మొదటి ముద్దుతోనే పండ్లూడినట్టు..

katahaడా. నలిమెల భాస్కర్‌

సామెతలు నీళ్ళ మీద రాతలు కావు. అవి రాళ్ళమీది రాతలు. శిలాక్షరాలు. పైగా నోళ్ల మీది రాతలు. తరతరాలుగా ప్రజల నోళ్ళల్లో గూడుకట్టుకున్న మాటలు. జానపదుల దైనందిన సంభాషణల్లో అలవోకగా నానుతున్న నానుడులు. గ్రామీణుల రచనలు నుండి రమణీయంగా జాలువారే రసవద్రచనలు. అనాదిగా లోకుల అనుభవమే పునాదిగా చెల్లుబాటు అవుతున్న లోకోక్తులు యివి. సామెతలను తెలంగాణలో ‘శాస్త్రాలు’ అనికూడా అంటారు.

‘ఆకలి రుచి ఎరుగదు – నిద్ర సుఖమెరుగదు’ అని తెలుగులో ఒక సామెత ఉంది. ఇక్కడ తెలుగు అంటే తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రాంతాల వ్యావహారిక భాష. తెలంగాణలో పై సామెతకు సమానార్థకంగా ‘ఆకలిమీద ఉన్నోనికి పాశిబువ్వనే పరమాన్నం’ అని వున్నది. నిజమే! ఆకలికి రుచిలేదు. బాగా ఆకలి ఐనప్పుడు ఏది పెడితే అది తింటం. క్షుద్బాధకు చేదు రుచైనా, స్వాదు రుచైనా సమానం. ఆరు రుచుల్లో ఏదైనా ఒకటే! మలమల మాడితే గుర్రం కూడా వరిగడ్డి తింటుంది. తెలుగు సామెతలో ‘ఆకలి రుచి ఎరుగదు’ అనే సాధారణీకరణం వున్నది. తెలంగాణలో దానికి ఉదాహరణయిచ్చారు. ఉదాహరణ తొందరగా అర్థం అవుతుంది. మనసుకు ఎక్కుతుంది. బాగా ఆకలైన వాడికి పాచిపోయిన అన్నమూ పరమాన్నమేనట! పైగా తెలంగాణ సామెతలో ‘బువ్వ’ పదం వుంది. ఇది అచ్చ తెలుగుపదం. మన పెద్దలు ‘ఆకొన్న కూడె అమృతము’ అని కూడా అన్నారు.

మూడు ప్రాంతాల తెలుగులో ‘అరణ్యరోదనంలా’ అనే మాట వుంది. నిర్జనమైన అరణ్యంలో ఏడిస్తే ఫలితం ఏమిటి? ఏ ఒక్కరూ రారు, కాపాడరు. పైగా క్రూరమృగాల బాధ. అడవి ఏడుపు నిరర్ధకమైనదే కాక నిష్ఫలమైనది కూడాను. తెలంగాణలో ‘గట్టుకు కుక్క మొరిగినట్లు’ అనే సామెత వుంది. ‘గట్టు’ అంటే ఇక్కడ ఒడ్డూ, తీరం అని కాదు అర్థం. పర్వతాలూ, కొండగట్లూ అని భావం. ఆ కొండల మీద అడవిలో ఉన్నట్లు రాళ్ళతో పాటు వృక్షాలుంటాయి. కుక్క ఊళ్ళో మొరిగిందంటే ఎవరైనా పట్టించుకునే అవకాశం వుంది. అది పెంపుడు జంతువు. పాపం! తప్పిపోయింది. గుట్టను చూసి దయనీయంగా ఎవరయినా రాకపోతారా అని మొరుగుతున్నది. నిజానికి అది కుక్క ఏడుపే! తెలుగులోని ‘అరణ్య రోదనంలా’ అన్నప్పుడు ఎవరు ఏడుస్తున్నారనేది తెలియడంలేదు. ‘గట్టుకు కుక్క మొరిగినట్లు’ అనడంలో మరలా ఉదాహరణ కన్పిస్తున్నది. సాధారణీకరణం చేసి, సూత్రీకరణం చేసి చెప్పడం కన్నా దృష్టాంతాలతోనూ, ఉదాహరణలతోనూ చెప్పినప్పుడే మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

‘అడకత్తెరలో చిక్కిన వక్కమాదిరి’ అనేది తెలుగులో మరోసామెత. అన్నం తిన్న తర్వాత సాధారణంగా అడకత్తెరతో భాగాలు కత్తిరించి నోట్లో వక్కలు వేసుకుంటారు. ఈ సామెతను బాధను ప్రకటించడానికి, కష్టాల సుడిగుండంలో చిక్కిన వాళ్లకి నిదర్శనంగా ఉపయోగిస్తారు. దీనికి తెలంగాణలో దీటుగా ఒక సామెత ఉంది. ‘ఇసుర్రాయిల మక్కిత్తు నలిపినట్లు’. పై తెలుగుసామెత కన్నా ఈ తెలంగాణ సామెత జీవితానికి మరింత దగ్గరగా వుంది. అందరి ఇళ్ళల్లో అడకత్తెరలు లేకపోవచ్చు. కానీ పూర్వం పేదలూ, మధ్యతరగతి వాళ్ళందరి ఇళ్ళలో విసుర్రాయిలు వుండేవి. ఆ విసుర్రాయితో పిండి, గట్కా మొదలైనవి విసిరేవాళ్ళు. ఇసుర్రాయిల మక్కిత్తును నలిపితే ఎంత బాధగా వుంటుంది. పైన ఒక పెద్దరాయి. కిందొక రాతిబిళ్ల. మధ్యలో చిన్న మక్క ఇత్తు. అడకత్తెరతో పోల్చితే విసుర్రాయి ఇంకా పెద్దది. పోకవక్కతో చూసినప్పుడు మక్కిత్తు మరీ చిన్నది. మొదటిదాని కన్నా రెండో సందర్భంలోనే బాధ మిక్కిలి. పైగా తెలంగాణ ప్రాంతంలో మక్కపంట ఎక్కువ. అందుకే వాళ్ళ సామెతలో మక్కిత్తు ప్రస్తావన.

తెలుగులో కొంచెం ఎక్కువ చదువుకున్నవాళ్ళూ, సంస్కృతం తెలిసిన వాళ్ళూ ‘ప్రథమ కబళే మక్షికా పాతః’ అంటారు. అర్థం : మొదటి ముద్దలో ఈగ పడ్డట్లు అని. తినడానికి కూర్చొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుందాం అనుకునేసరికి అందులో ఈగ పడిందట! ఇక భోజనం ఎలా వుంటుందో ఊహించుకోవచ్చును. తెలంగాణలో దాదాపు దీనికి సమానంగా ‘మొదటి బుక్కల ఈగ పడ్డట్లు’ అనే సామెత ఉంది.

పోతే సంస్కృతం ఎరిగినవాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ‘ప్రథమ చుంబనే దంత పాతః’ అనేశారు. ‘మొదటి ముద్దుతోనే పండ్లూడినట్లు’ అని అర్థం. సాధారణంగా ఎవరికి పండ్లూడుతాయి? పిల్లలకూ, వృద్ధులకూ వూడుతాయి. ఇది పిల్లల ప్రసక్తి అసలు కాదు. పెద్దల, వృద్ధుల ప్రస్తావన. ఈ సామెత బాల్యవివాహాల నాటిది. అరవై ఏళ్ల ముసలోళ్ళకు ఆరేళ్ళ, పదహారేళ్ళ అమ్మాయిలను కట్టబెడుతున్న దురాచారం. భార్యను ముద్దుపెట్టుకోబోయిన వృద్ధ భర్తకు వెంటనే పన్నూడింది. ఇక ఆ దాంపత్యం ఎట్లా వుంటుంది మరి! తెలంగాణలో ‘ఆట మొదలయేసరికి మద్దెల తూటు పడిందట!’ అనే సామెతవుంది. వీధి భాగవతమో, యక్షగానమో, నాటకమో ప్రారంభించాలనుకున్న తరుణంలోనే మృదంగం పగిలిపోయింది. అది మళ్ళీ దృఢంగా ఎప్పుడు కావాలి? ఎప్పుడు నాటకం మొదలవ్వాలి? మద్దెల మధ్యలో పోయినా కొంత ఆట జరిగివుండేది కదా! తెలంగాణలో ‘తొలుత తొలుత తోలుగుడ్డు పెట్టినట్లు’ అని ఇంకొక సామెత కూడా ఉంది.

తెలుగులో ‘ఆదిలోనే హంసపాదు’ ఇటువంటి సామెతే!