తెలంగాణపై పార్లమెంటరీ కమిటీకి ఎం.పి. నారాయణరెడ్డిచే లోక్‌సభలో తీర్మానం

villam-nundiతెలంగాణ భవితవ్యంపై ఆ ప్రాంతం ప్రజల అభిమతం తెలుసుకొనడానికి జనవాక్య సేకరణ (రెఫరెండం) జరపాలని కోరుతూ ఒక ప్రైవేట్‌ బిల్లును 1969 జూలై 25న లోక్‌సభలో నిజామాబాద్‌ నుండి ఇండిపెండెంట్‌గా ఎన్నికైన శ్రీ ఎం.నారాయణ రెడ్డి ప్రతిపాదించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగం కావాలా లేక ప్రత్యేక రాష్ట్రంగా వుండాలా అనే విషయమై అసెంబ్లీ ఓటర్ల జాబితా ప్రాతిపదికపై జనవాక్య సేకరణకు సమగ్రమైన పథకాన్ని ఈ బిల్లు సూచించింది. 1969 ఆగస్టు 21న ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ చేపట్టారు. బిల్లును ప్రతిపాదిస్తూ లోక్‌సభ (నిజామాబాద్‌) సభ్యుడు శ్రీ యం.నారాయణ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్‌ చెన్నారెడ్డి, లేక శ్రీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ పట్ల ద్వేష దృష్టితో ఆందోళనను పరిశీలించవద్దని సభ్యులను కోరుతూ ఇది పూర్తిగా ప్రజల ఉద్యమమని అన్నారు. పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆందోళనకు పరిష్కారం కనుగొనవలసి వుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలనేది ప్రజల కోరిక అని, కనుక పార్లమెంటు మాత్రమే ఈ సమస్యపై నిర్ణయం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంలేదని ఆయన చెప్పారు. పైగా ఈ ఆందోళన రాష్ట్ర ప్రభుత్వంలో విశ్వాస సంక్షోభానికి సంబంధించిందని సహజంగా సమస్య పరిష్కారానికి కేంద్రం జాప్యం చేస్తుందని ఆయన అన్నారు.

కొన్ని రాజ్యాంగ బద్దమైన, న్యాయబద్దమైన హామీలతో తెలంగాణ ప్రాంతం ఆంధ్రలో విలీనమైనదని, ఈ రాజ్యాంగ బద్దమైన హామీలు పరిరక్షించబడేట్టు చూడటం కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు విధి అని ఆయన అన్నారు. రాజ్యాంగ బద్దమైన హామీల రక్షణలో  కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు విఫలం కావడం వల్ల తెలంగాణలో పరిస్థితి తీవ్రమైనదని ఆయన అభిప్రాయపడ్డాడు.

సీనియర్‌ కాంగ్రెస్‌ ఎం.పి, లోక్‌సభలో పరిపాలన సంస్కరణల సంఘం అధ్యక్షుడు శ్రీ .హనుమంతయ్య ఈ బిల్లును సమర్ధిస్తూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెండు రాష్ట్రాలు ఏర్పడినా, మహారాష్ట్ర నుంచి రెండు లేక మూడు రాష్ట్రాలు ఏర్పడినా, ప్రజలను ప్రాతిపదికపై ప్రత్యేక గుజరాత్‌, స్వరాష్ట్రం ఏర్పడినా దేశ సమైక్యతకు ఎలాంటి భంగం కలుగదు. ఎన్నికల ద్వారాగానీ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారాగానీ, పార్లమెంటరీ సంఘం ఏర్పాటు ద్వారా గాని ప్రజలు తమ అభిమతం వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వాలి.

అధికారం నిలుపుకోవవాలన్న ఆలోచనతో ఉండడమే ప్రస్తుత నాయకత్వంతో (బ్రహ్మానందరెడ్డి నాయకత్వం) వచ్చిన ఇబ్బంది. తెలంగాణ కోర్కెను ఆమోదిస్తే, మరింతగా వేర్పాటు కోర్కెలు వ్యాపించగలవని మీరు భావించే పక్షంలో, అందుకు అంగీకరించనిచో మరింత నష్టం కలుగగలదని నేను హెచ్చరిస్తున్నాను. ప్రజల వాంఛను గౌరవించడానికి పరిపాలనా బద్దమైన ఏర్పాటు రాజ్యాంగంతో కల్పించబడింది. ప్రజల హక్కులను వ్యతిరేకించడం రాజ్యాంగ బద్దం కానీ, నైతిక న్యాయం కానీ, దేశభక్తి పూరితంగానీ కాదు. ప్రజాస్వామ్యం ప్రజల వాంఛలను ప్రతిబింబించే ప్రభుత్వ వ్యవస్థ. ప్రజల అభిమతాన్ని మించి ఉన్నతాదికారాన్ని ఆపాదించుకునే హక్కు మనలో ఎవరికీ లేదు. అలాకాని పక్షంలో మనం హిట్లర్లలాగే మారుతాం అని .హనుమంతయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరో పార్లమెంటు సభ్యుడు (ఇండిపెండెంట్‌) శ్రీ ప్రకాశ్‌ వీర్‌ శాస్త్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది. పెక్కు సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేయడం జరుగుతున్నది. పరిస్థితి రాజకీయ నాయకులు, పోలీసుల అదుపునుంచి తప్పింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకంటె మార్గంతరం లేదు. తెలంగాణ ఆందోళన ప్రజాందోళన కనుక ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.

తెలంగాణ ప్రాంత పార్లమెంట్‌ సభ్యుడు (కాంగ్రెస్‌) బాకర్‌ అలీమీర్జా పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాలేదు. 16 లక్షల మంది విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోయారని అన్నారు.

తెలంగాణ ప్రాంత సభ్యురాలు (కాంగ్రెస్‌) లక్ష్మీకాంతమ్మ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం స్వప్రయోజనపరులు, అవినీతి పరులైన రాజకీయ నాయకులచే కల్పించబడిన కుట్ర అని తెలంగాణ ఉద్యమంపై విషం కక్కినారు. ఇతర రాష్ట్రాల ఎం.పి.లు తెలంగాణపై  సానుకూలంగా ఉంటే తెలంగాణ ఎం.పి.గా ఎన్నికైన లక్ష్మీకాంతమ్మ పచ్చి వ్యతిరేకిగా మారినారు.

హోమ్ మంత్రి సాక్షిగా కొత్తగూడెంలో కాల్పులు- ఇద్దరి మృతి – బంద్‌ పిలుపు

1969 ఆగస్టు 5న కొత్తగూడెంలో జలగం వెంగళరావు అభినందన సభ జరుగుతున్న రామచంద్ర ఆడిటోరియం వద్ద నిరసన తెలుపుతున్న తెలంగాణ ఉద్యమ కారులపై పోలీసులు కాల్పులు జరుపగా పదేళ్ల వయస్సున్న బాలుడు దస్తగిరి, 25 ఏళ్ళ రాంచందర్‌ మరణించగా పలువురికి బుల్లెట్‌ గాయాలైనాయి. ఆ సమయంలో వెంగళరావు హాల్లో ఉపన్యసిస్తున్నారు. దీనితో ప్రజాసమితి బంద్‌ పిలుపునిచ్చింది. బంద్‌ ప్రశాంతంగా జరిగింది.

సికింద్రాబాద్‌లో కాల్పులు – ఒకరి మృతి

1969 ఆగస్టు 6న సికింద్రాబాద్‌లోని మార్కెట్‌ ప్రాంతంలో (రాజేశ్వర్‌ టాకీస్‌) ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపగా ఒక వ్యక్తి మరణించాడు. నలుగురికి బుల్లెట్‌ గాయాలైనాయి. రాజస్తాన్‌ సాయుధ పోలీసులు ఈ కాల్పులు జరిపినారు. ఆందోళనకారులు సికింద్రాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌పై దాడికి ప్రయత్నించారని అధికారులు ఆరోపించారు.

ఈ కాల్పులను నిరసిస్తూ ఆగస్టు 7న సికింద్రాబాద్‌లో ప్రజాసమితి బంద్‌ నిర్వహంచింది. కేంద్ర రిజర్వు పోలీసులున్న భవనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అంతకు కొద్దినిముషాలకు ముందే పోలీసులు ఆ భవనాన్ని ఖాళీ చేసారు. ఫర్నిచర్‌ తగలబడింది.

హోమ్ మంత్రి అహంకారం

తెలంగాణ ఉద్యమంలోకి నక్సలైట్లు ప్రవేశించి దౌర్జన్యాలు జరుపుతున్నారని హోమ్ మంత్రి వెంగళరావు ఆగస్టు 7న ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ సామాన్యులవెరికీ ఇష్టం లేదని, 90 శాతం ప్రజలు సమైక్య రాష్ట్రమే కోరుతున్నారని వెంగళరావు అన్నారు. ఆగస్టు 5న పాల్వంచలో జరిగిన బహిరంగ సభలో వెంగళరావు మాట్లాడుతూ 1948లో సాగిన రజాకార్ల ఉద్యమంతో తెలంగాణ ఉద్యమాన్ని పోల్చినారు. ఆనాడు సర్దార్ పటేల్‌ ఏ విధంగా రజాకార్లను అణచినాడో ఈనాడు సాగుతున్న అరాచకాన్ని కూడా పట్టుదలతో గట్టిగా అణచివేయగలనని నొక్కి వక్కాణించారు. (ఆంధ్ర పత్రిక 1969, ఆగస్టు 10)

తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆగస్టు 8న మాజీ మంత్రి వి.బి.రాజు త్రిసూత్ర పథకాన్ని సూచించారు. ఒకటి ప్రభుత్వ నాయకత్వంలో మార్పు జరగాలి. రెండు రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి. మూడు తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులందరినీ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి పిలవాలి. ఈ విషయమై ఆయన ఢిల్లీ వెళ్ళి ఆగస్టు 9న ప్రధానిని, హోమ్ మంత్రి తదితరులను కలిసి చర్చించారు.

– తెలంగాణ ఉద్యమం వల్ల 50 కోట్లు నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినట్లు ఆగస్టు 9న పత్రికలు వెల్లడించాయి. 1969 జూలై ఆఖరు నాటికి అధికారుల అంచనా ప్రకారం తగులబెట్టబడిన బస్సులు 55 (విలువ 25 లక్షలు), 30 బస్సులకు కలిగిన నష్టం విలువు 1.75 లక్షలు, ఆర్‌.టి.సి. ఆదాయం లోటు (బంద్‌ల కారణంగా) 3 కోట్లు, .టి.పి.ఎస్‌ విద్యుదుత్పాదక నిలిచిపోయినందున 9 లక్షలు, రైల్వేలకు నష్టం 2 లక్షలు, 3 సంచార నీటి ట్యాంకులు, ఫైర్‌ సర్వీసెస్‌ అంబులెన్స్‌ ఒకటి తగులబెట్టారు. 12 సార్లు రైల్వే స్టేషన్లపై దాడులు జరిగాయి. 92 ప్రైవేట్‌ వాహనాలు, 48 సినిమా హాళ్ళు, హాటళ్ళు దాడికి గురైనాయి. 7 ద్రాక్ష తోటలు నాశనమైనాయి. 65 పాఠశాలలు, 78 ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగాయి.

తెలంగాణా సమస్యపై ఆంధ్రలో ప్రచారం: గోరా

హైదరాబాద్‌లో సర్వోదయ కార్యకర్తల సభ ఆగస్టు 9న ప్రముఖ సర్వోదయ నాయకుడు గోరా అధ్యక్షతన జరిగింది. తెలంగాణేతర ప్రాంతాలలో ప్రజలకు మరింత అవగతపరచి వారి సహకారాన్ని పొందడానికి తెలంగాణా ఉద్యమ పునాదిని విస్తృతం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. తెలంగాణా ఆందోళనోద్యమంలో నిరాయుధులైన ప్రజల పైన, సత్యాగ్రహులపైన పోలీసులు లాటీఛార్జీ, కాల్పులు జరపడాన్ని సమావేశం ఖండించింది.

చెన్నారెడ్డి, లక్ష్మణ్‌లను సుప్రీంకోర్టులో హాజరు పర్చాలి

1969 ఆగస్టు 25న చెన్నారెడ్డి లక్ష్మణ్‌లను తమముందు హాజరుపర్చాలని, వారితో బాటు విచారణలో స్వయంగా పాల్గొనదలచిన డిటెన్యూలందరినీ హాజరు పర్చాలని ఆదేశాలిచ్చింది సుప్రీం కోర్టు. అంతకుముందు ఈ డిటెన్యూలు దాఖలు చేసిన హైబియస్‌ కార్పస్‌ పిటీషన్లను విచారించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు డిటెన్యూలను హైకోర్టులో హాజరు పర్చాలని ఆగస్టు 12న ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై స్టే కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయగా సుప్రీం కోర్టు హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇస్తూనే డిటెన్యూలను తమముందు హాజరుకాకుండానే హైకోర్టు తమ ముందున్న పిటీషన్లను విచారించవచ్చునని కూడా సూచించింది.

శాసన సభల సంయుక్త సమావేశంలో జై తెలంగాణ నినాదాలు.. ప్రసంగం పూర్తికాకుండానే గవర్నర్‌ నిష్క్రమణ

1969 ఆగస్టు 14న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, మండలి సంయుక్త సమావేశంలో గవర్నర్‌ శ్రీ ఖండూభాయ్‌ దేశాయ్‌ ప్రారంభోపన్యాసం మొదలు పెట్టగానే ప్రత్యేక తెలంగాణ కోరుతున్న సభ్యులు జై తెలంగాణ నినాదాలు చేసి ప్రసంగానికి అడ్డుతగిలారు. కొంచెం ఓపిక పట్టండి అన్న గవర్నర్‌ విజ్ఞప్తిని వీరు పట్టించుకోలేదు. మీరు చెవిటి గానూ, గుడ్డిగానూ వ్యవహరిస్తున్నారని . రాజమల్లు, ఐరేని లింగయ్యలు కేకలు వేసారు. గవర్నర్‌ తన 8 పుటల ప్రసంగాన్ని చదువుతుండగా రాజమల్లు తమ ప్రకటనను చదివారు.

గవర్నర్‌ తమ ప్రసంగంలోని మొదటి రెండుపేరాలు చివరిపేజీ చదివి జై హింద్‌ అని చెప్పి మిగతాదంతా చదివినట్లు భావించుకోవాలని వెళ్ళిపోయారు. గవర్నర్‌ ఇక తమ ప్రసంగాన్ని ముగిస్తారనగా రాజమల్లు, . రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 20 మంది తెలంగాణ శాసనసభ్యులు నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. శాసనభ్యురాండ్రు సుమిత్రా భాయ్‌, ఎన్‌.విమలాదేవి కూడా శాసనసభ్యులు కొందరిని ఆ రోజు ఉదయమే అరెస్టు చేసినందుకు నిరసిస్తూ కేకలు వేశారు.

రాజమల్లు, .రామచంద్రారెడ్డి సభలో తెలంగాణా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పక్షాన చదివిన ప్రకటనను పత్రికలకు విడుదల చేసారు. ఈ ప్రకటనలో తెలంగాణాలో 200 మందికి పైగా ప్రజలను ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నది. అమానుషమైన చర్యలు తీసుకున్నది. ఏడు మాసాలుగా ప్రభుత్వం అనేది లేదు. సంఘంలోని అన్ని అంతస్తులలోని ప్రజలు ఎన్ని విజ్ఞప్తులు పెట్టుకున్నా విన్నవారు లేరు. నేటి ఉదయం ఇద్దరు శాసనసభ్యులను, ఒక శాసనమండలి సభ్యున్ని అరెస్టు చేశారు. ఈ చర్యలన్నింటికి నిరసనగా, ప్రజాస్వామ్య విరుద్ధచర్యలకు అసమ్మతిగా సభ నుంచి నిష్క్రమిస్తున్నాము అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సభ నుంచి వాకౌట్‌ చేసిన సభ్యులు.. ఎం. బాగారెడ్డి, జి.సైదయ్య, జిన్న మల్లారెడ్డి, సోమ్ భూపాల్‌రెడ్డి, రత్నమ్మ, విమలాదేవి, నర్సింహరామయ్య, టి.లక్ష్మారెడ్డి, సంతోష్‌ చక్రవర్తి, శివరావు షేత్కర్‌, ఐరేని లింగయ్య, డా..నాగన్న, .రాజమల్లు, .రామచంద్రారెడ్డి, సుమిత్రాదేవి, సి.జగన్నాధరావు, టి.కనకరత్నమ్మ, లక్ష్మీనరసింహారెడ్డి, జి.ముత్తారెడ్డి, సి.హెచ్‌. సత్యనారాయణ రావు, టి.ఎస్‌.మూర్తి. సభ ముగిసిన తర్వాత ఇళ్ళకు వెళ్ళిపోతున్న మంత్రుల కార్లపై తెలంగాణ ఉద్యమ కారులు అసెంబ్లీ వద్ద రాళ్ళు , టమోటాలు విసిరినారు. మంత్రుల కార్లకెదురుగా బాలా బాలికలు తెలంగాణ పతాకాలను ఎగురవేసారు. 1969 ఆగస్టు 14న ఉదయం అరెస్టు చేశారని పై ప్రకటనలో ప్రస్తావించిన శాసనసభ్యులు పాల్వాయి గోవర్ధన రెడ్డి, జి.వి. సుధాకర్‌ రావు, శ్రీమతి జె.ఈశ్వరీ భాయి. (సశేషం)