విద్యార్థుల పరిశోధనా పటిమకు అద్దం

తెలివితేటలు ఎవరి సొత్తూ కాదు.. పల్లెలు, గ్రామాల నుంచి కూడా పట్టణాలు, నగరాలలో కార్పోరేట్‌ స్కూళ్ళలో చదివిన విద్యార్థుల కంటే తీసిపోని విధంగా విద్యార్థులు తయారవుతున్నారు. వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తే భావితరాలకు ఎంతో ఉపయోగపడే ఆవిష్కరణలు ప్రవేశపెట్టగలరని నిరూపిస్తున్నారు. దీనికి కావాల్సింది ఆ విద్యార్థులకు సరైన ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసి, ప్రోత్సహించడమే. ఇలా చేయడం వల్ల వారిలోని పరిశోధనా శక్తి నిద్రలేచి వారు మానవాళిక ఉపయోగపడే కొత్త కొత్త పరికరాలను ఆవిష్కరింప చేయగలరు. ఇలాంటి గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులలోని శోధించే శక్తిని వెలికితీయడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధికేంద్రంలో ‘తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌`2020’ పేరిట విద్యార్థుల నూతన ఆవిష్కరణల విజ్ఞాన ప్రదర్శనను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ఎన్నో జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చి తమ మస్తిష్కం నుంచి పురుడుపోసుకున్న పరిశోధనల ఫలితాలను ప్రదర్శించారు. 

ఈ ప్రదర్శనను తిలకించిన రాష్ట్ర ఐటీ, పురపాలక, భారీ పరిశ్రమలశాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు ఆశ్చర్యచకితులయ్యారు. విద్యార్థుల పరిశోధనా పటిమను చూపి అబ్బురపడ్డారు. ప్రతి స్టాల్‌ను తిరుగుతూ వాటి వివరాలను తెలుసుకున్నారు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని తల్లితండ్రులు కోరుకుంటున్నారని, అలాకాకుండా పిల్లల అభిప్రాయా లను కూడా తెలుసుకుని, వారికి ఇంట్రస్ట్‌ ఉన్న రంగాల లోనే ప్రోత్సహిస్తే ఎన్నో ఆవిష్కరణలు జరుగుతాయని, వారు ఉద్యోగాలు వెతుక్కోకుండా, వారే పదిమందికి 

ఉద్యోగాలిచ్చే పరిశ్రమలను స్థాపించగలరని అన్నారు. నూతన ఆవిష్కరణలకు కేరాఫ్‌ అడ్రస్‌గా తెలంగాణ మారుతుందని ఇది జరగాలంటే తల్లితండ్రులు, ఉపాధ్యా యుల దృక్పథంలో మార్పు రావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రజలు నిజజీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు తమ ఆవిష్కరణలతో సులభంగా పరిష్కారం చూపగలి గారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, రైతులు, మహిళలు, దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్య లకు వారు తమ ఆవిష్కరణల్లో చక్కని ఉపయోగకరమైన పరికరాలను తయారు చేశారు. వీటిలో నుంచి మూడు ఆవిష్కరణలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు. సర్టిఫికెట్‌, షీల్డ్‌తో పాటు నగదు ప్రోత్సాహకాలను కూడా అందించారు. 

ఆర్గానిక్‌ స్త్రీ రక్షా ప్యాడ్లకు మొదటి బహుమతి 

ఆర్గానిక్‌ స్త్రీ రక్షా ప్యాడ్లు తయారుచేసిన యాదాద్రి భువనగిరి జిల్లా ముల్కలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అనిత, శైలజ, లలితలకు మొదటి బహుమతి లభించింది. రూ. 75వేలు చెక్కు రూపంలో  అందచేశారు. కాటన్‌ లేయర్ల మధ్యలో గుర్రపుడెక్క ఆకు, వేప, పసుపు, మెంతులు, సజ్జ గింజలు ఉపయోగించి వీటిని తయారు చేశారు. వీటిలో సజ్జగింజలు, మెం తులు తడిదనాన్ని పీల్చుకుం టాయని, వేప, పసుపు ఇన్ఫెక్షన్‌ రాకుండా రక్షిస్తా యని ఆవిష్కర్తలు పేర్కొ న్నారు. పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా కేవలం రూ. 2కే వీటిని తయారు చేసినట్లు తెలిపారు. 

మల్టీపర్పస్‌ అగ్రికల్చర్‌ బ్యాగ్‌కు రెండవ బహుమతి 

మహబూబాబాద్‌ దంతాలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాల విద్యార్థులు రాజేష్‌, అభిషేక్‌, వేణులు రూపొందించిన మల్టీపర్పస్‌ అగ్రికల్చర్‌ బ్యాగ్‌కు రెండవ బహుమతి లభించింది. రూ. 50 వేల బహుమతిని చెక్కు రూపంలో వీరికి అందచేశారు. ఈ బ్యాగ్‌ ద్వారా సులభంగా ఎరువులు, విత్తనాలు వేయడం గానీ, పత్తి, మిరప, పండ్లు ఏరడం గానీ సులభంగా చేయవచ్చు. 

ఆర్గానిక్‌ చాక్‌పీస్‌కు మూడవ బహుమతి 

ఆదిలాబాద్‌ జిల్లా బంగారిగూడ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు హర్షిత్‌వర్మ, రుద్రలకు  ఆర్గానిక్‌ చాక్‌పీస్‌ తయారుచేసినందుకు గాను మూడవ బహుమతి వచ్చింది. రూ. 35వేల 500 బహుమతి చెక్కు రూపంలో అందచేశారు. ఆర్గానిక్‌ చాక్‌పీస్‌ వల్ల దాని పొడితో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని తెలిపారు. జిప్సమ్‌కు బదులుగా లైమ్‌ పౌడర్‌ వాడి వీటిని తయారు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ పౌడర్‌ గాలి పీల్చినా ఆరోగ్యానికి మంచిదేనని వారు పేర్కొన్నారు. 

ఇవేకాకుండా బషీరా అనే విద్యార్థిని హైడ్రాలిక్‌ లిఫ్టింగ్‌ వీల్‌చైర్‌ రూపొందించారు. నితిన్‌, తౌసిప్‌, అఖిలలు రైస్‌ షిఫ్టింగ్‌ బ్యాగ్‌ రూపొందించారు. ఇలా ఇంకా పలు రకాల పరికరాలను విద్యార్థులు రూపొందించి తమ మేథాశక్తిని నిరూపించుకున్నారు. వీరిలోని సృజనాత్మకతను వెలికితీస్తే ప్రపంచానికి 

ఉపయోగపడే ఎన్నో పరిశోధనా ఫలితాలు వెలువడు తాయనడంలో ఆశ్చర్యం లేదు.