తెలంగాణ శక్తిపీఠం

telangana-shakti-pitamలంబస్తనీం వికృతాక్షీం ఘాెర రూపాం మహాబలాం, ప్రేతాసన నమారూఢం జోగుళాంబాం నమామ్యహం తెలంగాణాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపురము ఒకటి.

బాలబ్రహ్మేశ్వర స్వామి ప్రధాన దైవతంగా నవబ్రహ్మాలయాలు నెలకొని ఉన్న పుణ్యక్షేత్రం అలంపురం, శిల్పరీత్యా, చరిత్ర రీత్యా, పౌరాణిక రీత్యా కూడా ఇదొక పవిత్ర క్షేత్రం. ఉత్తర వాహినియై ప్రవహిస్తున్న తుంగ భద్రాతీరంలో వెలసిన ఈ క్షేత్రానికి మరొక ప్రశస్తి ఉంది. భారత దేశంలో అత్యంత పవిత్రమైన అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమే అలంపురము.

జోగుళాంబాదేవిగా కొలువై ఉన్న అమ్మవారి పేరుతో కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పరమశివుని భార్య సతీదేవి శరీరాన్ని శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంతో ఖండించినప్పుడు మన పవిత్ర భారత భూమిపై ఆ శరీరపు పదునెనిమిది ఖండములు పడిన చోటు లే అష్టాదశ శక్తిపీఠములు. ప్రసిద్ధమైన యీ శక్తిపీఠములు మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్నట్లు పురాణ ఆధారాలను బట్టి తెలుస్తున్నది. దేశంలోని అపూర్వశక్తి సంపన్నమైన శక్తి పీఠాలలో ఇది ఒకటి అన్న విషయం లోక విదితము.

జోగుళాంబా అమ్మవారి ఆలయం ప్రాచీనమైనది. క్రీ. శ. 7వ శతాబ్దంలో యీ ప్రాచీనాలయం నిర్మించారని చారత్రకుల భావన. 9వ శతాబ్దంలో శ్రీ శంకర భగవత్పాదుల వారు శ్రీ చక్ర ప్రతిష్ఠ చేసినట్టు తెలుస్తున్నది. 14వ శతాబ్దంలో జరిగిన ముస్లిం దండయాత్రల కాలంలో ఈ ప్రాచీన దేవాలయం ధ్వంసం అయినందువల్ల అమ్మవారి మూల మూర్తిని బ్రహ్మేశ్వ రాలయంలోని ఒక మూలలో ప్రతిష్టించి పూజలు జరిపించారు. ఇంకా అనేక ఆలయాలు ధ్వంసం కాకుండా విజయనగర చక్రవర్తి రెండో హరిహరరాయల కుమారుడు మొదటి దేవరాయలు తన తండ్రి ఆజ్ఞ పాటించి ఆ ముస్లిం సైన్యాన్ని పారగొట్టి దేవాలయాల్ని రక్షించాడు. ఇటీవలె తిరిగి ఆ స్థలంలోని ప్రాచీన ఆలయ వాస్తు రీతిలో నూతన ఆలయం నిర్మించి తిరిగి అమ్మవారి ప్రతిష్ఠ జరిపించడం విశేషం.

ఈ నూతన ఆలయం పైకప్పుపై పద్మం, నాగంవంటివి మిగతా ఇక్కడి ఆలయాల్లో ఉన్నట్టే చెక్కడానికి ప్రధాన కారణం నాగం కుండలినీ శక్తికి, పద్మం సహస్రారానికి సంతాేలు కావడమేనని పెద్దల అభిప్రాయం. ఆలయ స్తంభాలపై అష్టాదశ, శక్తిపీఠాలలో కొలువైన అమ్మవార్ల శిల్పాలు కూడా చెక్కి ఈ శక్తి పీఠ ప్రాశస్త్యాన్ని మరింత శక్తివంతం చేశారు.

బాలబ్రహ్మ కుమార కర్క వీరో విశ్వశ్చ తారకః

గరుడ స్వర్గ పద్మాశ్రీ నవబ్రహ్మా: ప్రకీర్తితాః

అన్న పౌరాణిక ప్రమాణాలను బట్టి ఇక్కడ నవబ్రహ్మల ఆలయాలన్నట్లు తెలుస్తున్నది. బ్రహ్మ పరమేశ్వరుని గురించి తపస్సు చేసిన పవిత్ర స్థలం కావడం వల్ల ఇక్కడ ప్రధాన శివాలయమైన బాల బ్రహ్మేశ్వరాలయంతో బాటు, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ ఆలయాలు ప్రత్యేకంగా ఉండటం, ఇక్కడ క్షేత్ర పవిత్రతను మరింత పెంచాయి. ఈ శివాలయాలపై ఉన్న అనేక శిల్పాలు పౌరాణిక గాథలతో కూడి ఒక అద్భుత ప్రపంచాన్ని మనకు దృశ్యమానం చేస్తాయి. ఎందరెందరో దేశ విదేశ చరిత్రారులకు స్ఫూర్తినిచ్చేవిధంగా యీ దేవాలయాల నిర్మాణం జరిగింది. బ్రహ్మ తపోభూమిలో వెలసిన శివుడు కనుక ప్రతి శువుని చివరక బ్రహ్మ శబ్దం జోడించబడింది. దేవాలయ వాస్తును అధ్యయనం చేయాలనుకున్న జిజ్ఞాసువులకే  ఆలయాలు గొప్ప విద్యాకేంద్రాలని చెప్పవచ్చు.

ఇక్కడి ఆలయాలన్నీ ఒ కాలంలో నిర్మించినవి కాక పోవచ్చునని పరిశోధకుల భావన. తెలుగు నేలపై బాదామీ చాళుక్య రాజుల పాలన సాగిన 200 సంవత్సరాల కాలంలో వీటి నిర్మాణం జరిగినట్లు భావిస్తుంటారు. భారతీయ వాస్తు శిల్ప రీతులను, వేద ధర్మ వికాసాన్ని, చారిత్రక విశేషాలను అధ్యయనం చేయాలనుకున్న పరిశోధకులకు ఇవి గొప్పగా ఉపయోగపడే ఆలయాలు. మహాద్వారం మొదలుకొని వరుసగా కనిపించే ఈ నవ బ్రహ్మాలయాలు భక్తులకు, చరిత్ర విజ్ఞాన సముపార్జన చేయాలనుకున్న వారికి శిల్పరీతులను తెలుసుకొన గోరే వారికి ప్రధాన కేంద్రాలై విరాజిల్లుతున్నాయి.

దీనికి దక్షిణా కాశిగా సంభావిస్తుంటారు. అట్లా గుర్తించడానికి అనేక పురాణాంతర్గత సాక్ష్యాలున్నాయి. ఇది శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వారం. శ్రీశైలానికి తూర్పున త్రిపురాంతకం. దక్షిణాన సిద్ధవటం, పశ్చిమాన అలంపుర, ఉత్తరాన ఉమామహేశ్వరం అనే ప్రముఖ శైవ క్షేత్రాలున్నాయని స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం చెబుతున్నది.

బ్రహ్మేశోయం సవిశ్వేశః సాకాశీ హేమలాపురీ సాగంగా తుంగ భద్రే7యం సత్యమేతన్న సంశయః

కాశీ మహాక్షేత్రంలో విశ్వేశ్వరుడైతే ఇక్కడ బ్రహ్మేశ్వరుడు, అక్కడ గంగ ఉత్తరవాహిని, ఇక్కడ తుంగభద్ర ఉత్తర వాహిని అదికాశి, ఇది హేమలాపురం అంటూ చెప్పిన శ్లోకంలోనే దీనిని దక్షిణ దిశలోని కాశి అనడానికి ఏ సంశయమూ లేదని యీ శ్లోకం సాక్ష్యమిస్తున్నది. పైగా కాశీక్షేత్రంలో ఉన్నట్లు ఈ క్షేత్రంలోనూ పాపవినాశిని, మణి కర్ణిక మొదలైన 54 ప్రధాన ఘట్టాలున్నాయి. అక్కడికి దగ్గర్లో త్రివేణి సంగమం ఉంటే ఇక్కడికి దగ్గర్లో కృష్ణా, తుంగ భద్రల సంగమం ఉంది. అక్కడి దేవత కాశీవిశాలాక్షి అయితే ఇక్కడి అమ్మవారు జోగుళాంబాదేవి.

ఈ క్షేత్రానికి వైదిక మత రీత్యా ఎంతో ప్రాధాన్యం ఉంది. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సైర, స్కాందగా సంభావించిన షన్మణతాలకు సంబంధించిన దేవతా మూర్తులు ఈ క్షేత్రంలో మనకు కనిపిస్తాయి. ప్రధాన ఆలయమైన బ్రహ్మశ్వరాలయం రససిద్ధులచే నిర్మించబడిందనీ, ఇక్కడి శివలింగం మహా మహిమాన్వితమైందని భావిస్తుంటారు. స్కాంద పురాణంలోని శ్రీశైలఖండంలోని రెండు అధ్యాయాలు, సంస్కృతంలోని ఒక ప్రత్యేక స్థల పురాణం ఈ క్షేత్రం మహాత్మ్యాన్ని తెలిపే ప్రధాన ఆధారాలు. ఇది బ్రహ్మచే ప్రతిష్టితమైన శివలింగం. ఇది జ్యోతిర్వ్యాలామయమైనదని కూడా దీనికి ప్రశస్తి ఉంది. ఇక్కడ జమదగ్ని ఆశ్రమం ఉండేదని, జమదగ్ని మహర్షి భార్య రేణుకను కుమారుడు పరశురాముడు సంహరించిన స్థలంగా దీన్ని భావించడానికి ఇక్కడ తలలేని భూదేవి విగ్రహం ఉండటం కూడా ప్రమాణమని ఐతిహ్యం ఉంది.

ఇక్కడి పాప వినాశని తీర్థంలోని గదాధర విగ్రహ సన్నిధిలో శ్రాద్ధకర్కల నాచరించడం శ్రేష్టమని భావన. ఈ క్షేత్ర మహాత్మ్యం తెలుగులో ప్రసిద్ధి చెందిన పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర కూడా విస్తృతంగా వర్ణించింది. ఇక్కడి అనేక తీర్థాలను ప్రస్తావించింది. బ్రహ్మకు విగ్రహం ఉండటం ఈ క్షేత్రంలోని మరో విశేషం. మనకు అరుదుగా కనిపించే బ్రహ్మ విగ్రహం ఇక్కడ ఉండటానికి ఇది బ్రహ్మతపస్సు చేసి ఇక్కడి శివలింగాన్ని స్థాపించాడన్నదే ప్రధాన కారణంగా చెబుతారు.

ఇక్కడి శివుణ్ణి గోష్పాద ముద్రిత రసాత్మక లింగమూర్తేః అని వర్ణించడానికి కారణం ఇక్కడి లింగం పై భాగం ఆవు గిట్ట పడినట్లుగా ఉంటుంది. అదే దీనికి కారణం పరిమా ణంలో చాలా చిన్నదైన బ్రహ్మేశ్వర లింగం పై భాగం ఇట్లా ఉండటం ఒక ప్రత్యేక విశేషం.

అలంపురానికి గొప్ప చారిత్రక నేపథ్యం ూడా ఉంది. ఇక్కడి శాసనాల్లో దీనిపేరు హలంపుర, హతంపుర, హేమలాపురంగా పిలువబడిన ఈ గ్రామం ఇక్కడి ఉర్దూ రికార్డుల్లో అల్పూరుగా అలంపూరుగా పేర్కొనబడింది.

శతాబ్దం నాటి ఇక్ష్వాకుల శాసనాల్లో హలంపుర ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడి పరిసరాల తవ్వకాల్లో ప్రాచీన కాలపు అవశేషాలు అనేకం లభించాయి. శిలాయుగం నాటి అవశేషాలు కూడా వీటిలో ఉన్నట్లు గుర్తించారు. రాకాసి గుళ్ళు గా పిలుచుకునే పరిసర గ్రామాల్లోని సమాధులు తవ్వి చూస్తే అనేక ఆధారాలు లభించాయి.

మౌర్యులు, శాత వాహనులు, బాదామీచాళుక్యలు, రాష్ట్ర ూటులు, కల్యాణీ చాళుక్యులు, కాకతీయులు, విజయ నగర రాజులు, సుల్తానులు ఎందరెందరో పాలకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా శాసన ప్రమాణాలు, నిర్మాణ విశేషాలు సూచిస్తున్నాయి.

ఇదొక ప్రాచీన విద్యా పీఠంగా చెప్పడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. మహాద్వారం, కంచికామాక్షి ఆలయాలతో బాటు అనేక ఆలయాలున్న ఈ అలంపుర దేవాలయంలో అద్భుత శిల్పకళారీతు లు భారతీయ సంస్కృతికి పట్టు కొమ్మలు. ప్రాచీన కళాఖండాల సంరక్షణ కోసం ఏర్పరచిన మ్యూజియం మిక్కిలి ప్రసిద్ధం. ఇక్కడి దేవాలయాల ఆవరణలో ఉన్న షా అలీ పహిల్వాన్‌ దర్గా సుప్రసిద్ధమైంది.

కీ.శే. గడియారం రామకృష్ణ శర్మగారు ఈ క్షేత్రంపై విశేష పరిశోధనలు చేసిన పండితకవి. శ్రీ శైలం జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌లో మునిగిపోకుండా పోరాటం చేసి నిలబెట్టిన మహామనిషి. ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపుకు గురైన ప్రాంతాల్లోని అనేక ఆలయాలు ఇక్కడ పునర్మించినిలబెట్టారు.

తెలంగాణాలోని ఏకైక శక్తిక్షేత్రం, అద్భుత చారిత్రక నిర్మాణాలు చోటు చేసుకున్న ప్రాంతం. కాశీతో సమంగా వెలిగే దక్షిణకాశీ క్షేత్రం. దీన్ని పరిరక్షించి మరింత శోభను సమూర్చి మన ప్రాంతపు ప్రాచీన చరిత్రను ప్రపంచం ముందు నిలబెట్టి వెలిగించే బాధ్యత మనమీదే ఉందన్న సత్యం విస్మరించరానిది.