శాంతి, భద్రతల పరిరక్షణలో దేశానికే రోల్‌ మోడల్‌

కె. వెంకటరమణ

2014 సంవత్సరం జూన్‌ నెలలో నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన చారిత్రక వారసత్వానికి మారుపేరు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆర్ధిక ప్రగతికి, అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు, పౌరులందరి భద్రతకు, రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. కాస్మో పాలిటన్‌, మెట్రో పాలిటన్‌, గంగ – జమునా సమ్మిళిత సంస్కృతికి పేరుగాంచిన తెలంగాణ ఇప్పుడు పారిశ్రామిక, వ్యాపార, సేవా రంగాలలో విస్తృతంగా అంతర్జాతీయ పెట్టుబడులను, బహుళ జాతి సంస్థలను ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న మౌలికసదుపాయాలు, పటిష్టమైన శాంతి, భద్రతల పరిస్థితి ఇలాంటి దీర్ఘకాలిక పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రపంచ చిత్ర పటంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు అందిస్తున్నాయి.  అంతర్జాతీయంగా పేరొందిన బహుళ జాతి కంపెనీలన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. మరికొన్ని అదే దారిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతకు, లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం కూడా దిగువ తెలిపిన పౌర కేంద్రీకృత లక్ష్యాలను నిర్దారించుకొని అమలు చేస్తోంది.

CM KCR launching new police vehicles

అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, ప్రగతికి సానుకూలమైన వాతావరణం కల్పించడం ద్వారా ప్రజా భద్రత, రక్షణ ప్రమాణాలను ప్రోత్సహించడం. ప్రజల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడితే, రాష్ట్ర ప్రగతి, ప్రజల అభివృద్ధి, పెట్టుబడుల కల్పన సాధ్యం కాదన్నది రాష్ట్ర ప్రభుత్వ విశ్వాసం.  

జూన్‌ 2014 లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఐదేళ్ళలో రాష్ట్ర పోలీసు విభాగం ఎన్నో క్రియాశీలక ప్రక్రియలకు, సాంకేతిక ప్రయోగాలకు చొరవ తీసుకున్నది. రాష్ట్ర ప్రజలకు తగిన రక్షణ, భద్రత కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం అందించిన సంయుక్త మార్గనిర్దేశనం మేరకు రాష్ట్ర పోలీసు విభాగం తీసుకున్న చొరవను, చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించే ప్రయత్నమిది. 

ప్రధాన మంత్రి ప్రతిపాదించిన ‘స్మార్ట్‌ పోలీసింగ్‌’ భావనకు అనుగుణంగా ఈ కింద తెలిపిన కీలక అంశాల ప్రాతిపదికగా ఈ ప్రయత్నాలు జరిగాయి. 

  • ఖచ్చితంగా ఉండటం – సున్నితంగా ఉండటం 
  • ఆధునికత – మొబైల్‌ 
  • ఎల్లవేళలా అలర్ట్‌గా ఉండటం – జవాబుదారీతనంతో వ్యవహరించడం 
  • విశ్వసనీయత – బాధ్యతాయుత పనితీరు 
  • సాంకేతికత వినియోగం – శిక్షణ పొందడం 

శాంతి భద్రతలు:

తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ సంతృప్తికర స్థాయిలో ఉన్నది.  గడచిన ఆరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ కూడా తీవ్రమైన శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాలేదు. ఆయా భాగస్వామ్య పక్షాల సమన్వయంతో రాష్ట్రంలో ఎక్కడ కూడా అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూడటంలో రాష్ట్ర పోలీసులు పూర్తిగా సఫలమయ్యారు. దానికి అవసరమైన రీతిలో క్రియాశీలక చొరవ ప్రదర్శించారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతలు కాపాడే విషయంలో రాష్ట్ర పోలీస్‌ విభాగం కమ్యూనిటీ పోలీసింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. 

హైదరాబాద్‌ తో పాటుగా  రాష్ట్రంలోని అనేక ప్రధాన నగరాలు, పట్టణాలలో లక్షలాది సి.సి.టి.వి. కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతోమంది నేరస్తులను అరెస్ట్‌ చేయడానికి వీలైంది. నేరానికి పాల్పడితే కటకటాలు తప్పవనే సందేశం నేరస్తులకు వెళ్ళేలా చేయడానికి ఇది చాలా ఉపయోగపడింది.  టి.ఎస్‌. కాప్‌, హాక్‌ ఐ, సైబర్‌ క్రైం డిటెక్షన్‌ టూల్స్‌ వంటి అత్యాధునిక సాంకేతిక అప్లికేషన్లను వినియో గించుకుంటూ, బాధితులకు సత్వర న్యాయం అందించే ప్రయత్నాలు కూడా ఎంతగానో సఫలీకృతమయ్యాయి. 

రాష్ట్రంలో సంచలనం రేపిన అనేక కేసులను అవి జరిగిన 24 గంటలలోనే ఛేదించడం జరిగింది. నిందితులను అరెస్ట్‌ చేసి, త్వరితగతిన విచారణ పూర్తి చేసి,  నేరాలకు పాల్పడిన వాళ్లకు వెంటనే శిక్షలు పడేలా ప్రయత్నాలు జరిగాయి.  మహిళలు,  పిల్లలపై జరిగిన అనేక నేరాలలో విచారణ అనంతరం కోర్టులు నేరస్తులకు యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్షలు విధించాయి. మళ్ళీ మళ్ళీ నేరాలకు పాల్పడే వాళ్ళపై పి.డి. చట్టం కింద కేసులు బుక్‌ చేసి, వాళ్ళు తిరిగి నేరాలకు పాల్పడకుండా కట్టడి చేయడం జరిగింది. 

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలుగా పేరొందిన అనేక ప్రాంతాల్లో, మత పరమైన శాంతి భద్రతల పరిస్థితి కూడా పూర్తిగా అదుపులో ఉన్నది. అన్ని ప్రాంతాలలో ప్రశాంతత ఉన్నది. ఎక్కడా అవాంచనీయ సంఘటనలు లేవు. బోనాలు, గణేష్‌ ఉత్సవాలు, బక్రీదు, మొహర్రం, బతుకమ్మపండగ వంటి సందర్భాలలో అవసరమైన మేరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల సహాయ సహకారాలతో అవన్నీ ప్రశాంతంగా ముగిశాయి. ఏమైనా ఉల్లంఘనలు జరిగితే నిర్దిష్ట చట్టాల పరిధిలో కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. 

ఎలక్ట్రానిక్‌  నిఘా – పర్యవేక్షణ:

సి.సి.టి.వి. ఆధారిత పర్యవేక్షణ అన్నది ఒక వినూత్న ప్రక్రియ.  ప్రజలు తమంత తాముగా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, చట్ట బద్ధ సంస్థల మార్గదర్శకత్వం, సహాయంతో దానిని అమలు చేసుకుంటున్నారు. ఈ ప్రయత్నానికి చట్టబద్ధత కల్పించ డానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా భద్రత (ప్రమాణాలు) అమలు చట్టం, 2013 రూపొం దించింది. నేర నియంత్రణలో పౌరులు, కమ్యూనిటీకి భాగస్వామ్యం కల్పించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.  కార్పోరేట్‌ సామాజిక బాధ్యత పరిధిలో  ప్రభుత్వ రంగ కంపెనీలు, కార్పోరేట్లను కూడా ఈ ప్రయత్నంలో భాగస్వాములుగా చేయడం జరిగింది. సామాజిక బాధ్యత కింద ఈ వ్యవస్థ ఏర్పాటుకు నిధులు అందించే వెసులుబాటు ఇందులో ఉన్నది.  

కమ్యూనిటీ సి.సి.టి.వి. ప్రయత్నంలో అతి కీలక అంశం 

రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, హై వే లు, ఫ్రీ వే లు, ప్రధాన రోడ్లు, ట్రాఫిక్‌ జంక్షన్లు, నేరం జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలు, వీధులు, పార్కులు, పబ్లిక్‌ ప్రదేశాలు, ప్రభుత్వ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రదేశాలు – వీటన్నింటి మీద  సంపూర్ణ రీతిలో నిఘా, పర్యవేక్షణ ఉండేలా రాష్ట్ర స్థాయిలో ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరకంగా ఈ సి.సి.టి. వి. వ్యవస్థ సురక్షిత నగరానికి ఒక కవచం లాంటిది.  దీనివల్ల ప్రజా భద్రత మెరుగుపడుతుంది.  జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. నేరాలని నిరోధించడం లేదా నిర్మూలిం చడానికి బాగా ఉపయోగపడే సాంకేతికత ఇది. ప్రజలకు రక్షణ కల్పించే క్రమంలో ఇప్పుడు ఇదొక కీలక వ్యవస్థ.  ఒక పక్క ప్రజలకు తాము సురక్షితంగా ఉన్నామన్న నమ్మకాన్ని కలిగిస్తుంది. మరో పక్క నేరాలకు పాల్పడే వాళ్లకు నేరం చేస్తే పోలీసులకు దొరికిపోతామనే భయాన్ని కలిగిస్తుంది. 

జిల్లా కేంద్రాలలో కమాండ్‌, కంట్రోల్‌ కేంద్రాలు / యూనిట్లు:

తెలంగాణాలోని అన్ని జిల్లా కేంద్రాలు/కమీషనరేట్ల పరిధిలో కమాండ్‌, ట్రోల్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అన్ని చోట్లా 24/7 నిఘా పర్యవేక్షణకు ఏర్పాట్లు జరిగాయి. సి.సి.టి.వి. నిఘా కెమెరాలు అందించే వీడియో ఫుటేజిల ఆసరాగా ఈ నిఘా పర్యవేక్షణ అమలవుతున్నది. 

కమ్యూనిటీ / విజిబుల్‌ పోలీసింగ్‌:

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచడం, పెట్టుబడులకు, వ్యాపారాభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించే క్రమంలో భద్రత అనేది ఒక కీలక అంశం. పోలీసుల పనితీరు అందరికీ తెలిసేలా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోనూ పోలీసు పెట్రోలింగ్‌ ను విస్తృతం చేయడం జరిగింది. ఈ విజిబుల్‌ పోలీసింగ్‌ అంశానికి రాష్ట్ర పోలీసు విభాగం ఇప్పుడు చాలా ప్రాధాన్యం ఇస్తున్నది.  పెట్రోలింగ్‌, సాంప్రదాయ బీట్‌ నిర్వహణ పద్ధతులలో ఇప్పుడు జియో స్పేషియల్‌ టెక్నాలజీని వాడుతున్నది. అనుమానితులు, నేరస్తులు, సంఘ విద్రోహ శక్తులను  ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగాకుండా కట్టడి చేయడం జరుగుతోంది. సున్నితమైన ప్రాంతాలు, నేరాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు, ఆసుపత్రులు, స్కూళ్ళు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు,, చారిత్రక ప్రాధాన్యత ఉన్న  కట్టడాలు, మత పరమైన ప్రార్థనా ప్రదేశాలు వంటి కీలక ప్రాంతాలన్నింటినీ జియో ట్యాగింగ్‌ చేయడం జరిగింది.  జి.ఐ.ఎస్‌. మ్యాప్‌ ప్లాట్‌ ఫారం ఆధారంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోని మొబైల్‌ యాప్‌ ‘టి.ఎస్‌. కాప్‌’ ద్వారా ఈ ప్రాంతాలపై నిరంతర నిఘా, పర్యవేక్షణ జరుగుతున్నది. అదే క్రమంలో, గతంలో నేరాలు జరిగిన ప్రదేశాలు, అనుమానితులు, నేరస్తులు నివాసం ఉండే ప్రాంతాలను  కూడా టి.ఎస్‌.కాప్‌ మొబైల్‌ యాప్‌ లో జియో ట్యాగింగ్‌ ద్వారా అనుసంధానం చేసి పర్యవేక్షించడం జరుగుతున్నది. 

సమాజంలోని అందరికీ తెలిసే రీతిలో పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించడానికి జి.ఐ.ఎస్‌. సాంకేతికతను  సమర్ధవంతంగా వినియోగించుకోవడం జరుగుతోంది. ఇ – బీట్‌,  వెహికల్‌ పెట్రోలింగ్‌, నేర నియంత్రణ నిఘా కార్యకలాపాలలో ఇది బాగా ఉపయోగపడుతున్నది.  ఇంతకుముందు నేరాలు జరిగిన ప్రాంతాలను జియో ట్యాగింగ్‌ చేయడం మూలాన పెట్రోలింగ్‌ను మరింత విస్తృతం చేయడానికి వీలయింది. దాంతో సున్నితమైన ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలలో నేర నియంత్రణపై పట్టు పెరిగింది. 

New-vehicles-to-Telangana-Police-Department

గ్యాంబ్లింగ్‌ సెంటర్లు, పేకాట క్లబ్బుల మూసివేత:

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం  తరువాత రాష్ట్రంలో ఎక్కడ కూడా గ్యాంబ్లింగ్‌ సెంటర్లు, పేకాట క్లబ్బులు నడవడం లేదు. అన్ని గ్యాంబ్లింగ్‌ సెంటర్లు, పేకాట క్లబ్బులను మూసివేయడం జరిగింది. స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది, ప్రత్యేక బృందాలతో పాటు మామూలుగా శాంతి భద్రతలు నిర్వహించే పోలీసులు చక్కటి సమన్వయంతో పని చేస్తూ వీటిని కట్టడి చేశారు.  

తెలంగాణా పోలీసులు సాధించిన కొన్ని అతి ముఖ్యమైన విజయాలు:

  • హైదరాబాద్‌ నగరాన్ని ‘సురక్షిత నగరం’గా  మెర్సర్‌ సంస్థ నిర్ధారించడం .
  • ఆర్‌.బి.వి.ఆర్‌.ఆర్‌. పోలీస్‌ ఆకాడమీ 2014-15 సంవత్సరానికి  దేశంలోనే అత్యుత్తమ శిక్షణా సంస్థగా (గెజిటెడ్‌ ఆఫీసర్లకు) కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా తొలి ట్రోఫీని అందుకోవడం  
  • రాష్ట్రంలో ఎక్కడా టెర్రరిజం, మావోయిస్టుల చర్యలు లేకుండా చేయడం.
  • రాష్ట్రంలోని అనేక పోలీస్‌ స్టేషన్‌ లకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్లుగా గుర్తింపు 
  • ఎన్‌.సి.ఆర్‌.బి. డాటా ప్రకారం, తెలంగాణా రాష్ట్రంలో 66 శాతం కేసులు సి.సి.టి.వి.ల సహాయంతో  కనుక్కోగలగడం  
  • మార్చి, 2018లో మహిళా భద్రతా విభాగం నెలకొల్పడం.
  • మనదేశంలో ఐ.సి.జె.ఎస్‌. వ్యవస్థతో సి.సి.టి.ఎన్‌.ఎస్‌. వ్యవస్థను ఇంటిగ్రేట్‌ చేసిన రాష్ట్రాలలో తొలి రాష్ట్రం తెలంగాణ కావడం మరో విశేషమైన విజయం.                           

మహిళా, శిశు భద్రత:

  • మహిళలు, పిల్లల హక్కుల సంరక్షణ, వారి భద్రత కోసం చేపట్టిన చర్యలలో ‘షి’ బృందాలు, భరోసా కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.  మహిళలు, పిల్లల హక్కుల సంరక్షణ, భద్రత అంశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా ఇవి అద్భుతమైన రీతిలో పని చేస్తున్నాయి. 
  • ఈవ్‌ టీజింగ్‌, పబ్లిక్‌ ప్రదేశాలలో మహిళలను వేధించడం  వంటి నేరాలను నియంత్రించడంలో నగరంలోని అన్ని ప్రాంతాలలోనూ  ‘షి’ బృందాలు చురుకుగా పని చేస్తున్నాయి. గుట్టుగా పనిచేస్తూ నేరాలకు పాల్పడిన వాళ్ళను ఆధారాలతో సహా చట్టానికి అప్పగిస్తున్నాయి. 
  • భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అవసరమైన న్యాయ సలహాలు, వ్యక్తిగత కౌన్సెలింగ్‌, అవగాహన కల్పించడం వంటి సహాయ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయడం జరుగుతున్నది. 
  • మైనర్‌ పిల్లలపై జరిగే నేరాల విచారణకు గాను ‘పోస్కో’ చట్టం పరిధిలో వినూత్నమైన ‘బాలల స్నేహపూర్వక కోర్టులు’ ఏర్పాటు చేయడం జరిగింది. విచారణ క్రమంలో పిల్లలు ఏ ఇబ్బంది పడకుండా ఉండే వాతావరణంతో పాటుగా అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు అన్నీ ఈ కోర్టులలో ఉన్నాయి. బాలల సంరక్షణ కేంద్రం, పిల్లల కోసం ప్రత్యేక సేవలు, కౌన్సిలింగ్‌, భద్రత పరమైన సౌకర్యాలు అన్నీ ఈ కోర్టులలో  కల్పించడం జరిగింది

హ్యాక్‌ ఐ మొబైల్‌ యాప్‌: 

స్నేహపూర్వక, బాధ్యతాయుత పోలీసింగ్‌లో భాగంగా, ‘హ్యాక్‌ ఐ’ మొబైల్‌ యాప్‌ను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగింది. ప్రజలను బాధ్యతాయుతమైన పౌర పోలీసులుగా మలచడం ఈ యాప్‌ ఉద్దేశం. ఇది ప్రజలపై విపరీతమైన ప్రభావాన్ని చూపించింది. ఇప్పటివరకు మొత్తం 32 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.