తెలంగాణ ప్రాచీన వారసత్వం వివరించే గ్రంథం

ప్రాచీన భారతదేశానికి లిఖిత చరిత్ర లేదు. ఆనాటి నాణాలు, నిర్మాణాలు, వస్తు సామగ్రి ఆధారంగా చరిత్రను సమన్వయపరుచుకోవడం ఒక్కటే మార్గం. తెలంగాణ చరిత్ర కూడా ఇట్టి నాణాలు, శాసనాలు, నిర్మాణాలు, మట్టి పాత్రలు, పూసలు ఆధారంగా నిర్మించుకోవాల్సిందే! తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే, నిజాం కాలంనుండే పురావస్తు శోధన జరుగుతున్నదట. సంఘటితమైన ప్రయత్నయలోపంవలన ఈ ఆధారాలపై తగినంత వెలుగు ప్రసరించలేదు. ప్రస్తుత గ్రంథం ‘తెలంగాణాలో శాతవాహన వారసత్వం’ మంజీరా రచయిత సంఘం (మరసం)లోగడ ప్రకటించారు. ప్రపంచ మహాసభలు (డిసెంబర్‌ 2017, 15నుంచి 19) సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీవారు రెండవ ముద్రణగా 2017లో ప్రకటించిన చిన్ని పొత్తమిది. రచయిత ఈమని శివనాగిరెడ్డి గొప్ప చరిత్ర, పురావస్తు శాస్త్రజ్ఞులు. వివిధ ప్రాంతాల్లో త్రవ్వకాల్లో దొరికిన అవశేషాలననుసరించి తెలంగాణ ప్రాంతాన్ని క్రీ.పూ. 300 సం||లో గోపరాజులు పాలించారని, వారి తర్వాత శాతవాహన రాజులు క్రీ.పూ. 230 వరకు పాలించారని, తర్వాత ఈ ప్రాంతం వాకాటక రాజు మొదటి ప్రవరసేనుని వశమైనదని తెలుస్తున్నది. (పే 36)

ఏ జాతికైనా చరిత్ర ప్రధానమైనది. వర్తమానానికి పునాది వంటిది. ఆనాటి ప్రజల సాంఘిక జీవనం, వృత్తులు, పనిముట్లు, ఆభరణాలు: ఒక్కటేమిటి-ఆనాటి ప్రజలనాడి, గుండె చప్పుడు తెలిపే పరిశోధనా గ్రంథమిది. రచయిత తాను చెప్పిన విషయాలకు ప్రమాణికంగా ఆయా గ్రంథాలు పరిశోధనా పత్రాల (పేజీలు 86-94వరకు) వివరాలు ఇవ్వడం ఎంతో శాస్త్రీయంగా ఉంది. ఈ సందర్భంగా రచయిత, ప్రచురణకర్త ఇద్దరూ అభినందనీయులు.

తెలంగాణలో శాతవాహన వారసత్వం
డా॥ ఈమని శివనాగి రెడ్డి
పేజీలు:96, వెల:రూ.150/-

ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమీ
కళాభవన్, రవీంద్రభారతి
హైదరాబాదు.