స్వచ్ఛ సర్వేక్షణ్ లో మనమే నెంబర్‌ వన్‌!

By:- సాయి సందీప్‌ తేజ మార్గం 

రాష్ట్ర కీర్తి కిరీటంలో మరికొన్ని కలికితురాయిలు చేరాయి. రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంట పండింది. స్వచ్ఛ భారత మిషన్‌లో అద్భుత ఆదర్శప్రాయ ప్రదర్శనతో దేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమంగా నిలిచింది. దేశంలో నెంబర్‌ వన్‌ ర్యాంకుతో పాటు, వివిధ కేటగిరిల్లో 13 స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులు దక్కాయి. ఈ ర్యాంకులతోపాటు దేశానికి ఆదర్శ ప్రాయమైన అద్భుత ప్రదర్శన తెలంగాణ ది అంటూ కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు కూడా లభించాయి. అక్టోబర్‌ 2 స్వచ్ఛ భారత్‌ దివస్‌ సందర్భంగా రాష్ట్రానికి ఈ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయనున్నారు. అయితే, సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ వల్లే ఈ అవార్డులు దక్కాయని, సీఎం కేసీఆర్‌ మేధోమథన పల్లె ప్రగతి సాధించిన ప్రగతికి ఈ ర్యాంకులు, అవార్డులు, రివార్డులు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

2014 అక్టోబర్‌ 2, గాంధీ 145వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ను ప్రారంభించింది. దీన్నే క్లీన్‌ ఇండియా మిషన్‌గా పిలుస్తున్నారు. పకడ్బందీ నిర్మాణం, ప్రణాళికా బద్ధంగా ప్రచారం, కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించారు. బహిరంగ మల, మూత్ర విజర్జనను అరికట్టడం, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యం, చెత్త నివారణ, నిర్మూలన, తద్వారా గ్రామాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచడమనే లక్ష్యంతో ఈ ప్రణాళికను అమలు చేస్తున్నారు.

అయితే, ఇది ఒక వైపు దేశంలో అమలు అవుతుండగానే, తెలంగాణ సాధకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన మేధోమథనంతో ఒక అద్భుతమైన పథకానికి రూపకల్పన చేశారు. అదే పల్లె, పట్టణ ప్రగతి. పల్లె ప్రగతి పథకం అద్భుత ప్రగతిని అందించింది. ఆ ప్రగతి ఫలితాలే, ప్రస్తుత అవార్డులు, రివార్డులు.

సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతిని ఒక గ్రామీణ విధానంగా తీసుకువచ్చారు. స్వతంత్ర భారతం ఏర్పడి 70 సంవ్సతరాలు దాటినప్పటికి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత లేకపోవడం దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాల్లో సమగ్ర వికాసమే లక్ష్యంగా పల్లె ప్రగతిని రూపకల్పన చేశారు. పరిశుభ్రమైన గ్రామీణ వాతావరణంతో పాటు, పచ్చదనం, ప్రజల విస్తృత భాగస్వామ్యం, వార్షిక ప్రణాళిక తయారుచేయడం, నియంత్రిత పద్ధతిలో నిధుల వినియోగం, ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం, గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అలాగే గ్రామపంచాయతీల పరిపాలన మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా పంచాయతీరాజ్‌ చట్టానికి కూడా మార్పులు చేసి కొత్త చట్టాన్ని తెచ్చారు. అలాగే ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌, డంపింగ్‌ యార్డు, నర్సరీ, హరిత హారం, కల్లాలు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు వంటి వెన్నో చేపట్టి, వాటిని వినియోగంలోకి తెచ్చారు.

శిథిలాలు తొలగించడం, చెత్త చెదారం వేస్తే జరిమానాలు విధించడం, నిరంతరం పారిశుధ్యం కొనసాగేటట్లు చూడటం, మురుగునీటి కాలువలు, వాటిని శుభ్రపరచడం ఇలా అనేకానేక కార్యక్రమాలు చేపట్టి, అమలు చేస్తున్నారు. దీంతో గ్రామల్లో సీజనల్‌ వ్యాధులే కాదు. అత్యంతంగా ప్రపంచాన్ని వణికించిన కరోనా వంటి వ్యాధులను సైతం ఎదుర్కొనే విధంగా ఇవ్వాళ తెలంగాణ గ్రామాలు ఉన్నాయి. అభివృద్ధి విషయంలో దేశ ఫైనాన్స్‌ నిధులకు సమానంగా రాష్ట్రం ఫైనాన్స్‌ నిధులను ఇస్తుండటంతో పల్లెల అభివృద్ధికి సరిపడా నిధులు అందుతున్నాయి. అతి తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు కూడా నెలకు కనీసం 5 లక్షల రూపాయల నిధులు అందుతున్నాయి. ఇక 3,146 తండాలు, ఆదివాసీ గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో అభివృద్ధి అత్యంత క్రింది స్థాయికి వెళ్ళింది. ప్రగతి విస్తరించింది.

ఒకప్పుడు ఒక్క గంగదేవి పల్లె గురించే దేశం, ప్రపంచం మాట్లాడుకునేది. ఇవ్వాళ ముక్రాకే వంటి అనేక గ్రామాలు తెలంగాణ నిండా ఉన్నాయి. అందుకే ఆ మధ్య కేంద్రం ప్రకటించిన దేశంలోని మొదటి 20 అత్యుత్తమ గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణవే ఉత్తమంగా నిలిచాయి. పల్లె ప్రగతి సాధించిన ప్రగతికి ఇది నిదర్శనం. అయితే, కేంద్రం అమలు చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అభియాన్‌ వల్ల మాత్రమే అయితే, దేశంలో అనేక గ్రామాలు ఇలా నెంబవర్‌ వన్‌గా నిలవాలి. కానీ, తెలంగాణ నుండే ఇలా గ్రామాలు ఎంపిక అవుతున్నాయంటే, అందుకు కారణం, ఖచ్చితంగా పల్లె ప్రగతి కార్యక్రమమే. అనేక విభాగాల్లో తెలంగాణ పల్లెలే దేశంలో అత్యుత్తమంగా నిలుస్తున్నాయంటే నాడు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో వెల్లి విరుస్తున్నందువల్లే. నాడు తెలంగాణ మహోద్యమంలోలాగే, కేసీఆర్‌ చూపిన దారి… పల్లె  ప్రగతి. ఇప్పుడు ఆ పల్లె ప్రగతి కార్యక్రమమే పల్లెల రూపురేఖలని మారుస్తున్నది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతున్నది.

  • దేశంలో నెంబర్‌ వన్‌తో పాటుగా, వివిధ కేటగిరిల్లో వచ్చిన 13 స్వచ్ఛ అవార్డుల వివరాలు
  • SSG అవార్డులలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్‌ వన్‌.
  • SSG జిల్లాల కేటగిరీలో తెలంగాణలోని జగిత్యాల జిల్లా దేశంలో ద్వితీయ ర్యాంక్‌, నిజామాబాద్‌ తృతీయ ర్యాంక్‌ సాధించాయి.
  • SSG అన్ని టాప్‌ జిల్లాల జోన్ల కేటగిరీలో నిజామాబాద్‌ జోన్‌ దేశంలో రెండో ర్యాంక్‌, భద్రాది కొత్తగూడెం జోన్‌ మూడో ర్యాంక్‌ సాధించాయి.
  • సుజలం 1.0 కాంపైన్‌ కేటగిరీ లో తెలంగాణ దేశంలో 3వ ర్యాంక్‌ సాధించింది.
  • సుజలం 2.0 కాంపైన్‌ కేటగిరీలో తెలంగాణ దేశంలో 3వ ర్యాంక్‌ సాధించింది.
  • నేషనల్‌ ఫిలిమ్‌ కాంపిటేషన్‌ కేటగిరీలో తెలంగాణ లోని నూకలంపాడు గ్రామ పంచాయతీ (ఎంకురు మండలం) మూడో ర్యాంక్‌ సాధించింది.
  • వాల్‌ పేయింటింగ్‌ కాంపిటేషన్‌ ూణఖీ ప్లస్‌ బయో డిగ్రేడబుల్‌ వ్యర్ధాల మేనేజ్‌మెంట్‌్‌, గోబర్‌ ధాన్‌, ప్లాస్టిక్‌ వ్యర్ధాల మేనేజ్‌మెంట్‌, మురుగు నీటి మేనేజ్‌మెంట్‌, బహిరంగ మల విసర్జన మేనేజ్‌మెంట్‌ వంటి కేటగిరీల అవార్డులలో తెలంగాణ రాష్ట్రం సౌత్‌ జోన్‌లో మొదటి ర్యాంకులు సాధించింది.

ముఖ్యమంత్రి హర్షం 

సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, ‘‘స్వచ్ఛ భారత్‌ సర్వేక్షణ్‌’’లో మరోసారి దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలవడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శవంతమైన, పారదర్శక పాలనకు మరోసారి ఈ 13 అవార్డులు అద్దం పడుతున్నాయని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అన్నారు. 

సమష్ఠి కృషితో పల్లె ప్రగతిని సాధిస్తూ, పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం పునరుద్ఘాటించారు.

13 అవార్డులు దక్కించుకోవడానికి దోహదం చేసిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిని, శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని, సర్పంచులను, ఎంపిటిసిలను, గ్రామ కార్యదర్శు లను, ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

‘‘అప్రతిహత ప్రగతితో ముందుకుసాగుతున్న తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రగతిలో తనవంతుగా గుణాత్మక భాగస్వామ్యం పంచుకోవడం ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం. ఇదే పరంపరను కొనసాగిస్తాం’’ అని సీఎం పేర్కొన్నారు.