుతుండేవి. పంటలు ఎండిపోయి రైతుల ఆత్మహత్యల వార్తలు ప్రతీరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపించే పరిస్థితులు ఉండేవి. రాత్రిపూట విద్యుత్‌ ఇవ్వడం వల్ల రైతులు కరెంటు షాక్‌ తగిలి చనిపోవడం, పాము కాటుకు గురయి రైతులు చనిపోయిన సంఘటనలు కోకొల్లలు. ఈ దుస్థితిని తెలంగాణ రైతాంగం, పారిశ్రామిక వేత్తలు, గృహ వినియోగదారులు ఎదుర్కొనేవారు. ఇలాంటి గడ్డు పరిస్థితులను ఉమ్మడి రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు సరిగా ఎదుర్కోవడంలో విఫలమయ్యాయి. ముందు చూపుతో వ్యవహరించి ఈ విద్యుత్‌ సమస్యను పరిష్కరించలేకపోయాయి. కాని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఈ సమస్యకు అవసరమైన అన్ని పరిష్కార మార్గాలను వెదికారు. పక్క రాష్ట్రాలతో విద్యుత్‌ ఒప్పందాలు చేసుకుని, కొంచెం ఖర్చు ఎక్కువయినా సరే తగ్గేది లేదంటూ… రాష్ట్రానికి తక్షణ విద్యుత్‌ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుండి కొనడమే కాకుండా రాష్ట్రంలో కొత్త విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడేళ్లలో విద్యుత్‌ సంస్థలను బలోపేతం చేసి, 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు మార్గం సుగమం అయింది. తెలంగాణ ఏర్పడిన ఆరునెలల్లోనే అన్ని రంగాల విద్యుత్‌ వినియోగదారులకు కరెంటు కోతలు ఎత్తివేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు
2014లో ఒప్పంద సామర్థ్యం 7,778 మెగావాట్ల నుండి నేడు 16,623 మెగావాట్లకు పెంచుకోగలిగాం. ఈ ఏడేళ్లలో 8,845 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యాన్ని పెంచుకోలిగాం. అంటే 114 శాతం విద్యుత్‌ ఉత్పత్తి అదనంగా చేయగలిగాం. అదే రీతిలో సోలార్‌ విద్యుత్‌ 2014 నాటికి 74 మెగావాట్లు మాత్రమే ఉండగా, మరో 3,923మెగావాట్లు పెంచుకుని, నేడు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 3,997 మెగావాట్లకు పెంచుకున్నాం. విద్యుత్‌ పీక్‌ డిమాండ్‌ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, నేడు 13,688 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నాం.

2014లో పీక్‌ డిమాండ్‌కు 2,700 మెగావాట్ల విద్యుత్‌ లోటు ఉన్న స్థితి నుంచి పీక్‌ డిమాండ్‌ సమయంలో 13,668 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేసే స్థాయికి చేరుకోవడం విద్యుత్‌ శాఖ సాధించిన గొప్ప ప్రగతిగా చెప్పవచ్చు. 2014లో కోటి 11 లక్షల వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేయగా, నేడు కోటి 68 లక్షల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడం జరుగుతోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి విద్యుత్‌ వినియోగం 1,356 యూనిట్లు కాగా, 2,021 నాటికి తలసరి విద్యుత్‌ వినియోగం 2,012 యూనిట్ల కు పెరిగింది. దేశ తలసరి విద్యుత్‌ వినియోగం 1,161 యూనిట్లు మాత్రమే. దేశ తలసరి వినియోగంతో పోల్చితే తెలంగాణ రెట్టింపు స్థాయిలో ఉండటం విద్యుత్‌ శాఖ సాధించిన ఘనతగా చెప్పవచ్చు.

ఈ విద్యుత్‌ పంపిణీ కోసం పెద్ద ఎత్తున సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున బోర్లు, బావుల ద్వారానే ఎక్కువ వ్యవసాయం జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రం ఏర్పడే నాటికి 19 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉండేవి. ఈ ఏడేళ్లలో 6 లక్షల 89 వేల కనెక్షన్లు అదనంగా మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పుడు 25 లక్షల 92 వేల కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వడం జరుగుతోంది. దేశంలో మరే రాష్ట్రం ఇలా ఉచిత విద్యుత్‌ 24 గంటలు ఇవ్వడం లేదు.

జెన్‌కో సాధించిన ప్రగతి
2014లో రాష్ట్ర జెన్‌కో పరిధిలో 4,365 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం ఉండగా, ఈ ఏడేళ్లలో 2,570 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్లను ఏర్పాటు చేయడడం జరిగింది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌లో, ఇతర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలతో పోల్చితే జెన్‌కో గణనీయమైన ప్రగతి సాధించింది.

విద్యుత్‌ సరఫరా – పంపిణీ వ్యవస్థల బలోపేతం
33,722 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ప్రభుత్వం విద్యుత్‌ కోతలు లేకుండా నిరాటంకగా నాణ్యమైన విద్యుత్‌ ను డిమాండ్‌ కు తగ్గట్టుగా అందిచగలుగుతోంది. ట్రాన్స్‌ కో పరిధిలోని 400 కేవీ సబ్‌ స్టేషన్లు 2014 లో ఆరు మాత్రమే ఉండగా, వాటి సంఖ్యను 22 కు పెంచుకోగలిగాం. 220 కేవీ సబ్‌ స్టేషన్లు 2014లో 51 మాత్రమే, ఇప్పుడు 96కు పెంచుకోలిగాం. 132 కేవీ 2014లో 176 ఉండగా 243 కు పెంచుకున్నాం. 2014లో మొత్తం 233 సబ్‌ స్టేషన్లు మాత్రమే ఉండగా ఇవాళ ఆ సంఖ్యను విద్యుత్‌ శాఖ 361కు పెంచి నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు అందిస్తోంది. ఈ ఏడేళ్లలో అదనంగా 128 విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాన్స్‌ కో ఆధ్వర్యంలో విద్యుత్‌ పంపిణీ చేసే ట్రాన్స్‌ ఫార్మర్లు 2014లో 552 మాత్రమే ఉండగా ఇవాళ 1,064 ట్రాన్స్‌ ఫార్మర్లకు పెంచడం జరిగింది. ఈ ఏడేళ్లలో 512 విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నుండి విద్యుత్‌ పంపిణీ చేసేందుకు 2014లో 16,379 సర్క్యూట్‌ కిలోమీటర్ల విద్యుత్‌ లైన్‌ మాత్రమే ఉండగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 26,915 సర్య్యూట్‌ కిలోమీటర్లకు పెంచడం జరిగింది. అదనంగా ఈ ఏడేళ్లలో 10,491 సర్యూట్‌ కిలోమీటర్ల విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్‌ పంపిణీ సామర్థ్యం రాష్ట్రం ఏర్పడే నాటికి 14,973 వీహూ (మెగా వోల్ట్‌ ఆంపియర్‌) నేడు ఆ సామర్థ్యాన్ని 37,709 ఎంవీఏ కు పెంచుకున్నాం. అంటే ఈ ఏడేళ్లలో 22,736 ఎంవీఏ పెంచగలిగాం. ఇందు కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసింది.

ఈ రీతిలో పెద్దఎత్తున ట్రాన్స్‌ కో, డిస్కంలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నాం.

విద్యుత్‌ శాఖ స్థితి గతులపై మంత్రుల సమీక్ష
పెద్ద ఎత్తున రైతులకు, పరిశ్రమలకు, గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తోన్న నేపథ్యంలో ఆ శాఖ తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి బీఆర్కే భవన్‌లో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇటీవలే ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదనలను విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ కు సమర్పించింది. విద్యుత్‌ పంపిణీ సంస్థల ఆదాయ – వ్యయాల వ్యత్యాసం ఆ సంస్థలపై ప్రభావం చూపుతుందని ఈ లోటు పూడ్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రెగ్యులేటరీ కమిషన్‌ ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరిగింది. మరో వైపు విద్యుత్‌ సంస్థలు మనుగడ కొనసాగించాలంటే ఈ ఆదాయ – వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, ధరలు సవరించాల్సిందని విద్యుత్‌ సంస్థలు ఒత్తిడి తెస్తున్నందున ఆ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ లోటును ఎలా పూడ్చాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.

ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, ట్రాన్స్‌ కో అండ్‌ జెన్‌ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌ రావు, టీఎస్‌ఎస్‌ పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్‌ కో జేఎండీ శ్రీనివాస్‌ రావుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మరో మారు భేటీ కావాలని నిర్ణయించారు.