దేశానికే ఆదర్శ పాలన

kతెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్ళు పూర్తయింది. వనరులను, ఆత్మగౌరవాన్ని కొల్లగొట్టిన యాభై ఏడేళ్ళ వలసాధిపత్య పాలనకు చరమగీతం పాడిన తెలంగాణ స్వపరిపాలన ఎంత అద్భుతంగా వుంటుందో దేశానికి చాటుతున్నది. తన ప్రాణాలనే ఫణంగా పెట్టి అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిన ఉద్యమ నాయకుడే పరిపాలకునిగా కొలువుదీరి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అనుక్షణం శ్రమిస్తున్నారు.

సాధించాల్సిన లక్ష్యాలు అనేకం మిగిలే వున్నా ఈ రెండేళ్ళలో సాధించింది తక్కువేమీ కాదు. ‘తెలంగాణ వారికి పరిపాలించడం చేతకాదు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ అంధకారమవుతుందని’ అవహేళన చేసిన వారి ముఖాలు మాడేలా వెలుగులు విరజిమ్ముతూ అభివృద్ధి దిశలో ఔన్నత్యపు మైలు రాళ్ళను నాటుతూ తెలంగాణ పురోగమిస్తున్నది. నిత్యం పొడుస్తున్న పొద్దు సాక్షిగా ఆత్మగౌరవ బావుటానెగరవేస్తూ ‘మా వనరులు మా’నని కాలంతో పోటీ పడుతూ కదిలిపోతున్నది.

కూతవేటు దూరంలో సాగరమ్మై రూపు సవరించుకున్న కృష్ణవేణి వున్నా ఫ్లోరోసిస్‌ విషాన్ని నల్లగొండ బిడ్డల ముఖాన చిమ్మిన ‘సమైక్య’ పాలకులు ‘మా’ నీళ్ళతోనే ఫ్లోరైడ్‌ మరకలను తుడిచి వేస్తామంటున్న సదాశయానికి విభజన తర్వాత కూడా అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. గడిచిన రెండేళ్ళలో తెలంగాణ ఏనాడూ పరుల సొమ్ముకు ఆశపడలేదు. నేటి ముఖ్యమంత్రి .సి.ఆర్‌. 2004 లోనే ‘గుంటూరు జిల్లాలో గుంటెడు భూమి అడుగుతిమా? విజయవాడపట్నంలో వీసమంత అడుగుతిమా? అంటూ తెలంగాణ ఆత్మను ఉద్యమ గీతంలో స్వయంగా ఆవిష్కరించారు. అదే వైఖరిని ఆయన నేటికీ అనుసరిస్తున్నందునే తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్రబిడ్డల అభిమానాన్ని చూరగొంటున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో టి.ఆర్‌.ఎస్‌. పార్టీకి లభించిన ఫలితాలే.

విభజన బిల్లు రూపొందిస్తున్న సమయంలో ఎ..ఆంథోని కమిటీ హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రుల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ ఉండదేమోనని తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడడానికి ఆంధ్రనాయకులు చెప్పిన మాయమాటలు నమ్మి ‘లా అండ్‌ ఆర్డర్‌’ను గవర్నర్‌ చేతిలో పెట్టినా. రెండేళ్ళలో ఏనాడూ ఆయన ఆ అధికారాన్ని వినియోగించాల్సిన అవసరం రాని సుపరిపాలనను  కే.సి.ఆర్‌ అందించారు. తెలంగాణలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనూ ఆంధ్ర ప్రాంతీయుని ఆస్తులకు నష్టం వాటిల్లిందని కానీ, కనీసం తిట్టినారని గాని ఒక్కటంటే ఒక్క ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు.

సమైక్య రాష్ట్రంలో పవర్‌కట్‌లు లేకుండా ఒక్కరోజైనా లేదు. పరిశ్రమలకు ‘పవర్‌ హాలిడేలు’ ప్రకటించడంతో అప్పులపాలైన పారిశ్రామిక వేత్తలు ఎన్నేళ్ళయినా కోలుకోలేరు. 2014 ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్‌ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో ‘రాబోయే రెండేండ్ల వరకు తెలంగాణ విద్యుత్‌ సరఫరాలో ప్రస్తుత పరిస్థితే కొనసాగుతుంది. మూడో ఏడాది నుండి పరిస్థితులు మెరుగు పడతాయని’ పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో తొలి సంవత్సరమే పవర్‌కట్‌లు లేకుండా నిరంతర విద్యుత్తును అందించింది సిెఆర్‌ ప్రభుత్వం. సమర్థవంతమైన పాలనకు ఇంతకన్న రుజువులేముంటాయి?

ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రైతుల రుణమాఫీని అమలు చేశారు. సుదీర్ఘకాలం తెలంగాణ సాగునీటి రంగంలో అమలైన వివక్ష, నిర్లక్ష్యం ఫలితంగా రెండు దశాబ్దాలుగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని ఏ విధంగా అమలు చేయబోతున్నదీ సీేఆర్‌ రాష్ట్ర శాసనసభలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నమ్మకాన్నీ, ఆశను, ఆంధ్రానేతలకు ఆశ్చర్యాన్ని కలిగించారు. నీటి వనరులపై తెలంగాణ ముఖ్యమంత్రికి గల లోతైన అవగాహనకు దేశమే జేజేలు పలికింది.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో చాలా వరకు ఈ రెండేళ్ళలో అమలుకాగా కేజీ టు పీజీ వంటి మరికొన్ని హామీలు ఈ సంవత్సరం నుండి అమల్లోకి రాబోతున్నాయి.

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చెప్పుకున్న ముఖ్యమంత్రి ఆ దిశలోనే తన గమనాన్ని కొనసాగిస్తున్నారు. లక్షకు పైగా ఉద్యోగాలను కేటాయిస్తామని కేసిఆర్‌ ప్రకటించారు. ఐటిఐఆర్‌, పారిశ్రామిక రంగంలో లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. అధికారం చేపట్టగానే వృద్ధులకు, వితంతువులకు రూ.1000 పెన్షన్‌, వికలాంగులకు రూ.1500 పెన్షన్‌ మంజూరు చేశారు. ఆడపిల్లల పెళ్ళికి రూ.51,000 ఇచ్చే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను అమలు చేస్తున్నారు. పేదల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ రెండు బెడ్‌రూంల ఇండ్లను నిర్మిస్తామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేస్తున్నారు. దళితులకు మూడెకరాల భూమి పథకం అమలు చేస్తున్నది ప్రభుత్వం. తెలంగాణ అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించిన ప్రభుత్వం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్నిస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో అమరుల స్మృతి చిహ్నానికి ఏర్పాట్లు చేస్తున్నది. నాగార్జున సాగర్‌లో బుద్ధవనం ప్రాజెక్టును చేపట్టింది. ముస్లిం, క్రిష్టియన్‌, హిందువుల పండుగలను ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తూ మతసామరస్యాన్ని పరిరక్షిస్తూ వివిధ మతాల ప్రజల అభిమానాన్ని పొందింది.

యాదాద్రి, వేములవాడ, భద్రాచలం దేవస్థానాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు కేసిఆర్‌. తెలంగాణలో ప్రస్తుతం 26 శాతం వున్న అడవిని 33 శాతానికి పెంచుతామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ ప్రకారం 230 కోట్ల మొక్కలను పెంచాలని హరిత హారం ప్రాజెక్టును చేపట్టింది. గత రెండేళ్ళుగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు వున్నందున ఈ కార్యక్రమానికి కొంత అంతరాయమేర్పడినా ప్రభుత్వ సంకల్పాన్ని అభినందించాలి.

తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక కళాకారులు నిర్వహించిన పాత్ర ఎంతో గొప్పది. వీరిలో సుమారు ఆరువందల మందికి ప్రభుత్వోద్యాగాలిచ్చి బంగారు తెలంగాణ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేశారు కేసీఆర్‌.

తెలంగాణ మార్గదర్శి ప్రొ. జయశంకర్‌ పేరును వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, ఆఖరిశ్వాస దాకా యాభైఏళ్ళకు పైగా తెలంగాణ కోసం శ్రమించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరుతో హార్టికల్చరల్‌ యూనివర్సిటీని, ప్రజాకవి కాళోజీ పేరుతో వైద్య విశ్వవిద్యాలయం ప్రారంభించడం తెలంగాణ మహనీయుల పట్ల కేసిఆర్‌ ప్రభుత్వానికి గల గౌరవానికి నిదర్శనం.

హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రణాళికలు గత ప్రభుత్వాలేవీ కనీసం ఊహించనివి, ఇవి ప్రజలనెంతో ఆకర్షిస్తున్నాయి.

భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా 15 రోజుల్లోనే సింగిల్‌ విండో క్లియరెన్స్‌ ఇచ్చే టిఎస్‌ఐపాస్‌, ఐటి పాలసీలు, టూరిజం పాలసీ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గల విజన్‌కు సంకేతాలుగా నిలుస్తాయి. ఉద్యోగుల, జర్నలిస్టుల, న్యాయవాదుల, కార్మికుల, సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు గతంలో ఏ ప్రభుత్వమూ అందించనిది.

ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలందించడానికి ప్రభుత్వ ఆసుపత్రులను సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌గా తీర్చిదిద్దడం, త్వరగా చికిత్సనందించేందుకు వీలుగా 104, 108 సర్వీసుల సేవలను మెరుగుపర్చడం, వైద్యుల నియామకం తదితర చర్యలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు వైద్య సహాయం అందిస్తున్న ప్రభుత్వం మరింత మెరుగైన పథకాల కోసం ఆలోచిస్తున్నది.

వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం పాలీహౌజ్‌, పందిళ్ల నిర్మాణానికి సబ్సిడీలనందిస్తున్నది. మార్కెటింగ్‌ శాఖ అన్ని మండల కేంద్రాల్లో గోడౌన్లను నిర్మిస్తున్నది. భూసార పరీక్షలు జరిపి సాయిల్‌ హెల్త్‌కార్డులను రైతులకంది స్తున్నది. తప్పుల తడకగా వున్న రెవెన్యూ రికార్డులను సరిచేస్తున్నది.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రెండు పథకాలు: మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకం 46 వేల చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా రెండేళ్ళ నుండి కొనసాగుతున్నది. ఏటా 9 వేల చెరువులను పునరుద్ధరిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక రంగ అభివృద్ధికి వెన్నెముకలైన చెరువులను పునరుద్ధరించడం వలన భూగర్భ జలాలు పెరుగుతాయి. పూడికమట్టితో రైతుల భూముల్లో సారం పెరిగి అధిక దిగుబడి వస్తుంది. మిషన్‌కాకతీయ అంచనా వ్యయం 22,500 కోట్ల రూపాయలు. మిషన్‌ భగీరథ ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరిచ్చే అద్భుత పథకం. సుమారు 40 వేల కోట్ల రూపాయలు వ్యయమయ్యే ఈ పథకం దేశంలోనే మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. సిద్ధిపేటలో కేసీఆర్‌ అమలు చేసిన తాగునీటి పథకం విజయవంతంగా అమలు కావడంతో తెలంగాణ వ్యాప్తంగా మిషన్‌ భగీరథకు రూపకల్పన చేశారు. ప్రధాని మోడీతోబాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మన్ననలు పొందిన పథకమిది.

తన పథకాల అమలుపై సీేఆర్‌కు గల విశ్వాసం చెక్కుచెదరనిది. అందు ఏ సీఎం గతంలో ప్రకటించని రీతిలో రెప్పపాటు కరెంటు పోయినా, ఇంటింటికి తాగునీటిని అందించకపోయినా వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం టిఆర్‌ఎస్‌ నేతలు ప్రజల వద్దకు రారని శాసనసభలో ప్రకటించారు.

భారతదేశాని తలమానికమయ్యే విధంగా తెలంగాణ గమనం వుందని రెండేళ్ళ పాలనలో తెలుస్తున్నది.