విద్యుత్‌ ఉత్పత్తి లో దేశంలోనే అగ్రగామి

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, విద్యుత్‌ కోతలతో, పవర్‌ హాలిడేలతో భయంకరమైన బాధలు అనుభవించింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా చరిత్రకెక్కింది. నేడు  యావత్‌ భారతదేశంలో కరెంటు కోతలు విధించని ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. 

మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందించడం ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యపడిన అద్భుతం. వ్యవసాయానికి ఉచితంగా, ఇతర రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. విద్యుత్తు రంగంలో సమూలమైన మార్పులు తేవడం వల్లనే ఈ అద్భుతమైన విజయం సాధ్యమైంది. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రథమస్థానంలో నిలిచింది.

2014లో తెలంగాణ తలసరి విద్యుత్‌ వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగింది. ఈనాడు రాష్ట్రంలో అన్ని రంగాలకూ నిరంతరాయంగా, రైతులకు ఉచితంగా, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం మన తెలంగాణ . రాష్ట్రం ఏర్పడిన నాడు విద్యుత్‌ కోతలతో, పవర్‌ హాలిడేలతో ఉక్కిరిబిక్కిరైన సందర్భాలు ఉండేవి.

రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 17,305 మెగావాట్లు. సోలార్‌ విద్యుదుత్పత్తిలో రాష్ట్రం గత ఎనిమిదేళ్ళలో 74 మెగావాట్ల నుండి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయికి పెరుగుదల సాధించింది. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచింది. 

ఇక జాతీయ తలసరి వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్‌ వినియోగం 73 శాతం అధికంగా ఉంది. తలసరి విద్యుత్‌ వినియోగం అనేది ఒక సమగ్ర పురోగతిని ప్రతిబింబించే సూచిక. తెలంగాణ రాష్ట్రం తలసరి విద్యుత్‌ వినియోగం మనకెంతో గర్వకారణం.  పర్యావరణ భద్రతలో భాగంగా,  తెలంగాణ సోలార్‌ పవర్‌ పాలసీ దేశంలో అత్యుత్తమ సోలార్‌ పాలసీలలో ఒకటిగా పరిగణించ బడింది. ఇప్పటివరకు చుట్టూ రాష్ట్రంలో 4,950 మెగావాట్ల సోలార్‌ పవర్‌ కెపాసిటీ అభివృద్ధి చెందుతుందని అంచనా. వచ్చే ఏడాదిలో 8,000 మెగావాట్లు దాటనుంది. ఇది తెలంగాణ రాష్ట్రం.. విద్యుత్‌ రంగంలో సాధించిన గొప్ప విజయం.

తెలంగాణ ఏవిధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో, సంభావించారో.. అదేవిధంగా నేడు తెలంగాణ అన్నిరంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నది.  రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమించి.. దేశానికే దారిచూపే టార్చ్‌ బేరర్‌గా నిలిచింది. విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలలో అనతి కాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించి దేశానికే దిశానిర్దేశనం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన ప్రగతిశీల, పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగింది.