తెలంగాణ సమస్య – ఢిల్లీలో చర్చలు

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సమస్య పరిష్కారానికై 1970 ఆగస్టు మూడవ వారంలో నాయకుల మధ్య చర్చలు ప్రారంభమైనాయి. 9 నెలల కాలం తర్వాత ప్రజా సమితి అధ్యక్షులు డా|| చెన్నారెడ్డి ప్రధాని ఇందిరతో సమావేశమైనారు. తదనంతరం చెన్నారెడ్డికి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి మధ్య ఢిల్లీలో చర్చలు జరిగినాయి.
tsmagazine

ఢిల్లీ నుండి ఆగస్టు 20న హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. ”చెన్నారెడ్డితో జరిపిన సంభాషణలు ప్రధాని చొరవతో కాద”ని ముఖ్యమంత్రి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ”మేము మిత్రులవలె కలుసుకున్నాము. సహృద్భావ వాతావరణంలో మా సంభాషణలు కొనసాగాయి” అని ముఖ్యమంత్రి అన్నారు. డా|| చెన్నారెడ్డితో సంభాషణలు ఇంతకుముందు కొండాలక్ష్మణ్‌ తదితరులతో తెలంగాణా సమస్యపై కొనసాగించిన చర్చలలో భాగమేనని బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఒక విలేకరి ప్రశ్నకు బదులిస్తూ” నాతో ఏమి చర్చించినప్పటికీ అది ప్రత్యేక తెలంగాణపై ఉండబోదు” అని ముఖ్యమంత్రి అన్నారు.

”ఢిల్లీలో జరిగిన సమాలోచనలు చాలా ప్రయోజనకరం. ఇలాంటి సమావేశాలవల్ల అపోహలు వైదొలగి పోగలవ”ని ముఖ్యమంత్రి అన్నారు.

”కొందరు తెలంగాణా నేతలు మేఘాలయ పద్ధతిలో తెలంగాణా సమస్యను పరిష్కరించాలని సూచిస్తున్నారు. మేఘాలయ పద్ధతిలో ఉపరాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలన్న ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితికి ఎంతమాత్రం సరిపోద”ని ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి అన్నారు.

తెలంగాణా ప్రాంతీయ సంఘానికి చట్టబద్ద ప్రతిపత్తిని కల్పించే విషయమై ప్రధానితో చర్చించారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ… ప్రాంతీయ సంఘానికి చట్ట ప్రతిపత్తి అనేమాట తనకు అర్థం కావడం లేదని, తెలంగాణ సంఘం అధికారాలపై రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వునకు చట్ట ప్రతిపత్తి కలదని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ సమస్యపై ప్రధాని వైఖరిలో మార్పు ఉన్నట్లు తనకు తెలియదని మరొక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఇంతకు ముందు ఒక అంగీకారానికి వచ్చిన ప్రతిపాదనను అందరకు ఆమోద యోగ్యమైన పద్ధతిలో ఏ విధంగా అమలు జరపాలన్నది అందరిముందున్న ప్రధాన సమస్య అని వివరించారు. ప్రధానితో, డా|| చెన్నారెడ్డితో తానేమీ మాట్లాడినారో ఆ విషయాలను మాత్రం ముఖ్యమంత్రి వెల్లడించలేదు.

చర్చించిన ఎం.పి.లు

తెలంగాణపై ప్రధాని మొండి వైఖరిని గమనించిన తెలంగాణ ప్రాంత ఎంపిలు పరిష్కారం దిశగా కొత్త పథకంపై ఆగస్టు 20, 21 తేదీల్లో ఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ మేరకు ఒక మెమోరాండం ఎంపిలకు పంపిణీ చేశారు. దీన్ని త్వరలోనే ప్రధానికి సమర్పిస్తారని పత్రికలు వెల్లడించాయి.

తెలంగాణ ప్రాంతీయ సంఘానికి బాధ్యత వహించే చట్టబద్దమైన కార్యనిర్వాహక యంత్రాంగాన్ని నిర్మించాలని ఈ పథకంలో సూచించారు. రాష్ట్రపతి ఉత్తర్వులమేరకు ప్రాంతీయ సంఘం పరిధిలో గల అంశాలపై ఆ సంఘం చేసే నిర్ణయాలను ఈ యంత్రాంగం అమలు పర్చాలని సూచించారు.
tsmagazine

ఎం.పి.లను విమర్శించిన ప్రజా సమితి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని ప్రక్కన పెట్టి కొత్త పథకం గురించి ఢిల్లీలో కొందరు ఎంపిలు చేస్తున్న ప్రయత్నాలను హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రజా సమితి నేతలు తీవ్రంగా విమర్శించారు. టి.పి.ఎస్‌. వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎ. మదన్‌మోహన్‌ ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ”మేఘాలయ పద్ధతి ఉపరాష్ట్రం కన్నా కొద్దిగ తక్కువ స్థాయి పథకాన్ని రూపొందించడానికి తెలంగాణ పార్లమెంట్‌ సభ్యులు ఢిల్లీలో సృష్టిస్తున్న ‘ఏకాభిప్రాయం’ తెలంగాణ పౌరులు రెండవ తరగతి పౌరసత్వానికి కూడా తగరని, అందువల్ల వారిని మూడవ తరగతి పౌరులుగా ప్రకటించవలసిందని చెప్పినట్లు వున్నద”ని విమర్శించారు.

”తమ ద్వంద్వ విధేయతలను కాపాడుకోవాలనే ఆతృతతోను, తమ సిట్టింగ్‌ ఎం.పి. స్థానాలు రక్షించుకోవాలన్న కోరికతోనూ వారు ఈ పని చేస్తుండవచ్చు. ప్రధాని పట్ల అత్యధిక గౌరవం కలిగివుండే వారిలో నేనెవరికీ తీసిపోను గానీ ప్రజల ఆశయాలను, బాధను వ్యక్తం చేసేటప్పుడు సగౌరవంగానే అయినా నిర్భయంగా వ్యవహరిచడం అవసరం” అని ఎ. మదన్‌మోహన్‌ తన ప్రకటనలో తెలిపారు. ”కొందరు స్వార్ధపరులు తమ రాజకీయ మనుగడ కోసం కేంద్ర స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలో కూడా ఎల్లప్పుడూ నాయకత్వాన్ని, పెడదోవ పట్టిస్తూండడం దురదృష్టకరం. నాయకత్వానికి ప్రజలకు మధ్య పెద్ద అగాథం ఏర్పడి ఉన్నది. ఫలితంగా ప్రధాని మన కోరికలోని న్యాయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు” – అని మదన్‌ మోహన్‌ అభిప్రాయపడినారు.

”ఈ సమస్యను యిప్పటికన్నా ఎక్కువ తీవ్రంగా పరిశీలించవలసిందని, దీనిని మానవతా సమస్యగా పరిగణించవలసిందని, లేకపోతే 1972లో తెలంగాణ ప్రజలు బ్యాలెట్‌ పెట్టె ద్వారా తమ భవితవ్యాన్ని నిర్ణయించుకునేందుకు సమస్యను వారికి వదిలివేయవలసిందని ప్రధానికి, రాష్ట్రపతికి, పార్లమెంట్‌లోని జాతీయ రాజకీయ వర్గాలకు, మన తెలంగాణ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. గత 14 సంవత్సరాల కాలంలో ఉత్పన్నమైన పెక్కు క్లిష్ట సమస్యలకు మరొక పరిష్కారం లేనందునే ప్రత్యేక రాష్ట్రం కోరడం జరిగింది. అన్ని సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కార ప్రాతిపదిక లేకుండా రాజకీయ అవసరంతో రూపొందించే పరిష్కారం తెలంగాణా ప్రజలకు ఆమోదనీయం కాదని, చిత్త శుద్ధితో, వినయంతో మనవి చేస్తున్నాను. ఉద్యమం మరింత తీవ్రమైన రూపంలో ఈ నాయకులు అనుకున్న దానికంటే ముందుగా తిరిగి విజృంభించవచ్చు”నని ఎ. మదన్‌ మోహన్‌ ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ ప్రజాసమితి ప్రధాన కార్యదర్శి ఎస్‌. వెంకటరాంరెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ… తెలంగాణకు రాష్ట్ర ప్రతిపత్తి యిస్తేనే గడిచిన 14 సంవత్సరాలుగా ఆంధ్ర పాలకులు చేసిన అన్యాయాలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఏ పరిష్కారమైనా అర్థవంతంగా వుండాలని, ప్రజల ఆశలకు స్థానం వుండాలని ఆయన పేర్కొన్నారు. మల్లికార్జున్‌ కూడా ఇలాంటి ప్రకటనే విడుదల చేశారు.

తెలంగాణ ఎన్‌.జి.ఓ. నాయకుల విమర్శ :

తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాలను సాధించుకునే నిమిత్తం తమ అభిప్రాయాలను మార్చుకున్న ఆంధ్ర – తెలంగాణ నాయకులను గెంటివేయడానికి తెలంగాణ ప్రజలు, ఎన్‌.జి.ఓ.లు వెనుకాడబోరని తెలంగాణ ఎన్‌.జి.ఓ.ల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌.బి. మాలె, కార్యదర్శి బి. స్వామినాథన్‌ ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు.

ప్రత్యేక రాష్ట్రం తప్ప మరొక ప్రతిపాదన తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని, ప్రత్యేక తెలంగాణా సాధించే నిమిత్తం ఎట్టి త్యాగాలకైనా వెనుదీయబోమని వీరు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణపై సమితి వైఖరిలో మార్పులేదు- చెన్నారెడ్డి

ఢిల్లీ చర్చల తీరుపై వివాదం చెలరేగడంతో తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షులు డా|| చెన్నారెడ్డి ఆగస్టు 22న ఢిల్లీలో ఒక ప్రకటనను పత్రికలకు విడుదల చేశారు. ”తెలంగాణకు హిమాచల్‌ ప్రదేశ్‌ వలె ప్రత్యేక రాష్ట్రం ఇవ్వవలసింద”ని ఈ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు”. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న సమితి అభ్యర్థన విషయంలో ఎట్టి మార్పులేద”ని డా|| చెన్నారెడ్డి స్పష్టం చేశారు.

కొద్ది రోజుల క్రితం ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీతో జరిపిన చర్చలలో ఇదే విషయాన్ని స్పష్టం చేశానని, ప్రధాని సూచించిన అష్టసూత్ర కార్యక్రమం వల్ల తెలంగాణ ప్రజలపై ఎట్టి ప్రభావాన్ని తీసుకురాలేదని కూడా తాను శ్రీమతి గాంధీకి స్పష్టం చేశానని చెన్నారెడ్డి తెలిపారు”. బ్రహ్మానంద రెడ్డితో సమావేశమైనప్పుడు ఈ విషయాలు చర్చించలేద”ని డా|| చెన్నారెడ్డి ప్రకటనలో స్పష్టం చేశారు.

తెలంగాణా ప్రజా పరిషత్‌ అవతరణ :

తెలంగాణా ఉద్యమ నాయకులైన ఎం. జగన్మోహన్‌ రెడ్డి, జి.పి. సక్సేనా, ఎం.జెడ్‌. అన్సారీ, సంతపురి రఘువీర్‌ రావు, జి. నారాయణ రావు, కె. ఆర్‌. ఆమోస్‌లు ఒక పత్రికా ప్రకటనలో ‘తెలంగాణ ప్రజా పరిషత్‌’ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రెస్‌ క్లబ్‌లో పత్రికా విలేకరులను కలుసుకుని తమ సంస్థ లక్ష్యాలను తెలియచేశారు. డా|| మర్రి చెన్నారెడ్డి, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఢిల్లీలో మంతనాలు జరుపడం పట్ల వీరు తమ ప్రకటనలో ‘దిగ్భ్రాంతి’ వ్యక్తం చేశారు. ఈ కొత్త సంస్థ వివిధ రాజకీయాభిప్రాయాలు గల వారితో ఒక యునైటెడ్‌ ఫ్రంట్‌గా పని చేస్తుందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ఈ సంస్థ లక్ష్యమని ప్రకటన స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజా సమితిలో చేరిన కాంగ్రెస్‌ వాదులు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న మౌలిక లక్ష్యాన్ని దెబ్బకొట్టారని ఈ సాధనకు పోరాటం ప్రారంభించాలని ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ఎం.పి.ల ప్రతిపాదనలు
ఢిల్లీలో తెలంగాణ సమస్య పరిష్కారానికై రూపొందుతున్న ‘కొత్త పథకం’పై 24 ఆగస్టు 1970 ఆంధ్రపత్రిక బ్యానర్‌ వార్తను ప్రచురించింది. తెలంగాణ వాదనలో ‘కొత్త ఘట్టం’గా ఈ పథకాన్ని అభివర్ణించింది.

ఈ కథనం ప్రకారం :

  • తెలంగాణ రీజనల్‌ కమిటీకి చట్టబద్ధ్దమైన అధికారాలివ్వాలి.
  •  తెలంగాణ ప్రాంత మంత్రులను ఈ కమిటీకి బాధ్యులను చేయాలి.
  • తెలంగాణకు, మిగిలిన ఆంధ్ర ప్రదేశ్‌కు బడ్జెట్‌ వేర్వేరుగా శాసన సభలో ప్రవేశ పెట్టాలి.
  •  రెండు ప్రాంతాల ఉద్యోగస్తులను ముల్కీ నియమాల ప్రకారం వేరు చేయాలి.
  • తెలంగాణ రీజినల్‌ కమిటీకి వేరే సచివాలయాన్ని ఏర్పాటు చేయాలి.
  • ఆంధ్ర ప్రాంతానికి కూడా ప్రత్యేక ప్రాంతీయ సంఘం ఏర్పాటు చేసుకోవచ్చును.
  • ఇతర రాష్ట్రాలతో తెలంగాణ ప్రాంతాన్ని పోల్చరాదు.
  • వీటితోబాటు మరికొన్ని ప్రతిపాదనలతో ఒక విజ్ఞాపన పత్రాన్ని రూపొందించి ప్రధానికి అందజేయాలని తెలంగాణ ప్రాంత లోకసభ సభ్యులు కొందరు ఢిల్లీలో సంతకాల సేకరణ ప్రారంభించారు.

ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి, ప్రజా సమితి అధ్యక్షులు డా|| చెన్నారెడ్డి కలుసుకొని చర్చలు జరపడాన్ని తెలంగాణ ప్రాంత లోకసభ సభ్యులు స్వాగతించారు. కానీ వీరిరువురి చర్చలు ఫలించలేదు. ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో ఏ మార్పూ వుండకూడదని ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చెన్నారెడ్డి పట్టుదలతో వుండడంతో చర్చల్లో ప్రగతి కన్పించలేదు. ఈ ఉభయుల మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చడానికే తెలంగాణ ప్రాంత లోకసభ సభ్యులు వివాదాస్పదం కాని లేదా ఇప్పటి వరకు ఉభయులకు అంగీకారం వున్న అంశాలతో ఈ ‘కొత్త పథకాన్ని’ రూపొందిస్తున్నట్లు ‘ఆంధ్ర పత్రిక’ తెలిపింది.