ఆరోగ్యంలో తెలంగాణ ఆదర్శం

By: సిద్ధార్థ్‌

ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వం కనీస భాద్యత. ఆ భాద్యతను నిర్వర్తించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనిమిదేళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య వసతులు లేక ప్రజలు ఎన్నో అవస్థలు పడేవారు. ఎజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభించి ప్రజలు పిట్టల్లా రాలిపోయేవారు. ఊళ్లకు ఊళ్లే మంచాలు పట్టేవి. మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాల్సిన పరిస్థితులు ఉండేవి.

ఇక పెద్ద రోగం వస్తే వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్‌ దాకా రావాల్సిన దుస్థితి ఉండేది. ఈ క్రమంలో సకాలంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు. గర్భిణుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసేవారు. కాన్పు అంటేనే తల్లికి ప్రాణగండంగా ఉండేది. పుట్టిన బిడ్డను కళ్ల నిండా చూసుకోకముందే ఎందరో తల్లులు చనిపోయేవారు.

నాటి పాలకులు ప్రభుత్వ వైద్య రంగాన్ని విచ్ఛిన్నం చేసి ప్రైవేటును ప్రోత్సహించారు. దీని వల్ల ప్రజలు ప్రతి ఆరోగ్య సమస్యకు ప్రైవేటును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో పేదలు వైద్యంపై అధికంగా ఖర్చు చేసి ఆర్థికంగా చిక్కిపోయేవారు. ఏదైనా పెద్ద రోగం వస్తే అప్పులు చేసి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. ఆ కుటుంబాలు పేదరికంలోకి జారిపోయేవి. ఇలా పేదలు, మధ్య తరగతి ప్రజలు తమ సంపాదన అంతా జీవితాంతం అప్పులు, వడ్డీలు కట్టేందుకే సరిపోయేది. ప్రాణాలు దక్కాయని సంతోషపడాల్నో, అప్పుల పాలయ్యామని బాధపడాల్నో తెలియక మానసికంగా కుంగిపోయేవారు.

ఉద్యమ నేతగా సీఎం కేసీఆర్‌ ఊరూరు తిరుగుతున్నపుడు ఈ దుర్భర పరిస్థితులను కళ్ళారా చూశారు. చలించిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైద్య రంగం బలోపేతంపై దృష్టి పెట్టారు. సబ్‌ సెంటర్‌ నుంచి అన్ని స్థాయిల ఆసుపత్రుల వరకు మౌలిక వసతులు, మానవ వనరులు కల్పించి బలోపేతం చేశారు. దీనికోసం తగిన ఆర్థిక వనరులు అందిస్తూ ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేశారు. దీంతో ఆరోగ్య రంగంలో ఆరోగ్య సేవల వికేంద్రీకరణ, విస్తరణ జరిగి తెలంగాణ గత 8 సంవత్సరాలలో గణనీయమైన ప్రగతి సాధించింది.

ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డో… సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఉంటే, ఇప్పుడు నేను సర్కారు దవాఖానకే పోత బిడ్డా… అనే పరిస్థితి తెలంగాణలో ఆవిష్కృతమైంది. కేసీఆర్‌ కిట్లు, అమ్మఒడి వాహనాలు, ఆరోగ్య లక్ష్మీ వంటి అద్భుతమైన పథకాల అమలు, ముఖ్యమంత్రి దార్శనిక విధానాలు దీనికి ఎంతగానో తోడ్పాటునందించాయి. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వైద్య సేవల్లో వచ్చిన మార్పులు, నీతి అయోగ్‌, ఎకనామిక్‌ సర్వే వంటి ప్రతిష్టాత్మక నివేదికలు, కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ప్రశంసలు…
ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించింది. వైద్య సేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని వెల్లడిరచింది. వైద్య సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తలసరి ఖర్చు 1698 రూపాయలు. ఆరోగ్య రంగంలో అత్యధికంగా తలసరి ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది.

తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం, ప్రభుత్వ తలసరి వైద్య ఖర్చు రూ. 3,092కు చేరుకుంది. ఈ విషయంలో గుజరాత్‌ రూ. 1,821, రాజస్థాన్‌ రూ. 2,646, మధ్య ప్రదేశ్‌ రూ.1,716, కేరళ రూ. 2,874, కర్ణాటక రూ. 2,151 ఒక్కొక్కరి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాయి.

నీతి అయోగ్‌ జిల్లా ఆసుపత్రుల సేవల రిపోర్టు ప్రకారం, వ్యాధి నిర్ధారణ సేవలందించడంలో, ఆసుపత్రుల్లో ముఖ్య సేవలు అందించడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. నవజాత శిశు సంరక్షణ సేవల విషయంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది.

భారత ప్రభుత్వం ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ఇచ్చిన అవార్డులు తెలంగాణను వరించాయి. హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఎన్సీడీ స్క్రీనింగ్‌లో రెండో స్థానంలో ఉంది.
కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన జ్వర సర్వే విధానం దేశానికి ఆదర్శంగా నిలిచింది, బెస్ట్‌ ప్రాక్టీస్‌ అని నీతి అయోగ్‌ అభివర్ణించింది.

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పటిష్టమైన కార్యచరణ అమలు చేసిన మూడో అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణను ఎకనామిక్‌ సర్వే గుర్తించింది.

రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు తాజాగా భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయం నివేదిక స్పష్టం చేసింది. దీని ప్రకారం, తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్‌) 92 ఉండగా, ఇప్పుడు 56కు చేరుకున్నది. అతి తక్కువ ప్రసూతి మరణాలు నమోదవుతున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

జాతీయ ఆరోగ్య సూచిల్లో పురోగతి…..

 • ప్రసూతి మరణాల రేటు
  2014: 92
  2021: 56 (ప్రస్తుత దేశ సగటు 103)
 • శిశు మరణాల రేటు
  2014: 39
  2021: 23 (ప్రస్తుత దేశ సగటు 32)
 • నవజాత శిశు మరణాలు
  2014: 25
  2021 : 16 (ప్రస్తుత దేశ సగటు 22)
 • ఐదేళ్ళలోపు పిల్లల మరణాల రేటు
  2014 : 41
  2021 : 30 (ప్రస్తుత దేశ సగటు 36)
 • పూర్తి టీకా కార్యక్రమం
  2014 : 68 శాతం
  2021 : 100 శాతం (ప్రస్తుత దేశ సగటు 79)
 • ఆసుపత్రులలో ప్రసవాలు
  2014 : 91 శాతం
  2021 : 97 శాతం (ప్రస్తుత దేశ సగటు 79)
 • ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు
  2014 : 30 శాతం
  2021 : 52 శాతం