తెలంగాణలోనే ప్రజలు గెలిచారు
- శాసనసభలో సీఎం కేసీఆర్
దేశంలో 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ, మోడీ గెలిచారని, తెలంగాణలో 2018, డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 7 పనిదినాల్లో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు 12వ తేదీన ద్రవ్య వినిమయబిల్లు పై చర్చల అనంతరం సీఎం కేసీఆర్ శాసనసభలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. దేశంలో ఏ ఎన్నికల్లో అయినా ప్రజలు గెలవాలి కానీ, పార్టీలు, వ్యక్తులు కాదని అన్నారు. ప్రజలు గెలిస్తేనే ప్రజా పాలన వచ్చినట్లు అని పేర్కొన్నారు.
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో రెండు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వృద్ధులు, మహిళలు, చేనేత కార్మికులు, రూ. 3వేలు పెన్షన్ పొందుతున్న వికలాంగులు, ఎకరాకు సంవత్సరానికి రూ. 10వేలు రైతు బంధు పొందుతున్న రైతన్నలు, 24 గంటలు ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులు, నీటి బిందెలు మోసుడు లేకుండా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటివద్దే మంచినీటి నల్లాలతో నీళ్ళు పట్టుకుంటున్న మహిళలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నిండి సాగు చేసుకుంటున్న వ్యవసాయదారులు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు పొందుతున్న రైతన్నలు, ప్రభుత్వ పథకాలతో విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు విజయం సాధించారని సీఎం పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలని, సమాజం పురోగతి సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్ గెలుపు ప్రజల గెలుపు, తెలంగాణలో ప్రజలను గెలిపించి చూపించాం, దేశంలో కూడా ప్రజలను గెలిపించి చూపిస్తాం, అభివృద్ధి గురించి మాట్లాడే హక్కే మోదీకి లేదు. ఏమీ చేయకపోయినా, డబ్బా కొట్టుకోవడమనేది కరెక్టు కాదని మోదీ సర్కారుకు చురకలంటించారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ సంకుచిత రాజకీయాలను మానుకోవాలని, తెలంగాణపై పక్షపాతాన్ని వీడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు సహకరిస్తే తప్పకుండా రాష్ట్రం కేంద్రానికి సహకరిస్తుందని వెల్లడించారు. మోదీ రెండు సార్లు గెలిచారు. బీజేపీ కూడా గెలిచింది. కానీ ప్రజలు ఓడిపోయారు, ఎక్కడ పెరిగింది దేశం? దేంట్లో పెరిగింది? ఉపన్యాసాల్లోనా? లేక అదానీ ఆస్తుల్లోనా, ఇంత జరిగినా మౌనమా? దోస్తు బండారం బయటపడ్డదే అని మోదీ బాధపడ్తున్నడని అన్నారు. కాంగ్రెస్ హయాంలో లైసెన్స్ రాజ్.. బీజేపీ మోదీ హయాంలో సైలెన్స్ రాజ్ నడుస్తున్నదన్నారు. అప్పులు చేయడంలో నరేంద్ర మోదీని మించిన ఘనుడు మరొకరు లేరన్నారు. ఒక్క మెడికల్ కాలేజైనా ఇవ్వని బీజేపీకి మనం ఒక్క ఓటైనా ఎందుకెయ్యాలె?, ఒక్కటంటే ఒక్క మంచి పనన్నా చేసిండా మోదీ ఈ దేశానికి!, కేంద్రం చేతకానితనంతో రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయల నష్టం, నేను చెప్పిన వాటిల్లో ఒక్కటి తప్పున్నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి సవాల్ విసిరారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వాగుల్లో నీళ్లు పారినట్టు.. బీఆర్‌ఎస్‌కు డబ్బాల్లో ఓట్లు పారుతయని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో మోదీ అత్యంత చెత్త స్పీచ్ ఇచ్చారన్నారు. 10 లక్షల కోట్ల సంపద ఆవిరైతే.. పట్టదా?, దేశానికి థర్డ్ క్లాస్ ముద్రవేస్తే.. పరిస్థితేమిటి?, ప్రశ్నిస్తే మీడియాపై నిషేధం.. కోర్టు కేసులా?, ఇంత అహంకారమా? ఇంత అసహనమా?, కేంద్రానికి నీళ్ల లెక్కలు తేల్చడం చేతకాదా?, పనికిరాని చట్టాలను సముద్రంలో పడేయండి, కేంద్రంలో కిసాన్ సర్కార్ వస్తేనే రైతుకు మేలు, దమ్మున్న ప్రధాని ఉంటే నిరంతరం విద్యుత్తు అని పేర్కొన్నారు.
అన్నిరంగాల్లో మోదీ సర్కారు ఘోర వైఫల్యం చెందిందని, తగ్గిన జీడీపీ వృద్ధి రేటు, భారీగా పెరిగిన అప్పులే ఇందుకు నిదర్శనమని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇవి అబద్ధమైతే రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు. ఎగుమతులు ఎందుకు పడిపోయినయి? మేకిన్ ఇండియా జోకిన్ ఇండియా అయింది, విశ్వగురు ఏమైపాయె? ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి విశ్వగురు అవసరం లేదు. దేశగురు చాలని భారత ప్రజలు అంటున్నారన్నారు. అందుకే అన్నిచోట్లా బీఆర్‌ఎస్‌కు జేజేలు పలుకుతున్నరని పేర్కొన్నారు. బర్రె గుద్దితే పచ్చడైపోతున్న వందే భారత్ రైలుకు ప్రధాన మంత్రి వెళ్లి 14 సార్లు ప్రారంభోత్సవాలు చేస్తడా? గతంలో ఇంతకన్న మంచి రైళ్లు శతాబ్ది, రాజధాని వంటివి మొదలు కాలేదా? గత ప్రధానమంత్రులు ఇలా చేశారా అని ప్రశ్నించారు.
2023-24 నాటికి ఇండియాను 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చేస్తామని మోదీ ప్రకటించటం పెద్ద జోక్. ఆ లక్ష్యమే స్వల్పం, పోనీ దాన్నీ చేరుకున్నారా అంటే అదీ లేదు. అమెరికా ఆర్థికశక్తి 25, చైనా 18.3, జపాన్ 4.3, జర్మనీ 4 ట్రిలియన్ డాలర్స్.. ఇండియా ఎకానమీ ఇప్పటికీ 3.3 ట్రిలియన్ డాలర్లే. అసలు వాస్తవ ఎకానమీ గ్రోత్ పర్ క్యాపిటాలో ఉంటుంది. తలసరిపై ఐఎంఎఫ్ రూపొందించిన 192 దేశాల ర్యాంకుల జాబితాలో భారత్ ర్యాంకు 139. అదీ మన దేశ నిజమైన ఎకానమీ. పక్కనున్న బంగ్లాదేశ్ 138వ ర్యాంకులో ఉండగా, భూటాన్, శ్రీలంక కూడా మంచిస్థానాల్లో ఉన్నాయని సీఎం కేసీఆర్ గణాంకాలతో సహా వివరించారు.
దేశంలో బీజేపీ పాలన గుడ్దెద్దు చేలో పడ్డట్టుగా సాగుతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. మంచిది, చెడ్డది అని చూడకుండా అన్నింటినీ, అంతులేకుండా ప్రైవేట్‌పరం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ్యతల నుంచి తప్పుకోవడమే కాకుండా ఏకంగా పారిపోతున్నదని, ఇదేమని అడిగితే సహించలేకపోతున్నదని మండిపడ్డారు.
బాధ్యతల నుంచి తప్పుకోవడం ఏమిటి..?
మోదీ ప్రభుత్వం సోషలైజేషన్ ఆఫ్ లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ (నష్టాలను ప్రజలమీద రుద్దాలి.. లాభాలను కార్పొరేట్లకు పంచాలి) అనే కుటిల నీతిని అనుసరిస్తున్నదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో, పేద ప్రజల కోణంలో కొన్ని రంగాల్లో కచ్చితంగా ప్రభుత్వం తగిన పాత్ర పోషించాల్సి ఉంటుందని, కానీ మోదీ ప్రభుత్వం వ్యాపారం చేయబోమంటూ తప్పించుకోజూస్తున్నదని ధ్వజమెత్తారు. ‘ఎక్కడ అవసరముంటే అక్కడ కచ్చితంగా ప్రభుత్వమే తగిన పాత్ర పోషించాలి. అందులో భాగంగానే రైతుల ధాన్యం, మార్క్‌ఫెడ్ ద్వారా సజ్జలు కొంటున్నాం. ఈటల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు స్వయంగా మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ అని పెట్టామన్నారు. ప్రజల సౌకర్యార్థం, క్రాస్ సబ్సిడీ చేయాల్సి ఉంటది. ప్రభుత్వం వ్యాపారం చేయాల్సి ఉంటది. లాభం వచ్చేవేకాకుండా నష్టం వచ్చేవాటిని సమ్మిళితం చేసి ముందుకుపోవాలి. మొత్తానికి మొత్తం ప్రైవేట్‌కు వదిలేయడం సరికాదని దుయ్యబట్టారు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో, పేద ప్రజల కోణంలో కొన్ని రంగాల్లో కచ్చితంగా ప్రభుత్వం పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. కాడి కిందపెట్టేవాడు సిపాయి ఎట్ల అయితడు? ప్రధాని మోదీ బాధ్యతల నుంచి తప్పుకోవడమే కాకుండా ఏకంగా పారిపోతున్నారు. అన్నీ ప్రైవేట్ పరం చేస్తం, కొంటే కొను లేకపోతే ఆకలితో చావు అంటే కుదరదు’ అని సీఎం స్పష్టంచేశారు.
బీజేపీని ప్రజలు సాగనంపుతారు
బీజేపీ చెప్పే ముచ్చట్లు, ప్రదర్శిస్తున్న జులుం, పెడుతున్న కొట్లాటలన్నీ తాత్కాలికమని, ఎన్నో రోజులు ఉండబోవని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 2024లో బీజేపీ ఓటమి వందశాతం ఖాయమని స్పష్టంచేశారు. ‘బంగ్లాదేశ్ యుద్ధం గెలిచిన సందర్భంలో ఇందిరాగాంధీని స్వయంగా వాజ్‌పేయి పొగిడారు. దుర్గామాతగా అభివర్ణించారు. ఇక ఆమెకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎదురేలేదని అందరూ భావిస్తున్న తరుణంలో ఒక్క అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా చెలరేగిన నిప్పుతో ఏం జరిగిందో అందరికీ తెలుసు.
లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపుమేరకు మహానాయకురాలిని దేశం గిల్లిపారేసింది. అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ కూడా అదే తప్పులు చేసిందని, దేశం మళ్లీ ఇందిరాగాంధీని తెచ్చిపెట్టుకొన్నది. ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదు. ఏదైనా ప్రజలకు ఇష్టమున్నంతవరకే. కన్నుమిన్ను కానకుండా మాట్లాడటం, మేము చేసిందే రైటు, ఎవరేం అడిగినా చెప్పం అనే భావన మంచిది కాదు. సంయమనం, హుందాతనం ఉండాలి. లేదంటే సమాజం ఒప్పుకోదు’ అని బీజేపీకి చురకలంటించారు.
కాంగ్రెస్‌తో కాలే. బీజేపీతో కాలే. అందుకే విసుగెత్తి నేను వచ్చిన. మేమే అధికారంలోకి వస్తం. ప్రతి ఎకరానికీ సాగునీరిస్తం. ప్రతి ఇంటికీ తాగు నీరిస్తం. 24 గంటలు కరెంటు ఇస్తం. చెప్పుడు కాదు. చేసి చూపిస్తం. తెలంగాణలో చూపించలేదా. మేమే అధికారంలోకి వస్తం. అట్లనే చూపిస్తం.నేను ఇండియన్‌ను.. నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన భారతీయుడిని. ఐ యామ్ ఎన్ ఇండియన్..ఇది ఒక దేశభక్తుడి సగర్వ ప్రకటన చేస్తున్నానన్నారు. బీఆర్‌ఎస్ వట్టిగ షోకుల కోసం పెట్టలె. మేం విసిగి వేసారిపోయినం. నేనూ, మోదీ సమాంతరంగా ఒకేసారి అధికారంలోకి వచ్చినం. ఆయన ప్రధాని అయ్యిండు. నాలుగైదురోజులకు నేను ముఖ్యమంత్రి అయిన. చూసీ.. చూసీ.. చూసీ.. విసిగిపోయి, యాష్టకొచ్చి, రిటైరయ్యే వయసులో నేను ఈ పని మీదికెత్తుకున్న. చూడబుద్దయితలేదు. ఈ దేశం ఇట్ల నాశనం అయితుంటె అని చెప్పారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక బంగారు తెలంగాణ సాధించిన విధంగానే భారతదేశాన్ని అన్ని రంగాల్లోను ముందుకు తీసుకెళతామని, ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకునేలా చేసి చూపెడతామని సీఎం ప్రకటించారు.

ఎన్ని తప్పులు చేసినా తమనెవరూ ప్రశ్నించకూడదన్న అహంకారంతో బీజేపీ వ్యవహరిస్తున్నదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పొరపాట్లు దొర్లిపోతున్నా, దేశం అట్టుడుకుతున్నా మోదీ మీడియా రాయడం లేదు. రాసేవాళ్లు రాస్తున్నా దానిపై కేంద్రం ఏమాత్రం స్పందించడం లేదు. కాంగ్రెస్‌ను తిట్టడమే బీజేపీ వాళ్ల ఏకైక నమూనా. ఇటీవల బీబీసీ గోద్రా ఘటనపై ఒక డాక్యుమెంటరీ ప్రసారం చేస్తే, ఆ సంస్థను నిషేధించాలని బీజేపీకి చెందిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో కేసు వేశారు. అంత అహంకారమా? ఎక్కడికి పోతున్నది ఉన్మాదం? అది దేశానికీ అలంకారమా? ప్రపంచం మనగురించి ఏమనుకొంటది? ఇంత అసహనమా? ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతేనా? దీని గురించి ప్రజాస్వామికవాదులు, సమాజ పురోగతిని ఆకాంక్షించేవాళ్లు ఆలోచించాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇంత పెద్ద దేశాన్ని నడిపేప్పు డు ఎక్కడో ఒక చోట, ఏదో ఒక తప్పు జరుగుతుందని, దానిని ధైర్యంగా ఒప్పుకోవాలి కానీ ప్రశ్నించినవాళ్లను జైళ్లలో వేస్తాం అనడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
దేశంలో చాలా గందరగోళం నెలకొని ఉన్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను మించి రూ.48 లక్షల కోట్లకుపైగా ఆస్తులున్న, ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీని అమ్మిపారేస్తం అంటే ఎలా? 1953లో నెహ్రూ ప్రభుత్వం జాతీయం చేసిన ఎయిరిండియాను, నేడు మోదీ సర్కారు తిరిగి మళ్లీ అదే టాటా కంపెనీకి ధారాదత్తం చేసింది. అమ్మకానికి కారణమేంటని పార్లమెంట్‌లో ఎంతమంది అడిగినా, పేపర్లలో ఎంత రాసినా కేంద్రం సమాధానం చెప్పడం లేదు. కానీ టైం వచ్చినప్పుడు కచ్చితంగా ఆ ప్రశ్నలకు ప్రజలే సమాధానం చెప్తారు ’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబాటా?
మోదీ పాలనలో మన దేశం అన్ని సూచీల్లోనూ కిందికే వెళ్తున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘అంతర్జాతీయ ఆర్థికవేత్త, ప్రొఫెసర్ అశ్వత్థ దామోదర్ లెక్క ప్రకారం అదానీకి ప్రస్తుతమున్న షేర్ వాల్యూ చాలా ఎక్కువ. అసలు వాస్తవాలు తెలిస్తే ప్రస్తుతమున్న స్థానం కంటే అదానీ మరింత కిందకు పోవడం ఖాయం. అంటే ఎంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నవో ప్రజలంతా ఆలోచన చేయాలి’ అని సీఎం సూచించారు. దేశంలోని ఇరిగేషన్ పాలసీని సమూలంగా తీసి బంగాళాఖాతంలో పడేసి కొత్త ఇరిగేషన్ పాలసీని ప్రవేశపెట్టాల్సిందే. ఈ పనిని కాంగ్రెస్, బీజేపీ చేయలేకపోయాయి. కచ్చితంగా రేపు మా గవర్నమెంటే వస్తది. చేసి చూపిస్తం. ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. ఐదారేండ్లలో ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఒక రేషన్ డీలర్‌తో దేశ ఆర్థిక మంత్రి కొట్లాటా?
చాలా బాధ అనిపిస్తున్నది. ఇంతపెద్ద ఈ సువిశాల భారతదేశానికి అర్థిక మంత్రిగా పనిచేసే వ్యక్తి వచ్చి, బాన్సువాడలో ఒక రేషన్‌షాపు దగ్గరికి వచ్చి నిలబడి డీలర్‌తో కొట్లాట పెట్టుకుంటదా? ప్రధానమంత్రి ఫొటో ఎందుకు పెట్టలేదని! ఒక డీలర్‌తో దేశ ఆర్థిక మంత్రి కొట్లాటపెట్టుకుం టదా? పాపం.. సింధువులో బిందువంత డీలర్ ఏమై పోవాలె? అయినా ఏం సాధించిండని, ఏం గొప్పతనం చూపిండని మోదీ ఫొటో పెట్టుకోవాలె? అని కేసీఆర్ ప్రశ్నించారు.
రైల్వే స్టేషన్‌లో లిఫ్టును జాతికి అంకితం చేస్తరా!
ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు టూత్ పాలిష్ చేస్తరట. రంగులేస్తరట. దానిని ప్రధానమంత్రి వచ్చి ప్రారంభిస్తడట. మరో కేంద్ర మంత్రి వచ్చి రైల్వేస్టేషన్లో లిఫ్టులను, అదే జనం ఎక్కి దిగే లిఫ్టులను జాతికి అంకితం, నిజమేనండీ జాతికి అంకితం చేస్తడు. ఏమన్న ఉన్నదా! ఇదా దేశాన్ని నడిపే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు.
తిరుమలరాయుడి కథలా మోదీ తీరు..
ప్రధానికి పొగడ్తలు ఎక్కువైపోయాయని సీఎం అన్నారు. ఏందా పొగుడుడు? అయినదానికీ కానిదానికీ పొగుడుడేనా? భజన బృందం మోదీనిట్ల పొగుడతనే ఉంటది. పొగుడుతనే ఉంటరు. ఎప్పటిదాకా. మాజీ ప్రధాని అయ్యేదాక పొగుడుతదన్నారు. పార్లమెంట్‌లో ఎదుటివాళ్లను కించపరుస్తూ ఎవరూ మాట్లాడకుండా బుల్డోజింగ్ చేస్తున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఒక సందర్భం, పద్ధతి లేకుండా, అయిందానికి, కానిదానికి మోదీని పొగుడుతున్నారని, అది విని తాను కూడా గొప్పని పీఎం అనుకుంటున్నారని విమర్శించారు. ఒక కథను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ఉదహరించారు.
‘తిరుమలరాయుడు అనే రాజుకు ఒకటే కన్ను ఉంటది. ఒక కవి తనకు ఇష్టం లేకపోయినా రాజువద్ద నుంచి బహుమతి పొందాలనే ఉద్దేశంతో..
‘‘అన్నాతి గూడ హరుడవు
అన్నాతిని గూడకున్న అసురగురుండౌ
అన్నా తిరుమలరాయా
కన్నొక్కటి లేకయున్న కౌరవపతివే ।’’
అంటూ కవి కీర్తించిన వైనాన్ని సీఎం వివరించారు. ఈ కథను సీఎం విడమరచి చెప్పగా సభంతా నవ్వులతో నిండింది. ప్రస్తుతం మోదీని పొగుడుతున్న వాళ్లు కూడా ఆ కవిలానే ఉన్నారని, మోదీకి పొరపాట్లను చెప్పకుండా, ఏమీ లేకపోయినా, చేయకపోయినా అంతా బాగుంది బాగుంది అంటున్నారని విమర్శించారు. మోదీ దిగిపోయినా ‘మాజీ ప్రధానిగా ఉంటవు తక్కువేం ఉన్నది అంటరు’ కాబోలని సీఎం వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై వివరణ
కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంకా ముంపునకు గురవుతున్న ప్రాంతం ఉన్నదనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి మేరకు వెంటనే సర్వే చేయిస్తాం. నిజంగానే నష్టం ఉంటే ఆ భూమిని కూడా సేకరించి బాధితులకు పరిహారం అందజేస్తామని తెలిపారు.
డైట్ చార్జీలు పెంచుతం
గతంలో అడగకుండా విద్యార్థుల డైట్ చార్జీలు పెంచాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన విజ్ఞప్తులను మన్నిస్తాం. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విద్యార్థుల డైట్‌చార్జీలను ఏ మేరకు పెంచాలో, అవసరమైతే ఈటలకు ఫోన్ చేసి సలహా తీసుకోవాలి. ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ చర్చించి రెండు మూడు రోజుల్లో జీవో విడుదల చేయాలి. ఎక్కడెక్కడ ఎంతమేరకు పెంచాలో అంతవరకు పెంచుతూ రెండు మూడు రోజుల్లో జీవో విడుదల చేయాలని సూచించారు. మహిళల రుణాల విషయంలో కూడా సమస్యేమీ లేదని, బకాయిలు పెట్టకుండా ఏ నెలకు ఆ నెల క్లియర్ చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. గెస్ట్ లెక్చరర్లు ఉన్నన్ని రోజులు వారికి జీతాలు ఇవ్వాలని చెప్పారు. ఉద్యోగులకు వేతనాలు పెంచుతం, దేశంలోనే మన రాష్ట్ర ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్నం. రాష్ట్ర పురోభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. వారికి మళ్లీ వేతనాలు పెంచుతమని పేర్కొన్నారు.