స్వచ్ఛమైన తాగునీరులో మనమే ప్రథమం

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఉద్యమకాలంలో నల్లగొండ లాంటి జిల్లాల్లో ఉన్న ఫ్లోరైడ్ బాధలను చూసి చలించి పోయిన కేసీఆర్ మన ప్రభుత్వం రాగానే స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ సాధించి, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తాగునీటి పై దృష్టి సారించారు. దాని ఫలితమే మిషన్ భగీరథ.
ప్రతి పల్లె, ప్రతి తండా, గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్నింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పైపులైన్లు వేశారు. నీటిని శుద్ధిచేసి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీటిని అందించారు. ఇలా చేయడంతో దీన్ని చూసిన కేంద్ర ప్రభుత్వ అధికారులు దేశంలోనే తాగునీటిని అందించడంలో తెలంగాణకు మొదటి స్థానాన్ని ఇచ్చారు. అత్యంత శుద్ధమైన తాగునీళ్లు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే టాప్‌గా నిలిచింది. ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ అట్టడుగున నిలిచింది. తాగునీటి నాణ్యతా ప్రమాణాల్లో తెలంగాణ దరిదాపుల్లో ఏ ఒక్క రాష్ట్రము లేదు. జాతీయస్థాయిలో శుద్ధమైన, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కేవలం 11.4 శాతం మేరకే తాగునీరు అందుతుండగా, తెలంగాణలో అది 99.953 శాతంగా ఉండడం తెలంగాణకు గర్వకారణం.
దేశంలోని పెద్దరాష్ట్రాల్లో అట్టడుగుస్థానంలో పశ్చిమబెంగాల్ ఉండగా, గుజరాత్ మూడో స్థానంలో
ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర సర్కారు కాపీ కొట్టి జల్ జీవన్ మిషన్‌గా అమలు చేస్తున్నది. ఇంటింటికీ శుద్ధిచేసిన నల్లా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకం పురోగతి ఇప్పటికీ 36 శాతానికి మించకపోగా, ఇప్పటికే తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా 100 శాతం గృహాలకు తాగునీటిని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు నల్లాల ద్వారా అందిస్తున్న తాగునీరు నిర్దేశిత ఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదా? లేదా? అనే విషయాన్ని తెలుసుకొనేందుకు కేంద్ర జల్‌శక్తిశాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ చర్యలు చేపట్టింది.
అన్ని రాష్ట్రాల్లో నల్లాల ద్వారా అందుతున్న నీటి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించింది. నల్లా నీటిలో ఉన్న బయోలాజికల్, రసాయనిక కలుషితాలను తెలుసుకొనేందుకు టెస్ట్‌లు నిర్వహించింది. అందుకు సంబంధించి వాటర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ నివేదికను ఇటీవల రాజ్యసభకు నివేదించింది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా 61,78,426 శాంపిల్స్ సేకరించి, వాటిని రెండువిధాల పరీక్షలుగా చేశారు. అందులో 11.29 శాంపిల్స్‌లో కలుషితాలు ఉన్నట్టుగా తేలింది. 88.71 శాతం కలుషితరహితంగా ఉన్నాయి. దేశంలో తాగునీటిలో బ్యాక్టిరియోలాజికల్ కలుషితాల కంటే రసాయన కారక కలుషితాలు అధికంగా ఉన్నట్టు నివేదిక తేల్చింది. దేశం మొత్తంమీద తెలంగాణలోనే 99.953 శాతం నల్లా నీటిలో కలుషిత కారకాలు లేవని నిర్ధారణ జరిగింది.
నాణ్యమైన, స్వచ్ఛమైన తాగునీరు
మిషన్ భగీరథ పథకం దేశంలోనే సంచలనం. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఇలాంటి బృహత్తర పథకాన్ని అంతకుముందెన్నడూ, ఏ ప్రభుత్వమూ చేపట్టలేదు. ఆగస్టు 6, 2016న సీఎం కేసీఆర్ తన స్వంత నియోజకవర్గం గజ్వేల్‌లో శంకుస్థాపన చేశారు. ఈ పథకం మొత్తం బడ్జెట్ అంచనా రూ. 43,791 కోట్లు. రాష్ట్రంలో అత్యంత మారుమూలన నాలుగిండ్లు ఉన్న గూడేలకు కూడా పైప్‌లైన్లు వేసి తాగునీరు అందించే లక్ష్యంతో మొదలైన ఈ పథకం నూటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకొన్నది. కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తరలించి 1.697 లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్లు వేసి ప్రతిగ్రామానికి ప్రభుత్వం మంచినీటిని అందిస్తున్నది. ఈ నీటిని అనేక దశల్లో శుద్ధిచేసిన తర్వాతే ప్రజలకు చేరవేస్తున్నారు. ఇందుకోసం 150 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిరంతరం పనిచేస్తున్నాయి. 35,573 ఓవర్‌హెడ్ సర్విస్ రిజర్వాయర్లు, 62 పంపింగ్ స్టేషన్లు, 27 ఇంటేక్‌వెల్స్ ఉన్నాయి. మోటర్లను నడిపించటానికే రోజూ 182 మెగావాట్ల విద్యుత్తు అవసరం అవుతున్నది. నీటి నాణ్యతను పరిశీలించేందుకు పదుల సంఖ్యలో ల్యాబులు నిత్యం పనిచేస్తున్నాయి.
కేసీఆర్ కృషి ఫలితం
మానవ చర్యల ఫలితంగా దేశంలోని అనేక నీటి వనరులు కాలుష్యపూరితమవుతున్నాయి. పరిశ్రమలు, వ్యర్థజలాల నిర్వహణ సక్రమంగా లేకపోవటం ఫలితంగా చెరువులు, కుంటలు, తద్వారా వాగులు, ఆపై నదులు, భూగర్భ జలాలు కలుషితమై పోతున్నాయి. ప్రజలను రోగాల పాలు చేస్తున్నాయి. పంట దిగుబడులను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం నీటి కాలుష్య నివారణకు పకడ్బందీ చర్యలను చేపట్టింది. పట్టణాల్లో మురుగునీరు నేరుగా కుంటలు, చెరువుల్లో కలువకుండా మురుగునీటి శుద్ధి ప్లాంట్లను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తున్నది. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాల్లోనూ ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నది. విడతలవారీగా ప్లాంట్ల ఏర్పాటును క్రమబద్ధంగా విస్తరిస్తూ వస్తున్నది. పల్లెల్లోనూ ఇదే తరహా చర్యలను చేపడుతున్నది. చెరువులను కూడా రిజర్వాయర్లతో అనుసంధానించి వాటిల్లోకి కూడా జలాలను తరలిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలన్నీ సత్ఫలితానిస్తున్నాయి. ఫ్లోరైడ్, ఆర్సెనిక్ తదితర హానికర మూలకాల గాఢత తగ్గిపోతున్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్వచ్ఛమైన తాగునీరు తెలంగాణ ప్రజలకు సరఫరా జరుగుతున్నది. నీటి కుళాయిల వద్ద, మంచినీటి ట్యాంకర్ల వద్ద ఆడవాళ్ళ యుద్ధాలు లేని, కిలో మీటర్ల మేర నెత్తిమీద బిందె పెట్టుకుని మంచినీరు తెచ్చుకునే దుస్థితి లేని తెలంగాణ ఏర్పడింది.